భవిష్య పురాణము

62 - 63 - సూర్యయోగ క్రియాయోగాలు

చెప్పసాగాడు సుమంతుడు.

“మహారాజా! ఒకప్పుడు కొందరు ఋషులు బ్రహ్మనిలా ప్రార్థించారు. దేవా! అన్ని చిత్తవృత్తులను నిరోధించి కైవల్యపదాన్నిచ్చేది యోగమేనని మీరు సెలవిచ్చియున్నారు. ఈ యోగం ఎన్నో జన్మల కఠిన సాధన ద్వారా ప్రాప్తిస్తుందను కుంటున్నాము. కాబట్టి కాస్త సులువైన కార్యాచరణనుపదేశింప ప్రార్థన”.

బ్రహ్మ ఇలా చెప్పాడు, ‘మునీశ్వరులారా, యజ్ఞ, పూజన, నమస్కార, జప, వ్రతోపవాస, బ్రాహ్మణభోజన దానాదికముల ద్వారా సూర్యనారాయణుని ఆరాధన చేయుటయే మీరడిన దానికి ముఖ్యోపాయము. ఇది క్రియాయోగము. ఆయనే పరబ్రహ్మము, అక్షరము, సర్వవ్యాపి, సర్వకర్త, అవ్యక్త అచింత్య మోక్షప్రదాత.’

మహారాజా! ఆ మహర్షులానాడు ఉపాసనారూప క్రియాయోగ తత్పరులైనారు. విషయసుఖాలలో నిరంతరం మునిగి యుండే జీవులకు స్వల్పసాధన, ఆరాధనలకే మెచ్చి మోక్షమిచ్చు భగవానుడు భానుడే. అందుచేత లేచివున్నా, కూర్చున్నా, నడుస్తున్నా, నిద్రిస్తున్నా, భుజిస్తున్నా సూర్యదేవుని స్మరిస్తూనే వుండి, భక్తిపూర్వకంగా ఆయన ఆరాధనలో మునిగివుంటే, జనన, మరణ, వ్యాధియుక్తమైన ఈ సంసార సముద్రాన్ని సులువుగా ఈదిపారేయగలము. జగత్కర్త, సదావరదానప్రదాత, దయాళువు, గ్రహస్వామియైన శ్రీసూర్యనారాయుణుని శరణు కోరినవాడు అవశ్యము ముక్తిని పొందగలడు.

ప్రాచీనకాలంలో దిండియను వానికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. దానిని పోగొట్టుకోవడం కోసం అతడు చాలాకాలము పాటు సూర్యారాధన, స్తుతిచేశాడు. సూర్య భగవానుడు ప్రత్యక్షమై తాను ప్రసన్నుడనయ్యాననీ వరం కోరుకొమ్మనీ అడిగాడు.

దిండి సహజంగానే ‘భగవాన్! నీవు నాకు దర్శనమివ్వడమే నా పాలిటి అతిగొప్ప వరము. పుణ్యహీనులకు నీ దర్శనం దుర్లభం. అందరి హృదయస్థిత వాసుదేవుడవు నీవు. నన్ను బ్రహ్మహత్యా పాతకఫలం నుండి తప్పించు. అన్ని పాపాల నుండి ముక్తుడనై సంసారమునుద్ధరించేలాగ నన్ను అనుగ్రహించు. ఈ లోకంలోని అన్ని ప్రాణులూ సుఖంగా బతకగలిగే ఆచరణను నాకుపదేశించు’ అని కోరుకోగానే దయాసాగరుడైన సూర్యదేవుడతనికి ‘నిర్బీజయోగ’మునుపదేశించాడు. ఇది దుఃఖాలను నివారించే ఔషధం వంటిది.

దిండి యను పేరు గల ఆ గణనాయకుడు మరల ‘స్వామి! ఈ నిర్బీజ నిష్కలయోగం మిక్కిలి కఠినసాధ్యము. ఇంద్రియాలను జయించడం, మనస్సుని స్థిరంగా వుంచడం, అహంకార మమకారాలను త్యజించడం, రాగద్వేషాలు లేకుండా వుండడం - ఇలాంటివన్నీ సామాన్యులవల్ల అయ్యేపనులు కావు. కాబట్టి నామీదా, నావాళ్ళపట్ల దయతో అనాయాసంగా విశేషపరిశ్రమ అక్కర్లేకుండా ఫలప్రాప్తినిచ్చే సాధనను అనుగ్రహించండి’ అని వేడుకున్నాడు.

