“శతానీక మహారాజా! సూర్య మహాత్మ్యాన్ని శ్రీకృష్ణుడింకా ఇలా వర్ణిస్తున్నాడు. ఏమాసం లోనైనా శుక్లసప్తమి, గ్రహణం లేదా సంక్రాంతికి ఒకరోజు ముందు ఒకమారు హవిష్యాన్నమును భుజించి సాయంకాలం శ్రద్ధగా ఆచమనం చేసి అరుణదేవునికి ప్రణామం చెయ్యాలి. ఆ తరువాత ఇంద్రియాలన్నిటినీ అదుపులో పెట్టుకొని సూర్యదేవుని వీలైనంత ఎక్కువసేపు ధ్యానించి ఆ రాత్రి నేలపై కుశదర్భలను పఱచుకొని శయనించాలి. మరునాడు ప్రాతర్వేళనే మేల్కొని విధిపూర్వకంగా స్నాన సంధ్యలను ముగించి ఇదివఱకే మనం చెప్పుకున్న ఓం ఖఖోల్కాయ స్వాహా అనే మంత్రాన్ని జపించి సూర్యభగవానుని పూజించాలి. అగ్నినే సూర్యతాపంగా భావించి హెూమవేదిని చేసుకుని సంక్షిప్తంగా హవన తర్పణాలు చేయాలి. కుశలను గాయత్రి మంత్రంతో ప్రోక్షించి పూర్వాగ్ర ఉత్తరాగ్రాలలో విసరాలి. తరువాత పాత్రలన్నిటినీ శుద్ధిచేసి దర్భలను వేసివుంచాలి. ఈరకంగా పవిత్రీకరింపబడిన అన్ని వస్తువులపై మంత్రజల ప్రోక్షణం చెయ్యాలి. నేతిని హోమాగ్నిలో కరిగించి ఉత్తరం వైపున్న పాత్రలో ఉంచి, తరువాత మండుతున్న ఉల్ముకంతో(కొఱవి) పర్యగ్నికరణ చేస్తూ నేతిని మూడు మార్లు ఉత్‌ప్లవనం చెయ్యాలి. స్రువాదులను దర్భతో శుచిపఱచి అగ్నిలో సూర్యదేవుని తలచుకొంటూ కుడిచేతిలో పెట్టుకుని మూల మంత్రాన్ని జపిస్తూ హవనం చెయ్యాలి. ఇక్కడ యోగశాస్త్రంలో చెప్పబడిన మనోయోగపూర్వక మౌనధారణ చేస్తూనే అన్ని క్రియలనూ సంపన్నం అయ్యేలా చూసుకోవాలి. పూర్ణాహుతి, తర్పణాల అనంతరం బ్రాహ్మణులకు మంచి భోజనం పెట్టి యథాశక్తిగా దక్షిణలివ్వాలి.
వరుణ నామకుడైన సూర్యుని మాఘసప్తమినాడు పూజించాలి. అలాగే క్రమంగా ఫాల్గునంలో సూర్య, చైత్రంలో వైశాఖ, వైశాఖంలో ధాత, జ్యేష్ఠంలో ఇంద్ర, ఆషాఢంలో రవి, శ్రావణంలో నభ, భాద్రపదంలో యమ, ఆశ్వయుజంలో పర్జన్య, కార్తికంలో త్వష్ట మార్గశిరంలో మిత్ర, పుష్యంలో విష్ణు అనే పేర్లతో పూజించాలి. మిగతా అన్ని పురాణాల్లో చైత్రంతో మొదలుపెట్టి పూజించవలసిన సూర్యనామాలిలా ఉన్నాయి. ధాతా, అర్యమ, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్, పూషా, పర్జన్య, అంశ, భగ, త్వష్ట, విష్ణు. ఈ విధంగా పన్నెండు నెలల్లో పన్నెండు పేర్లతో ఆయనను పూజిస్తే యేడాదిలో ప్రతిరోజూ పూజ చేసిన ఫలం వస్తుంది.
