భవిష్య పురాణము

9 - ధన్వంతరి, శుశ్రుతుడు, జయదేవుడు

ఋషులారా! దేవగురువైన బృహస్పతి ఇంద్రాదులకు ప్రయాగలో ఇలా చెప్పసాగాడు. ‘హే దేవేంద్రా! ప్రాచీన కాలంలో త్రేతాయుగం చివర్లో శంకరభగవానుల కోరికపై సూర్యదేవుడు ఎలా రమణీయమైన ప్రతిష్ఠానపురంలో జన్మించాడో వివరిస్తాను. వినండి.

త్రేతాయుగాంతానికి కొంతముందు సింహళ ద్వీపంలో పరిక్షిత్తను రాజు పాలించేవాడు. ఆయన వేద ధర్మపరాయణుడు, దేవతల- అతిథుల పూజకుడు. అతనికి భానుమతి అని ఒక కూతురుండేది. ఆమె సూర్యవ్రత పరాయణ. ఆమె ఎంత గొప్ప భక్తురాలంటే రాజమహల్లో ప్రతిరోజు పూజానంతరం ఆమె పెట్టే నైవేద్యాన్ని సూర్యభగవానుడు స్వయంగా వచ్చి స్వీకరించేవాడు.

ఒక ఆదివారం భానుమతి నలినీ సాగరానికి పోయి నీటిలో దిగి స్నానం చేయసాగింది. ఆమె రాజకుమార్తె కాబట్టి అటువైపు పోవడానికి ఎవరూ సాహసించలేదు. త్రిలోక సంచారియైన నారద మహర్షి ఈ విషయం తెలియక ఆ తీరం వెంబడి పయనిస్తూ ఆమెను చూసి ‘నన్ను వివాహం చేసుకుంటావా’ అని అడిగాడు. ఆమె ‘ఇది పద్ధతి కాదు’ అంది. వెంటనే నారదుడు సిగ్గుపడి అక్కడి నుండి తొలగిపోయాడు. ఆయనలో ఏదో రోగం ప్రవేశించింది. వెంటనే పరమశివుని వద్దకు పోయి జరిగిందంతా చెప్పి శరణు కోరాడు. భక్తవశంకరుడైన శంకరుడు నారదుని తరపున తానే సూర్యభగవానునికై తపస్సు చేయసాగాడు. సూర్యుడు వెంటనే ప్రత్యక్షమై ఎవరూ ఏమీ అడగకుండానే నారదుని రోగాన్ని నశింపజేసి, మరింత సుందర రూపాన్నొసగి శివునితో, ‘హే ప్రభూ నాకు ఆజ్ఞని దయ చేయండి. నేను మీకు ప్రియమైన ఏ ఇతర కార్యాన్ని నిర్వర్తించగలను?’ అన్నాడు. శివుడు సూర్య భగవాన్! మీరు వెంటనే బ్రాహ్మణ రూపాన్ని ధరించి సవితాయను పేరుతో ప్రసిద్ధులై పరిక్షిత్ తనయయగు భానుమతిని వివాహం చేసుకోవాలి’ అని కోరాడు.

సూర్యుడలాగే చేశాడు. సవిత భానుమతి మానవ ధర్మంగా సూర్యారాధన చేసి దేహాంతంలో సూర్యలోకాన్ని చేరుకున్నారు. ప్రతి పుష్యమాసంలో వారు ఆకాశంలో ప్రకాశిస్తారు. ఆ మాసంలో భక్తుల కోరికలను తీరుస్తారు. కాబట్టి ఓ దేవేంద్రా! నీవు కూడా పుష్యమాసంలో శాస్త్రోక్తంగా భక్తి పురస్సరంగా సూర్యునారాధించు.’

