భవిష్య పురాణము

28 - సత్యనారాయణ వ్రత కథలో నాల్గవ అధ్యాయము పూర్తి సాధువైశ్యుడు - అల్లుడుల కథ

మహర్షులారా! స్వామి మహత్తును తెలిపే మరో కథ ఇది. ఒకమారు సత్యనారాయణ దేవుని పరమ భక్తుడైన చంద్రచూడ మహారాజు తన ప్రజలతో బాటు కూర్చుని పెద్దయెత్తున మహోత్సవము వలె సత్యనారాయణవ్రతం చేస్తుండగా అక్కడికి రత్నపురి నివాసి, మహాధని సాధు అనుపేరు గల వైశ్యుడు వచ్చాడు. అతనికి గ్రామవాసులందరితో క్రిక్కిరిసి, మణులతో, ముత్యాలతో నిర్మితమై శ్రేష్ఠ వితానాదులచే విభూషితమైన పూజామండలం కనబడి ఆశ్చర్యచకితుడై నిలబడిపోయాడు. గీత వాద్యాదులు ధ్వని, వేదధ్వని కలగలుపుగా అతని చెవులను అలరించాయి. ధన, వస్తు, కనక, వాహనాదులతో సుసంపన్నమైన తన నౌకను నదీతీరాన వుంచి వ్యాపారం కోసమై వచ్చిన ఆ సాధు వణిక్‌ప్రముఖుడు ఈ రమ్యస్థానాన్ని చూసి తన నావికునికి నౌకకులంగరు వేసెయ్యమని కబురు పెట్టి, ఈ వ్యవహారమేదో చూసి ఆనందిద్దామని వుండిపోయాడు.

‘మహాశయా! ఇక్కడేదో పుణ్యకార్యం జరుగుతున్నట్లుంది. దయచేసి నాకు చెప్పగలరా?’ అని ఒక పౌరుడినడిగాడు వణిజుడు.

‘మేమంతా మా మాననీయులైన మహారాజా వారితో కలిసి సత్యనారాయణ వ్రతంలో పాల్గొంటున్నాము. మా దేశాన్ని ఈ వ్రతమే రక్షించి, మా బతుకుల్ని బాగు చేసింది. సత్యదేవుని వ్రతం ద్వారా పూజించిన వారికి, ధనం కోరితే ధనం, ద్రవ్యం, ఉత్తమపుత్రులు, జ్ఞానదృష్టి ఏది కోరితే అది శీఘ్రంగా ఈ జన్మలోనే లభిస్తుంది. భయపడుతూ బతికేవాడు ఈ వ్రతాన్ని చేస్తే నిర్భయుడై జీవిస్తాడు. అని చెప్పాడు పౌరుడు. ఇది విన్న వణిజుడు తన మెడ చుట్టూ వస్త్రాన్ని పలుమార్లు త్రిప్పుకొని సత్యనారాయణ స్వామికి సాష్టాంగ ప్రణామం చేసి అక్కడి సభాసదులందరికి సాదరంగా చేతులు జోడించి నమస్కరించి ప్రమాణం చేస్తున్నట్లుగా ఇలా అన్నాడు. ‘భగవన్! నాకు సంతానం లేదు. అది లేకపోతే నామొత్తం ఐశ్వర్యం, ఉద్యోగం (ప్రయత్నం) వ్యర్థములే కదా! హే కృపాసాగరా! నాకు కొడుకు గాని కూతురు గాని పుడితే నీ వ్రతాన్ని, బంగరు పతాకను తయారు చేయించి, మహావైభవంగా, చేస్తానని మొక్కుకుంటున్నాను.’

