భవిష్య పురాణము

89 - యమధర్మరాజ సమారాధన వ్రత కథ

“అచ్యుతా! యమధర్మరాజును ప్రసన్నం చేసుకొనే వ్రతమేదైనా వుందా?”

“ధర్మనందనా! నేనొకమారు ద్వారక దగ్గరి సముద్రంలో స్నానం చేసి వస్తుండగా ముద్గల మహర్షి అటుగా వస్తూ దర్శనమిచ్చాడు. ఆయన సూర్య సమాన తేజుడు. అతని ముఖము నుండి వెలువడుతున్న తపఃకాంతులతో దిక్కులన్నీ వెలుగులను నింపుకున్నాయి. నేనాయనకు నమస్కారం చేసి అర్ఘ్యపాద్యాది సత్కారాలను గావించి అనన్యభక్తితో చేతులు జోడించి నిలబడి ఆయనను ఇలా అడిగాను, ‘హే సర్వజ్ఞ ప్రభో! నరకగమనం, యమకింకరుల చేతిలోబడడం మానవజాతికి అత్యంత భయదాయకాలు. ఈ భయం నుండి విడుదల నిప్పించే వ్రతమేదైనా వుంటే సెలవీయండి.’

ఆయన తొలుత కొంత ఆశ్చర్యపోయినా వెంటనే తేరుకొని ఇలా చెప్పాడు. ‘వాసుదేవా! ఒకమారు నేను అకస్మాత్తుగా మూర్ఛవచ్చినట్లయి, నేలపై విరుచుకు పడిపోయాను. తెలివి తప్పలేదు. అప్పుడు నాకేవేవో విచిత్ర దృశ్యాలు కనిపించాయి. నా శరీరం నుండి లాఠీలు పట్టుకొని అగ్నులలాగా మండిపోతూ కొందరు వ్యక్తులు బయటికి వచ్చారు. వారు అతిప్రయత్నంమీద, బలవంతంగా నా హృదయం నుండి చిటికెన వ్రేలంత వున్న వ్యక్తిని బయటికి త్రాళ్ళు కట్టి లాగి యమపురి వైపు తీసుకొని పోసాగారు. యమలోకంలో, నేను వెళ్ళేసరికి, యమధర్మరాజు కొలువుతీరి వున్నాడు. ఆయన కనులు ఎఱ్ఱగా, పచ్చగా వున్నాయి. కఫం, వాతం, పిత్తం, జ్వరం, మాంసం, శోథం, కురుపులు, మొటిమలు, భగందరాలు, అక్షరోగాలు, విషూచికా, గలగ్రహాది భయంకర అసహ్యకర రోగాలన్నీ మృత్యువుతో సహా రూపధారణ చేసి ఆయన చుట్టూ చేరి ఆయనను ఉపాసిస్తున్నాయి. భయదశస్త్రాలంకారులై యమ దూతలాయనను పరివేష్టించి యున్నారు. కొందరు రాక్షసులు దైత్యులు కలరు. సింహం నుండి తేలుదాకా మనిషిని బాధించి చంపే ప్రాణులన్నీ క్రిములతో సహా అక్కడ పరివేష్టించి వున్నాయి.

నన్ను చూడగానే యమరాజు లేచి నిలబడి తన కింకరులతో ‘ఏమిరా మూర్ఖులారా! ఈ ముద్గల మహర్షిని తెచ్చితిరేల? మేము తెమ్మన్నది ముద్గల క్షత్రియుని కదరా. అతడు కౌండిల్య నగర నివాసి భీష్మకుని పుత్రుడు. ఈ మునిని ఇప్పటికి వదిలేసి అతనిని తీసుకురండి’ అన్నాడు. ఈ వింత చూద్దామని నేనక్కడే వున్నాను. వెళ్ళిన కికంరులు వెంటనే మరలి వచ్చి ‘స్వామీ! ముద్గల క్షత్రియునిలో మృత్యులక్షణాలేవీ కనబడుట లేదు. మా త్రాళ్ళకు ఆయన లొంగలేదు’ అన్నారు. వెంటనే యముడు దివ్యదృష్టితో చూసి ‘కింకరులారా! ఇందులో మీ దోషం లేదు. భయపడకండి. ఆరాజు నరకార్తి వినాశినియైన ఒక త్రయోదశీ వ్రతాన్ని మిక్కిలి భక్తిశ్రద్ధలతో ఆచరించాడు. ఆయన మీకు లొంగడు’ అని చెప్పి నాతో ఇలా చెప్పాడు. ‘మునీంద్రా! ఈ వ్రతాన్ని ప్రచారం చేయడానికే బ్రహ్మ మిమ్ము ఇక్కడికి పంపినట్లున్నాడు. వినండి. మార్గశిర శుద్ధ త్రయోదశి ఆదివారంగాని మంగళవారం గాని పడకుండా వున్నరోజు ఈ వ్రతాన్ని చేయాలి. ఆ రోజు పవిత్రులూ, విద్వాంసులూనైన పదముగ్గురు బ్రాహ్మణులను ముందే ఎంచుకొని, ఒక పురాణ వాచకుని కూడా ఆహ్వానించి వారిని ఉత్తరాభిముఖంగా పవిత్రాసనం పై కూర్చుండబెట్టాలి.

పూర్వాహ్ణంలోనే వారికి తిలలతో తైలంతో అభ్యంగనం చేయించి గంధకాషాయం కలిపిన గోరువెచ్చని నీటితో స్నానం కూడా చేయించి ధూపాది సేవలు చేయాలి. ఆ తరువాత ప్రతి తూర్పుముఖంగా వారిని కూర్చుండబెట్టి శాల్యన్న, ముద్గాన్నాలను, బెల్లపు అప్పాలను సుపక్వ వ్యంజనాలతో సహా స్వయంగా వడ్డిస్తూ ఆదరపూర్వకంగా తినిపించాలి.

పిదప వ్రతి పవిత్రుడై ఆచమనం చేసి వారందరినీ అర్చించాలి. రాగిపాత్రలలో ఒక శేరు నువ్వులనూ, దక్షిణనూ, గొడుగునూ, నీటితో నింపిన మంచి కలశలనూ వారికి ఒక్కొక్కరికీ దానం చేయాలి. ఇలా ఒక యేడాది పూర్తిగా చేయాలి. ఇలా చేసిన వారికి నరక దర్శనం వుండదు. వారిని దేహాంతంలో సూర్యుడు విమానం తెచ్చి తీసుకు పోతాడు. అక్కడి నుండి విష్ణులోకం, శివలోకం కూడా వారికి ప్రాప్తిస్తాయి.

యమధర్మరాజు ముగించగానే నాకు మూర్ఛ నుండి తెలివి వచ్చినట్లయింది. నిజానికి నేను మీ దర్శనానికి వచ్చాను. కాని ఓ వాసుదేవా! మీరే నాకు దర్శనమిచ్చి నన్ను మాట్లాడించి ధన్యుని గావించారు అంటూ వెళ్ళాడు ముద్గల మహర్షి.

కాబట్టి ఓ ధర్మరాజా! ఈ వ్రతం పరమ శ్రేష్ఠం. పాపాలు చేసినా అవి దగ్ధమై పోయే అవకాశం ఈ వ్రతులకుంటుంది. వారు నరకాన్ని చూడరు.”