భవిష్య పురాణము

52 - 53 - సూర్యరథం - భ్రమణ వైశిష్ట్యం

“మునివరా! సూర్యనారాయణుని రథయాత్ర నేవిధంగా చేయాలి? రథాన్నెట్లు తయారు చేయాలి? మృత్యులోకంలో కూడా దీని ప్రసక్తి వుంటుందని విన్నాను, అది ఎలా సాధ్యపడింది?” అడిగాడు శ్రోత.

చెప్పసాగాడు పురాణజ్ఞాన ప్రదాత.

“ఓ శతానీక మహారాజా! ఒకప్పుడు సుమేరుపర్వతంపై పర్యటిస్తున్నవేళలో పరమశివుడు బ్రహ్మని సూర్యనారాయణుడెటువంటి రథంలో భ్రమణం చేస్తాడని అడిగితే బ్రహ్మ ఇలా చెప్పాడు.

ఒక చక్రం, మూడు నాభులు, అయిదు అరలు, స్వర్ణమయములై కాంతివంతాలైన ఎనిమిది బంధాలు, ఒకనేమిలను కలిగియుండి పదివేల యోజనాల పొడవు వెడల్పుండే బంగారు రథంపై సూర్యుని పయనం సాగుతుంది. రథం యొక్క ఉపస్థకంటే ఈషాదండం మూడురెట్లు పెద్దది. దీనిపై సారధి అరుణుడుంటాడు ఇతడే అనూరుడు ఈరథము (ఇక్కడ పురాణంలో जुआ అనేమాట వాడబడింది). బంగారంతో చేయబడివుంటుంది. వాయువేగంతో పోగలిగే ఏడు తెల్ల గుఱ్ఱాలూ సంస్కృత చందస్సులు. అయిదు ఋతువులు ఆరాలు (ఊచలు) నేమి ఆరోఋతువు. ఇలా విశ్వంలో ఉండేవన్నీ ఈ రథంలో సంకేతరూపంలో వున్నాయి.

రథంతో వెళ్ళే ప్రముఖులు రెండు నెలలకోసారి మారుతుంటారు.

చైత్ర, వైశాఖమాసాల్లో ధాత, అర్యముడనే ఆదిత్యులు, పులస్త్య, పులహ ఋషులు, ఖండక, వాసుకిలను నాగులు, నారదతుంబురులను గంధర్వులు, క్రతుస్థల, పుంజిక స్థలలను అప్సరసలు, రథకృత్స్న, రథౌజులను యక్షులు, హేతి ప్రహేతులను రాక్షసులు రథంతో వెళతారు.

అదే క్రమంలో మిత్ర వరుణులు, అత్రి వసిష్ఠులు, తక్షక, అనంతులు, మేనక సహజన్యలు. హాహాహూహూలు, రథస్వాన, రథచిత్రులు, పౌరుషేయబదులు జ్యేష్ఠ ఆషాఢాలలో వెళతారు.

శ్రావణ, భాద్రపద మాసాలలో ఇంద్ర వివస్వతులను ఆదిత్యులు, అంగిర భృగు ఋషులు, ఏలాపర్ణ; శంఖపాలులను నాగులు, ప్రంలోచనదుందుకలను అచ్చరలు, భాను; దుర్దురులను గంధర్వులు, సర్ప బ్రాహ్మలను రాక్షసులు, స్రోత ఆపూరణులను యక్షులు రథంతో వెళతారు.

ఆశ్వియుజ కార్తిక మాసాలలో పర్జన్య, పూషలను ఆదిత్యులు, భారద్వాజ, గౌతమ ఋషులు, చిత్రసేన; వసురుచులనే గంధర్వులు, విశ్వాచీ ఘృతాచీలను అప్సరసలు, ఐరావత; ధనంజయ నాగులు, సేనాజిత; సుషేణులనే యక్షులు, ఆప; వాత నామకులైన రాక్షసులు రథం వెంట వెళతారు.

మార్గశిర, పుష్యమాసాల్లో అంశు; భగలను ఆదిత్యులు, కశ్యప; క్రతు ఋషులు, మహాపద్మ; కర్కోటక నాగులు, చిత్రాంగద; అరణాయులను గంధర్వులు, సహా; సహస్యలను అప్సరసలు, తార్‌క్ష్య, అరిష్టనేమిలను యక్షులు, మరల ఆప; వాత రాక్షసులు రథం వెంట వుంటారు.

