భవిష్య పురాణము

13 - అఘోర భైరవ, బాలశర్మల ఉత్పత్తి కథలో రావణ హనుమానుల ప్రసక్తి

సూతమహర్షి ప్రవచనం కొనసాగుతోంది. “శౌనకాచార్యా! ఒకప్పుడు మహాదేవుడైన శివుడు అయోనిజునిగా కాశీలో జనించాడు. కపాల మోచనకుండము నుండి యతిరూపంలో ఉద్భవించిన శివుడు వేదనిధి భైరవుడను పేరున ప్రసిద్ధుడైనాడు. దుష్కరమైన అఘోరమార్గీయులందరినీ మార్చి తన శిష్యులనుగా చేసుకొని వారిని జనజీవన స్రవంతిలోనికి గొనివచ్చాడు. డామరుక మంత్రాన్ని ప్రజల్లోకి తెచ్చాడు. కీలిత మంత్రాలను ఉత్‌కీలన చేయుట నేర్పాడు. చివరగా కాశీపోయి శంకరాచార్యుని శిష్యుడైనాడు.

మునులారా! బృహస్పతి దేవతలకు చెప్పిన విషయాన్నే ఇప్పుడు మీకు నేను వివరిస్తున్నాను. మయదానవుని పెద్ద కూతురు మయీదేవి కథ విన్నారు కదా! అతని రెండవకూతురు మండోదరి. ఆమె త్రిపురాల దగ్ధం తరువాత ఎంతో గుప్తంగా సనాతనుడైన మహావిష్ణువును తన పూజలచే ఉపాసనచే ఆరాధనలచే సంతుష్టుని చేసింది. ఆయన ప్రసన్నుడై ఆమె దేహాంతమైన సమయంలో ఉత్తమ యోగాన్నిచ్చి భయంకరమైన వింధ్యాద్రిలో ఒక గుహలో ఆమె తేజోమయమైన ఆత్మను విలీనం చేశాడు. ఆవిధంగా అది అలాగే కొన్నివేల సంవతసరాలు సమాధిగతమై ఉండిపోయింది.

వైవస్వత మన్వంతరం పన్నెండవ సత్యయుగంలో బ్రహ్మపుత్రుడైన పులస్త్యునికి విశ్రావసుడను పుత్రుడు జనించాడు. అతడు పెద్దవాడై విద్వాంసుడై బ్రహ్మచర్యాశ్రమం చివర్లో వందేళ్ళు తపస్సు చేసి వచ్చి సుమాలి యను దైత్యుని పుత్రియైన కేకసిని పెండ్లాడాడు. వారికిద్దరు పుత్రులు జనించారు. వారే రావణ, కుంభకర్ణులు వారికి పూర్తిగా రాక్షస లక్షణాలే వచ్చాయి. రావణునికి తల్లిపైన కుంభకుర్ణునికి తండ్రి పట్ల భక్తి ఎక్కువ. రాక్షసులేయైనా బ్రాహ్మణులు కూడా కాబట్టి వారు మహావిద్వాంసులై, వేదవేదాంగవేత్తలై అక్కడితో తృప్తి చెందక వేయి సంవత్సరాలపాటు బ్రహ్మకై ఘోరతపస్సు చేశారు. పరమేష్టి ప్రసన్నుడై వారికి దేవదానవులందరినీ జయించగలిగే సాహస పరాక్రమాలను వరంగా ఇచ్చాడు.

వారిద్దరూ ఆ వరాల ప్రభావంతో విజృంభించి ముందు కుబేరునోడించి అతని పుష్పక విమానాన్ని గ్రహించి దానిపై పయనించి అన్ని లోకాలపై దాడిచేసి మొత్తం దేవతలందరినీ ఓడించి స్వర్గం నుండి దేవతలను తగిలేసి తమ వారిని అక్కడ వుంచి తాము మాత్రం లంకా రాజ్యాన్ని పాలించసాగారు. సుఖప్రదమైన స్వర్గం నుండి తగిలివేయబడిన దేవతలు పార్థివార్చన ద్వారా పదకొండేళ్ళు కైలాస సంస్థితుడైన శివుని ఆరాధించారు. ఆయన అభయమిచ్చి వేచి చూడమన్నాడు.

