మహారాజా! ప్రాచీన కాలంలో నొకప్పుడు బ్రహ్మపుత్రుడు అమిత తేజస్వియగు అత్రిమహర్షికి పరమ సౌభాగ్యవతి, మహాపతివ్రతయగు అనసూయకీ విష్ణు స్వరూపుడూ, అమిత తేజస్వీ, మహాయోగీ ఐన దత్తదేవుడు జన్మించాడు. అతని మరోపేరు అనఘుడు. అతని భార్య పేరు నది. ఆమె లక్ష్మి అంశతో జన్మించింది. వారికి బ్రాహ్మణ గుణాలన్నిటి ఉత్తమ లక్షణాలతో ఎనమండుగురు పుత్రులు కలిగారు. అనఘుడు, నది వింద్య గిరిపై ఆశ్రమాన్ని నిర్మించుకొని ఎక్కువకాలం యోగాభ్యాసంలో గడుపుతుండేవారు. అదే సమయానికి జంభాసురుడను రాక్షసుడు దేవతలను గెలిచి వారిని సర్వవిధాలా పీడించసాగాడు. వారంతా పారిపోయి వచ్చి అత్రి తనయుడైన దత్తుని అనగా దత్తాత్రేయుని శరణుజొచ్చారు. ఆయన ఇంద్రాది దేవతలందరికీ తన యోగబలంతో రక్షణ నేర్పాటు చేసి తన ఆశ్రమంలోనే నిర్భయంగా నివసించేలా చేశాడు. వారు ప్రసన్నులై అక్కడే వున్నారు.
దైత్యులు దేవతలను వెంటాడుతూ దత్తాశ్రమ పరిసర ప్రాంతాలకు వచ్చారు. వారి కాయనపై అత్యంత క్రోధం జనించగా దైత్య సహజమైన ద్రోహబుద్ధితో దత్తుని పత్ని నదిని ఎత్తుకొని పోవడానికి ప్రయత్నించారు. లక్ష్మీ స్వరూపయైన ఆమెను హింసించి నెత్తిపైకి బలవంతాన ఎక్కించుకోగానే ఆపాపానికి వారంతా శ్రీ విహీనులూ, బలహీనులూ అయిపోయారు. ఈలోగా కనులు తెఱచిన దత్తదేవుని చూపు దైత్యులను సోకగానే వారు నేలపై పడిపోయి మరణించసాగారు. మిగతా దైత్యులిది గమనించి పారిపోతుండగా దేవతలు విజృంభించి పోరాడి(జంభుడనే పేరు చాలామంది దైత్యులకుంది. వారిలోనొక జంభాసురుడు మాత్రము మహా తపస్సంపన్నుడు. అతనిని అతి కష్టంమీద ఇంద్రుడు వధించాడు. నాటి నుండి దేవేంద్రుని ఈలోకం ‘జంభారి’ అని కీర్తిస్తోంది. ఆ జంభుని కధ బ్రహ్మాండ, మత్స్య, (47/72) విష్ణు (4/6/14) శ్రీమద్భాగవతాది పురాణాలలో కనిపిస్తుంది.) జంభునితో సహా రాక్షసులందరినీ చంపేశారు.
దేవతలు వారి వారి లోకాలకు మరలినాక దత్తాత్రేయుడు లోకకల్యాణానికై చేతులు పైకెత్తి కఠిన తపస్సు చేశాడు. యోగమార్గాన్నాశ్రయించి ధ్యాన సమాధి స్థితుడై వుండిపోయాడు. అలా మూడువేల సంవత్సరాలు గడిచాక ఒకనాడు హైహయ వంశ వర్ధనుడు మాహిష్మతి దేశాధిపతియగు కార్తవీర్యార్జునుడటుగా వచ్చి దత్తదేవుని తపస్సమాధిని చూసి అచ్చెరువొంది ఆకర్షితుడై ఆయనను అహోరాత్రాలు సేవించుకొంటూ అక్కడే వుండిపోయాడు. దత్తుడు కార్యవీర్యుని సేవలకు ప్రసన్నుడై అతని కోరికమేరకు నాలుగు వరాలిచ్చాడు. వెయ్యి చేతులు కలిమి, అధర్మం నుండి పుడమిని రక్షించి ధర్మబద్ధంగా యేలగల బలిమి, ఏ యుద్ధంలోనైనా అపరాజితునిగా నిలువగల పరాక్రమపు మేలిమి, భగవంతుడైన విష్ణుదేవుని చేతిలో మరణించే పేరిమి.
కౌంతేయా! మహాసిద్ధుడైన శ్రీ దత్తముని కార్తవీర్యునికి అష్టసిద్ధులనూ, చక్రవర్తి పదవినీ ప్రసాదించాడు. ధర్మబద్ధంగానే, సప్తద్వీప సమన్వితయైన మొత్తం వసుమతిని కార్త వీర్యార్జునుడు తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇదంతయునతని వేయి బాహువుల ప్రభావమే. అతడు యజ్ఞాలు చేసి అగ్నికుండం నుండి ధ్వజాలతో కూడిన రథాలను ఉత్పన్నం చేసేవాడు ఆ రథాలపై అంతటా కలయ దిరుగుతూ ఈ భూమిపై ఒకే సమయంలో పదివేల యజ్ఞాలు నిరంతరం చేయించగలుగుతుండేవాడు. ఈ యజ్ఞాల వేది, మండప, యూపాదులన్నీ బంగారుమయాలే. దక్షిణలు చాలా గొప్పగా ఇస్తుండేవాడు దేవతలు విమానాలలో బయలుదేరివచ్చి వాటిలోనే ఆకాశంలో కూర్చుని ఈయన చేస్తున్న యజ్ఞాలను వీక్షిస్తూ వాటి శోభను ఇనుమడింప జేస్తుండేవారు. నారదుడను పేరుగల గంధర్వుడొకడు ఈ యజ్ఞగాథలను ఇలా గానం చేస్తుండేవాడు: ‘కార్తవీర్యుని చరిత్రను పరిశీలిస్తూ వస్తే ప్రపంచంలో ఏ రాజూ ఏనాడూ ఇతనివలె యజ్ఞ, దాన, తపాలను చేయలేదని బోధ పడుతుంది. ఏడు ద్వీపాలలోనూ ఈయననుమించిన కత్తి, డాలు, విల్లమ్ముల ప్రయోక్త లేడు.’ తరగని సంపదతో, గ్లాని, క్రాంతి లేని రాజ్యాన్ని ధర్మపథంలో పాలించసాగాడు కార్తవీర్యుడు.