ఋషులారా! బృహస్పతి నిర్దేశకత్వంలో ఇంద్రాది దేవతలు పుష్యమాసంలో సూర్య భగవాను నారాధించగా ఆయన ప్రసన్నుడై సాక్షాత్కరించి, ‘దేవతలారా! నేను కాశీలో ధన్వంతరి అను పేరుతో పుట్టి పరమ వైద్య శిఖామణినై రోగపీడితమైన భూలోక జననముదాయానికి ఆ పీడను వదిలిస్తాను. అక్కడే నివసించి మీ కార్యములను సిద్ధింపజేస్తాను’ అని వరమిచ్చాడు. అనంతరం సూర్యుడు కాశీలో కల్పదత్తుడను బ్రాహ్మణునికి ధన్వంతరియను నామంతో జన్మించాడు. ధన్వంతరి పెద్దవాడై గొప్ప వైద్యశాస్త్ర శిఖామణిగా వెలుగొందాడు. దేశపు నలుమూలల నుండి ఆయన వద్దకు శిష్యరికం చేయడానికి ప్రౌఢ విద్వాంసులు వచ్చేవారు. రాజపుత్రుడు సుశ్రుతుడు వీరిలో నొకడు.

ధన్వంతరి ఆయుర్వేద చికిత్సా శాస్త్రమైన కల్పవేదాన్ని వెలయించాడు. రోగం ద్వారా క్షీణిస్తున్న దేహాన్ని ‘కల్ప’మంటారు. కల్పవేదతంత్రంలో ఈ క్షీణత నాపి ఆరోగాన్ని చేకూర్చే జ్ఞానం నిహితమై వుంది. అందుకే ధన్వంతరి రచనకు కల్ప వేదమను పేరు సార్థకమైంది. కలియుగంలో సూర్యభగవానుడే ధన్వంతరిగా అవతరించడం వల్ల ఆయన దర్శన మాత్రం చేతనే సమస్త రోగాలూ నశించిపోతుండేవి. సుశ్రుతాచార్యుడు ధన్వంతరి ప్రణీతమైన కల్పవేదాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి ‘సౌశ్రుత - తంత్ర’ మనే నూరు అధ్యాయాల గ్రంథాన్ని తయారుచేసి మానవజాతికి ప్రసాదించాడు.

బృహస్పతి ఇంకా ఇలా చెప్పసాగాడు. ‘దేవరాజా! ఒకప్పుడు పంపాపురంలో హేలి అను పేరుగల బ్రాహ్మణుడుండేవాడు. అతడు అరవై నాలుగు కళలలోనూ పండితుడు, సూర్యారాధన తత్పరుడు. అతడు హస్త నైపుణ్యంతో వస్తు నిర్మాణం చేసే వృత్తిని చేపట్టాడు. ఒకనాడతను ఇనుప ధాతువు నుండి ఒక సుందర విగ్రహాన్ని మలచి దానిని అనేకానేకాలంకారములతో చిత్రికపట్టి అయిదువేల ముద్రలకు విక్రయించాడు. ఆ డబ్బును మాఘమాసంలో సూర్యయజ్ఞాలకు, పూజలకే, సంపూర్ణంగా వినియోగించాడు. ఆ తరువాత హేలి పంపా సరోవరంలో జ్యోతిః స్వరూపమైన (న్యాయంగా జ్యోతిస్స్వరూప అని వుండాలి) ఒక ఉత్తమ స్తంభాన్ని నిర్మించాడు. సూర్యభగవానుడు కూడా ఆ బ్రాహ్మణుని కళా కౌశలానికి ముగ్ధుడై, భక్తికి ప్రసన్నుడై, రోజూ మధ్యాహ్నం అతడు పెట్టే నైవేద్యాన్ని ఆస్తభంపై ఆగి స్వయంగా స్వీకరించేవాడు. ఆ దేవుని అనుగ్రహం వల్ల అతడు భూమిపై వెయ్యేళ్ళపాటు అన్ని సుఖభోగాలనూ అనుభవిస్తూ జీవించి, ప్రాణ పరిత్యాగానంతరము సూర్యునిలో కలిసిపోయాడు. మాఘమాసంలో సూర్యమండలంలో ఆ హేలియే ప్రకాశిస్తాడు. మీరు కూడా ఆ సూర్యదేవుని ఉపాసించండి. లోకకల్యాణం జరుగుతుంది.

దేవేంద్రుడు పూజ చేయగా సూర్యుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై ‘ఓ దేవతలారా! నేను వంగదేశంలో బిల్వగ్రామంలో నిరుక్తకారుని రూపంలో జన్మిస్తాను. కవిశిరోమణి జయదేవునిగా ప్రసిద్ధి పొందుతాను. లోకులను భక్తి మార్గంలోకి మళ్ళిస్తాను’ అని చెప్పాడు.