కరుణాకరుడైన దివాకరుడిలా అనుగ్రహించసాగాడు, ‘ఓ గణనాయకా! దిండీ! సర్వక్లేశాలనూ దూరం చేసి ముక్తినిచ్చే క్రియాయోగాన్నిస్తాను, విను. ముందు నీ మనసులో నన్ను పెట్టుకో. భక్తితో నన్ను భజించు, నన్నే పారాయణయజనం చెయ్యి, ఆత్మను నాపై లగ్నం చెయ్యి, నాకు నమస్కరించు, సంపూర్ణ బ్రహ్మాండంలో ప్రతి అణువులోనూ నన్నే చూడు. లోకమే నేననుకో, నేనే లోకమనుకో. అలాగ త్రికరణ శుద్ధితో చేయగలిగిననాడు నీ సంపూర్ణ దోషాలన్నీ సంపూర్ణంగానే నశిస్తాయి. మనసును నాపై పూర్తిగా లగ్నం చేస్తే, ముందు రాగ, ద్వేష, లోభాది దోషాలు నశిస్తాయి. బంగారం, వెండి, రాగి, రాయి, కర్ర - ఏది దొరికితే దానితో నా ప్రతిమను దీక్షగా తయారుచేసేస్తూ వుంటే, చిత్రాలు గీసేస్తూ వుంటే, నీ మనస్సు స్థిరంగా నాపైనే వుండి పోతుంది. నడుస్తున్నా, నిలబడివున్నా నిద్రిస్తున్నా భోంచేస్తున్నా నా ప్రతిమను ఏ పవిత్రనదీ జలాలతో ఎలా స్నానించాలా, అభిషేకించాలా అనే ఆలోచిస్తూ వుండు. గంధ, పుష్ప, వస్త్ర ఆభూషణ, రుచికర పదార్థాలలో నీకు నచ్చిన ప్రతిదాన్ని నాకు నివేదిస్తూ పూజలు చేయి. పాడాలని కోరిక పుడితే నా ప్రతిమ యెదురుగా నిలబడి నా పాటలు పాడు. వినాలనిపిస్తే నా పై చెప్పబడిన కథలు, నన్ను కీర్తించే పాటలు విను. ఇలా అన్ని కర్మలనూ నాకే అర్పించి, భయాన్ని స్వార్థాన్నీ వదిలి ఏంచేసినా నాకోసమే చేస్తూ వుంటే బ్రహ్మహత్యాపాతకంతో సహా అన్ని దోషాలూ, పాపాలూ హరించుకుపోయి ముక్తిని పొందుతావు. ఇదే క్రియాయోగం. దీన్నే ఆశ్రయించు.’

మరింత విస్తారపూర్వకంగా దీని గూర్చి వినగోరిన దిండిని బ్రహ్మ కడకు పంపించాడు భాస్కరుడు. బ్రహ్మ ఇలా అన్నాడు.

‘ఓ గణనాయకా! నీ బ్రహ్మహత్యాపాతకం సూర్యదర్శనంతోనే దగ్ధమై పోయింది. భగవానుని కృపాపాత్రుడవై ధన్యుడవైనావు నీవు. సూర్యనారాయణ ఆరాధనేచ్ఛ వుంటే ముందు దీక్షాగ్రహణం చెయ్యి. ఉపాసన చెయ్యి. ఆ స్వామిని పూజించాలనే బుద్ధిపుట్టడమే పూర్వజన్మ సుకృతం. ఈ భవసాగరంలో పడి కొట్టుకుపోతున్న జీవిని చెయ్యి పట్టుకొని ఉద్ధరించే ఏకమాత్ర భగవానుడు సూర్యదేవుడే. కాబట్టి దీక్షతీసుకో, తన్మయుడవై ఉ పాసించు, శీఘ్రమే ఆయనకు నీపై అనుగ్రహం కలుగుతుంది. (ఇక్కడ బ్రహ్మ నీవు నీవు అంటున్నది. దిండిని కాదు. ఆయనపై అప్పటికే సూర్యానుగ్రహం వుంది. దిండి అడిగిందీ మనకోసమే. బ్రహ్మ చెప్తున్నదీ మనకే)

ఈ దీక్షకి అధికారం అందరికీ వుంటుందా, దీక్షాగ్రహణం చేశాక ఏంచేయాలి అని అడిగిన దిండికి బ్రహ్మ ఇలా ఉపదేశించాడు.

‘మనసా, వాచా, కర్మణా అహింసకు కట్టుబడి, సూర్యభక్తిని కలిగి, దీక్షిత బ్రాహ్మణులకు నిత్యం నమస్కారం చేసే సంస్కారముండి, ఎవరికీ ద్రోహం చెయ్యను - అనే దీక్ష పట్టి, జగత్తంతా సూర్యమయమే అందుచే ప్రతి వస్తువులోనూ సూర్యదర్శనమే అను నమ్మకముండి, ఆత్మలో సూర్యుని ప్రతిష్ఠించుకోగలిగే పురుషులందరూ ఈ దీక్షకి అధికారం గలవారే. సూర్యారాధన వల్ల ప్రాప్తించే గతిని పొందాలంటే మహాతపమూ అవసరంలేదు. పెద్దయెత్తున దక్షిణ లివ్వవలసిన యజ్ఞాలూ అక్కర్లేదు. సర్వకాల సర్వావస్థలందూ సూర్యుని తలచుకుంటే చాలు. హృదయంలోనే సూర్యార్చన చేయగలిగినవానికి అన్నిపాపాలు నశించి సూర్యలోకప్రాప్తి కలుగుతుంది. సూర్యమందిరాన్ని నిర్మించినవాడు తనతోబాటు ఏడుతరాల తనవారిని తరింపజేయగలడు. సూర్యలోకంలో కూర్చోబెట్టగలడు.

బహుపకరణాయజ్ఞా నానాసంభారవిస్తరాః

నదిండిన్నవాప్యంతే మనుష్యైరల్ప సంచయైః

భక్త్యాతుపురుషెః పూజాకృతా దుర్వాంకురైతపి

భానోర్థదాతి హిఫలం సర్వయజ్ఞైః సుదుర్లభం (బ్రాహ్మ63/32,33)

మనస్సులోనే దీక్షితుడవై గంధ, పుష్ప, ధూప, వస్త్ర, భూషణాదులను, నీకు ప్రియమైన వాటిని, సూర్యునికర్పించు. ఆయన ప్రతిమకు తీర్థజలం, పెరుగు, పాలు, నెయ్యి, చెఱకురసం, తేనె మున్నగువాటితో స్నానం చేయిస్తూ వుండు. నేను సూర్యారాధనవల్ల వచ్చిన శక్తితోనే సృష్టిని చేయగలుగుతున్నాను. స్థితి, లయకారులైన కేశవశివులూ అంతే.!’