పైన చెప్పిన పద్ధతిలో ఒక సంవత్సరం పూజ చేసే రత్న ఖచిత సువర్ణ రథాన్నొకదానిని ఏడుగుఱ్ఱాలతో తయారుచేయాలి. రథ మధ్యంలో బంగారు కమలంపై రత్నభూషాలం కృతమైన సూర్యనారాయణుని బంగారు మూర్తిని ప్రతిష్ఠించాలి. రథానికి ముందు సారథి బొమ్మనీ పెట్టాలి. తరువాత పన్నెండు సూర్యనామాలనూ పన్నెండుగురు బ్రాహ్మణులలో ఆరోపించుకొని పదమూడవ బ్రాహ్మణుని ముఖ్యాచార్యునిగా సాక్షాత్తూ సూర్యనారాయణ మూర్తిగా భావించుకొని వారందరికీ పూజచేసి ఆచార్యునికి రథ, ఛత్ర, భూమి గోవులను సమర్పించాలి. మిగిలిన పన్నెండు మంది బ్రాహ్మణులకు రత్నాభరణాలు, వస్త్రాలు, దక్షిణ, పన్నెండు గుఱ్ఱాలు సమర్పించి చేతులు జోడించి, బ్రాహ్మణ దేవతలారా! ఈ సూర్యవ్రత ఉద్యాపన తరువాత సూర్యవ్రతం చేయడానికి సామర్థ్యం నాలో లేకపోయినా, దానిని దోషంగా పరిగణించవలదు. అని ప్రార్థించాలి. బ్రాహ్మణులు, ముఖ్యాచార్యుడు కూడా ‘ఏవమస్తు’ అని యజమానిని దీవిస్తారు. సూర్యభగవానుడు నీకు ప్రసన్నుడగు గాక! ఏ కోరికతో ఈ వ్రతం చేశావో అది సంపూర్ణంగా సిద్ధించాలి గాక! సూర్యనారాయణుడట్లు చేయుగాక! అని కూడా ఆశీర్వదిస్తారు. అపుడు అంధులకు, అనాథులకు అన్నదానం చేసి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టడంతో వ్రత సమాప్తి కాగలదు.
ఈ సప్తమీ వ్రతం చేసినవాడు నూరుయోజనాల పొడవు వెడల్పులు గల రాజ్యానికి పాలకుడవుతాడు. ఈ వ్రత ఫలితంగా నూరేళ్ళకి పైగా నిష్కంటకంగా రాజ్యపాలన చేయగలడు. ఈ వ్రతాన్నాచరించిన స్త్రీ రాజపత్ని కాగలదు. రాగిరథంతో పేదవాడెవరైనా ఈ వ్రతం చేస్తే ఎనభై యోజనాల పొడవు వెడల్పులు గల రాజ్యానికి రాజవుతాడు. పిండితో చేసిన రథాన్ని పూజానంతరం దానం చేసినవాడు అరవైయోజనాల రాజ్యానికి పాలకుడవుతాడు. వీరందరికీ చిరాయువు, రోగరహిత సర్వసుఖ సహిత జీవనం కలుగుతాయి. ఒక కల్పం పాటు సూర్యలోకనివాసము, అనంతరం రాజజన్మ అబ్బుతాయి. భౌతికశక్తి లేకపోగా మానసికంగానే సూర్యవ్రతం చేయగలిగిన వానికి జీవితమంతా ఏ రోగమూ రాకుండా సుఖంగా గడుస్తుంది. వానికీ ఏ ఆపదలూ కలగవు.
పుత్రా! ఈ మొత్తం విజ్ఞానమంతా నాకు సూర్యనారాయణునిచేతనే స్వయంగా అందించబడింది. తొలిసారిగా నీకే చెప్తున్నాను. ఈ వ్రతాన్ని చేయడం వల్లే నేను సహస్ర సంఖ్యలో పుత్రులను, పౌత్రులను పొందాను. దైత్యులను జయించాను. దేవతలను వశం చేసుకున్నాను. నా ఈ సుదర్శన చక్రంలోని శక్తి ఆయనదే. ఆయన యొక్క నిత్యజప, ధ్యాన పూజాదులను చేయుటచేత నేను లోక పూజ్యుడనైనాను. నీవు కూడా మనస్సు, వాణి, కర్మలతో సూర్యునారాధించు. నీకు వివిధ సుఖాలు ప్రాప్తిస్తాయి. ఈవ్రత విధానమును శ్రద్ధగా విన్నవానికి కూడా పుత్ర, పౌత్ర, ఆరోగ్య, లక్ష్మీ, సూర్యలోక గమనాదులు ప్రాప్తిస్తాయి.