మాఘఫాల్గునాల్లో పూషా; జిష్ణు ఆదిత్యులు, జమదగ్ని; విశ్వామిత్ర ఋషులు, కాద్రవేయ; కంబలాశ్వతర నాగులు, ధృతరాష్ట్ర; సూర్యవర్చులను గంధర్వులు, తిలోత్తమ, రంభ, ఇంకా సేనజిత సత్యజిత నామకులు యక్షులు, బ్రాహ్మోపేత; యజ్ఞోపేతులను రాక్షసులు సూర్యుని రథంతో వెళతారు.

బ్రహ్మదేవుడు రుద్రదేవునితో ఇంకా ఇలా వివరిస్తున్నాడు. దేవతలందరూ తమ అంశలను వివిధ అస్త్రశస్త్రాలలో పెట్టి సూర్యదేవునికిచ్చారు. అందరూ ఆయన రథంతో బాటు తిరుగుతుంటారు. ఆ రథం వెంట వెళ్ళని ఆకాశచరులు లేరు. ఈ సర్వ దేవమయ సూర్యనారాయణ మండలాన్ని, బ్రహ్మవేత్తలు పరబ్రహ్మ స్వరూపమనీ, యాజ్ఞికులు యజ్ఞస్వరూపమనీ, భగవద్భక్తులు విష్ణు లేదా శివ స్వరూపమనీ విశ్వసిస్తారు. దేవగణాలు తేజస్సుతో, ఋషులు స్తుతులతో, గంధర్వులు గానంతో ఆయనను ప్రార్థిస్తుంటారు. అప్సరసలు నాట్యం చేస్తూ రథం ముందు సాగుతుంటారు. వాలఖిల్యులని ఋషిగణం వున్నారు. వారు సూక్ష్మరూపులు. అరవైవేలమంది మునులు వారు ఎల్లప్పుడు రథాన్ని చుట్టుముట్టి వుంటారు.

మహావైభవంతో సాగే సూర్యరథం పరిసరాల్లో వీరేకాక ఇంకా దివస్పతి, స్వయంభువులు రథానికి ముందు, భర్గుడు కుడివైపు, పద్మజుడెడమవైపు, కుబేర వరుణులు దక్షిణ ఉత్తరాల్లో, వీతిహెూత్రుడు, హరి రథం వైపు వుంటారు. రథానికి పీఠంలో భూమి, మధ్యలో ఆకాశం, కాంతిలో స్వర్గం, జెండాకర్రలో దండం, ధ్వజాగ్రంపై ధర్మం, పతాకంలో బుద్ధి, వృద్ధి, శ్రీలు ఉంటాయి.

సూర్యనారాయణ స్వామియే లోకబాంధవుడు. ఆయన కిరణాలే లోకాలను, చంద్రునీ వెలిగిస్తాయి. తన కిరణాలతో భూరసాన్ని పానంచేసి వర్షాన్ని ఇచ్చేది ఆయనే. ఈ వృష్టి నుండియే ఔషధాలు ప్రాప్తమవుతున్నాయి. వర్షం వల్లనేగా జనమూ ప్రతివర్షమూ బ్రతికేది.

ఒక్క చక్రపు రథంలో కూర్చునే ఆయన ఒకరోజులో సప్తద్వీపాలనూ సముద్రాలతో సహా వెలిగించి వస్తాడు. 360 మార్లు జరుగుతుంది. ఈ భ్రమణం ఒక సంవత్సరానికి. యమరాజు నగరి సంయమనిలో సూర్యోదయం అవుతుంటే అమరావతిలో మధ్యాహ్నం, వరుణ నగరియగు ‘సుఖ’ లో అర్ధరాత్రి, సోమనగరి ‘విభ’ లో సూర్యాస్తమయం ఒకే మారు జరుగుతాయి. ఏ ప్రాంతానికైనా సూర్యోదయమయ్యే దిక్కే తూర్పు, సూర్యుడస్తమించే దిశ పడమర. ఒక ముహూర్తకాలంలో భూగోళంలో ముప్పదవ భాగాన్ని సూర్యుడాక్ర మిస్తాడు. ప్రతిరోజూ ప్రతి ఖేచరుడూ ప్రతి దేవతా సూర్యుని పూజిస్తారు. బ్రహ్మ విష్ణు రుద్రాదులు రాత్రి అంతం కాగానే బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యుని పూజిస్తారు.

(ముఖ్యంగా ఈ విషయాన్ని బ్రహ్మ, రుద్రునికే చెబుతున్నాడు. అయినా మనమిద్దరమూ అని కాకుండా బ్రహ్మ విష్ణు రుద్రాదులనడం మనకి అర్థం కావడం కోసం.)