“పౌరాణికోత్తమా! మండలస్థ భగవానుడైన సూర్యుని ఏ మాహాత్మ్యాన్ని బృహస్పతి దేవతల కుపదేశించాడు? మాపై కృపతో మాకూ వినిపించండి” అని అడిగారు ఋషులు. చెప్పసాగాడు సూతమహర్షి సత్తముడు.
“ఋషులారా! ఈ మహత్త్యాన్ని వింటేనే సూర్యప్రసన్నత లభిస్తుంది. ప్రయాగలో సుఖాసీనుడై యున్న బృహస్పతి ఇలా ప్రవచించసాగాడు. దేవతలారా బర్హిష్మతీ (బిఠూర్) అను పేరుగల నగరిలో ధాతృశర్మయను బ్రాహ్మణుడు పుత్ర సంతానం కోసం కఠోరమైన తపస్సు చేసి పరమ ప్రజాపతి బ్రహ్మదేవుని మెప్పించాడు. అయిదేళ్ళ తపస్సుకి ఫలితంగా బ్రహ్మ ధాతృశర్మకు ముందొక పుత్రుడు. తరువాత ఒక పుత్రిక, అటు పిమ్మట మరొక పుత్రుడు కలిగేలా వరమిచ్చాడు.
వారు పుట్టి దినదిన ప్రవర్ధమానులై వివాహయుక్త వయస్కులైనారు. వరమున పుట్టిన వారికి వధువులను గానీ వరునిగానీ చూచుటకు తన శక్తి చాలదని చింతించి ఆ ధాతృశర్మ గంధర్వపతి తుంబురుని యజ్ఞం ద్వారా వివిధ హవనాల ద్వారా ప్రసన్నం చేసుకున్నాడు. ఆయన ప్రసన్నుడై అతని సంతానానికి తగిన జీవిత భాగస్వాములను సూచించాడు. వివాహ మహోత్సవానికీ, ఇతరేతర పుణ్యకార్యాలకీ కావలసిన ధనం కోసం ధాతృశర్మ ధర్మశాస్త్ర విహితంగా ధనపతి కుబేరుని పూజించగా ఆయన అపార ధనరాశులనేగాక బంగారాన్ని సృష్టించగలిగే స్వర్ణమంత్రాన్ని కూడా ప్రసాదించాడు. ధాతృశర్మ తను ఒక గృహస్థుగా చేయవలసిన పనులన్నీ సక్రమంగా పూర్తి చేశాడు. స్వర్ణమంత్రాన్ని వాడుకోలేదు. వయసు ఊరికి దూరం, కాటికి దగ్గర అనే దశకు చేరుకోగానే ఆలసించకుండా పరమేశ్వరుడైన శంకరుని జ్ఞానప్రాప్తి కోసం పూజించాడు. శివుడు ఒక నెలలోపలే సాక్షాత్కరించి, అతనికి సంపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించాడు.
అపుడు ధాతృశర్మ తన ధర్మపత్ని సుకన్యతో కలిసి రవివార వ్రతం ద్వారా మోహనాశకుడు బహుళ జన్మాంతర జ్ఞానప్రదాయకుడునగు సూర్యభగవానుని ఆరాధించాడు. ఇలా అయిదేళ్ళు ఉపాసించిన మీదట సూర్యభగవానుడు ప్రత్యక్షమైనాడు.
‘వత్సా! నీకేం కావాలో కోరుకో.”