కార్తవీర్యార్జునుడీ నేలపై యాభైవేల సంవత్సరాలదాకా అఖండ శాసనకర్తగా నిలిచాడు. అతడు తన యోగబలం ద్వారా పశువులనూ పంటలనూ కూడా రక్షించుకొనగలిగేవాడు. సమయానుసారం, తానే మేఘంగా మారి వర్షించేవాడు. నేలపై రెండవ సూర్యునివలె ప్రకాశించేవాడు తన వేయి బాహువులనూ అడ్డుపెట్టి సముద్రతరంగాలను ఆపివేసి నాగలోకంలో కర్కోటకాది మహానాగులను జయించి అక్కడ కూడా నగరాన్ని నిర్మించాడు. సముద్రజలాలనే తన బాహువులతో శాసించగల ఈ అరుదైన నరుని చూచి పాతాళంలోని రాక్షసులు కూడా భయపడేవారు. ప్రపంచంలోని అందరు ధనుర్ధరులనూ అతడు గెలిచాడు. మహావీరుడు, తపస్సంపన్నుడు నగు రావణుడు కూడా అతనితో పొగరుగా ప్రవర్తించి అతని చేతిలో చిత్తుగా పరాజయం పాలై కారాగారం పాలు కూడా అయినాడు. అపుడు పులస్త్య మహర్షి వచ్చి కార్తవీర్యునికి చెప్పి మనుమని విడిపించుకు పోయాడు. తనను ఆకలిదప్పుల నుండి కాపాడుమంటూ చిత్రభాను రూపంలో వచ్చిన అగ్నిదేవునికి సప్తద్వీపయైన యావద్వసుంధరను దానమిచ్చి వేసి చరిత్రలోనే అతిగొప్పదానిగా నిలచిపోయాడు కార్తవీర్యుడు.
యోగాచార్యుడైన భగవాన్ దత్తాత్రేయు (అనఘుడు)ని ద్వారా ప్రాప్తమైన ఈ అనఘాష్టమీ వ్రతాన్ని కార్తవీర్యుడు భూలోకంపై పరమ ప్రాచుర్యంలోకి తెచ్చాడు. అఘం - అనగా పాపం మూడు ప్రకారాలుగా వుంటుంది. అవి కాయిక, వాచిక, మానసిక పాపాలు. ఈ వ్రతం ఈ మూడు విధాల పాపాలనూ నశింపజేస్తుంది. ఈ వ్రతం వల్ల అణిమ, మహిమ, ప్రాప్తి, ప్రకామ్య, లఘిమ, ఈశత్వ, వశిత్వ, సర్వకామావసాయిత అనగా - అష్టైశ్వర్యాలు - అలవోకగా అరచేతిలో పడతాయి.”
ధర్మజుని ప్రార్థనమేరకు ఈ వ్రతవిధిని శ్రీకృష్ణుడిలా వర్ణించనారంభించాడు:
“మార్గశిర కృష్ణ అష్టమినాడు ముందుగా కుశలతో స్త్రీ, పురుష ప్రతిమలను తయారు చేసి భూమిపై స్థాపించాలి. వాటిలో సౌమ్య, శాంతి స్వరూపయుక్తుడైన దత్తదేవునీ, నదినీ భావించుకొని ఈ లక్ష్మీనారాయణులను ఇలా స్తుతించాలి.
అతోదేవా అవంతునోయతో విష్ణుర్విచక్రమే ।
పృథివ్యాః సప్త ధామభిః ॥
ఇదం విష్ణుర్వి చక్రమే త్రేధాని దధేపదం
సమూహల మస్య పాంసురే॥
త్రీణి పదా వి చక్రమే విష్ణుర్గోపా అదాభ్యః ।
అతోధర్మాణి ధారయాన్ II
విష్ణోః కర్మాణి పశ్యతయతోవ్రతాణి పస్పశే ।
ఇంద్రస్య యుజ్యః సఖా ॥
తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః ।
దివీవ చక్షురాతతం ॥
తద్ విప్రాసోవిపన్యవో జాగృవాసః సమింధతే ।
విష్ణోర్యత్ పరమం పదం ॥ (ఋగ్వేదం 1/22/16 - 21)
పూజలో ఫలాలనూ, కందాలనూ, శృంగారిక సామగ్రినీ, రేగుపండ్లనూ, వివిధ ధాన్యాలనూ పుష్పాలనూ ఉపయోగించాలి. దీపాన్ని వెలిగించి, బ్రాహ్మణులకూ వ్రతిబంధు బాంధవులకూ భోజనాలు పెట్టాలి. ఈ ప్రకారంగా పూజ చేసేవారికి సర్వపాపాల నుండీ విముక్తి లభిస్తుంది. లక్ష్మీ ప్రాప్తిస్తుంది; విష్ణుదేవుడు ప్రసన్నుడౌతాడు.