“లోమహర్షణ మహర్షీ! సంవరణ మహారాజు ఎప్పుడు భూమిపైకి మరల, మరలి వచ్చాడు? ఎంతకాలం పాటు మరల రాజ్యం చేశాడు? ద్వాపరంలో ఆ తరువాత వచ్చిన రాజులెవరు? దయచేసి ఈ విషయంలో మాకు జ్ఞానాన్ని కలుగజేయండి” అని సవినయంగా అడిగిన శౌనకునికి ఇలా చెప్పసాగాడు సూత మహర్షి.
“మునీంద్రా! సంవరణ మహారాజు భాద్రపద కృష్ణ త్రయోదశీ శుక్రవారము నాడు మునులను ముందిడుకొని ఒకప్పుడు ప్రతిష్ఠానపురముండిన చోటికి వచ్చాడు. విశ్వకర్మ అక్కడ మిక్కిలి విశాలమైన ప్రాసాదాన్నొక దానిని నిర్మించాడు. దాని ఎత్తు అరకోసు(ఒకటిన్నర కిలోమీటర్లు) ఉంటుంది. మిగతా కొలతలను దీని బట్టే ఊహించుకోవచ్చు. సంవరణ మహారాజు ఇతరేతర వనరులతో అయిదు యోజనాల (ఇరవై కోసుల) వైశాల్యంగల క్షేత్రంలో అతి సుందరం, స్వచ్ఛమునైన నగరాన్ని నిర్మింపజేశాడు. అనగా ప్రతిష్ఠానపురం మరల ప్రతిష్ఠింపబడింది. ఈ నేలపై ఒకే సమయంలో, కొంత కాలానికి, చంద్రపుత్రుడైన బుధుని వంశమువాడైన ప్రసేనుడు, యదు వంశీయుడైన సాత్వత శూరసేనుడు మథుర రాజులైనారు. మ్లేచ్ఛవంశీయుడైన శ్మశ్రుపాలుడు (వీనికి గెడ్డముంటుంది) మరు దేశానికి (అరబ్, ఇరాన్, ఇరాక్) శాసకుడైనాడు. క్రమంగా ప్రజలతో బాటు రాజుల సంఖ్యా పెరుగసాగింది. సంవరణ మహారాజు పదివేల సంవత్సరాలు పరిపాలించాడు. అతని కొడుకు సూర్యజూపి పదివేల సంవత్సరాల పాటు రాజ్యం చేశాడు. అతని పుత్రుడు అర్చాజ్ఞుడు కూడా అయిదువేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. సూర్యజూపి కొడుకైన సూర్యయజ్ఞుడు గొప్ప సౌరయజ్ఞపరాయణుడు. తరువాత క్రమంగా ఒకరి పుత్రులొకరుగా ఆదిత్యవర్ధనుడు, ద్వాదశాత్మ, దివాకరుడు, ప్రభాకరుడు, భాస్వదాత్మ, వివస్వద్‌జ్ఞుడు, హరిదశ్వార్చనుడు, వైకర్తనుడు, అర్కేష్టిమంతుడు, మార్తండవత్సలుడు, మిహిరార్ధుడు, అరుణ పోషణుడు, ద్యుమణి, తరుణియజ్ఞుడు, మైత్రేష్టివర్ధనుడు, చిత్రభానూర్జకుడు, వైరోచనుడు, హంసన్యాయి, వేద ప్రవర్ధనుడు, సావిత్రుడు, ధనపాలుడు, మ్లేచ్ఛహంత, ఆనందవర్ధనుడు, ధర్మపాలుడు, బ్రహ్మభక్తుడు, బ్రహ్మేష్టివర్ధనుడు, ఆత్మప్రపూజకుడు, పరమేష్ఠి, హైరణ్య వర్ధనుడు, ధాతృయాజి, విధాతృప్రపూజకుడు, ద్రుహిణక్రతువు, వైరంచ్యుడు, కమలాసనుడు, శమవర్తి, శ్రాద్ధదేవుడు, పితృవర్ధనుడు, సోమదత్తుడు, సౌమదత్తి, సోమవర్ధనుడు, అవతంసుడు, ప్రతంసుడు, పరాంతసుడు, అయతంసుడు, సమాతంసుడు, అనుతంసుడు, అధితంసుడు, అభితంసుడు, సుముత్తంసుడు, తంసుడు పరిపాలించారు. ఈ తంసుని కొడుకే దుష్యంతుడు.
