ధర్మజా! ప్రాచీనకాలంలో నిషధదేశాన్ని నల మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతని తమ్ముడైన పుష్కరుడతనిని జూదంలో ఓడించి మొత్తం రాజ్యాన్ని గెలుచుకున్నాడు. అప్పుడతడు తన భార్య దమయంతితో సహా వనాలలోకి నిర్గమించాడు. కేవలం జలాహారాన్ని మాత్రమే స్వీకరిస్తూ నిర్జన భయంకర వనాల్లో తిరుగుతుండేవారు. ఒకరోజు ఆ రాజు ఒక వనంలో బంగారు కాంతులీనుతున్న కొన్ని పక్షులను పట్టుకోదలిచి తన వస్త్రాన్ని విప్పి వాటిపై వేశాడు. కాని దైవయోగం వల్ల ఆ పక్షులా వస్త్రాన్ని పట్టుకొని ఎగిరి పోయాయి. తన దారిద్ర్యానికి తనలో తానే కుమిలి పోతూ కనీసం ఆమెయైనా పుట్టింటికి పోయి సుఖపడుతుందని యెంచి గాఢ నిద్రలోనున్న దమయంతిని వదిలి పారిపోయాడు నలుడు.
దమయంతి మేలుకొని తన పతిని గానక ఎలుగెత్తి పిలిచిపిలిచి అలసి సొలసి దుఃఖ భారం తీరక హాహా కారాలు చేస్తూ అటూ ఇటూ తిరుగుతూ చివరికి చేది దేశాన్ని చేరుకుంది. అక్కడ రాజమార్గంలో నీరసంతో కళ్ళు తిరిగి నేలపై పడిపోయింది. అద్భుత సౌందర్యవతియైన దమయంతి నేలపైబడిన చంద్రరేఖ వలె కాంతులను విరజిమ్ముతుండగా చేది దేశపు రాజమాత ఆ దారంట వెళుతూ చూసి తన భవనానికి తీసుకొని పోయి అక్కడ సేదదీర్చి ఆమె వివరాలడిగింది. దమయంతి అసలు విషయాన్ని దాచిపెట్టి తానొక సైరంధ్రినని చెప్పి వూరుకుంది. రాజమాత నమ్మలేదు కాని ఆమెను చూసి ముచ్చట పడి తన దగ్గరే వుండిపొమ్మని అడిగింది.
‘ఉంటాను గానీ నాకు కొన్ని నియమాలున్నాయి. నేనెవరి పాదాలూ కడగను, ఎవరి యెంగిలీ తినను, నన్ను పొందాలనే ప్రయత్నం ఏ పురుషుడు చేసినా దానికై నన్ను వేధించినా మీరు వానిని దండించాలి’, అని వినయంగానైనా కచ్చితంగానే చెప్పింది దమయంతి. అంగీకరించింది రాజమాత. కొన్నాళ్ళకు దమయంతి సామాన్యురాలు కాదనీ ఒక చక్రవర్తి కూతురని ఒక బ్రాహ్మణుని ద్వారా తెలుసుకున్న రాజమాత మిక్కిలి గౌరవాదరాలతో ఆమెను ఒక బ్రాహ్మణబృందాన్ని తోడిచ్చి పుట్టింటికి పంపించింది. మాతాపితలూ, అన్నదమ్ములూ, చిన్ననాటి స్నేహితులూ ఆమెను ఎంత ఆప్యాయంగా చూసుకున్నా ఆమె ముఖాన చిరునవ్వునూ గుండెలో ఆనందాన్నీ తెప్పించలేకపోయారు.
ఒకనాడు దమయంతి శ్రేష్ఠుడైన బ్రాహ్మణునొకని పిలిపించి ఇలా అడిగింది. ‘ హే బ్రాహ్మణ దేవతా! నన్ను నాపతి చెంత చేర్చగలిగే దానం గాని వ్రతం గాని ఏదైనా వుంటే నన్ననుగ్రహించి నాకుపదేశించండి.’
‘భద్రే! మనోవాంఛిత సిద్ధిని ప్రదానం చేయగలిగిన ఆశాదశమీ వ్రతాన్ని అనుష్టించు.’ అని చెప్పాడాయన.
