భవిష్య పురాణము

123 - స్నాన, తర్పణ విధి

మహారాజా! స్నానం లేనిదే శరీరం గాని మనసుగాని శుద్ధికావు. కాబట్టి ప్రతి జీవికీ స్నానం అవశ్యకర్తవ్యం. నది, తటాకం దగ్గర్లో వున్నవారు అక్కడికిపోయి స్నానం చేస్తే మరీ మంచిది. ఇంటిలో వీలైనంత నిర్మల, నూతనజలంతో రోజూ స్నానం చేయాలి. మంత్రవేత్త, విద్వాంసుడు నగు పురుషుడు మూలమంత్రం ద్వారా తీర్థకల్పన చేసుకోవాలి. మూలమంత్రం ఓం నమోనారాయణాయ మొదట కుశదర్భలను చేతిలోకి తీసుకొని విధిపూర్వకంగా ఆచమనం చేసి మనసునూ ఇంద్రియాలనూ అదుపులో నుంచుకొని నాలుగు జానల (హస్తాల) చతురస్ర మండలాన్ని తయారుచేసి క్రింది మంత్ర శ్లోకంతో గంగను ఆవాహనం చేయాలి.

విష్ణుపాద ప్రసూతాసి వైష్ణవీ విష్ణుదేవతా

పాహి నస్త్వేనసస్త స్మాదాజన్మ మరణాంతికాత్

తిస్రఃకోట్యోఽర్ధకోటీచ తీర్థానాం వాయురబ్రవీత్

దివిభూమ్యంతరిక్షేచతానితేసంతి జాహ్నవి  

నందినీత్యేవ తేనామ దేవేషు నలినీతి చ

క్షమాపృథ్వీచ విహగా విశ్వకాయా శివామృతా

విద్యాధరా సుప్రసన్నాతథాలోకప్రసాదినీ

క్షేమ్యాతథా జాహ్నవీ చశాంతా శాంతి ప్రదాయినీ (ఉత్తరపర్వం - 123/5-8)

ఎక్కడ స్నానం చేసి ఈ నామాలతో కూడిన మంత్ర శ్లోకాన్ని చదివినా గంగమ్మ వచ్చి ఆ నీటిలో ప్రవేశిస్తుంది. పై మంత్రాన్ని నామాలను ఏడుమార్లు పఠించి, సంపుటాకారంలో రెండు చేతులనూ జోడించి వాటిలోకి నీటిని తీసుకోవాలి. మూడు, నాలుగు, అయిదు లేదా ఏడుమార్లు అలా నీటిని తీసి నెత్తిపై పోసుకోవాలి. తరువాత విధిపూర్వకంగా కొంత మట్టిని అభిమంత్రితం చేసి ఒంటినిండా రాసుకోవాలి. అభిమంత్రితం చేయడానికి ఈ క్రింది మంత్రాన్ని పఠించాలి:

అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరే

మృత్తికేహరమే సర్వం యన్మయాదుష్కృతం కృతం

ఉద్ధృతాసి వరాహేణ కృష్ణేన శతబాహువా 

నమస్తే సర్వలోకానామసు ధారిణి సువ్రతే (ఉత్తరపర్వం - 123/12,13)

ఈ విధంగా మన్ను రాసుకొని మరల స్నానం చేయాలి. తరువాత విధ్యుక్తంగా ఆచమనం చేసి శుద్ధ శ్వేత ధోవతిని కండువాను ధరించి త్రిలోకములలో నున్న వారి తృప్తికై తర్పణాలివ్వాలి. ముందుగా త్రిమూర్తులకూ, ప్రజాపతికీ, ఆపై దేవతా యజ్ఞ, నాగ, గంధర్వ, అప్సర, క్రూరసర్ప, గరుడ, జంభక, వృక్ష, అసుర, విద్యాధర, మేఘ, ఇతర ఆకాశచారీ జీవ, నిరాధార జీవ, పాపజీవ, ధర్మపరాయణ జీవ బృందములకు తృప్తి కలగడానికి నేను నీరు విడుస్తున్నాను అని ఈ శ్లోకం ద్వారా చెప్పాలి:

బ్రహ్మ విష్ణు మహేశులకూ ప్రజాపతికీ తర్పణలిస్తున్నాను. నన్ను తరింప జేయండి. అని ముందుగా పలికి శ్లోకాలు చదవాలి.