ఇతనికీ విశ్వామిత్ర పుత్రి శకుంతలకీ పుట్టినవాడే భరతుడు. ఆయన పేరిటనే ఈ దేశం భారతదేశమైనది. సూర్యదేవునీ, మహామాయనూ భక్తి తత్పరతతో పూజించిన భరతుడు సంపూర్ణ పృథ్విని ముప్పదియారువేల సంవత్సరాలపాటు చక్రవర్తిగా, సమ్రాట్టుగా పరిపాలించాడు. ఆతని తరువాత వంశపారంపర్యంగా మహాబలుడు, భరద్వాజుడు, మన్యుమానుడు, బృహత్‌క్షేత్రుడు, సుహోత్రుడు వీతిహోత్రుడు, యజ్ఞహోత్రుడు, శక్యహోత్రుడు పరిపాలించారు. ఇంద్రుడు శక్రహోత్రుని పట్ల ప్రసన్నుడై అతనిని స్వర్గానికి తీసుకొని వెళ్ళాడు.
ఈ సమయానికి అయోధ్యలో మహాబలశాలియైన ప్రతాపేంద్ర మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన పదివేల సంవత్సరాల పాటు పరిపాలించాక అతని పుత్రుడు మండలీకుడు, ఆపై అతని కొడుకు విజయేంద్రుడు, తరువాత అతని పుత్రుడు ధనుర్దాసు పుడమినేలినారు.
శక్రహోత్ర మహారాజు ఇంద్రుని ఆజ్ఞతో ఘృతాచిని వెంటనిడుకొని మరల భూలోకానికి విచ్చేసి ధనుర్దాసుని జయించి ధరణిపై తన శాసనాన్ని నిలిపాడు. ఘృతాచీ శక్రహోత్రుల పుత్రుడైన హస్తి మహారాజు పుడమినేలుతూ ఐరావత మహాగజము యొక్క సంతానమైన పరమహస్తిపై కలియదిరుగుతూ ఒక చక్కని ప్రదేశంలో హస్తినాపురమను పేరుతో నొక బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మించాడు. రాజ్యానికి పడమటివైపు కట్టబడిన ఈ నగరం పదియోజనాల విస్తీర్ణము కలది. స్వర్గంగా తీరాన నున్నది. హస్తిమహారాజు హస్తిన రాజధానిగా పదివేల సంవత్సరాలపాటు భూమిని పరిపాలించాడు. అతని వంశంలో పుత్రపౌత్రులు అజామీఢుడు, రక్షపాలుడు, సుశమ్యర్ణుడు, కురుమహారాజు చక్కగా రాజ్యపాలనము చేసి దేవేంద్రుని వరం వల్ల సశరీరంగా స్వర్గాన్ని చేరుకున్నారు.
ఆ కాలం నాటికి మథురలో మహారాజుగా సాత్వత వంశానికి చెందిన అమేయ బలశాలి వృష్టి పరిపాలన సాగుతోంది. ఆయన విష్ణు వరప్రసాది. అయిదువేల సంవత్సరాలపాటు రాజ్యపాలన మొనరించి స్వర్గస్తుడైనాడు. అతని వంశంలో వరుసగా నిరావృత్తి, దశారి, వియామునుడు, జీమూతుడు, వికృతి, భీమరథుడు, నవరథుడు, దశరథుడు, శకుని, కుశంభుడు, దేవరథుడు, దేవక్షేత్రుడు, మధువు, నవరథుడు, కురువత్సుడు - వీరంతా అయిదేసి వేలయేళ్ళు పరిపాలన చేసినవారే. కురువత్సుని తరువాత క్రమంగా వారసులై పుత్రవంతులై అనురథుడు, పురహోత్రుడు, విచిత్రాంగుడు, సాత్వతవంతుడు, భజమానుడు, విదూరథుడు, సురభక్తుడు, సుమనుడు, తతిక్షేత్రుడు, స్వాయంభువుడు, హరిదీపకుడు, దేవమేధ, సురపాలుడు తండ్రులకు ఎందులోనూ తీసిపోకుండా రాజ్యపాలన చేశారు.