‘మీకోరిక తప్పకుండా నెరవేరుతుంది. తథాస్తు!’ అని సభాసదులంతా దీవించారు. భగవంతుడైన సత్యనారాయణస్వామికీ అక్కడి సభాసదులకూ మరల మరల దండాలు పెడుతూ, అత్యంతాదరంతో ప్రసాదాన్ని స్వీకరించి, హృదయంలో పదేపదే భగవత్ చింతన చేస్తూ ఆ వణిజుడు సపరివారంగా కొన్నాళ్ళకి తన ఇంటికి చేరాడు. ఇంటివద్ద మంగళకర ద్రవ్యాలతో ముత్తయిదువులు అతనికి స్వాగతం పలికారు. సాధుకి అతిశయ ఆశ్చర్యం కలిగింది. అంతఃపురంలోకి వెళ్ళాడు. అతని పత్ని, పరమ పతివ్రతయైన లీలావతి అతనిని సాదరంగా ఆహ్వానించింది.

కొంతకాలానికి సత్యనారాయణస్వామి సత్కృప వల్ల సాధువణిజునికి స్త్రీ సంతానం కలిగింది. ఆతనితో సహా బంధు, బాంధవులంతా కమలముల వంటి కన్నులు కల ఆ పాపను చూసి మురిసిపోయారు. అపుడా వణిజుడు అతిశయానందితుడై ఎన్నో దానధర్మాలుచేశాడు. వేదజ్ఞులైన బ్రాహ్మణోత్తములను రావించి అమ్మాయికి జాత కర్మాది మంగళకృత్యాలను సంపన్నం చేయించాడు. ఆ బాలికకు జన్మకుండలిని వ్రాయించి దాని ప్రకారమామెకు కళావతి అని పేరు పెట్టారు. తరువాత ఆమె శుక్ల పక్ష చంద్రునిలా దినదినప్రవర్ధ మానమై చంద్రకళావతియై పెరుగసాగింది. ఎనిమిది సంవత్సరాల గౌరి,

అష్టవర్షాభవేద్గౌరీ నవ వర్షాచరోహిణీ

                  దశవర్షా భవేత్ కన్యా తతః ప్రౌఢా రజస్వలా   (ప్రతిసర్గం 2/28/21,22)

 తొమ్మిదేళ్ళ రోహిణి, పదేళ్ళకన్యా, తరువాత పన్నెండేళ్ళ ప్రౌఢా అయింది.

సమయానుసారంగా వర్ధిల్లుతూ కళావతి వివాహయోగ్యదశను చేరుకొంది. ఆమె తండ్రి ఆ ప్రయత్నంలో పడ్డాడు. కాంచనపురనగరంలో శంఖపతియని ఒక గొప్ప వణిక్ శ్రేష్ఠుడు (వణిక్ర్ఛేష్ఠుడు అనే సంస్కృతంలో వుంటుంది) ఉండేవాడు. అతడు కులీనుడు, రూపవంతుడు, సంపత్తిశాలి, శీలవంతుడు, ఉదారాది గుణసంపన్నుడు. సాధువణిజుడు తన కుమార్తె కళావతిని ఇతనికిచ్చి శుభలగ్నంలో అనేక మాంగలిక ఉపచారాలతో అగ్ని సాన్నిధ్యంలో వేదవాద్యాది ధ్వనుల మధ్య యథావిధిగా పెండ్లి చేశాడు. ఎన్నో మణులను, ముత్యాలను, స్వర్ణాభరణాలను, వస్త్రభూషణాలను మంగళాన్ని కోరుకుంటూ కూతురికీ అల్లుడికీ బహూకరించాడు. అల్లుని తన ఇంటిలోనే ఉంచుకొని కొడుకు కన్న నెక్కువగా కూరిమి, గౌరవాలను చూపుతూ మొత్తం వాణిజ్యాన్ని అతనితో కలిసే చేస్తున్నాడు. అల్లుడు కూడా మామగారిని తండ్రిగా, గురువుగా చూసుకుంటున్నాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఈ మహానందంలో పడి వణిజుడు తాను సత్యనారాయణ స్వామికి చెల్లించుకో వలసిన మొక్కు సంగతి పూర్తిగా మరచిపోయాడు.