దేవాయక్షాస్తథానాగా గంధర్వాప్సరసాంగణాః

క్రూరాః సర్వాః సుపర్ణాశ్చ తరవో జంభకాదయః

విద్యాధరా జలధారాస్తధైవాకాశ గామినః

నిరాధారాశ్చయే జీవాః పాపకర్మరతాశ్చయే

తేషామాప్యాయనాయై తద్ దీయతే సలిలంమయా (ఉత్తరపర్వం - 123/15-17)

దేవతలకు తర్పణలిస్తున్నప్పుడు జందెమును ఎడమ భుజంపై ధరించాలి. తరువాత దానిని మెడలో మాలను వలె ధరించి మానవులకు ఋషులకు, ఋషిపుత్రులకు భక్తి పూర్వకంగా తర్పణలివ్వాలి.

సనకః సనందనశ్చైవ తృతీయశ్చ సనాతనః

కపిలశ్చాసురిశ్చైవ వోఢుః పంచశిఖస్తథా

సర్వేతే తృప్తిమాయాంతు మద్దత్తేనాంబునా సదా (ఉత్తరపర్వం - 123/18,19)

సనకాదుల పిమ్మట మరీచి, అత్రి అంగిరా, పులస్త్య, భృగు, పులహ, క్రతు ప్రచేతా, వసిష్ఠ, నారదాది ఋషిగణానికి అక్షత సహిత జలం ద్వారా తర్పణలివ్వాలి. తరువాత యజ్ఞోపవీతమును మరల ఎడమ భుజముపై నుంచి మోకాళ్ళమీద నేలపై కూర్చొని అగ్నిష్వాత్త, బర్హిషద్, హవిష్మన్, ఊష్మప, సుకాలీ, భౌమ, సోమప, ఆజ్యప అను పేర్లు గల పితరులకు తిల, చందన యుక్త జలాలతో భక్తిపూర్వకంగా తర్పణలివ్వాలి. ఇలాగే చేతిలో కుశలను పెట్టుకొని పవిత్ర భావంతో పరలోకవాసులైన తండ్రి, పితామహుడు, మాతామహుడు మున్నగువారికి నామ, గోత్ర ఉచ్ఛారణలను చేస్తూ తర్పణలివ్వాలి. ఇలా బంధువులందరికీ కూడా ఇస్తూ ఈ శ్లోకం చదవాలి.

యేఽబాంధవా బాంధవా వాయేఽన్యజన్మని బాంధవాః

తే తృప్తిమఖిలా యాంతు యశ్చాస్మత్తోఽభి వాంఛతి (ఉత్తరపర్వం - 123/24)

పై శ్లోకం ద్వారా బంధువులకూ, బంధువులు కానివారికీ, పూర్వజన్మ బంధువులకీ, ఈ తర్పణాలను కోరుకున్నవారికీ కూడా అవి అందుతాయి.

తరువాత విధి పూర్వకంగా ఆచమనం చేసి ఎదురుగా పుష్పాక్షతలతో కమల స్వరూపాన్ని చిత్రించుకోవాలి. యత్నపూర్వకంగా సూర్యదేవుని నామాలను ఉచ్చరిస్తూ అక్షత, పుష్ప, రక్త చందన మిశ్రిత జలంతో ఈ క్రింది మంత్రాలు చదువుతూ అర్ఘ్య ప్రదానం చేయాలి.

నమస్తే విశ్వరూపాయ నమస్తే విష్ణు సఖాయవై

సహస్రరశ్మయే నిత్యం నమస్తే సర్వతేజసే

నమస్తే సర్వవపుషే నమస్తే సర్వశక్తయే

జగత్‌స్వామిన్ నమస్తేఽస్తు దివ్యచందన భూషిత

పద్మనాభ నమస్తేఽస్తు కుండలాంగద ధారిణే

నమస్తే సర్వలోకేశ సర్వాసుర నమస్కృత

సుకృతం దుష్కృతంచైవ సమ్యగ్జానాసి సర్వదా

సత్యదేవ నమస్తేఽస్తు సర్వదేవ నమోఽస్తుతే॥

దివాకర నమస్తేఽస్తు ప్రభాకర నమోఽస్తుతే॥ (ఉత్తరపర్వం 123/27-31)

ఇట్లు సూర్యదేవునికి నమస్కరించి మూడు మార్లు ప్రదక్షిణం చెయ్యాలి. తరువాత ద్విజునీ, గోవునీ, సువర్ణాన్నీ స్పృశించి ఇంటికిపోయి భగవానుని ప్రతిమను పూజించాలి.