యుధిష్ఠిర మహారాజా! ఒకమారు మహనీయుడైన లోమశమహర్షి మా మథురా నగరానికి వచ్చాడు. నా తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులాయనకు గొప్ప ఆతిథ్యమిచ్చి మిక్కిలి భక్తి ప్రపత్తులతో ఆయనను సేవించారు. ఆయన కూడా ప్రేమగా వారి మందిరంలో కొలువై ఎన్నో ధర్మాలనూ వ్రతాలనూ ఉపదేశిస్తూ ప్రసంగవశాన ఇలా అన్నాడు.
‘అమ్మా దేవకీ దేవీ! కంసుడు నీ పుత్రులను వధించాడు. బతికి బట్ట కట్టినవాడు భగవంతుడేయైనా ఆ గర్భశోకం ఆరిపోదు కదా! ప్రాచీన కాలంలో చంద్రముఖి అను సర్వ సులక్షణయైన ఒక మహారాణి పుత్రులను పోగొట్టుకొని పరమ దుఃఖితయై ఒక వ్రతం ద్వారా తన పుత్రులను బతికించుకోగలిగింది. నువ్వు కూడా ఆ వ్రతాన్నాచరించు’
దేవకీ దేవి ప్రార్థించిన పిమ్మట ఆ ముని మొత్తం విషయాన్నిలా చెప్పాడు.
‘అమ్మా! ప్రాచీన కాలంలో అయోధ్యను నహుషుడనే ప్రసిద్ధ మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతని మహారాణియే చంద్రముఖి. రాజపురోహితుని భార్య మానమానికతో ఆమెకు గట్టి స్నేహబంధముండేది. ఒకరోజు వారిద్దరూ కలసి సరయూ నదీ తీరానికి స్నానానికై వెళ్ళారు. ఆ సమయానికక్కడికి నగరిలోని స్త్రీలు కూడా కొంతమంది వచ్చారు. స్నానాంతరము వారంతా ఒక మండలాన్ని నిర్మించి అందులో శివపార్వతుల ప్రతిమను చిత్రించి గంధ, పుష్పాక్షతాదులతో భక్తిగా యథావిధిగా పూజలు నిర్వహించారు. ఇదంతా చూసిన చంద్రముఖి ఆ స్త్రీలను ‘అమ్మలారా! మీరీ పూజను ఎవరికి, దేనికోసం చేశారు?’ అని అడుగగా వారు ‘మేము శివపార్వతులను పూజిస్తున్నాం. వారికి ఆత్మ సమర్పణను గావించి ఈ సువర్ణమయ దీక్షా కంకణమును ధరించి వున్నాం. మా కంఠంలో ప్రాణముండగా ఈ పూజను ఆపబోమని ప్రమాణం చేశాం’ ఈ మాటలను విని చంద్రముఖీ మాసమానికా కూడా ఈ వ్రతాన్ని చేయడానికి అక్కడికక్కడే నిశ్చయించుకొని ఇంటికి వచ్చి వ్రతాన్ని సర్వ నియమ సహితంగా మొదలు పెట్టేశారు కాని, కొన్నాళ్ళ తరువాత రాచరిక వ్యవహారాలలో మునిగిపోయి మానేశారు. కంకణాలు జారిపోతే మరల కట్టుకోలేదు. దీనివల్ల దేహాంతంలో రాణీ ఆడకోతిగానూ పురోహిత పత్ని కోడిపెట్టగానూ జన్మించారు. అయితే, పూర్వజన్మ నాటి స్నేహమూ, కొన్ని స్మృతులూ వారిని వీడలేదు.