‘దేవా! ఇకనాకు కావలసినది మోక్షమే’
‘వత్సా! ధాతృశర్మా! నీకు తెలియనిది కాదుగా. మోక్షం నాలుగు ప్రకారాలుగా వుంటుంది. తపస్సు వల్ల వచ్చే సాలోక్యము, భక్తిచేత సమకూడు సామీప్యము, ధ్యానంతో కలుగు సారూప్యము, జ్ఞానం ద్వారా ఉత్పన్నమగు సాయుజ్యము. విప్రేందా! నీకు సాయుజ్య మోక్షం లభిస్తుంది. భగవంతుడైన విష్ణుదేవునిలోనే ఈ మన్వంతరం ముగిసేదాకా వుంటావు. నా ముఖము నుండి ఒక తేజోరాశి వెలువడి నీ పత్ని సుకన్యను ఆశ్రయిస్తుంది!’ అని కోరిన వరాలిచ్చు కొండంత దేవుడు నిష్క్రమించాడు.
ఆ తరువాత రవితేజ సంపన్నుడైన ధాతృశర్మ కలియుగంలో కావ్యకర్తయను సద్ర్బాహ్మణునింట ఈశ్వరపురీ ఆచార్య దేవునిగా జన్మించాడు. అతడు తన కాలపు వైదిక విప్రులందరినీ శాస్త్రార్థాలలో పరాజితులను చేసి పరమాచార్యుడైనాడు.
మునులారా! ఈ జ్ఞానాన్ని బృహస్పతి నాకు స్వయంగా ప్రసాదించాడు. దానినే నేను మీకు వినిపిస్తున్నాను. మాయావతీ (హరిద్వార్) నగరంలో మిత్రశర్మయను బ్రాహ్మణుడుండేవాడు. అతడు కావ్యప్రియుడు, విద్యాపరాయణుడు, రసికుడు. హరిద్వారంలో కుంభరాశిలోకి గురుగ్రహం వచ్చినపుడు ఒక మహోత్సవం జరుగుతుంది. ఒకమారు అలా ఉత్సవం జరిగినపుడక్కడికి ఎందరో రాజులు కూడా వచ్చారు. మిత్రశర్మా, ఇంకెందరో స్త్రీ పురుషులు కూడా సర్వాలంకారశోభితులై ఆ ఉత్సవాని కరుదెంచారు. అలాగే దాక్షిణాత్య రాజైన కామసేనుని కూతురు చిత్రిణి కూడా వచ్చింది. ఆమె మిత్రశర్మని తదేకంగా చూసింది. ఆమె హృదయంలో అతనిపట్ల గొప్ప ప్రీతి ఉత్పన్నమైంది. ఉత్సవానంతరం ఆమె ఇంటికి తిరిగి వచ్చి అతనిని పొందడం కోసం ఆదిత్యారాధన చేయసాగింది.
ఇక్కడ మిత్రశర్మ కూడా, ఆమెకోసం కాకపోయినా, వైశాఖ మాసంలో గంగాస్నానం చేసి జలమధ్యంలో నిలబడి సూర్యభగవానుని ధ్యానిస్తూ ‘ఆదిత్య హృదయస్తోత్రా’న్ని ప్రతిదినం పారాయణం చేశాడు.
ఒక నెల్లాళ్ళకి సూర్యభగవానుడు ప్రసన్నుడై అతని మనోరథం ప్రాప్తిస్తుందని వరమిచ్చాడు. వరాన్ని పొంది అతడు ఇల్లు చేరాడు. చిత్రిణి కూడా భగవంతుడైన భానుని నుండి తన మనోరథ ప్రాప్తిని వరంగా పొందింది. కామసేన మహారాజుకి సూర్యభగవానుడు కలలో కనబడి అతని కూతురు చిత్రిణిని మిత్రశర్మకిచ్చి వివాహం చేయమని చెప్పాడు. రాజు ఆ విధంగానే చేశాడు.