సాంబా! మరొక మాట విను. మాఘశుక్ల పంచమినాడు ఏకభుక్తవ్రతము, షష్ఠినాడు (దినంలో అధికాంశం ఏమీ తినకుండా సాయంత్రం నాలుగు ప్రాంతంలో భోంచేసి మరునాటి మధ్యాహ్నం దాకా ఏమీ తినకుండా ఉండడాన్ని ఏకభుక్త వ్రతమంటారు. అదే రోజంతా ఉపవసించి నాలుగు ప్రాంతంలో కాకుండా రాత్రి భోజనం చేయడాన్ని నక్తవ్రతమంటారు.) నక్తవ్రతం చెయ్యాలి. రక్తచందనం, గన్నేరుపూలు, గుగ్గిలధూపము, పాయసాదినైవేద్యాలతో మాఘం నుండి నాలుగు నెలలదాకా స్వామి పూజ చెయ్యాలి. ఆత్మశుద్ధికై గోమయ మిశ్రితజలంతో స్నానం చేస్తూ వుండాలి.
జ్యేష్ఠం నుండి నాలుగు మాసాలపాటు శ్వేత చందనం, తెల్లపూలు, నల్లని అగరు ధూపము, ఉత్తమ నైవేద్యాలతో సూర్యనారాయణునికి అర్పణవ్రతం చెయ్యాలి. తరువాత ప్రతి పంచగవ్యాలను తిని బ్రాహ్మణులకు గొప్ప భోజనాలు పెట్టించాలి.
ఆశ్వయుజాది నాలుగు మాసాల్లో అగస్త్యపుష్పాలు, అపరాజితధూపము, బెల్లం మిఠాయిలు, చెఱకురసము, సూర్యభగవానునికి సమర్పించాలి. శక్తికొలది బ్రాహ్మణులకు భోజనాలు పెట్టించి ప్రతి ఆత్మశుద్ధి కొఱకై కుశజలంతో స్నానం చెయ్యాలి. ఆరోజుకి కుశోదకాన్నే తాగాలి. వ్రత సమాప్తినాడు అనగా మాఘసప్తమినాడు రథాన్ని దానం చెయ్యడమే కాదు, రథోత్సవాన్ని కూడా యేర్పాటుచేయాలి. మహాపుణ్యదాయనియైన ఈ సప్తమినే రథసప్తమంటారు. మహాసప్తమనికూడా అంటారు. ఆ రోజు ఉపవాసం చేసే వానికి కీర్తి, ధన, పుత్ర, ఆరోగ్య, కాంతి, విద్యాదులు ప్రాప్తిస్తాయి.
రాజా! శ్రీకృష్ణుని ఉపదేశానుసారం సాంబడు సూర్యారాధన చేసి రోగ ముక్తుడైనాడు.”
Summary of chapter 32 of the Bhavishya Purāṇa is as follows:
The Pañcamī Kalpa opens with the foundational narrative of serpent-worship: the story of Kadru, mother of the nāgas, and her curse upon her own serpent-children when they refused to help her deceive Vinatā in a wager. The curse doomed the serpents to perish in Janamejaya's great serpent sacrifice — the Sarpa Satra — but the sage Āstīka, born of a ṛṣi father and a nāga mother, was prophesied to save them. The Nāga-pañcamī vrata is established in this context: by worshipping the twelve nāga-kings — Ananta, Vāsuki, Śeṣa, Padmanābha, Kambala, Śaṅkhapāla, Dhṛtarāṣṭra, Takṣaka, Kaliya, Mahāpadma, Karkoṭaka, and Piṅgala — with offerings of milk on the fifth tithi, the devotee is freed from all fear of serpents and obtains the protection of the nāga-world.