తరువాత సూర్యదేవుడు (నేటి బెంగాల్‌లోని) వంగదేశంలోని కందుకి అను బ్రాహ్మణుని ఇంట పుత్ర రూపంలో అవతరించాడు. అతడు అయిదేళ్ళ వయసులోనే తల్లిదండ్రులకు అన్ని రకాల సేవలనూ శ్రద్ధాభక్తి ప్రేమలతో చేయసాగాడు. కాని అతనికి పన్నెండేళ్ళు రాగానే ఆ మాతాపితలిద్దరూ మరణించారు. అతడు అధైర్యపడకుండా వారిద్దరికీ శాస్త్రోక్తంగా శ్రాద్ధ కృత్యాన్ని నెరవేర్చాడు. ఎంత శ్రద్ధగా చేశాడంటే అతడు వారికి గయలో పిండ ప్రదానం చేసినపుడు స్వయంగా వచ్చి వారు ‘జయదేవా! మేము తృప్తిచెందాము” అని చెప్పి స్వర్గానికి వెళ్ళారు. ఆ తరువాత జయదేవుడు వైరాగ్య సంపన్నుడై అడవిలో వుండి భజన చేయసాగాడు. అప్పటికతని వయసు ఇరవైమూడు.

ఈ సమయంలోనే సత్యవ్రతుడను బ్రాహ్మణుడు తన కన్యను భగవానుడైన జగన్నాథునికి సమర్పించదలచుకున్నాడు. జగన్నాథుడతనికి సాక్షాత్కరించి, ‘సత్యవ్రతా! శ్రీ జయదేవుడు నా మూర్తియే. నీ పుత్రిక పద్మావతిని అతనికే యిచ్చి పెండ్లి చెయ్యి’ అని ఆదేశించాడు. వెంటనే సత్యవ్రతుడు వనములో భజనలోనున్న జయదేవుని గొనివచ్చి సర్వాలంకృతుని చేసి సానందంగా సామోదంగా కన్యను సమర్పించాడు.

పతివ్రతయగు పద్మావతి వనంలోనే వుండి పతికి అన్ని విధాలా సేవ చేయసాగింది. జయదేవుడు కొన్నాళ్ళు ధ్యాన సమాధిలో వుండి బయటకు వచ్చి వేదాంగ నిరుక్తాన్ని రచించాడు. కలియుగంలో నాగవంశీయులైన శూద్రులు వైదిక ప్రకృతులను భ్రష్టు పట్టించారు. ప్రాకృత భాషల రచయితలు, కలిప్రియులు చేసిన మూఢ రచనా విశేషాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న సమయంలో జయదేవుడు బయలుదేరి ఈ మూఢరచయితలను వాదంలో ఓడించి ప్రజలను సరైన దారిలో పెట్టి పాణిని సంస్కృత వ్యాకరణాన్ని పునరుద్ధరించి భాషనూ, సమాజాన్నీ మరల ఉచ్ఛస్థితికి తీసుకొచ్చాడు. అతనిపై పగబట్టిన కలిపురుషునిచే ప్రేరితులై కొందరు దొంగలు రాజుగారు జయదేవునికిచ్చిన సంపదనంతటినీ దోపిడి చేసి అతనిని హింసించి ఒక గోతిలో పడేశారు. పద్మావతి పతి దురవస్థను కనుగొని గోతిలో నుండి బయటకు తీసి చేతులపై నెత్తుకొని ఇంటికి తీసుకొని సేవ చేసి మరల అతనిని మామూలు మనిషిని చేసింది. అంటే మనసు, మాట మామూలు స్థాయికి వచ్చినా కాళ్ళూ చేతులూ ఇంకా స్వాధీనం కాలేదు.

