భవిష్య పురాణము

56 - దూర్వా - ఉత్పత్తి - దూర్వాష్టమీ వ్రతం

ధర్మనందనా! భాద్రపద శుద్ధ అష్టమినాడు పరమ పవిత్రమైన వ్రతాన్నొక దాన్ని చేయాలి. దానిపేరు దూర్వాష్టమీ వ్రతం. ఆ వ్రతాన్ని చేసిన పురుషుని వంశం, దూర్వాంకురములలాగే, ఎన్నటికీ నశింపదు.”

“లోకనాధా! దూర్వా అనేది పరమపవిత్రమైన ఆకుపచ్చ గడ్డి అని నేనువిన్నాను. అది ఎలా పుట్టింది? అంత పవిత్రం, లోకవంద్యం ఎలాగైంది?” అని అడిగాడు ధర్మనందనుడు. చెప్పసాగాడు లోకవంద్యుడు కృష్ణుడు.

“అమృతంకోసం క్షీరసాగర మధనం జరుగుతున్నప్పుడు మందర పర్వతాన్ని మోస్తున్న శ్రీ మహావిష్ణువు రోమాలు కొన్ని ఆ పర్వతం కదులుతున్నప్పటి రగడ వల్ల తెగి సముద్రంలో పడ్డాయి. అవి కెరటాల కదలికల వల్ల తేలి తేలి భూమిపైకి వచ్చి ఆకుపచ్చని గడ్డిగా పెరిగాయి. అమృత కుంభాన్ని దేవతలు ముందుగా దానిపైనే వుంచగా కొన్ని బిందువులు దానిపై రాలినవి. అప్పుడా దూర్వాంకురాలు అతి పవిత్రాలూ, అజరామరాలూ అయినవి. దేవతలు వాటిని విష్ణు సంబంధితాలు గావున పూజించారు. భాద్రపద శుక్ల అష్టమినాడు గంధ పుష్పధూప దీప నైవేద్యాలతో, ఖర్జూర, నారికేళ, ద్రాక్ష, దాడిమాది ఫలాలతో పెరుగువంటి ద్రవ్యాలతో, పూమాలలతో, అక్షతలతో ఈ క్రింది మంత్రాల ద్వారా దాన్ని పూజించారు:

త్వందూర్వేఽమృత జన్మాసి వందితా చ సురాసురైః

సౌభాగ్యం సంతతి కృత్వా సర్వకార్య కరీభవ 

యథాశాఖా ప్రశాఖాభిః విస్తృతాసి మహీతలే!

తథామమావి సంతానం దేహిత్వమజరామరే (ఉత్తరపర్వం - 56/12,13)

దేవతలతోబాటు వారి భార్యలూ, అప్సరసలూ కూడా ఈ వ్రతాన్ని గావించారు. మానవ లోకంలో వేదవతి, దమయంతి, సీత మున్నగు ప్రసిద్ధ పుణ్యస్త్రీల ద్వారా కూడా. ఈ దూర్వపూజలందుకున్నది. వారి వారి కోరికలను నెరవేర్చింది. స్నానం చేసి శుద్ధ వస్త్రాలను ధరించి దూర్వను పూజించి తిలపిష్ట, గోధుమ, సప్త ధాన్యాదులను బ్రాహ్మణులకు దానం చేసి కమ్మటి భోజనాలు పెట్టి పంపించిన స్త్రీకి పుత్ర, సౌభాగ్య, ధనాది ప్రాప్తి కలుగుతుంది. ఇహంలో సుఖ జీవనం, పరంలో పతి సహితంగా స్వర్గలోక నివాసము ప్రాప్తిస్తాయి.