వివాహానంతరం కూడా వారిద్దరూ సూర్యవ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తూనే వున్నారు. తామ్రపాత్రపై సూర్యయంత్రాన్ని గీసి దానిని రక్తవర్ణ పుష్పాలతో భక్తిశ్రద్ధలతో పూజించారు. నూరేళ్ళపాటు ఏ రోగమూ లేకుండా జీవించి మరణానంతరం సూర్యదేవుని సామీప్యతను పొందారు. తరువాతి మన్వంతరంలో ఈ దంపతులకే సూర్యుడు రామానందునిగా జన్మించాడు. కన్యాకుబ్జంలో జనించిన రామానందుడు బాల్యావస్థలోనే జ్ఞాని, రామనామ జపపారాయణుడు, రామభక్తిరతుడు అయినాడు. మాతాపితల అనుమతితోనే వారిని త్యజించి రాఘవానందయతి అనే మహానుభావుని శరణుకోరి అతనికి శుశ్రూష చేయసాగాడు. ఆ సమయంలోనే అతని హృదయంలో శ్రీరామచంద్రమూర్తి ప్రవేశించి నివసించసాగినాడు. ఈ ప్రకారంగా సూర్యుని అంశతో బలవంతుడు, హరిభక్తుడు, కాశీలో ప్రసిద్ధాచార్యుడుగా వెలుగొందిన రామానందుని ఆవిర్భావం జరిగింది.
జ్యేష్ఠమాస సూర్యుని కథ చెబుతాను వినండి. ఇది బృహస్పతి చెప్పినదే. ప్రాచీన కాలంలో సత్యయుగంలో అర్యముడని ఒక బ్రాహ్మణుడుండేవాడు. ఆయన ధర్మశాస్త్ర పరాయణుడు, వేదవేదాంగ తత్త్వ జ్ఞాత, శ్రాద్ధయజ్ఞుడను రాజు పితృమతియను తన పుత్రికనితనికిచ్చి వివాహం చేశాడు. ఆమె అతిశయ సాధ్వి. వారికి ఏడుగురు కొడుకులు కలిగారు. ఒకప్పుడు అర్యముడు బాగా యోచించి హృదయంలో వివేచించి ధనకామనతో అనేక ప్రకారాల ఉపాసనలతో భాస్కర భగవానుని ప్రసన్నం చేసుకున్నాడు. జ్యేష్ఠమాసంలో సూర్యుడతనికి ఒక దివ్యమణి నిచ్చాడు. అది ప్రతిదినమూ కొంత బంగారాన్ని ఉత్పత్తి చేయగలదు. అతడా ధనాన్ని ధర్మకార్యాలకు అనగా యజ్ఞాలకూ, పూజలకూ, వాపీకూప తటాకాది ప్రతిష్ఠకూ, సుందర దైవమందిర నిర్మాణాలకూ ఇలాటి ఇతర పనులకూ వెచ్చించేవాడు. సూర్యభగవానుని దయవల్ల అతడు వెయ్యి సంవత్సరాల వయసు వచ్చేదాకా రోగమూ, వార్ధక్యమూ రాకుండా జీవించాడు. దేహాంతంలో సూర్యలోకప్రాప్తిని పొందాడు. అక్కడ లక్ష సంవత్సరాలు నివసించాడు. కాబట్టి మహేంద్రునీ ఇతర దేవతలనూ మండలస్థ సూర్యభగవానుని సేవించుకొమ్మని బృహస్పతి ఆదేశించాడు.
దేవతలంతా జ్యేష్ఠమాసంలో శ్రద్ధగా సూర్యభగవానుని పూజించి, స్తుతించి, ప్రసన్నుని చేసుకోగలిగారు. ఆయన వారికి సాక్షాత్కరించి ‘దేవతలారా! ద్వాపరయుగం చివర్లో శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం సుదర్శనుడు జన్మిస్తాడు. ఆయన నింబాదిత్య (నింబారాచార్య) నామంతో ప్రసిద్ధుడై ధర్మాన్ని రక్షిస్తాడు’ అని ఆశీర్వదించాడు.
