ధర్మజా! చైత్ర, భాద్రపద, మాఘశుద్ధ తదియలలో చేయవలసిన వ్రతాలున్నాయి. వీటివల్ల రూపం, సౌభాగ్యం, ఉత్తమ పుత్ర ప్రాప్తీ కలుగుతాయి.
పార్వతీదేవికి జయా, విజయా అని ఇద్దరు ఇష్ట సఖియలుండేవారు. ఒకనాడు కొందరు మునికన్యలు వారిని ఇలా ప్రశ్నించారు. ‘మీరు ఎల్లవేళలా మహాదేవియైన పార్వతీని పరివేష్టించే వుంటారు కదా! ఆమె ఏ రోజు ఏ వ్రతం చేస్తే ఎక్కువగా ప్రసన్నురాలవుతుందో మీకే బాగా తెలుస్తుంది; దయచేసి వాటిని మాకు అనుగ్రహించండి.’
జయ ఇలా చెప్పింది - ‘చైత్రశుద్ధ తదియనాడు చేయబడే ఒక వ్రతం అంటే పార్వతికి చాలా ఇష్టం. దానిని చెప్తాను వినండి. ప్రతి ఆరోజు పెందరాళే లేచి దంతధావనాదులను ముగించుకొని ఈ వ్రతానికి ఉపక్రమించాలి. స్నానంచేసి, కుంకుమ, సింధూరం, ఎఱ్ఱబట్టలు, తాంబూలాది మంగళచిహ్నాలను ధరించి (ఇవి సౌభాగ్య చిహ్నములు) భక్తితో దేవిని పూజించాలి. ముందుగా నొక అతిశయ సుందరమైన మండపాన్ని నిర్మించి దానిమధ్యలో ఒక మనోహరమైన మణిజటితమైన వేదిని రచించాలి. ఒక హస్త ప్రమాణంలో కుండమును నిర్మించి మరల స్నానము చేసి ఉత్తమ వస్త్రాలను ధరించి దేవతలనూ పితరులనూ పూజించి దేవీ మండపం వద్దకురావాలి. పార్వతి, లలిత, గౌరి, గాంధారి, శాంకరి, శివా, ఉమ, సతి అను ఎనిమిది నామాలతో దేవిని అర్చించాలి. అప్పుడు (దేవి ప్రతిమను వేదికపై ప్రతిష్ఠించి) కుంకుమ, కర్పూరం, అగరు, చందనాలను పూయాలి. అనేక రకాల సుగంధిక పుష్పాలను వేస్తూ నామం చదవాలి. ధూపదీపాది ఉపచారాలను చేయాలి. లడ్లను, అప్పాలనూ, నేతితో చేసిన పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలి. జీలకఱ్ఱ, పసుపు, కుంకుమ, ఉప్పు, చెఱకుగడ, చెఱకురసం, కొబ్బరికాయ, ఉసిరికాయ, గుమ్మడి, నారింజ, దానిమ్మ, పనసపండ్లు, వేపకాయలు భగవతికి నివేదించాలి. గృహస్థ ఉపకరణాలైన ఱోలు, నూరుకొనే బండ, చేట, తట్ట వంటి వాటినీ, శరీరానికి అలంకరించు కొనే వస్తువులను కూడా దేవికి నివేదించాలి. శంఖ, తూర్య, మృదంగాదులను వాయిస్తూ ఉత్తమ గీతాలను అమ్మ సమక్షంలోపాడాలి, పాడించాలి. ఒక మహోత్సవాన్నే చేయించాలి. ఈ విధంగా భక్తిగా శక్తిననుసరించి పార్వతీదేవిని పూజించిన కన్యలు సౌభాగ్యవతులు కావాలంటే తెల్లవారగానే కొత్త కలశలతో నీరు తెచ్చుకొని స్నానం చేయాలి. తరువాత ఇంతకు ముందు చెప్పినట్లుగా పార్వతీదేవిని పూజించాలి. జాముకొకసారి పూజను చేసి నువ్వులు నెయ్యి కలిపి హవనం చెయ్యాలి. భగవతి సమ్ముఖంలో పద్మాసనం వేసుకొని రాత్రి జాగరణ చేయాలి. నృత్యంతో శంకర భగవానుని గీతంతో పార్వతీదేవి నీ భక్తితో అందరు దేవతలనూ ప్రసన్నం చేసుకోవచ్చని గమనించాలి. ముత్తయిదువలను పిలిచి వారిని తాంబూలంతో కుంకుమతో ఉత్తమ పుష్పాలతో సత్కరించాలి. పెందలకడనే స్నానం చేసి బెల్లం, కుంకుమ, ఉప్పు, కర్పూరం, అగరు, చందనాలతో యథాశక్తి పార్వతీ దేవిని పూజించి తులాదానం చేయాలి. బ్రాహ్మణులకు సువాసినులకు భోజనాలు పెట్టించాలి. నైవేద్యాలను వితరణ బుద్ధితో తయారుచేయించి ఎంతమందికి పంచి పెట్టడం వీలైతే అంతమందికి పంచాలి.
భాద్రపద శుద్ధతదియనాడు కూడా చైత్ర తదియనాడు చేసినట్టే చేసి సప్త ధాన్యాలతో ఉమాదేవి మూర్తిని తయారుచేసి పూజించాలి. గోమూత్రాన్ని నోటిలో వేసుకోవాలి. ఈ వ్రతం ఉత్తమ సౌందర్యప్రదాయకం.
మాఘమాస శుద్ధ తదియనాడు కూడా చైత్ర తదియనాడు చేసినట్టే చేసి కుంద పుష్పాలను తులాదానంచేయాలి. మరునాడు అనగా చవితిరోజు గణేశుని పూజించాలి.
ఈ విధంగా పూజనూ తులాదానాన్నీ చేసిన స్త్రీ భర్తతో సహా స్వర్గానికీ, ఆపై బ్రహ్మ లోకానికీ తరువాత శివలోకానికీ వెళ్ళగలదు. మూడులోకాలలోనూ బహుకాలం నివసిస్తుంది. ఈ లోకంలో కూడా ఆమెకు ప్రతి జన్మలో రూపం, సంతానం, సౌభాగ్యం, ధనం పుష్కలంగా లభిస్తాయి. ఆమె వంశంలో దుర్భాగ కన్యలూ, దుర్వినీత పుత్రులూ పుట్టరు. ఇంట్లో దారిద్ర్య, రోగ, శోకాదులుండవు. కన్యలీ పూజను చేసి బ్రాహ్మణ పూజను గావిస్తే మంచి భర్త లభించి పైన చెప్పిన ఫలాలన్నీ ప్రాప్తిస్తాయి.”