4 - పరిహారవంశం - శూరవంశం

హే భృగుశ్రేష్ఠ! శౌనకా! అథర్వవేదవేత్తయైన పరిహారుడు బౌద్ధులందరి మీదా విజయాన్ని సాధించి సర్వశక్తిమయి దేవిని శ్రద్ధాపూర్వకంగా ఆరాధించాడు. ఆమె ప్రసన్నురాలై చిత్రకూట పర్వతంపై ఒకటిన్నర యోజనాల విస్తీర్ణంలో ఒక మహానగరాన్ని నిర్మించి అతనికి ప్రసాదించింది. దేవతలకు ప్రియమైన ఇచ్చోట ఒకప్పుడు కలి బంధింపబడ్డాడు. ఇప్పుడతడు ఆ నగరిని చూడడానికే భయపడతాడు. కాబట్టి ఆ నగరం ‘కలింజర’ నామంతో ఈ లోకంలో ప్రసిద్ధిచెందింది. పరిహారుడా నగరంలో నుండి పన్నెండేళ్ళు రాజ్యపాలనం చేశాడు. అతని పెద్దకొడుకు గౌరవర్మ కూడా తండ్రిలాగే పరిపాలన చేసి తన తమ్ముడైన ఘోరవర్మకి ప్రసన్నతాపూర్వకంగా కలింజర రాజ్యాన్నిచ్చేసి గౌడదేశాన్ని సంస్కరించి అక్కడ రాజధర్మాన్ని నిర్వర్తించాడు. గౌరవర్మ తరువాత అక్కడ అతని వంశం వారైన సుపర్ణుడు, రూపణుడు, కామవర్మ పరిపాలించారు. కామవర్మ కూతురైన భోగవతి విక్రముని ఇల్లాలు కాగా కొడుకు భోగవర్మ రాజయ్యాడు. అతని కొడుకు కాళీవర్మ. ఈయన మహాకాళి నుపాసించగా ఆ దేవి ప్రసన్నురాలై ప్రత్యక్షమై అనేక దివ్యపుష్పాలను వర్షించింది. అవన్నీ నేలపై రేఖలుగా మారి వాటినుండి ఒక సుందరనగరం ఉత్పన్నమైంది. అది కలికాతాపురీ (కలకత్తా) అను పేరుతో పృథ్విపై ప్రసిద్ధిచెందింది. కాళీవర్మ తరువాత ఆ వంశంలో వరుసగా కౌశికుడు, కాత్యాయనుడు, హేమవతుడు, శివవర్మ, భవవర్మ, రుద్రవర్మ రాజ్యపాలనం చేశారు. రుద్రవర్మ కొడుకు భోజవర్మ వనప్రదేశంలో భోజరాష్ట్రాన్నే నిర్మించాడు. అతని కొడుకు గవవర్మ. అతని తరువాత వరుసగా వింధ్యవర్మ, సుఖసేనుడు, బలాకుడు, లక్షణుడు, మాధవుడు, వేశవుడు, సురసేనుడు, నారాయణుడు, శాంతివర్మ రాజ్యం  చేశారు

శాంతివర్మ గంగా తీరంలో శాంతిపురమను పేరిట ఒక నగరాన్ని నిర్మించాడు. అతని పుత్రుడు నదీవర్మ, మనుమడు గంగాదత్తుడు. ఈ గంగాదత్తుడు మహాబలవంతుడు. ఇతడు గౌడ (ఢాకా) రాష్ట్రాన్నీ, నదీహాయను రమ్యమైన నగరాన్ని నెలకొల్పాడు. తన తపశ్శక్తితో ఒక విశేషజ్ఞుడైన విద్యాధరుని ఆహ్వానించి అతని ద్వారా వేదపరాయణపురిగా ‘నదీహా’ని మలచి సురక్షితం చేశాడు. అతడు ముప్పదివత్సరాలు పరిపాలించాడు. అతని నుండి ఈ రాజవంశం గంగా వంశంగా ప్రసిద్ధమైంది.

గంగాదత్తుని తనయుడైన శారంగదేవుడు మహాబలశాలి, విష్ణుభక్తుడు. అతడు పది సంవత్సరాలు రాజ్యాన్ని పాలించి గౌడదేశం పోయి విష్ణు ధ్యానం చేస్తూ ఆయనలో లీనమైపోయాడు. ఆ తరువాత పైతృకంగా గంగాదేవుడు, అనంగుడు, రాజేశ్వరుడు, నృసింహుడు, కలివర్మ రాజులైనారు. మహాబలశాలియైన కలివర్మ కొన్ని రాష్ట్రాలను, దేశాలను జయించి మొత్తం రాజ్యాన్ని మహావతీ అనే సుందర నగరాన్ని నిర్మించి అక్కడ నుండి పాలించాడు. అతని పుత్రుడు ధృతివర్మ, మనుమడు మహీపతి. ఇతడు జయచంద్రుని సూచన మేరకు ఉర్వీమాయా (ఉర్వీయా) అను ఒక ప్రసిద్ధ మహానగరాన్ని నిర్మించాడు. కురుక్షేత్ర యుద్ధంలో పోరాడినా వెనుకకు రాగలిగిన ఈ మహారాజు ఆ తరువాత పెద్ద రాజ్యాన్ని ఇరవైయేళ్ళదాకా పరిపాలించాడు.

పరిహారుని పుత్రుడు ఘోరవర్మ కలింజర్‌ను పరిపాలించాడు. అతని పుత్రుడే శార్దూలుడు. ఇతని గొప్పతనం వల్ల ఇతని తరువాతి రాజులందరూ శార్దూల వంశ క్షత్రియులుగా ప్రసిద్ధులయ్యారు. మహామాయ ప్రసాదంవల్ల వీరు బాగా వ్యాప్తి చెందారు.

సహెూద్దీనుని ద్వారా సముద్ధరింపబడిన రాజులందరిలో సుయోధనునిలో నున్న అంశలే వుండడం వల్ల కురుక్షేత్ర యుద్ధంలో వారంతా మరణించారు.