ఋషులారా! శ్రీకృష్ణ భగవానుడే నింబార్కునిగా జన్మించాడంటారు. తన ఆజ్ఞ ద్వారా దేవకార్యాన్ని సంపన్నం చేయాలని ఆయన సుదర్శనునికి చెప్పాడు. మేరు పర్వతానికి దక్షిణ దిశలో నర్మదాతీరాన, దేవతలచే ఋషులచే తఱచు దర్శింపబడే తైలంగ దేశముంది అక్కడ జన్మించిన సుదర్శనుడు దేవర్షినారదుని ద్వారా ఉపదేశాన్ని పొంది మధుర, నైమిషారణ్యం, ద్వారవతి, సుదర్శనాశ్రమం మొదలగు స్థానాలలో నివసిస్తూ ధర్మ ప్రచారాన్ని చేశాడు. సుదర్శనుడే నింబార్కాచార్యుడు.
సుదర్శనాశ్రమంలో వేదవేదాంగ పారంగతుడు, మనస్వియగు అరుణుడనే ద్విజశ్రేష్ఠుడు ముని వృత్తిలో వుండేవాడు. అతని భార్య పేరు జయంతి. ఆయనలో సుదర్శన చక్రం యొక్క తేజస్సు ప్రవేశించి ఆయన ద్వారా జయంతిలో ప్రవేశించగా ఆమె చంద్రునిలా ప్రకాశించసాగింది. పరమ శుభ సమయం వచ్చింది. దిశలు నిర్మలమైనాయి. కార్తిక పౌర్ణమినాడు చంద్రుడు వృషభరాశియందున్నపుడు, కృత్తికా నక్షత్రయుక్త లగ్నంలో, అయిదు గ్రహాలు తమ అత్యుచ్ఛ స్థానాలలో నున్నప్పుడు సాయంకాలం మేషలగ్నంలో జయరూపిణియైన జయంతి గర్భం నుండి జగదీశ్వరుడైన నింబాదిత్యుడుద్భవించాడు. ఈ విశ్వంలోనే వేదధర్మాన్ని నిలబెట్టడానికి జనించాడు.
నింబార్కుని ఆశ్రమానికొక రోజు బ్రహ్మదేవుడు మానవ వేషంలో సూర్యుడస్తమించ బోతుండగా తనకి ఆకలిగా వుందనీ, భోజనం కావాలనీ, అయితే సూర్యుడస్తమించాక ఇక ఏమీ తినకూడదన్నది తన నియమమనీ చెప్పాడు. నింబార్కుడు ‘అలాగే స్వామీ’ అంటూ ఆయనకి భోజనం పెట్టాడు. అప్పటికే సూర్యుడు అస్తాద్రివైపు జారసాగాడు. అప్పుడు నింబార్కాచార్యుడు తన తేజంతో సుదర్శనుని తేజస్సుతో ఒక సూర్యబింబాన్ని సృష్టించి తన ఆశ్రమంలో వేపచెట్టు (నింబవృక్షం)పై ప్రతిష్ఠించాడు. బ్రహ్మ ఆశ్చర్యపడి తృప్తిగా భోంచేసి నింబార్కాచార్యునికి ప్రణామం చేసి వెళ్ళాడు.”
(హిందీ సాహిత్య చరిత్రలో ఇదే ఘట్టం ఇలా వర్ణింపబడింది. అతని పేరు మొదట్లో సుదర్శనుడే. ఒకరోజు ఆకలిగావున్న అతిథి కోసం అతని నియమ రక్షణ కోసం సుదర్శనుడు తన ఆశ్రమంలోని వేపచెట్టుమీదనే అస్తమించబోతున్న సూర్యుని ఆపేశాడు. అతిధి భోజనం పూర్తికాగానే సూర్యుడు, కాస్త ఆలస్యంగా అస్తమించాడు. వేపచెట్టు (నింబవృక్షం)పై అర్కుని అనగా సూర్యుని ఆపెయ్యగలిగాడు కాబట్టి ఆయన ఆనాటి నుండి నింబార్కాచార్యునిగా ప్రసిద్ధిగాంచాడు.)