కొన్నేళ్ళ తరువాత వారి జంతు జన్మ ముగిసి మానవజన్మ లభించింది. చంద్రముఖి మాళవదేశ మహారాజుగారి పట్టమహిషిగానూ మానమానిక ఆరాజ పురోహితుని పత్నిగానూ జన్మించారు. రాణి పేరు ఈశ్వరి; బ్రాహ్మణి పేరు భూషణ. ఈ మారు భూషణకు మాత్రమే పూర్వజన్మ స్మృతి వున్నది. ఆమెకు ఎనమండుగురు ఉత్తమ పుత్రులు జన్మించారు. ఈశ్వరికి మాత్రం లేక లేక ఒక కొడుకు పుట్టి రోగగ్రస్తుడై తొమ్మిదవయేటనే మరణించాడు. తనకు పుత్రులే లేకపోవడం తన ప్రియసఖి పుత్రులు బతికి బాగుండడం చూసిన ఈశ్వరి అసూయతో కుతకుత ఉడికిపోయి భూషణ పుత్రులందరినీ చంపించేసింది. కాని, వారందరూ శంకరభగవానుల కృపవల్ల బ్రతికి ఆరోగ్యంగా వెనక్కి వచ్చేశారు. రాజపురోహితుని భార్యకు ఇదంతా తెలుస్తూనే వుంది. అయినా మాట్లాడలేదు. ఇక ఉండ బట్టలేక ఈశ్వరియే ఆమెను పిలిపించుకొని, ‘సఖీ! నీ పుత్రులు మృతులై మరల బతికి వచ్చారని విన్నాను. ఏ వ్రతం వల్ల ఇది సాధ్యమైంది. ఇంతమంది పిల్లలను కన్న తరువాత కూడా నీ అందం ఏ మాత్రమూ తరగడం లేదు. ఏ నోము నోచావు?’ అని అడుగగా భూషణ ఇలా బదులిచ్చింది.
‘సఖీ! విలక్షణ ఫలాలనిచ్చే వ్రతమొకటుంది. దానిపేరు ముక్తాభరణ సప్తమీ వ్రతం. భాద్రపద శుద్ధ సప్తమినాడు చేయవలసిన ఈ వ్రతానికి పద్ధతేమిటంటే - ముందుగా స్నానం చేసి ఒక మండలాన్నేర్పఱచి అందులో శివపార్వతుల ప్రతిమను చిత్రించి దానిని పూజించి ఆత్మసమర్పణ సూత్రాన్ని (దోరకం) మణికట్టుకి ధరించి గానీ వెండి లేదా బంగారు ఉంగరాన్ని వ్రేలికి పెట్టుకొని గాని దాన్నే దీక్షా కంకణంగా నిత్యధారణం చేయాలి. ఆ రోజంతా ఉపవాసముండి మరునాడు ఉద్యాపన చేసుకోవాలి. ఆరోజు మరల మండలగత శివపార్వతులను పూజించి ఆ ఉంగరాన్ని రాగిపాత్రలో వేసి బ్రాహ్మణునకు దానమిచ్చేయాలి. యథాశక్తి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి.
సఖీ! ఈ జన్మలో కూడా మనం కొన్నేళ్ళ కిందట ఈ వ్రత నియమ ధారణను కలిసే చేశాం. నువ్వు అశ్రద్ధ కొద్దీ మధ్యలో వదిలేశావు. నేను వదలకుండా ఆచరిస్తున్నాను. మొన్నటి జన్మలో ఈ వ్రతాన్ని మధ్యలో ఆపేసిన పాపానికి మనం కోతిగా కోడిగా పుట్టాము. కొంతకాలమైనా చేసిన పుణ్యం వల్ల మళ్ళా ఇప్పుడిలా పుట్టాము. సరే. అయినదేమో అయినది ఇప్పుడు నీకు నా వ్రత పుణ్యంలో సగం ధారవోస్తాను. దానివల్ల నీ దుఃఖాలన్నీ దూరమౌతాయి అంటూ ఆమె అలాగే చేసింది. వెంటనే తగిన కాలంలో రాణికి క్రమంగా పుత్రులుదయించి దీర్ఘాయురారోగ్యాలతో వర్ధిల్లారు. ఆమెకు అందము కూడా పెరిగింది. దేహాంతంలో మోక్షం లభించింది.
కాబట్టి ఓ వసుదేవ పత్నీ! నీవీ వ్రతాన్ని చేపట్టు. నీ కడుపున భగవంతుడే పుట్టవచ్చు. ఇకపై నీకు కలుగబోయే బిడ్డలు బతకడమే కాదు లోకాలనే బతికించవచ్చు. అని చెప్పి లోమశముని నిష్క్రమించాడు(ఈ కథ దేవకీ వసుదేవులు చెఱసాలలో నున్నప్పుడు జరిగి వుండాలి. ఒకానొక హరివంశ కథలో శ్రీకృష్ణుడే దేవకిని స్వయంగా గొనిపోయి ఆమెయొక్క పుత్రులను, వివిధ వయస్సులలో నున్నవారిని, చూపినట్లు చెప్పబడింది.).