(కొన్ని పురాణాల్లో దీని పేరు రథ, సూర్య, భాను, అర్క, మహతీ, పుత్ర సప్తమీగా వుంది.)
“భగవన్! మీరు నాకు మాఘస్నాన విధానాన్ని అనుగ్రహించి యున్నారు. అంతకంటే తక్కువ కష్టంతో సుకుమారులైన స్త్రీలు రూప, సౌభాగ్య, సంతాన, అనంత పుణ్యాలను అందుకోగలిగే వ్రతం వుందా?” “ఉంది ధర్మజా! గోపనీయ విధానంగల అచలా సప్తమి వుంది. ఒకప్పుడు మగధ దేశంలో ఒక అతిరూపవతియగు ఇందుమతి యనుపేరుగల వేశ్య వుండేది. ఒకనాటి ప్రాతఃకాలంలో కూర్చుని వున్న ఆమెకు ఈ ఆలోచన వచ్చింది ‘ఈ జీవితమెంత అశాశ్వతమో కదా! ఈ విషయరూపమైన ప్రపంచమెంత భయంకరము? ఈ సాగరంలో మునిగిపోతూ జన్మ, మృత్యు, జరలతో బాధపడుతూ పీడితులమౌతూ ఎంత ప్రయత్నించినా తేలలేకపోతున్నాం కదా! కోరికలు మన జీవితాన్ని చీలికలు పేలికలుగా కావిస్తున్నవి కదా! ఈరికలెత్తే ఈ కోరికలకు అంతము లేకపోతున్నది కదా! బ్రహ్మదేవునిచే నిర్మితమైన ఈ ప్రాణి సముదాయము తాము చేసుకున్న కర్మలనే ఇంధనం వల్ల కాలమనే అగ్నిలో దగ్ధం చేయబడుతున్నది. అర్థ కామరహితంగా జీవనం గడిపేవారు వెనుకకు రారంటారు కదా, వారెక్కడికి పోతున్నారు? పుత్ర, స్త్రీ, గృహ, క్షేత్ర, ధనాదుల చింతలో బడి ఉన్న ఆయువంతా అయిపోతోంది. మృత్యువు వచ్చి తినేస్తుంది’
ఇలా ఆలోచిస్తూ నిర్విణ్ణయై, ఉద్విగ్నుయై చింతిస్తూ పూర్వజన్మ దుష్కృతి వల్ల వృత్తినీ, సుకృతి వల్ల జ్ఞానేచ్ఛనీ పొందిన ఇందుమతి వసిష్ఠ మహర్షి ఆశ్రమానికి పోయి ఆయనకు సాష్టాంగ ప్రమాణమాచరించి లేచి చేతులు జోడించి ఇలా ప్రార్థించింది.
‘భగవన్! నేనేనాడూ జపతపాలను గాని వ్రతోపవాసాలను గాని చేయలేదు. ఏ దైవారాధనా చేయలేదు. ఇపుడీ భయంకర ప్రపంచంలో భయభీతనై మిమ్ముశరణు జొచ్చాను. ఏదేని వ్రతోపదేశం ద్వారా నన్నీ పంకిలం నుండి ఉద్ధరించడానికీ, ఉత్తమ గతి నొందించడానికీ సర్వజ్ఞులైన తమరే సమర్ధులు. కరుణించండి.
వసిష్ఠులిలా సెలవిచ్చారు. ‘వరాననా! మాఘస్నానాలే నీకు తరణోపాయం. మాఘశుద్ధ సప్తమినాడు అచలా సప్తమ్యాచరణను సంకల్పించు. రూప సౌభాగ్యాలూ దేహాంతంలో సద్ధతులూ కరతలామలకములౌతాయి. షష్ఠినాడు ఒకపూటే భోజనం చేసి సప్తమినాట ప్రాతఃకాలంలోనే ఎవరూ అప్పటిదాకా కదిలించని నీటిలో (నదిగానీ చెఱువుగానీ) దీపదానం గావించి స్నానం చెయ్యి. తరువాత యథాశక్తి దానాలు చెయ్యి. దానాలే దేవతలను ప్రసన్నులను చేస్తాయని గుర్తుంచుకో. నీకు శుభం జరుగుతుంది.’