దుష్టశిక్షణకై దేవదేవులందరూ పూనుకొన్నపుడు శంకరభగవానుడు అంజనా గర్భము నుండి హనుమంతునిగా భూలోకంలోకి అవతరించాడు. అంజనపుత్రుడు కావున ఆయన్ని ఆంజనేయుడని కూడా అంటారు. ఆంజనేయుడు చిన్నపిల్లవానిగా నున్నపుడొక రోజు ఉదయిస్తున్న సూర్యబింబాన్ని చూసి ఫలమనుకొని ఒక్క ఎగురున పోయి దానినందుకున్నాడు. ఆ దారి వెంట పోతున్న రావణుడు సూర్యుని రక్షిద్దామనుకొని ఈ బాలమర్కటుని తోక పట్టుకొని లాగసాగినాడు. ఆంజనేయుడు ఆగలేదు. లోకాల్లో చీకటి వ్యాపించసాగింది. ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుని నోటిమీద కొట్టాడు. అయినా అతనికేమీ కాలేదు. మూతి కొంచెం ముందుకి సాగిందంతే. రావణుని పట్టు విడిపించుకోవడానికి సూర్యబింబాన్ని వదలి అతనిని పట్టుకున్నాడు ఆంజనేయుడు. ఒక యేడాది యుద్ధం చేశాడతనితో. పారిపోవడానికి ఎంత ప్రయత్నించినా రావణుని చేతకాలేదు. ఇక సర్వశక్తులూ సన్నగిల్లిన రావణుడు సొమ్మసిల్లిపడిపోయే వేళకి అతని తండ్రియైన విశ్రావోబ్రహ్మ వేదమయ స్తోత్రాలను, పరావాణిని చదివి హనుమంతునిలోని రుద్రుని ప్రసన్నం చేసుకోగా రావణుడు బతికి బయటపడ్డాడు. ఆ తరువాత కేసరి పుత్రుడైన హనుమంతుడు పంపానదీ తటంలో నిశ్చలంగా కూర్చుని కఠోర తపస్సు చేశాడు. అప్పుడే అతనికి స్థాణుడని పేరు వచ్చినది. అతని తపానికి మెచ్చి బ్రహ్మదేవుడే దిగివచ్చి ఇలా అన్నాడు. ‘తపోనిధివైన ఓ రుద్రా! వైవస్వత మన్వంతరం - ఇరవై యెనిమిదవ త్రేతాయుగం మొదటిపాదంలో విష్ణుభగవానుడే శ్రీరామచంద్రునిగా అవతరిస్తాడు. నీవాయనను, సేవించి అన్నివిధాలా ఆయననే ఆదుకొనేటంత మహానుభావుడవై శ్రీగురుదేవునిగా చరిత్రలో నిలిచిపోతావు.

బ్రహ్మదేవుడు భాద్రపదమాసంలో చంద్రమండలాధిపతిగా ఉండేటట్లు హనుమంతుని నియమించాడు. ఇక్కడ మండోదరి రావణ పత్ని అయినది. రావణుడు నైరృతి దిక్కుకి పాలకుడయ్యాడు. విష్ణువే శ్రీరామ రూపంలో అవతరించి రావణుని అంతమొందించాడు.

మునులారా! అనంతరకాలంలో ఆ హనుమంతుడే మనుష్య శరీరాన్ని ధరించి పృథ్విపై కదలీవనమను పేరుగల ప్రాంతంలో బాలశర్మగా పుట్టాడు. ఈయన వేదవేదాంగాలలో ప్రవీణుడై మంత్రశాస్త్రంపై పరిశోధనలను నిర్వర్తించి ‘తంత్ర - మంత్రశాస్త్ర’మను గ్రంథాన్ని నిర్మించాడు. అనంతరం శంకరాచార్యుల వారి శిష్యుడై కాశీలో మణికర్ణిక ప్రాంతంలో స్థిరపడ్డాడు.”