భవిష్య పురాణము

132 - ఫాల్గున పూర్ణిమోత్సవం

“జనార్దనా! ఫాల్గున పూర్ణిమనాడు వాడవాడలా గ్రామాల్లో నగరాల్లో ఉత్సవాలు జరుగుతుంటాయి కదా! వీటినెందుకు చేస్తారు? హోరీలనబడు కట్టెలనెందుకు జ్వలింప జేస్తారు? పిల్లలు ప్రతి ఇంటికీ వెళ్ళి అనాప్ - శనాప్ అంటూ గోలెందుకు చేస్తారు? అడాడా అని దేనినంటారు? ఇదంతా ఏ దేవత పూజ?

“ధర్మజా! సత్యయుగంలో రఘునామకుడైన మహారాజొకాయన వుండేవాడు. ఆయన శూరుడు, వీరుడు, ప్రియవాది, సర్వగుణ సంపన్నుడు, మహాదాని. పృథ్విలోని రాజు లందరినీ జయించి ప్రజలందరినీ కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు. అధర్మంగానీ దుర్భిక్షం గానీ అకాలమృత్యువుగానీ ఆ రాజ్యంలో లేవు. కాని ఒకరోజు నగరవాసులంతా కట్టగట్టుకొని రాజద్వారం వద్దకు వచ్చి త్రాహి త్రాహి (కాపాడండి) అని ఆక్రందించసాగారు. మహారాజు మెరుపు వేగంతో వచ్చి వారి ఎదుట నిలబడి ‘ఏమైంది ఏమైంది?’ అని ఆదుర్దాగా అడిగాడు.

‘మహారాజా! ఢోంఢాయను రాక్షసి ప్రతిరోజూ మా బస్తీకి వచ్చి పిల్లలని హింసిస్తోంది. మీ దాకా రాకుండానే దానిని తరిమెయ్యడానికి మేమే ప్రయత్నించాం. కానీ, మంత్రతంత్రాలూ, శస్త్రాస్త్రాలూ, ఓషధులూ ఏవీ దానిపై పనిచేయడం లేదు. ఇక మాకు మీరే దిక్కు’ అని అంగలారుస్తున్న ప్రజలకు అభయమిచ్చి ఆ రాజు వసిష్ఠుని ఆ రక్కసి గూర్చి అడిగాడు.

‘మహారాజా! మాలియను దైత్యుని కూతురు ఈ డోంఢా. ఆమె చాలాకాలం ఉగ్రతపస్సు చేసి పరమశివుని మెప్పించింది. ఆయన ప్రసన్నుడై ప్రత్యక్షమై వరం కోరుకొమ్మన్నప్పుడు, ‘దేవతలు, దైత్యులు, మనుష్యాదుల వల్ల గాని, అస్త్రశస్త్రాదుల ద్వారాగాని, పగలు, రాత్రి, శీతకాలం, ఉషఃకాలం, వర్షకాలంలోగాని, ఇంటి బయట గాని లోపలగాని, తనకు మరణం లేకుండా వరం కావాలం’ది. శివుడు ‘తథాస్తు’ అంటూనే, ‘ఒక ఉత్తమ బాలకుని వల్ల తప్ప నీకెవరి వల్లా భయం లేదు’ అని చెప్పాడు. ‘అలాగే’ ‘అడాడా’ మంత్రం పలుకబడినచోట నీ ప్రతాపం చెల్లదు’ అని కూడా చెప్పాడు. అప్పటి నుండి ఆ రాక్షసి బాలకులను హింసిస్తోంది’ అని సర్వజ్ఞుడు, దివ్యదృష్టి సంపన్నుడునైన వసిష్ఠ మహర్షి రఘుమహారాజుకి చెప్పాడు.