ఇలా వుండగా అక్కడి రాజైన ధర్మపాలుడు ఒకనాడు వేటకు వచ్చి వనంలో జయదేవుని చూచి విచలితుడై మిమ్మల్ని ఈ దశకు తెచ్చిన వారెవరో దయచేసి చెప్పండి అని ఎంత అడిగినా జయదేవుడొకే సమాధానం చెప్పాడు. ‘మహారాజా! నేను నా కర్మఫల స్వరూపాన్నే అనుభవిస్తూ వున్నాను. ఎవరినీ ఏమీ దూషించనవసరం లేదు.’ రాజు వెంటనే ఒక పల్లకిని తెప్పించి జయదేవుని అందులో పరుండబెట్టి తన రాజభవనానికి గొనిపోయాడు. అతని నుండి దీక్షను గ్రహించి అతని కోసమే ఒక గొప్ప ధర్మశాలను నిర్మించాడు. దైవయోగం వల్ల జయదేవుని గాయపరచి, దోచుకున్న దొంగలు వైష్ణవ వేషాలను ధరించి రాజు వద్దకు వచ్చి రాజుతో ‘ప్రభో! మేము శాస్త్రాల్లో నిపుణులం. మీ ఇంటికి వచ్చాం. రాజా మేము వండి పెట్టిన పదార్ధాలను విష్ణుదేవుడు శాలగ్రామరూపంలో స్వీకరిస్తాడు’ అని చెప్పి ఆ కలి భక్తులు తమ మాయచే భోజనం చేస్తున్న చతుర్భుజుడైన విష్ణుమూర్తిని రాజుకు చూపించారు.

ఆశ్చర్యచకితుడైన ధర్మపాలుడు వారిని గౌరవించి విడిదికి పంపించి జయదేవుని వద్దకు వచ్చి ‘గురుదేవా నేను భోజనం చేస్తున్న విష్ణుదేవుని చూడగలిగాను. వారు చూపించారు. మీ అంగవైకల్యాన్ని వారు పోగొట్టగలరేమో రండి’ అంటూ జయదేవుని తీసుకొని ఈ మహామాయా వైష్ణవుల వద్దకు వచ్చాడు. ఆపాఖండులు జయదేవుని చూడగానే పకపక నవ్వి, ‘ఓ రాజా! ఈ మీ గురుదేవుడై పోయిన బ్రాహ్మణుడు గౌడ దేశపు రాజుగారి వంటసాలలో పనిచేస్తుండేవాడు. ఒకమారు రాజుగారి భోజనంలోనే విషం పెట్టి దొరికిపోయాడు. రాజుగారు మిక్కిలి కోపంతో ఈ మనిషిని శూలమెక్కించి కొరత వేయించేశాడు. అప్పుడే మేము అక్కడికి వెళ్ళడం తటస్థించింది. బ్రాహ్మణుని చంపకూడదని మేము ఆ రాజుకి బోధపఱచడంతో ఇతని చేతులూ, కాళ్ళూ విరిచి వదిలేశాడు. ఆ రాజు ఈనాటికీ మా శిష్యుడే’ అన్నారు. ఆ మాటలలోని అసత్యాన్ని ఇక భరించలేక వారి కాళ్ళ క్రింద నేలబద్ధలై పోయింది. వారు నలుగురూ భూమిలోకి క్రుంగిపోయి పాతిపెట్టబడి పోయారు. ఎంత దుష్టులైనా సాటి మానవుల ఘోరమృతికి జయదేవుని సున్నితమైన కవి హృదయం కరిగిపోయింది. అతని కంటివెంట దుఃఖాశ్రువులు ధారలు కట్టి జాలువారినవి. అతని అశ్రువులు నేలపై పడగానే భూమి మామూలుగా అయిపోవడమే కాక, జయదేవుని అంగవైకల్యం పూర్తిగా నశించింది సంపూర్ణారోగ్య వంతుడైనాడు. రాజు ఆశ్చర్యం నుండి తేరుకొని గురుదేవా! ఏమిటిదంతా?’ అని అడిగాడు. జయదేవుడు వారి కథనూ తన కథనూ కూడా చెప్పాడు. ఆ తరువాత కారణజన్ముడైన జయదేవుడు కొన్ని యుగాలపాటు నిలచిపోయే ‘గీత గోవింద’ కావ్యాన్ని రచించాడు. రాధాకృష్ణ తత్త్వానికి, శ్లోకాల్లో, అష్టపదుల్లో, అద్దం పట్టిన ఈ మహాభక్తి కావ్యాన్ని విన్నంత మాత్రముననే ఆ రాజుకి దేహాంతంలో మోక్షం లభించింది.