మహారాజా! ఇంతవఱకు అత్యంత గుప్తంగా వుండిపోయిన వివిధ ప్రకీర్ణ వ్రతాలను వర్ణిస్తాను. విను. ప్రాతః కాలంలో స్నానం చేసి అశ్వత్థ వృక్షాన్ని పూజించి తిలలు నింపిన పాత్రను బ్రాహ్మణునికి దానం చేసిన వానికి శోకించవలసిన అవసరంరాదు. అన్ని పాపాలనూ దూరం చేసే ఈ వ్రతం పేరు పాత్రవ్రతం.
బంగారంతో బృహస్పతి ప్రతిమను చేయించి దానిని పీత వస్త్రాదులతో అలంకరించి, పుణ్యదినాన బ్రాహ్మణునికి దానం చేయాలి. బల, బుద్ధి ప్రదాయకమైన ఈ వ్రతం పేరు వాచస్పతి వ్రతం.
ఏకభుక్తముండీ(లవణ, కటు, తిక్త, జీరక, మరిచ, హీంగ, సోంఠ పదార్ధాలు. వీటికీ శిలాజీవితాన్ని కలిపి దానం చేయాలి.) లవణాది సప్త పదార్ధాలను ఏడుగురు గృహస్థులైన బ్రాహ్మణులకు దానం చేస్తే లక్ష్మీ, వాక్కూ సిద్ధిస్తాయి. ఇది శిలావ్రతం.
నక్తవ్రతం చేసి ఆవునూ, వస్త్రాలనూ, సువర్ణంతో చేయబడిన త్రిశూలాన్నీ, చక్రాన్నీ గృహస్థ బ్రాహ్మణునికి దానం చేసి ఆయనకు ప్రణామం చేస్తూ శివకేశవౌ ప్రీయేతాం అనాలి. మహాపాతకాలను కూడా దగ్ధం చేసే ఈ వ్రతం శివకేశవ వ్రతం.
ఒక యేడాదిపాటు ఏకభుక్తముండి సువర్ణముతో చేయబడిన ఎద్దునీ(ఇల్లు, తోలు, చేట, సన్నికల్లు, గిన్నె, కుండ, పొయ్యి సప్తోపస్కరాలు.) ఉపస్కర సహితమైన తిలధేనువునీ బ్రాహ్మణునికి దానం చేయాలి. అన్ని రకాల పాపాలనూ శోకాలనూ దూరం చేసి శివలోకప్రాప్తినిచ్చే ఈ వ్రతం పేరు రుద్రవ్రతం.
పంచమినాడు సర్వౌషధి మిశ్రిత జలంతో స్నానం చేసి సప్త ఉపస్కరాలనూ బ్రాహ్మణునికి దానం చేయాలి. అత్రి మహర్షిచే అనసూయకుపదేశింపబడిన ఈ వ్రతం పేరు గృహవ్రతం.
స్వర్ణ కమలాన్నీ నీలకమలాన్నీ చక్కెర నింపిన గిన్నెతో సహా బ్రాహ్మణునికి దానమిచ్చే వ్రతం నీలవ్రతం. దీనినాచరించు వానికి విష్ణులోక ప్రాప్తి వుంటుంది. ఆషాఢాదిగా నాలుగు నెలలపాటు తైలాభ్యంగ స్నానం చేయకుండా వుండి, చివర పారణంలో నువ్వుల నూనె నింపిన కొత్తకుండ బ్రాహ్మణునికిచ్చి నేతితో పాయసంతో భోజనం పెట్టి చేసే వ్రతాన్ని ప్రీతివ్రత మంటారు. దీనివల్ల కూడా విష్ణులోక ప్రాప్తి వుంటుంది.
ఇలా నలభైకి పైగా చిన్న చిన్న వ్రతాలు శ్రీకృష్ణునిచే ధర్మజుని కుపదేశింపబడ్డాయి.
ధర్మరాజా! ఒక సంవత్సరం పాటు అష్టమినాడు రాత్రి పూట మాత్రమే భోజనం చేసి సంవత్సరం చివర బ్రాహ్మణునికి పయస్వినియైన గోవుని దానమిచ్చిన వారికి ఇంద్రలోక నివాస ప్రాప్తి కలుగుతుంది. దీనిని సుగతి వ్రత మంటారు.
హేమంత శిశిర ఋతువులలో ఇంధన దానం రోజూ చేసి చివర్లో నేతినీ, పాలిచ్చే ఆవునీ బ్రాహ్మణునికి దానమిచ్చేది వైశ్వానర వ్రతం. దీని వల్ల ఆరోగ్యం, తేజస్సు, పాపనాశం, కలుగుతాయి. చివర బ్రహ్మపదం ప్రాప్తిస్తుంది.
