శౌనకాచార్యా! శివభక్తి పరాయణుడును, పరమశుద్ధాత్ముడునునైన భట్టోజి దీక్షితుడు కృష్ణచైతన్యుల వద్దకు వచ్చి ఆయన శిష్యునిగా చేరిపోయాడు. ఆయన ఆదేశం మేరకు పాణినీయమైన వేదానికి తృతీయాగమమైన వ్యాకరణానికి ప్రక్రియాత్మక వ్యాఖ్యను రచించాడు. పిమ్మట ప్రభువుల వారి ఆశీస్సులతో దీక్షితుడే, సిద్ధాంత కౌముదిని కూడా నిర్మించి చైతన్యాశ్రమంలోనే నివాసముండిపోయాడు.
సూర్యభక్తి పరాయణుడు, వరాహమిహిరుడనే పేరుగల జ్యోతిశ్శాస్త్రవేత్త చైతన్యుల వారి ఇరవై యొకటవయేట ఆయన శిష్యునిగా చేరాడు. ఆయన ఆదేశాల మేరకు ఎన్నో జ్యోతిషశాస్త్ర గ్రంథాలను వెలయించాడు.(ఇతడు రెండవ వరాహమిహిరుడు. మొదటి వరాహమిహిరుడను ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిశ్శాస్త్రగ్రంథకర్త విక్రమాదిత్యుని ఆస్థానంలో వుండేవాడు. నవరత్నాలలో నొకడు. చైతన్య మహాప్రభువుల కాలము నాటి (14వ శతాబ్ది) వరాహమిహిరుడూ జ్యోతిశ్శాస్త్రవేత్తయే))
శివభక్తి పరాయణుడొకాయన, చందశ్శాస్త్ర పండితుడై, రచయితయై, మహాప్రభువుల వారి 23వ యేట ఆయన వద్దకు వచ్చి శిష్యునిగా చేరాడు. తరువాత మరింత పెద్ద ఉద్గ్రంధాన్ని చందశ్శాస్త్రంలో వెలయించాడు ఆ తరువాత, పరమ శ్రేష్ఠమైన రాధాకృష్ణ జపం చేసుకుంటూ ఆనందంగా జీవించాడు. అతని పేరు వాణీభూషణుడు.
మునులారా! ధన్వంతరియని, బ్రహ్మభక్తి పరాయణుడైన బ్రాహ్మణుడొకాయన ఈ సమయంలోనే ప్రభువుల వారిని చేరి ఆయన శిష్యరికాన్ని స్వీకరించాడు. ఆయన ఆశ్రమంలోనే వుంటూ ‘కల్పవేద స్వరూప వేదాంగ’మను వైదిక గ్రంథాన్ని రచించాడు.
చైతన్యుల వారి ఇరవై అయిదవ యేట బౌద్ధ మార్గ పరాయణుడగు జయదేవుడను బ్రాహ్మణుడాయన వద్దకు వచ్చాడు. ‘మీ పరమ ఉపాస్యులైన గురుదేవులు ఓఢ్ర దేశ నివాసి జగన్నాథులు కదా! పదండి, నేను కూడా శిష్యసమేతంగా అక్కడికే బయలుదేరు తున్నాను’ అన్నారు చైతన్యమహాప్రభువు జయదేవుని చూడగానే.
ఈ మాట వినగానే ఆయన భక్తులందరూ తమ తమ శిష్యులందరినీ కూడగట్టుకొని మహాప్రభువుల వెనుకనే బయలుదేరారు. నిధులూ, సర్వసిద్ధులూ మానుష రూపం ధరించి చైతన్య మహాప్రభువును సేవించుకుంటూ వెళ్ళాయి. వీరశైవులూ, శాక్తేయులూ, వైష్ణవులూ పదివేలమందిదాకా కలిసి ఆయన వెంట పూరీజగన్నాథమునకు కదిలిపోయారు. చైతన్య మహాప్రభువుల రాకను చూసి స్వయంగా జగన్నాథస్వామియే ఒక బ్రాహ్మణ ఋషిపుంగవుని రూపంలో వచ్చి ఆయనకెదురుగా నిలబడ్డాడు. చైతన్యులాయనకు నమస్కరించి ‘స్వామీ! భయానకమైన ఈ కలియుగంలో ఏమతం సముచితమైనది? దయచేసి నాకు చెప్పండి’ అని వేడుకొన్నారు.
జగన్నాథస్వామి లోకకల్యాణర్థమై చైతన్యులతో ఇలా చెప్పనారంభించాడు, ‘కశ్యపునిచే శాసింపబడుతున్న ‘మిస్ర’ దేశంలో ఉత్పన్నులైన మ్లేచ్ఛ గణాలవారు సుసంస్కృతులై బ్రాహ్మణ వర్ణ ప్రాప్తి నొందినారు. వారు శివసూత్రధారణము చేసి ఉత్తమ, శ్రేష్ఠ వేదాధ్యయనం కూడా గావించి యజ్ఞాల ద్వారా దేవాధిదేవుడైన శచీపతిని పూజించారు. ఆయన ఈ మ్లేచ్ఛ పూజను గ్రహించలేక, మానలేక దుఃఖితుడై శ్వేత ద్వీపానికి వచ్చి నన్ను శరణు వేడాడు. నేనెవరో నీకు తెలిసి పోయింది కదా! నన్ను పోల్చుకొన్నాకనే నాకు నమస్కరించి సంభాషించసాగావు కదా!’
కాస్త ఆగి ప్రసన్న భాసుర మందహాసంతో బ్రాహ్మణ వేషంలోనే నిలబడి వున్నాడు. జగన్నాథస్వామి. చైతన్యులు నమస్కారం పెట్టి నిలబడి వున్నారేగాని మాట్లాడలేదు. స్వామియే మరలా ఇలా అనుగ్రహాన్ని కొనసాగించాడు.
‘ప్రచారకోత్తమా! అపుడు ఇంద్రాది దేవులకు నేను అభయమిచ్చాను. కలియుగంలో నేను భూలోకంలో అవతరిస్తానని చెప్పి ఇంద్రాది దేవతలను ద్వాదశాదిత్యుల రూపాలలో రమ్మని చెప్పాను. సింధుతటంలో దారుపాషాణరూపములో వెలిశాను. స్వర్గం నుండి వచ్చి భువిలో జనించి పెరిగిన ఇంద్రద్యుమ్న మహారాజు గారిచే రచితమైన మందిరంలో ప్రతిష్ఠితుడనైనాను. ఇక్కడ భక్తియే ప్రధానం. వర్ణాల భేద భావాలుండవు. నేను సర్వపాప వినాశకుడను. నా దర్శన మాత్రం చేతనే కలియుగంలో మానవులు ధన్యులౌతారు. నేను వారికి ఇంకోమాట కూడా చెప్పాను. కృష్ణచైతన్య మహాప్రభువు ఇక్కడికి వచ్చి నా ప్రసాదాన్ని ప్రచారం చేస్తాడని. కాబట్టి వత్సా! నీ భక్తి మతమే శ్రేష్ఠమైనది. అదే నీ కర్తవ్యం.’