భవిష్య మహా పురాణము
59 - సోమాష్టమి వ్రత విధానం
మహారాజా! సర్వ సమ్మతం, కల్యాణప్రదం, శివలోక ప్రాపకం అయిన సోమాష్టమి వ్రతాన్ని శుక్ల అష్టమి సోమవారం పడిన రోజు చంద్రచూడుడైన శివుని ప్రీత్యర్థం చేయాలి. అర్ధనారీశ్వర ప్రతిమను తయారుచేసి దానికి విధ్యుక్తంగా పంచామృతాలతో స్నానం చేయించి దక్షిణ భాగంలో కర్పూరయుక్త చందనాన్ని పూయాలి. తెల్లపూలనూ ఎఱ్ఱపూలనూ ప్రతిమపై వేయాలి. నేతి వంటకాలను నైవేద్యం పెట్టాలి. యాభై దీపాలను వెలిగించి వాటితో ఉమామహేశులకు ఆరతినివ్వాలి. ఆ రోజు నిరాహారంగా నుండి మరునాటి ఉదయం మరల ఇలాగే పూజ చేసి నువ్వులనూ, నేతినీ హవనం చేసి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. శక్తికొలదీ బ్రాహ్మణదంపతులనూ పితరులనూ పూజించాలి. ఒక యేడాదిపాటు ఇలా వ్రతం చేసి అదే అష్టమినాడు ఒక త్రికోణం, చతుష్కోణం మండలాలు తయారుచేయాలి. త్రికోణంలో పార్వతీదేవినీ రెండవదానిలో పరమేశ్వరునీ స్థాపించాలి. తరువాత మరల ఇదివఱకులాగే పూజ చేసి, శ్వేత, పీత వస్త్రాలతో వితానం, పతాక, ఘంట, ధూపదాని, దీపమాల మున్నగు పూజోపకరణాలను బ్రాహ్మణునికి సమర్పించి భోజనం పెట్టాలి. బ్రాహ్మణ దంపతులను సత్కరించి వస్త్ర, ఆభూషణ, భోజనాదుల నొసగి యాభై ప్రజ్వలిత దీపాలతో మెలమెల్లగా నీరాజనాలివ్వాలి. ఇలా అయిదేళ్ళుగాని ఒక యేడాది గాని ఈ వ్రతం చేసినవారికి శివలోకనివాసము, అనామయపదము ప్రాప్తిస్తాయి. జీవితాంతమూ ఈ వ్రతాన్ని గావించిన పురుషుడు విష్ణుసారూప్యం చెందుతాడు.