ద్వాపర యుగం తృతీయ చరణంలో కురుమహారాజు ఇంద్రుని ఆజ్ఞతో వచ్చిన సుకేశీయను అప్సరసను చేపట్టాడు. ఇతడు నిర్మించిన ఇరవై యోజనాల విస్తీర్ణం గల కురుక్షేత్రం అనంతరకాలంలో పుణ్యక్షేత్రమయినది. కురుమహారాజు పన్నెండువేల సంవత్సరాల దాకా రాజ్యపాలనం చేసి స్వర్గానికేగాడు. అతని వంశక్రమంలో వరుసగా పుత్రవంతులైన జహ్నువు, సురథుడు, విదూరథుడు, సార్వభౌముడు, జయసేనుడు, అర్ణవుడు పరిపాలించారు. అర్ణవమనగా సముద్రం. ఈ మహారాజు పరిపాలనా కాలంనాటికి కురురాజ్యం నాలుగు సముద్రాలు దాటి విస్తరించింది. అర్ణవుని పుత్రుడు అయుతాయువు పదివేల సంవత్సరాలు పరిపాలించాడు. అతని తరువాత క్రమంగా అక్రోధనుడు, ఋక్షుడు, భీమసేనుడు, దిలీపుడు, ప్రతీపుడు రాజులైనారు. ప్రతీపుని పుత్రుడు శంతనుడు. అతడు వెయ్యి సంవత్సరాలు రాజ్యం చేశాడు. ఒక పొరపాటు కూడా చేశాడు. దాని వల్ల మానవజాతియే తమవాడని గర్వంగా చెప్పుకునే మహామనీషి రాజు కాకుండా పోయాడు. విచిత్రవీర్యుడు రెండువందల యేళ్ళు, పాండురాజు అయిదువందల సంవత్సరాలు, పాలించాక యుధిష్ఠర, సుయోధనులు యాభై, అరవై సంవత్సరాలు రాజ్యం చేశాక ప్రపంచ చరిత్రలోనే పరమ భయంకరమైన భారతయుద్ధం కురుక్షేత్రంలో జరిగింది. (ఈ పురాణంలో ధృతరాష్ట్రుడు రాజయ్యాడని చెప్పబడలేదు)
ప్రాచీనకాలంలో దేవతల ద్వారా అనేక యుద్ధాల్లో భారీసంఖ్యలో దైత్యులు మరణించడం జరిగింది. వారంతా వివిధ నామరూపాలతో (నామాలతో) శంతనుని రాజ్యంలో మళ్ళా జన్మలను ధరించారు. దుర్యోధనుని విశాలమైన సైన్యం నిండా అసురాంశలే పోగుపడ్డాయి. పాపులభారం ఎక్కువైపోయి భూదేవి ఇంద్రుని ప్రార్థించగా అతడు శ్రీహరిని శరణువేడగా ఆయన వసుదేవనందనుడై వసుంధరపై అవతరించి నూటముప్పదియైదు సంవత్సరాలు జీవించి సంపూర్ణ దుష్టశిక్షణలో సింహభాగమును చేసి, చేయించి ధర్మస్థాపనమును చేసి గోలోకానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణభగవానుని అవతారం ద్వాపరయుగ చతుర్థచరణం చివర్లో జరిగింది.
దీని తరువాత హస్తినాపురంలో అభిమన్యునందనుడైన పరీక్షిన్మహారాజు రాజ్యం చేశాడు (పరీక్షిత్తనే మాట సరైనది కాదు. పరిక్షీణించిన వంశాకురం కాబట్టి ‘పరి’ క్షిత్ అనే పేరే సార్థకమైంది.) తరువాత క్రమంగా జనమేజయుడు, శతానీకుడు, యజ్ఞదత్తునిగా పేరుగాంచిన సహస్రానీకుడు భూమిని శాసించారు. సహస్రానీకుని పుత్రుడైన నిశ్చక్రుడు (నిచక్నుడు) రాజ్యం చేస్తున్న కాలంలో గంగకి వరదవచ్చి హస్తినాపురం మూడువంతులు మునిగిపోయింది. అపుడతడు ప్రయాగకు నాలుగు యోజనాల దూరంలో కౌశాంబి అనే నగరాన్ని రాజధానిగా చేసుకొని అక్కడినుండి రాజ్యపాలన చేశాడు (విష్ణుపురాణం: అంశ4/అధ్యాయము 21) అతని తరువాత ఈ వంశంలో వరుసగా ఉష్ర్ట్, చిత్రరథ, ధృతిమాన్, సుషేణ, సునీథ, మఖపాల, చక్షు సుఖవంత (సుఖావల) పరిప్లవ, సునయ మేధావి, నృపంజయ, మృదు, తిగ్మజ్యోతి, బృహద్రథ, వసుదాన, శతానీక, ఉదయన, అహీనర, నిరమిత, క్షేమక మహారాజులు అధికారానికి వచ్చారు.
క్షేమకుడు రాజ్యాన్ని త్యజించి కలాపగ్రామానికి వెళ్ళిపోయాడు. నారదుని ఉపదేశం వల్లనూ, సత్ప్రయాస సత్ఫలితంగానూ అతనికి ప్రద్యోతుడను పుత్రుడుదయించాడు. క్షేమకుని మృతి మ్లేచ్ఛులద్వారా జరిగింది. ప్రద్యోతుడు మ్లేఛ్ఛయజ్ఞం చేయడంతో రాజ్యంలో మ్లేచ్ఛ వినాశనం సాధ్యమైంది”.