216 - బ్రాహ్మపర్వ శ్రవణ మాహాత్మ్యము; పురాణ, పురాణవాచక వ్యాసమహిమ

            మహారాజా! ఈ భవిష్యపురాణంలోని ప్రథమ పర్వమైన బ్రాహ్మపర్వాన్ని శ్రద్ధగా శ్రవణం చేయడంవల్ల అనూహ్య, అపూర్వ లాభాలెన్నో కలుగుతాయి. సంపూర్ణ పాపాలనుండి ముక్తి, సహస్ర అశ్వమేధ, వాజపేయ, రాజసూయ యజ్ఞాల, సర్వ తీర్థయాత్రల, వేదాభ్యాస, పృథ్వీదానాల పుణ్యమంతా వస్తుంది. నిజానికి, సర్వపాపనివారణకు ఇతిహాస పురాణ శ్రవణానికి మించిన సాధనంలేదు. శ్రవణానికున్న ఫలమే పఠనానికి కూడా వుంటుంది. ఇందులో సందేహం లేదు.”

            “మునీంద్రా! ఇతిహాస పురాణాదులను వినడానికి కూడా ఓ పద్ధతి వుంటుందని విన్నాను. అదేది? పురాణ వాచకునికెటువంటి లక్షణాలుండాలి? వానిని పూజించడం వల్ల కూడా సత్ఫలితాలు వస్తాయటకదా! అవేవి? ప్రతి పర్వపూర్తికీ కొన్ని కర్మలు చేయాలనీ విన్నాను. దయచేసి ఈ విషయాలపై నాకు సంపూర్ణ జ్ఞానాన్ని కలిగించండి” అని వేడుకున్నాడు శతానీకుడు,

            “మహారాజా! నిజానికి నీ జిజ్ఞాసను మెచ్చుకోవాలి. ఈ విషయంలో బృహస్పతి బ్రహ్మదేవుల సంవాదమొకటి జరిగింది. చెప్తాను విను.

            మానవుడు విశేషభక్తితో ఇతిహాస పురాణాల శ్రవణం చేస్తే బ్రహ్మహత్యాది అన్ని పాపాలనుండీ విముక్తుడౌతాడు. శరీరాన్నీ మనస్సునీ కూడా నిర్మలంగా పవిత్రంగా వుంచుకొని సాయంకాలాల్లో, రాత్రివేళల్లో శ్రద్ధగా పురాణశ్రవణం చేసేవానిని చూసి బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు సంతుష్టులౌతారు. వాని పట్ల ప్రసన్నులౌతారు. ఇక వాచకుని విధానాన్ని విను. పవిత్ర వస్త్రాన్ని కట్టుకొని పరిశుద్ధుడై ఆసనానికి ప్రదక్షిణ చేసి దానిపై కూర్చున్న వాచకుడు దేవస్వరూపునితో సమానము. ఆసనం మరీ ఎత్తుగానో, పల్లంలోకో వుండకూడదు. ప్రజలంతా ముందా ఆసనానికే ప్రణామం చెయ్యాలి. వాచకుని ఈ ఆసనాన్ని వ్యాసపీఠమంటారు. దానిని గురువుతో సమానంగా చూసి గౌరవించుకోవాలి. దానిపై వాచకుడు తప్ప మరెవరూ కూర్చొనరాదు. పురాణ శ్రవణం చేసేవారు ముందుగా ఇంటిలోని దేవతలను అర్చించి, ఊరిలోని బ్రాహ్మణులను పూజించి బయలుదేరాలి. వినడానికి వచ్చిన వారంతా కలిసికట్టుగా పోయి వాచకుని ఆహ్వానించి కూర్చుండబెట్టి తాము వినబోతున్న గ్రంథాన్ని పరమాదరంగా ఆయనకి అందించాలి. శాంత చిత్తులై పురాణాన్ని వినాలి.

            గ్రంథానికి కట్టబడిన త్రాటిని వాసుకి అంటారు. గ్రంథ పత్రాలు (పేజీలు) బ్రహ్మ, అక్షరాలు విష్ణువు, పత్రాలను కలిపివుంచే కుట్టు మహేశ్వరుడు, పంక్తి సముదాయం దేవతలు. సూత్ర (త్రాడు, దారం) మధ్యమంలో సూర్యుడు, అగ్ని వుంటారు. గ్రహాలు, ఆకాశం, చంద్రుడు గ్రంథం కాళీ ల్లోనూ, కర్ర అట్టల్లోనూ వుంటారు. కాబట్టి మన పవిత్ర గ్రంథమేదైనా సర్వ దేవతామయమే. (అందుకే వీటిని ఇంటిలో భద్రంగా దాచుకొని, నమస్కరిస్తూ, పూజిస్తూ, సరస్వతీపూజ నాడు దైవమందిరంలో వుంచి దీపం పెట్టడం ఈనాటికీ జరుగుతోంది)

            రాజా! వాచకుడీ గ్రంథాన్ని చేతులలో పెట్టుకొని వ్యాస, వాల్మీకి, విష్ణు, శివ, సూర్యాది దేవతలకు ప్రణమిల్లి శ్రద్ధా సమన్వితుడై ఓజస్సు నిండిన గొంతుతో, అక్షరాలను స్పష్టంగా ఉచ్చరిస్తూ ఏడురకాల స్వరాలనూ యథోచితంగా యథాసమయంగా సందర్భానికి తగినట్లుగా రసాలను భావాలను ముఖంలో ప్రతిబింబించేలా చేస్తూ పురాణం చెప్పాలి. వాచకుని వదనం నుండి జాలువారే ఈ రసాభ్యుచితబంధమైన గ్రంథాన్ని శ్రోత నియమనిష్ఠలతో భక్తితో వింటాడు. శ్రోత వినే గ్రంథం పురాణమైనా, ఇతిహాసమైనా, రామచరితమానసమైనా వచ్చే పుణ్యప్రాప్తి విపులం ఇక్కడ రోగముక్తి, అక్కడ భగవానుని ఉత్తమ, అద్భుతలోక నివాసప్రాప్తి.