ఏకాదశి రోజుల్లో నక్తవ్రతాన్ని పాటిస్తూ చైత్ర మాసం చిత్రానక్షత్రంలో స్వర్ణ శంఖ చక్రాలను దానం చేసినవారు కల్పాంతం వఱకూ విష్ణులోకంలో నివాసముండి మరల పుడమిపై పుట్టినపుడు మహారాజులౌతారు. ఇది విష్ణువ్రతం.
ఒక ఏడాది దాకా పంచమి దినాల్లో పాలను మాత్రమే ఆహారంగా తీసుకొని చివర్లో రెండు ఆవులను బ్రాహ్మణులకు దానమిచ్చినవారు ఒక కల్పంపాటు లక్ష్మీలోకంలో నివసించగలరు. దీనిని దేవీవ్రత మంటారు. ఇలాగే సప్తమినాడు నక్తవ్రతంతో చేసేది భానువ్రతం. దీనికి ఫలం సూర్యలోకప్రాప్తి. ఇలాగే చవితినాడు చేసి ఏడాది చివర్లో అగ్నిహోత్రియైన బ్రాహ్మణునికి ఎనిమిది ఆవులను దానం చేస్తే వినాయక వ్రతం. దీని వల్ల వ్రతికి ఎటువంటి విఘ్నాలూ ఎదురుకావు.
ఒక యేడాదిదాకా ప్రతి సప్తమికీ ఉపవాసం చివర నొక బంగరుకమలమును, రాగిపాత్రను తయారుచేయించి సవత్సగోవుతో సహా పౌరాణికుడైన బ్రాహ్మణునికి దానం చేస్తే సూర్యలోకం నివాస ప్రాప్తి కలుగుతుంది. ఇది సౌరవ్రతం. పన్నెండు శుద్ధ ద్వాదశులలోనూ ఉపవాసం చేసి యథాశక్తి పన్నెండు జలపూర్ణ ఘటాలనూ వస్త్రాలనూ బ్రాహ్మణులకు దానం చేసినవారికి సర్వకార్యసిద్ధి ప్రాప్తిస్తుంది. ఇది గోవిందవ్రతం.
పద్ధతి ప్రకారం కృచ్ఛ్రప్రాయశ్చిత్తాన్ని చేసుకొని అంతంలో గోదానం చేసి బ్రాహ్మణులకు యథాశక్తి భోజనాలు పెట్టించడం ప్రాజాపత్యవ్రతం. దీనివల్ల పాపవిముక్తి కలుగుతుంది. ప్రతి చతుర్దశికీ నక్తవ్రతం చేసి సంవత్సరాంతంలో రెండు గోవులను బ్రాహ్మణునకు దానం చేసినవారికి శైవపదం ప్రాప్తిస్తుంది. ఇది త్ర్యంబకవ్రతం. వరుసగా ఏడు రాత్రులుపవాసం చేసి నేతి కుండను బ్రాహ్మణుకిని దానమిస్తే బ్రహ్మలోక నివాస మబ్బుతుంది. ఇది బ్రహ్మవ్రతం.
బ్రహ్మకూర్చవ్రతం లో కార్తీక శుక్ల చతుర్దశినాడు ఉపవాసం చేసి విశిష్ట పంచగవ్యాలను పానం చేయాలి. అనగా కపిల గోమూత్రాన్నీ, నల్లావుపేడనీ, తెల్లావుపాలనీ, ఎఱ్ఱావు పెరుగునీ, బొల్లిఆవు నేతినీ మంత్రసహితంగా కుశోదకాలతో కలిపి స్వీకరించాలి. రెండవ రోజు పెందలకడనే స్నానం చేసి దేవతలకూ పితరులకూ తర్పణాలొసగి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టించి ప్రతి కూడా మౌనంగా భోంచేయాలి. దీనివల్ల బ్రహ్మదేవుడు ప్రసన్నుడై ప్రతి అన్ని జీవిత దశల్లో చేసిన పాపాలనుండీ ముక్తిని ప్రసాదిస్తాడు.
చాంద్రాయణ వ్రతం చేసి బంగరు చందమామను చేయించి బ్రాహ్మణునికి దానమిస్తే చంద్రలోకప్రాప్తి లభిస్తుంది. ఇది చంద్రవ్రతం. జ్యేష్ఠ శుద్ధ అష్టమినాడూ, చతుర్దశినాడూ పంచాగ్నులను సేవించి యధాశక్తి స్వర్ణాన్నీ, గోవునీ బ్రాహ్మణునకు దానమిచ్చిన వారికి రుద్రలోక ప్రాప్తి వుంటుంది. దీనిని రుద్రవ్రత మంటారు. ఒక యేడాదిపాటు ప్రతి తదియనాడూ శివాలయములో ఉపలేపనం చేసి చివర్లో గోదానం చేస్తే స్వర్గం లభిస్తుంది. దీనిపేరు భవానీవ్రతం.