ఆ రక్కసి బారి నుండి తప్పుకొనే ఉపాయాన్ని కూడా వసిష్ఠుడే ఇలా చెప్పాడు. ‘మహారాజా! ఫాల్గున పూర్ణిమ నాడు మన ప్రజలందరూ ఒకచోట చేరి ఏ మాత్రమూ భయమన్నది లేకుండా నవ్వుతూ, తుళ్ళుతూ, ఆడుతూ, పాడుతూ గొప్ప ఉత్సవ వాతావరణాన్ని కల్పించాలి. బాలకులంతా కర్రలతో చేయబడిన కత్తులవంటి ఆయుధాలను ధరించి వీరసైనికుల్లాగా హర్షంతో యుద్ధానికి వెళుతున్నట్టుగా హడావుడి చేస్తూ సంబరం జరుగుతున్న ఊరంతటా కలియదిరగాలి. ఎండిన కట్టెలను, పిడకలనూ, ఎండు టాకులనూ, వీలైనంత ఎక్కువగా నొకచోట చేర్చి రక్షోఘ్న మంత్రాల ద్వారా అగ్నిని రగిల్చి అందులో అన్నిటినీ హవనం చేస్తూ మూడుమార్లు దానిచుట్టూ అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ కేరింతలతో అరుస్తూ ప్రదక్షిణలు చేయాలి. వినోదపూర్వకమైన మాటలు చెప్పుకుంటూ గట్టిగా పగలబడి నవ్వుతుండాలి. ఈ రకంగా మ్రోగుతున్న రక్షా మంత్రాలనూ, రగులుతున్న హవనాలనూ, ఉన్మత్తులవలె తిరుగుతున్న బాలకులనూ చూసి భయపడిపోయి అది ఇక మన రాజ్యంవైపురాదు.’

రాజుగారు వెంటనే తన రాజ్యంలో ప్రతి నగరంలోనూ ఈ ఉత్సవాన్ని పెద్ద యెత్తున చేయించి తాను కూడా స్వయంగా అందులో పాల్గొనగా చూసి ఆ రక్కసి భయపడి పారిపోయింది.

ఆనాటినుండి ఈ లోకంలో ఢోఢో ఉత్సవం జరుగుతోంది. అడాడా మంత్రం కూడా చదవబడుతోంది.

ఇక వైదిక పరంగా ఈరోజు బ్రాహ్మణుల ద్వారా అందరు దుష్టులనూ, అన్ని రోగాలనూ పారద్రోలే వసోర్ధారా హోమం చేయబడుతోంది. అందుకే ఈ పున్నమిని హోలికా పౌర్ణమి అని కూడా వ్యవహరిస్తున్నారు.

మరునాడు వసంతర్తు ఆగమనాన్ని సూచిస్తూ మరొక పండుగను చేస్తారు. ఆ పాడ్యమినాడు దేవతలకూ, పితరులకూ తర్పణలిచ్చి పూజలు కూడా చేస్తారు. దీనినొక వ్రతంగా చేసేవారు హోలికనాటి విభూతికి వందనం చేసి దానిని శరీరంపై పూసుకోవాలి. ఇంటిప్రాంగణాన్ని పేడతో అలికి దానిపై చతురస్రాకారంలో ఒక మండలాన్ని తయారుచేయాలి. దానిని రంగురంగుల అక్షతలతో అలంకరించాలి. దానిపై ఒక పీఠాన్ని పెట్టి సువర్ణ సహిత పల్లవాలతో సమన్వితమైన కలశను స్థాపించాలి. శ్వేత చందనాన్ని ఆ పీఠంపైనను, కలశ చుట్టును పూయాలి. సౌభాగ్యవతియైన స్త్రీ సుందర వస్త్రాలనూ, ఆ భూషణాలనూ ధరించి పెరుగు, నెయ్యి, పాలు, అక్షతలు, గంధము పుష్పాలు, వసోర్దారలతో శ్రీఖండ పూజను చేయాలి. తరువాత ఆ చందనాన్ని ఆమ్రమంజరీ సహితంగా నోట్లో వేసుకోవాలి. దీనివల్ల ఆయురారోగ్యాలు వృద్ధి కావడమే కాక, కోరికలూ తీరుతాయి. భోజన సమయంలో ముందు నిన్నటి మంటలో వండి దానిని ప్రాశ్న చేసి ఆ తరువాత ఇచ్ఛానుసారము భోం చేయాలి. ఈ విధంగా మొత్తం ఫాల్గునోత్సవాన్ని చేసేవారికి అన్ని మనోరథాలూ అనాయాసంగానే సిద్ధిస్తాయి. ఇది విజయదాయినియైన పరమ పవిత్ర పూర్ణిమ.”