            శ్రోత కూడా స్నానాదులచే పవిత్రుడై, వాచకునికి ప్రణామం చేసి వాక్కును అదుపులో పెట్టుకొని వాచకునికెదురుగా కూర్చుని వాని ప్రతిమాటనూ శ్రద్ధగా వినాలి.

            హే మహాబాహో! వాచకునికి నమస్కరించి, ముందురోజు కథలో ఏదైనా సంశయముంటే అడగాలే గాని ఇంకేమీ మాట్లాడరాదు. ఈ సంశయం కూడా కథా సంబంధి, ధార్మిక సంబంధి, జిజ్ఞాసయుక్తము అయివుండాలి. ఆ నిముషంలో ఆ పౌరాణికుడు శ్రోతకి వ్యాస స్వరూపుడు, ధర్మబంధువు, గురువు. కాబట్టి శ్రోత రాజైనా సరే సందేహాన్ని చాలా వినమ్రంగా చేతులు జోడించి అడగాలి. వాచకుడు కూడా యాచకునికైనా మహారాజుకైనా ఒకే రకమైన ప్రీతితో సందేహాన్ని పోగొట్టి చివర ‘నీకు శుభమగుగాక’ అని దీవించి పంపాలి. వాచకుడు బ్రాహ్మణవర్ణుడే అయివుండాలి. ఆయన చేత పురాణం చెప్పించుకున్న వారు మిగతా ధర్మవిధులన్నీ పాటిస్తూ ఆయనకి నెలతిరగగానే సువర్ణదానం చేయాలి.

            పురాణపఠన శ్రవణ కార్యక్రమంలో ప్రథమ పారణలో ప్రతిశ్రోతా తన శక్త్యనుసారము వాచకునికి పూజాసత్కారాలు చేస్తే అగ్నిష్టోమ యజ్ఞప్రాప్తి లభిస్తుంది. కార్తికంలో మొదలు పెట్టి ఆశ్వయుజం దాకా ప్రతిమాసంలో ఒకొక్క పారణకీ పూజాదులు చేసి వాచకుని సంతోష పెట్టినవారికి క్రమంగా అగ్నిష్టోమ, గోసవ, జ్యోతిష్టోమ, సౌత్రమణి, వాజపేయ, వైష్ణవ, మాహేశ్వర, బ్రాహ్మ, పుండరీక, ఆదిత్య, రాజసూయ, అశ్వమేధయజ్ఞాల ఫలితము దక్కుతుంది. ఇలాటి ఫలం అబ్బినపుడు నిస్సందేహంగా దేహాంతంలో ఉత్తమలోకమూ ప్రాప్తిస్తుంది.

            పురాణేతిహాసాలలో ఒక పర్వశ్రవణం పూర్తియైనపుడు గంధ, మాలా, వివిధ వస్త్రాలతో పౌరాణికుని లేదా వాచకుని పూజించాలి. బంగారం, వెండి, ఆవు, కంచుపాత్ర మున్నగువాటిని ఆయనకు ప్రదానం చేస్తే పురాణశ్రవణఫలం మరింతగా దక్కుతుంది. వాచకుని మించిన సుపాత్రుడు లేడు. అతని నాలుక చివరనే అన్ని శాస్త్రాలూ విరాజిల్లుతుంటాయి. వాచకునికి భక్తి శ్రద్ధలతో భోజనం పెట్టేవాని పితరులు వందేళ్ళ దాకా సంతుష్టులై వుంటారు. దేవతలలో సూర్యదేవుని వలెనే బ్రాహ్మణులలో పౌరాణికుడు లేదా వాచకుడు శ్రేష్ఠుడు. ఇటువంటి వేదవ్యాస స్వరూపుడు నివసించే గ్రామం, నగరం, దేశం సర్వశ్రేష్ఠ క్షేత్రాలు అవుతాయి. ఈతనికి ప్రణామం చేస్తే వచ్చేటంత పుణ్యం ఇక ఏ కర్మలకీ రాదు.

            కురుక్షేత్రం వంటి తీర్థం, గంగాసమాన పవిత్రనది, భాస్కరతుల్యుడైన భగవానుడు, పుత్రజన్మములాటి ఆనందము పురాణ వాచకుని వంటి బ్రాహ్మణుడు లేరు. దేవకార్య, పితృకార్యాది అనేక పవిత్ర కార్యాలకంటె పురాణ శ్రవణము, పౌరాణికాదరణ శ్రేష్ఠకర్మములు.

            ఓ శతానీక మహారాజా! ఇవి పురాణ శ్రవణ, వాచక మాహాత్మ్యాలు. దైవ, పితృ, శ్రవణ, స్నాన, దాన, జప, హోమ కార్యాలేవి చేసినా విధిపూర్వకంగా అంటే పద్ధతిగా శ్రద్ధగా అనుష్ఠించాలి.”

బ్రహ్మపర్వం సంపూర్ణం