మాఘశుద్ధ సప్తమినాడు ఉపవాసం చేసి రాత్రి తడిబట్టలు కట్టుకొని అవి ఆరేదాకా పూజా మందిరంలో నామజపం చేసి తెల్లవారాక బ్రాహ్మణునికి గోదానం చేస్తే కల్పాంతం దాకా స్వర్గలోక నివాసం ప్రాప్తిస్తుంది. దీనిని తాపనవ్రత మంటారు.
సూర్యలోక ప్రాప్తిని కలిగించేది ధామవ్రతం. దీనికి మూడు రాత్రులుపవాసముండి ఫాల్గున పూర్ణిమనాడు గృహదానం చేయాలి. పున్నమినాడు ఉపవాసం చేసి సపత్నీక బ్రాహ్మణునికి మూడు సంధ్యలలో వస్త్ర, ఆభూషణ, భోజనాలతో తృప్తి కలిగిస్తే మోక్షప్రాప్తినిచ్చేది ఇందువ్రతం.
శుక్ల ద్వితీయనాడు ఉప్పు నింపిన కంచుపాత్రను వస్త్ర దక్షిణలతోబాటు భూసురునకు దానమిచ్చి చివర శివమందిరంలో గోదానం చేసినవారు కల్పాంతం దాకా శివలోకంలో నివసించి మరుజన్మలో రాజాధిరాజులౌతారు. ఈ వ్రతం సోమవ్రతం. ప్రతి పాడ్యమి నాడూ ఒక ఏడాది దాకా ఒంటిపూట భోంచేసి కపిలగోవును బ్రాహ్మణునికి దానమిచ్చిన వారికి అగ్నిలోక ప్రాప్తి వుంటుంది. ఈ వ్రతం పేరు ఆగ్నేయవ్రతం.
మాఘమాసంలో ఏకాదశి, చతుర్దశి, అష్టమి దినాల్లో ఏకభుక్తం చేసి వస్త్రాలు, చెప్పులు, కంబళి, లేడిచర్మాది శీతనివారక వస్తువులను దానం చేసి చైత్రమాసంలో ఇవే తిథుల్లో విసనకర్ర, గొడుగు, చెప్పులు వంటి ఉష్ణ నివారక పదార్ధాలను దానం చేసినవారికి అశ్వమేధ యజ్ఞఫలం దక్కుతుంది. ఈ వ్రతం పేరు సౌఖ్యవ్రతం. ఒక యేడాదిపాటు దశమి రోజులలో ఒంటిపూట భోజనం చేసి చివర్లో దశ దిశల స్త్రీ మూర్తిని స్వర్ణంతో చేయించి తిలరాశిపై స్థాపించి దానిని గోసహితంగా బ్రాహ్మణునికి దానం చేసినవారికి మహాపాతకాలన్నీ నశించి బ్రహ్మాండాధిపత్యం సిద్ధిస్తుంది. ఇది విశ్వవ్రతం. శుక్లసప్తమినాడు నక్తవ్రతం చేసి సూర్యభగవానుని పూజించి సప్తధాన్యాలనూ లవణాలనూ, బ్రాహ్మణునికి దానమిచ్చిన వారికి ఏడుతరాల వారు ఉద్ధరింపబడతారు. ప్రతి కూడ సుఖంగా జీవిస్తాడు. ఇది ధాన్యవ్రతం.
ముప్పది పలంల స్వర్ణంతో సముద్ర సహిత భూగోళ మూర్తిని తయారు చేసి తిలరాశిపై స్థాపించి కుటుంబికుడైన బ్రాహ్మణునికి దానం చేసి, తాను ఆ రోజంతా పాలను మాత్రమే ఆహారంగా తీసుకొనేవాడు ఏడు కల్పాల కాలం గడిచేదాకా రుద్రలోకంలో ప్రతిష్టితు డౌతాడు. ఇది మహీవ్రతం.
మాఘ లేదా చైత్ర శుద్ధ తదియనాడు బెల్లం తిని సర్వోపచారాలతో గుడధేనువును బ్రాహ్మణునికి దానమిచ్చినవారికి ఉమాలోక (గౌరీలోక) ప్రాప్తి కలుగుతుంది. దీనిని ఉమావ్రతమంటారు.
