భవిష్య మహా పురాణము
8 - తిలకవ్రతమాహాత్మ్యం - చిత్రలేఖ చరిత్ర
“పరంధామా! మన శాస్త్రాలలో బ్రహ్మ, విష్ణు, శివ, గౌరీ, గణపతి, దుర్గా, సోమ, అగ్ని, సూర్యాది దేవతలను ప్రసన్నం చేసుకోవడానికుపకరించు వ్రతాలన్నీ నిర్దిష్టంగా చెప్పబడినవనివిన్నాను. వాటిని ప్రతిపాదిత క్రమంలో వర్ణించవలసినదిగా మిమ్ము ప్రార్థిస్తూన్నాను. ఏదేవతను ఏతిథిలో ఎలా ప్రసన్నంచేసుకోవాలో కూడా మాపై దయతో తెలపండి.”
“పాండవాగ్రజా! చైత్రశుక్ల పాడ్యమినాడు తటాకంలోగాని, నదిలో గాని గృహంలో గాని స్నానం చేసి దేవతలకు, పితరులకు తర్పణలివ్వాలి. తరువాత ఇంటిలోని దైవమందిరానికి వచ్చి గోధుమపిండితో ఆ సంవత్సరునియొక్క పురుష మూర్తిని తయారుచేసి చందన, పుష్ప, ధూప, దీప, నైవేద్యాది ఉపచారాలతో ఆయనను పూజించాలి. ఋతు, మాసాల పేర్లనుచ్చరించి, పూజచేసి ప్రణామంగా ఆ సంవత్సర నామానికి తగిన ప్రార్ధన చేసి ఈ క్రింది మహా మంత్రాన్ని పఠించాలి:
సంవత్సరోఽసి పరివత్సరోఽ సీదావత్సరోఽసీ
ద్వత్సరోఽసి వత్సరోఽసి ।
ఉషసస్తే కల్పంతామహోరాత్రాస్తే కల్పంతామర్ధ
మాసాస్తే కల్పంతాం మాసాస్తే కల్పంతా మృతవస్తే
కల్పంతా సంవత్సరస్తే కల్పతాం! ప్రేత్యా ఏత్యై
సంచాంచ ప్రచసారయ! సుపర్ణ చిదసితయా
దేవతయాంఽగిరస్వద్ ధృవః సీద ॥ (యజుర్వేదం 27/45)
అపుడా ప్రతిమకు వస్త్రాన్నలంకరించి ఫల, పుష్ప, మోదకాదులతో పూజించి నైవేద్యం పెట్టి చేతులు జోడించి ‘దేవా నీ అనుగ్రహంవల్ల నాకీ సంవత్సరం సుఖంగా గడవాలిగాక (భగవంత్స్వ ప్రసాదేన వర్షం శుభదమస్తుమే) అని ప్రార్థించాలి.
ఇలా చెప్పి బ్రాహ్మణునికి యథాశక్తి దక్షిణనిచ్చి ఆరోజు నుండి నిత్యం నుదుటిపై చందనాన్ని ధరించాలి. ఈ ప్రకారం వ్రతం చేసే స్త్రీ పురుషులు దాని ప్రభావం వల్ల ఉత్తమ ఫలాల నందుతారు. ఈ చందన తిలకం భూత, ప్రేత, పిశాచ, గ్రహ, డాకినీ, శత్రుబాధలను పారద్రోలుతుంది. యమకింకరులు కూడా ఈ తిలకానికి భయపడిపారిపోయినట్లు చెప్పే ఇతిహాసమొకటున్నది. విను. పూర్వకాలంలో శత్రుంజయుడని ఒక రాజుండేవాడు. అతని భార్య పేరు చిత్రలేఖ. ఆమె అత్యంత సదాచారిణి. ఈ వ్రతాన్ని బ్రాహ్మణుల ద్వారా సంకల్పమునందుకొని ప్రప్రథమంగా చేసిందామెయే దీని ప్రభావం వల్ల వాళ్ళకొక పుత్రుడు పుట్టాడు. చిత్రలేఖా మహారాణి నిత్యమూ సంవత్సరపూజను చేస్తూనే వుండేది. ఆమె లలాట మెల్లపుడూ ఆ తిలకంచే శోభిస్తునే వుండేది. ఆ తిలక ప్రభావం వల్ల ఆమె వద్దకు వచ్చే వారందరూ ఆమెపట్ల గౌరవాదరాలను మాత్రమే చూపగలిగే వారు. కొందరు, ఆమెకన్న అన్ని విధాలా పెద్దవారు, ఆమెతో గొడవ పెట్టుకోవడానికి వచ్చి కూడా ఆమె తిలకాలంకృత లలాటాన్ని చూడగానే, పులుల వలె వచ్చినవారు పిల్లులైపోయి, పోయేవారు. ఇలా వుండగా ఒక రోజు రాజుగారి పట్టపుటేనుగు పిచ్చెత్తిపోయి రాజు గారినే పొడిచి చంపేసింది. సరిగ్గా అదే సమయానికి విపరీతమైన శిరోవేదనతో మెదడు పగిలి రాకుమారుడు మరణించాడు. రాణి చిత్రలేఖ ఇద్దరి శవాలకూ సమీపంలో శోకవిహ్వలయై కూర్చుని నివున్నది. యమకింకరులు వారి ప్రాణాలను గొనిపోవడానికి వచ్చారు కాని, రాణీ గారి నుదుటిపైనున్న అద్భుత వ్రతఫలచిహ్నమైన తిలకాన్ని చూసి ఈమె సౌభాగ్యాన్ని చెడగొట్టే ధైర్యం లేక వెనుకకు మరలిపోయారు. వెంటనే రాజుగారు, రాకుమారుడు నిద్రనుండి వలె లేచి కూర్చున్నారు. వారి శరీరాలు కాంతి వంతములు కాగా వారు మరింత ఆరోగ్యవంతులైనారు. మహారాజా! ఈ పరమోత్తమ వ్రతాన్ని నాకు పరమేశ్వరుడుప దేశించాడు. నేను నీకు ఉపదేశించాను. ఈ తిలక వ్రతం అన్ని దుఃఖాలనూ హరిస్తుంది. దీనిని భక్తి పూర్వకంగ చేసిన వారు చిరకాలము ఇక్కడ అన్నిభోగాలనూ అనుభవించి దేహాంతంలో బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు.