భవిష్య పురాణము

19 - యజ్ఞపాత్రలు - పూర్ణాహుతి

మునులారా! యజ్ఞక్రియలో ఉపయోగించడానికి స్రువా నిర్మాణంలో శ్రీపర్ణ, శింశు ప, క్షీరీ, బిల్వ, ఖదిర కాష్ఠాలు ప్రశస్తంగా భావింపబడ్డాయి. యాగక్రియలో వీటితో చేయబడ్డ స్రువ (చెంచాలా వుండి చివర చిన్నగొయ్యి వుండే కొలబద్ద) లను వాడితే సిద్ధి కలుగుతుంది. దేవప్రతిష్ఠలో ఖదిర, ఉసిరి కర్రలు శ్రేష్ఠం. యాగక్రియలో పై వాటితో బాటు కేసరకాష్ఠాలను కూడా స్రువలను నిర్మించడంలో ఉపయోగించవచ్చు. ప్రతిష్ఠ, సంప్రాశన, సంస్కార కర్మలలో, యజ్ఞాది కార్యాలలో స్రువా వినియోగముంటుంది. రిక్తాది తిథులు లేనపుడే స్రువలకై బిల్వకాష్ఠ గ్రహణం చేయాలి. ఈ పనిని చేసే వ్యక్తి కూడా ముందు ఉపవాసం చెయ్యాలి. అప్పటికే మద్య, మాంసాది అలవాట్లు ఉంటే మానేసి వుండాలి. స్త్రీ సంపర్కానికి కొన్నాళ్ళు దూరంగా వుండాలి. స్రువ, స్రుక్‌లను ఒక్క కర్రతోనే నిర్మించవచ్చు. శాస్త్రోక్త విధిలోనే వాటిని నిర్మించాలి. దర్వి లేదా గరిటెలను బంగారం లేదా రాగితోనే నిర్మించాలి. కర్రతో గరిటెలను వేరే యజ్ఞపు పని కోసం తయారు చేయవలసి వస్తే గంభారీ, తేందు, క్షీరీవృక్షాలు చెక్కనే వాడాలి. అది పన్నెండంగుళాల పొడవే ఉండాలి. (చెట్టుకాదు గరిట). క్రిందిభాగము రెండంగుళాల మండలమై వుండాలి. యజ్ఞంలో తామ్రదర్వి బరువు నలభై తులాలుండాలి. దాని మండలం అయిదంగుళాలు, పొడవు ఎనిమిది జానలూ వుండాలి. పాయసంలో కూడా ఈ దర్వినే వాడాలి. నేతిని పోయడానికి పదితులాల రాగి గరిట వుండాలి. ఇది లేకపోతే పీపలకాష్ఠ దర్వి వాడవచ్చు. అది పదహారంగుళాల కొలత వుండాలి. ఆజ్యస్థాలి రాగిదైనా కావొచ్చు, మట్టిదైనా కావచ్చు.

విప్రులారా! ఇపుడు పూర్ణాహుతి విధిని వివరిస్తాను. దీని అనుష్ఠానంతో యజ్ఞం పూర్తి కాగలదు. కాబట్టి పూర్ణాహుతిని మరీ శ్రద్ధాభక్తులతో చేయాలి. పూర్ణాహుతి తరువాత ఇక దేవతలను పిలిచి అర్ఘ్యాలిచ్చేయడమే. యజ్ఞం అపూర్ణమైతే యజమాని దరిద్రుడై పోతాడు. స్రువలో చరు (పక్వం చేయబడి హోమయోగ్యమైన అన్నం) ని వుంచి సూర్యభగవానునికి అర్ఘ్యమివ్వాలి. యజ్ఞం సంపన్నం కాగానే బ్రాహ్మణులకి భోజనాలు పెట్టాలి. తదనంతరం యజమాని తన ఇంట్లో ప్రవేశించి అందరు దేవతలనూ ప్రార్థించాలి. ప్రతిష్ఠాయాగంలో పూర్ణాహుతి సమయంలో సప్తతే(ఇక్కడ సంస్కృతంలో ‘‘ అని వుంటుంది. ఈ సున్నాకి అర్థం ‘సప్తతేం’ అనికాదు. మంత్రం ఇంకా వుందనీ ఆ వేదంలో ‘సప్తతే’ అనే అక్షరాలతో మొదలయ్యే మంత్రాన్ని పూర్తిగా చదవాలనీ అర్థం. (యజు17/79),)  ఇక్కడ సంస్కృతంలో అని వుంటుంది. దేహిమే (0) (యజు3/50) పూర్ణాదర్వి (యజు 3/49) పునంతు(0) (యజు 19/39) అనే మంత్రాలను పఠించాలి.

నిత్య నైమిత్తికయాగంలో పునంతు, పూర్ణాదర్వి, సప్తతే, దేహిమే లను పఠించాలి. ఎవరి వంశంలో వున్న సాంప్రదాయాన్ని వారు పాటించాలి. పూర్ణాహుతిని నిలబడి ఇవ్వాలి కూర్చునికాదు. గ్రహహోమానికీ శతహోమానికీ ఒక పూర్ణాహుతిచాలు. సహస్రయాగానికి రెండు, అయుతహోమానికి నాలుగు, సహస్రపుష్ప హోమానికి ఒకటి, మృదుపుష్పహోమానికి కూడా ఒకటి, శత ఇక్షుహోమంలో రెండు, గర్భాదాన, అన్నప్రాశ్న, సీమంతోన్నయన మరియు ప్రాయశ్చిత్త కర్మలు, నైమిత్తిక వైశ్వదేవ యాగాలకు ఒకటి చొప్పున పూర్ణాహుతులివ్వాలి.

మంత్రోచ్చారణలో ఋషి, ఛందం, వినియోగాదులను వాడాలి. వీటిని వినియోగించక పోతే ఫలప్రాప్తిలో కోతపడుతుంది. సప్తతే(0) మంత్రానికి బ్రాహ్మణులు, కౌండిన్యర్షి, జగతీ ఛందములు అగ్నిదేవతగా చెప్పబడ్డాయి. దేహిమే (0) అనే మంత్రానికి ప్రజాపతి ఋషి, అనుష్టుప్ ఛందము, ప్రజావత్తే దేవత. పుర్ణాదర్వి(0)కి శతక్రతువు ఋషి, అనుష్టుప్ ఛందస్సు, అగ్నిదేవత. పునంతు (0) మంత్రానికి పవనుడు ఋషి, జగతి ఛందస్సు (ఛందస్సు అనే మాట వ్యాకరణ దోషమని, వత్తులేని చతో చందస్సు అనే మాటే సరైనదనీ కొందరంటారు.) అగ్నిదేవత.

ఈ రీతిలో ఆయా మంత్రాలనుచ్చరిస్తున్నపుడు ఆయా ఋషులను, ఛందాలను, అధిదేవతలను తలచుకోవాలి. జపకాలంలో మంత్రసంఖ్యను తప్పని సరిగా పాటించాలి. నిర్దిష్ట సంఖ్యను పాటించకుండా చేసే జపం ఫలితాన్నివ్వదు. అయుత, అక్ష, కోటి హోమాల్లో వరింపబడే ఋత్విక్ బ్రాహ్మణులు శాంతమూర్తులై కామక్రోధరహితులై వుండాలి. ఋత్విజుల సంఖ్య హోమభేదాన్ననుసరించి వుండాలి. వారిని పూజలతో, గౌరవంతో, దక్షిణలతో సంతుష్టులను, ప్రసన్నులను చేసుకోవాలి. ఈ విధంగా సర్వలక్షణ లక్షితంగా యాగకర్మను చేసే వ్యక్తులు వసు, ఆదిత్య, మరుద్గణాల ద్వారా శివలోకప్రాప్తిని పొంది పరమ పూజ్యులౌతారు. అనేక కల్పాలపాటు శివలోకంలో నివసింపగలరు. చివరికి మోక్షాన్ని పొందుతారు. నిష్కామ భావపూర్వకంగా ఈశ్వరార్పణ బుద్ధితో లక్షహోమమును చేసినవారు సుఖంగా జీవించి పరమపదమును పొందుతారు. రాజ్యభ్రష్టులై రాజ్యాన్ని, దరిద్రులై ఐశ్వరాన్నీ కోరుకుంటూ యాగం చేసేవారికి అవి ప్రాప్తిస్తాయి. నిష్కామభావంతో కోటి - హోమం చేసే వారికి దేహాంతంలో పరమాత్మ సామీప్యసిద్ధి లభిస్తుంది. ఋత్విజబ్రాహ్మణులు లభించనిచో ఆచార్యదేవునే ఋత్విజునిగా వరించవచ్చును. లేదా హోతగా నియమించ వచ్చును. ఆసనాలలో కుశాసనం ప్రశస్తమని భావింపబడుతున్నది.

దేవతలు పద్మాసనంలో వుంటారు కాబట్టి పద్మంలోనే వాసం కూడా చేస్తుంటారు కాబట్టి మనం కూడా అర్చన చేసేటపుడు పద్మాసనమే వేయాలి. దేవోభూత్వా దేవాన్ యజేత్ ఈ న్యాయాన్ననుసరించి పద్మాసనస్థులైన దేవతలను పద్మాసనస్థులమై పూజించాలన్న మాట. ఈ నియమాన్ని పాటించకపోతే మనకు రావలసిన యజ్ఞఫలాన్ని యక్షిణి సంపూర్ణంగా హరించి వేస్తుంది.”.

మధ్యమపర్వ ప్రథమభాగం సంపూర్ణం