మహాకల్యాణకారియైనది రుద్రవ్రతం. దీనిలో గోమూత్ర ప్రాముఖ్యం గణనీయం. కార్తీకంతో మొదలుపెట్టి ప్రతి తదియనాడూ రాత్రి గోమూత్రంలో ఉడికించిన లపసి (నేతి హల్వా లేదా గంజి)ని ప్రాశ్న చేసి పడుకోవాలి. పెందలకడనే లేచి స్నానం చేసి గౌరీశంకరులను పూజించాలి. ఇలా ఒక యేడాది పాటు చేసినవారికి ఒక కల్పం దాకా గౌరీలోకనివాస ప్రాప్తి కలిగి, మరుజన్మలో మహారాజ పదవి లభిస్తుంది.
తిలపిష్టంతో ఏనుగును తయారు చేసి రెండు ఎఱ్ఱ బట్టలను, అంకుశ, చామర, మాలాదులను తెచ్చి దానినలంకరించి, అంకుశ, చామర, మాలాదులను తెచ్చి దానిని నలంకరించి రాగిపాత్రలో స్థాపించి పత్నీ సహితుడైన బ్రాహ్మణోత్తముని ఆహ్వానించి ఆయనను పూజించి తాను నీటిలో గొంతుదాకా మునిగియుండి ఆ ఏనుగును దానం చేసిన వానికి సర్వపాపాలూ నశిస్తాయి. అడవులలో ఎట్టి ఆపదా రాదు. ఈ వ్రతం పేరు కాంతారవ్రతం.
జ్యేష్ఠా నక్షత్రం ప్రవేశించినపుడు త్రాతారమింద్ర మవితారమింద్రం. మున్నగు శ్లోకాలతో ఇంద్ర పూజన, హవనాలను చేసేవారు ప్రళయ పర్యంతమూ ఇంద్రలోకంలో నివసించగలరు. పురందర వ్రతం లేదా ఇంద్రవ్రతం అని దీనిని వ్యవహరిస్తారు. శుక్ల అష్టమినాడు ఉపవాసం చేసి శివుని పూజించి రెండు శ్వేతవస్త్రాలతో ఘంటలతో భూషితములైన ఎద్దులను బ్రాహ్మణునికి దానము చేసిన వారు ఒక కల్పందాకా శివలోకంలో నివసించి ఆ తరువాత పృథ్విపై జనించి పుడమినేలే రాజు కాగలరు. ఇది వృషవ్రతం.
నవమినాడు నక్తవ్రతం చేసి వింధ్యవాసినీ దేవిని పూజించి పంజరసహిత స్వర్ణ శుకమును తయారు చేయించి బ్రాహ్మణునకు దానమిస్తే ఇక్కడ ఉత్తమవాణీ ‘అక్కడ’ అగ్నిలోక నివాసప్రాప్తీ కలుగుతాయి. ఈ వ్రతం పేరు ఆగ్నేయవ్రతం.
విష్కుంభాది ఇరవైయేడు యోగాల్లో నక్త వ్రతం చేసి క్రమంగా నెయ్యి, తైలం, పండ్లు, చెఱకుగడ, యవధాన్యము, గోధుమలు, వేరుసెనగ, సేమ్యా, శాలి బియ్యం, ఉప్పు, పెరుగు, పాలు, వస్త్రాలు, బంగారం, కంబళి, ఆవు, ఎద్దు, గొడుగు, చెప్పులు, కర్పూరం, కుంకుమ, చందనం, పూలు, ఇనుము, రాగి, కంచు, వెండిలను బ్రాహ్మణులకు దానం చెయ్యాలి. ఇలా చేసినవారికి సర్వపాప విముక్తి, ఇష్టవస్తు శాశ్వత సంయోగము, సహయోగము లభిస్తాయి. ఈ వ్రతం పేరు యోగవ్రతం.
కార్తిక పూర్ణిమతో ప్రారంభించి ఆశ్వయుజ పూర్ణిమదాకా పన్నెండు పున్నముల్లో క్రమంగా మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధను, మకర, కుంభ, మీన రాశుల యొక్క స్వర్ణ ప్రతిమలను వస్త్ర మాల్యాదులతో అలంకరించి పూజించి దక్షిణతో సహా భూదేవులకు దానం చేసిన వారికి సంపూర్ణ ఉపద్రవశమనం, సర్వాశా పూర్ణప్రాప్తి, సోమలోక నివాసం కలుగుతాయి. ఇది రాశివ్రతం.
ఈ వ్రతాలను చదివినంత మాత్రముననే అన్ని పాతకాలూ నశిస్తాయి. విన్నంత మాత్రాన సకల పుణ్యాలూ లభిస్తాయి.