వెంటనే వేదవేదాంగవేత్త, పరమ పౌరాణికుడు దమన నామకుడునైన ఆ మహనీయుని ఆధ్వర్యంలోనే ఆ వ్రతాన్నాచరించి దాని ప్రభావంవల్ల తన పతిని మరల పొంద గలిగింది. (నల దమయంతుల ఈ కథ శృంగార నైషధకావ్యం ద్వారా జగత్ప్రసిద్ధమైంది. ధర్మరాజే అరణ్యవాసకాలంలో ఈ కథను సవిస్తరంగా, సాకల్యంగా, సాంతంగా వినియున్నాడు. కాబట్టి ఇక్కడ ఆ కథ చెప్పబడలేదు)
“హే సర్వజ్ఞ! ఈ వ్రతాన్నెలా చేయాలో చెప్పి నన్ననుగ్రహించండి” అని ధర్మరాజు ప్రార్థించాడు చెప్పసాగాడు జగద్గురువు శ్రీకృష్ణుడు:
“మహారాజా ! ఈ వ్రత ప్రభావం వల్ల రాజపుత్రులు రాజ్యాన్నీ, వైశ్యులు వ్యాపారంలో లాభాన్నీ, పుత్రార్థులు పుత్రుల్నీ, సర్వమానవులు ధర్మార్థ కామసిద్ధినీ పొందగలరు. కన్యలు శ్రేష్ఠవరులనూ, బ్రాహ్మణులు నిర్విఘ్నయజ్ఞ సంపన్నతనూ, రోగి రోగాన్నుండి ముక్తినీ, చిరకాల ప్రవాసము నుండి పత్ని తన పతి యొక్క తత్‌క్షణాగమనాన్నీ సాధించుకోగలరు.
ఈ వ్రతాన్ని ఏ శుద్ధ దశమినాడైనా అనుష్టించవచ్చును. ఆ రోజు పెందలకడనే స్నానం చేసి ఇష్ట దేవతలను పూజించుకొని రాత్రి పుష్ప, అలక్త చందనాలతో ఆశాదేవీ దశకాన్ని పూజించాలి. ఆశా యనగా దిశ, దశదిశలకూ పదిమంది అధిష్ఠాన దేవతలుంటారు. వారెవరనగా ఐంద్రి, ఆగ్నేయి, యామ్య, నైరృతి, వారుణి, వాయవ్య, సౌమ్య, ఐశానీ, అధా, బ్రాహ్మి. ఇంటిముంగిట యవధాన్యంతోగాని, పిష్టాతకంతో గాని పదిమంది దిశాదేవతల ప్రతిమలను తయారు చేసి దిక్కులవారీగా ప్రతిష్ఠించాలి. ఆ ప్రతిమలను శాస్త్రంలో చెప్పబడిన శస్త్రాస్త్రాలతో, వాహనాలతో అలంకరించి పూజించి అందరికీ నేతితో కూడిన నైవేద్యాలను, వేరువేరుగా దీపాలనూ ఋతుఫలాలను సమర్పించాలి. తదనంతరం తమ కార్యసిద్ధికై వ్రతులు ఈ మంత్రంతో ఆ దేవీమణులను ప్రార్థించాలి.
ఆశాశ్చాశాః సదాసంతు సిద్ధ్యాంతాం మేమనోరథాః॥
భవతీనాం ప్రసాదేన సదా కల్యాణమస్త్వితి ॥ (ఉత్తర పర్వం 64/25)
ఈ విధంగా పూజ చేసి బ్రాహ్మణులకు దక్షిణ లిచ్చి వారి చేతి వెంట ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇదే క్రమంలో ప్రతి మాసం తన కోరిక తీరేదాకా ఈ వ్రతాన్ని చేస్తూనే వుండాలి. ఉద్యాపన వేళ ఆశా దేవీమణుల బంగారు, వెండి, లేదా పిష్టాతకప్రతిమలను మరల ప్రతిష్ఠించి వారితో బాటు నక్షత్రాలనూ, గ్రహాలనూ, నక్షత్ర మాతృకలనూ, భూత - ప్రేతాలనూ, వినాయకునీ(ఎప్పుడూ ముందుండే వినాయకుడి పేరు ఇందులో చివర రావడం విశేషం) కూడా అభీష్టసిద్ధికై ప్రార్థించాలి. నృత్య గీతాలతో ఉత్సవాన్ని చేయించి ఆ రాత్రి జాగరం చేయాలి. మరునాటి ప్రాతర్వేళ పూజన పదార్థాలనన్నిటినీ విద్వాంసుడైన బ్రాహ్మణునకిచ్చివేసి ఆయనకు ప్రణామం చేసి క్షమాభిక్షను వేడాలి. అనంతరం బంధు బాంధవులతో కలిసి ప్రసన్నంగా భోజనం చేయాలి. ఈ వ్రతం స్త్రీలకు విశేష శ్రేయస్కరం”