ఇందుమతి తన నివాసానికి మరలివచ్చి మహర్షి ఉపదేశానుసారము స్నానధ్యానాలను ఆచరించి దేహాంతంలో దేవలోకం చేరి అప్సరశ్శిరోమణి అయింది. మహారాజా! సకల పాపాలనూ హరించే ఈ అచలా సప్తమి వసిష్ఠోపదిష్టము” అన్నాడు శ్రీకృష్ణుడు.
“శ్రీకృష్ణ చంద్రా! వ్రతమాహాత్మ్యాన్ని విని ధన్యుడనైనాను. ఇక వ్రత విధానాన్ని కూడా ఆదేశించి నన్ను తరింపజేయండి” అని ప్రార్థించాడు అర్జునాగ్రజుడు. చెప్పసాగాడు గీతాచార్యుడు.
“పాండవాగ్రజా! షష్ఠిరోజున ఏకభుక్తం చేసి సూర్యనారాయణుని పూజించాలి. సప్తమినాట వీలైనంత వేగమే నదిలోగాని చెఱువులోగాని స్నానంచేయాలి. బంగారు, వెండి లేదా రాగి పాత్రలో కుంకుమపువ్వు నలదిన వత్తిని పెట్టి నువ్వుల నూనెనుపోసి దీపాన్ని వెలిగించాలి. ఆ దీపాన్ని తలపై బెట్టుకొని హృదయంలో సూర్యుని ధ్యానించాలి. ఇలా :
నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః॥
వరుణాయ నమస్తేఽస్తు హరివాస నమోఽస్తుతే॥
యావజ్జన్మ కృతం పాపం మయా జన్మసుసప్తసు।
తన్మేరోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ॥
జననీ సర్వభూతానాం సప్తమీ సప్తసప్తికే
సర్వవ్యాధి హరే దేవి నమస్తే రవిమండలే॥ (ఉత్తరపర్వం 53/33,34)
తరువాత ఆ దీపాన్ని నీటిపై పయనింప జేయాలి. మరల స్నానంచేసి దేవతలకూ, పితరులకూ తర్పణలివ్వాలి. చందనంతో కర్ణికా సహితమైన ఒక అష్టదళ కమలాన్ని చిత్రించి దాని మధ్యలో శివపార్వతులను స్థాపించి ప్రణవమంత్రం (ఓంకారం)తో పూజించాలి. పూర్వాది ఎనిమిది దిక్కుల్లోగల దళాల్లో క్రమంగా భాను, రవి, వివస్వాన్, భాస్కర, సవిత, అర్క, సహస్ర కిరణ, సర్వాత్మ అనే సూర్యనామంతో ‘ఓం’ ని ముందూ ‘నమః’ ను చివరా పెట్టి పలుకుతూ పూజచేయాలి. ఓం భానవే నమః, ఓం రవయే నమః’ ఇత్యాదిగా, క్రమంగా.
ఇలా పుష్ప ధూప దీప నైవేద్యవస్త్రాది ఉపచారాలతో విధిపూర్వకంగా సూర్యదేవునికి పూజ చేసి ‘స్వస్థానంగమ్యతాం’ అంటూ విసర్జితం చేయాలి. తరువాత తామ్ర లేదా మట్టిపాత్రలో బెల్లం, నేయి కలిపిన నూలగుండ, తాళపత్రాకారంలో సాగదీయబడిన బంగారు చెవికమ్మీల నుంచి దానిని రక్తవస్త్రంతో కప్పి పుష్ప ధూపాదులతో పూజించి మనసులో నాకెట్టి దౌర్భాగ్యమూ వుండకూడదు’ అని పదే పదే అనుకొంటూ దానిని బ్రాహ్మణునకిచ్చి వేయాలి. అనంతరం ‘సపుత్ర పశుభృత్యాయమేఽర్కోయం ప్రీయతాం’ అని ప్రార్థించాలి. గురువుగారికి వస్త్ర, తిల, గో దక్షిణలను సమర్పించి అన్యబ్రాహ్మణులకు యథాశక్తి కమ్మటి భోజనాలను పెట్టాలి.
ఈవిధంగా అచలా సప్తమీ స్నానాలను చేసే పురుషునికి సంపూర్ణ మాఘస్నానాల పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. దీని మాహాత్మ్యాన్ని విన్నవారికీ చెప్పివారికీ, అవశ్యం, ఉత్తమ లోకాలు కలుగుతాయి.