కొన్నాళ్ళ తరువాత మామా, అల్లుడూ కలిసి వ్యాపార నిమిత్తమై సుదూరంగా, నర్మద దక్షిణ తీరంవైపు వెళ్ళారు. ఇంటికి దూరంగా బహుకాలమే ఉండవలసి వచ్చినా సాధు వణిజునికి సత్యనారాయణస్వామి గుర్తుకు రాలేదు. వ్రతం లేదు. పూజలేదు. కనీసం తలచుకోడం కూడా లేకపోవడం సాధుని పాపానికీ, సత్యదేవుల కోపానికి గురిచేసింది. దానితో చాల సంకటాల చేత గ్రస్తుడయ్యాడు. నర్మద దక్షిణ తీరంలో నున్న రాజమహల్లో ఒక నిస్తబ్ధరాత్రి దొంగతనం జరిగింది. అనేక ద్రవ్య నిధులతో బాటు ఒక ప్రత్యేకమైన పెద్ద ముత్యాలహారాన్ని కూడా అపహరించుకుపోయారు. చండశాసనుడైన మహారాజుగారు నేర పరిశోధకవిభాగం రాజ పురుషులను సమ్ముఖానికి పిలిపించుకొని ‘మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. ఆదొంగలను పట్టుకొని మన సొత్తును ముత్యాల హారంతో సహా తేకపోతే మీకు ఉద్యోగబాధ్యత నిర్లక్ష్య నేరం కింద మృత్యుదండన విధించబడుతుంది. రెండు దినాలు ముగిసేలోగా ఆ దొంగలూ, సొత్తూ నాముందుండాలి.’ అని గట్టిగా చెప్పాడు. రాజ పురుషులు సామాన్యులు కారు. కడు సమర్థులు. అయినా కూడా వారికి చోరులు గానీ, కనీసం దొంగతనానికి సంబంధించి ఒక చిన్న ఆధారంగానీ దొరకలేదు. చివరికి తిరిగి తిరిగి, దిమ్మట్టి వారంతా ఒకచోట చేరి ఒకరి వైఫల్యాన్నింకొకరు తెలుసుకొని ‘రాజుగారెలాగూ మనను చంపేస్తారు కదా! అలాగైతే మనకు ప్రేతయోని ప్రాప్తిస్తుంది. అదే మనను కనిపెంచిన తల్లి, దేవత ఈ నర్మదానది లో శివుని స్మరిస్తూ ప్రవేశించి మరణిస్తే, శివలోకం ప్రాప్తిస్తుంది’ అని నిశ్చయించుకున్న వారై నర్మదానదీ తీరానికి ‘శివాయ నమఓం’ అని పాడుకుంటూ చేరారు. అక్కడ వారికి మన వణిజుడు సాధు కనిపించాడు. అతని కంఠానికి అలంకారంగా అద్భుతమైన ముత్యాలహారముంది. వారు తమకి కావలసిన వస్తువూ, మనిషీ దొరికినందుకు, ప్రస్తుతానికి మరణం తప్పినందుకూ పరమానంద భరితులై వణిజునీ అతని అల్లునీ వారి ధనాదులతో బాటు రాజుగారి వద్దకు లాగుకుపోయారు. సత్యనారాయణస్వామి దయ తప్పినందువల్లనో యేమోగాని అన్నీ తెలిసిన ఆరాజు వీరిని విచారణ సరిగ్గా జరుపకుండానే చెఱసాల పాల్జేశాడు. వారి సంపదనంతటిని జప్తు చేయించాడు. ఖజానాలోకి జమకూడా చేయించేశాడు. వణిక్కులెంత గోల పెట్టినా ఎవరూ పట్టించుకోలేదు. వణిజుడు అల్లునితో, ‘బాబూ! నా ధనమంతా ఏమైపోయిందో యేమో! నాపత్నీ పుత్రీ ఎలావున్నారో కదా! నేనేదో ధర్మవిరుద్ధమైన భగవద్విపరీతమైన కృత్యాన్ని చేసివుంటాను. ఇది దానియొక్క ప్రభావమే.’ అంటూ వాపోయాడు. (ముందు ధనాన్నీ తరువాత పెళ్ళాం బిడ్డల్నీ తలచుకొన్నాడనే పురాణంలో వుంది). ఇలా చాలాకాలం గడిచింది.”

సత్యనారాయణ వ్రత కథలో ఐదవ అధ్యాయము పూర్తి