భవిష్య పురాణము

2 - 3 - గర్భాదానం నుండి యజ్ఞోపవీతం దాకా సంస్కారాలు సంక్షిప్త విధులు, అన్నప్రశంస, ధనవర్ధనుని కథ, హస్తోదకవిధి, ఆచమన విధి.

“మునీంద్రా! మీ కృపవలన జాత కర్మాది సంస్కారాలను తెలుసుకున్నాను. ఇప్పుడీ సంస్కారాల లక్షణాలనూ, వర్ణాశ్రమధర్మాలనూ మీనుండి వినాలని కోరు కుంటున్నాను.” అని అడిగాడు శతానీకుడు.

ఇలా చెప్పసాగాడు సుమంతు మునీంద్రుడు. “ద్విజులు అంటే రెండు మార్లు పుట్టినవారని అర్థం కదా! కాని వారు రెండుమార్లు పుట్టనవసరం లేదు. యజ్ఞోపవీతా నంతరమే వర్ణుడు ద్విజుడవుతాడు. ద్విజాతీయుల యొక్క బీజ - సంబంధి, గర్భ - సంబంధి దోషాలన్నీ గర్భాదాన, సీమంతోన్నయన, జాతకర్మ, అన్నప్రాశ్న, చూడాకర్మ, యజ్ఞోపవీత సంస్కారాల వల్ల పటాపంచలైపోతాయి. వేదాధ్యయన, వ్రత, హోమ, త్రయీ విద్యావ్రత, దేవర్షి - పితృ - తర్పణ, పుత్రోత్పాదన, పంచమహాయజ్ఞ, జ్యోతిష్టోమాది యజ్ఞాల ద్వారా ఈ శరీరం బ్రహ్మ - ప్రాప్తికి యోగ్యమవుతుంది. ఆ సంస్కారాలను గూర్చి సంక్షిప్తంగా చెప్తాను విను.

పురుషునికి బొడ్డుకోయడానికి ముందే జాతకర్మ సంస్కారం ప్రారంభింపబడుతుంది. వేదమంత్రాలను ఉచ్చరిస్తూ బంగారం, తేనె, నెయ్యి బాలకునికి నోటి యందుంచాలి. పదవరోజు గానీ, 12, 18 లేదా ముప్పదవ రోజు తిరగగానే తిథినీ ముహూర్తాన్నీ చూసుకొని శుభ నక్షత్రంలో నామకరణాన్ని చేయాలి. బ్రాహ్మణుని పేరులో మంగళ ముండాలి శివశర్మ వలె. క్షత్రియునికి బలవాచకముండాలి ఇంద్రవర్మలాగ. వైశ్యుని పేరు ధనయుక్తమై వుండాలి ధనవర్ధనుడులాగా... అలా శూద్రులకు భగవంతుని దాసులపేర్లు పెట్టాలి. స్త్రీలకిమాత్రం చాలా ఆలోచించి నామకరణం చెయ్యాలి. పేరును పలకడంలో కష్టముండకూడదు. క్రూరతా ఉండరాదు. స్పష్టంగానూ, మంచిదిగానూ వుండాలి. పేరు వినగానే మనసు ప్రసన్నత నొందాలి. మంగళసూచకమై ఆశీర్వాదయుక్తమై వుండాలి. యశోదాదేవి వలె చివర ‘ఆ’ గాని ‘ఇ’ గాని వుండాలి.

పుట్టిన తరువాత పన్నెండవరోజునగాని పదునాల్గవ నెలలోగాని బాలకుని ఇంటినుండి బయటకి తీసుకురావాలి. దీనిని నిష్క్రమణమంటారు.

మొదటి లేదా మూడవయేట పుట్టుజుత్తులు తీయించాలి. బ్రాహ్మణునికి ఎనిమిదవ సంవత్సరాన, క్షత్రియునికి పదకొండవ వర్షాన, వైశ్యునికి పన్నెండవయేట యజ్ఞోపవీత సంస్కారం జరగాలి (ఇది సామాన్యుల సంస్కార నియమం. రాజగురువులు, మహారాజులు, కోశాధిపతులు దీన్ని మరింత వేగవంతం చేస్తారు. బ్రహ్మతేజాన్ని కోరుకొనే బ్రహ్మణులు తమ బాలకునికి అయిదవయేట, బలసంపన్నత కోరే రాజులు ఆరవయేట, ధనకామనను కలిగి వైశ్యులు ఎనిమిదవ సంవత్సరంలో ఉపనయన సంస్కారం చేస్తారని చెప్పబడింది.).

పదహారేళ్ళ లోపల బ్రాహ్మణునికి, ఇరువది రెండు లోపల క్షత్రియునికి, ఇరవైనాలుగు లోపల వైశ్యునికి గాయత్రి(సావిత్రి)మంత్రాన్ని పొందే అధికార ముంటుంది. ఆ వయసుదాటితే వారు వ్రాత్యులనబడతారు. అపుడు మరల వ్రాత్యస్తోమమనే యజ్ఞం ద్వారా శుద్ధిచేస్తేగాని వారి శరీరం గాయత్రి మంత్రదీక్ష నొందుటకు యోగ్యము కానేరదు. వీరు వ్రాత్యదశలో నున్నంత కాలం వేదాది శాస్త్రాలు నేర్చుటకుగాని వివాహానికిగాని అర్హత వుండదు.

మూడువర్ణాల బ్రహ్మచారులు క్రమముగా కస్తూరి మృగచర్మము, రురు మృగచర్మము, గొఱ్ఱెచర్మము ఉత్తరీయాలుగా ధరించాలి. అలాగే జనుము, అవిసె, గొఱ్ఱెల నుండి తీసిన ఉన్నిని క్రమంగా ధరించాలి. మూంజి, మూర్వాసన, మేఖలలు ధరించాలి. అవి దొరకని పక్షంలో కుశ, అశ్మంతక, బల్వజ అను పేర్లుగల గడ్డితో చేసిన వడ్డాణాలని క్రమంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, బ్రహ్మచారులు ధరించాలి. ఈ మేఖల మూడు మడతలలో ఐదు ముడులతో శోభిల్లాలి. జందెములు క్రమముగా పత్తి, జనుప, గొఱ్ఱె ఉన్నులతో నేయబడాలి. దండములు బ్రాహ్మణునకైతే బిల్వ లేదా పలాశ లేదా ప్లక్ష (రావి) చెక్కతో చేయబడి ఆ వటువు శిరస్సుదాకా వచ్చేటంత వుండాలి. క్షత్రియులకి మర్రి, చండ్ర, లేదా పేము బెత్తముండాలి. వైశ్యునికి పైలవ, పీపల లేదా గులర దండం ముక్కుదాక వచ్చేలాగ వుండాలి. ఈ దండాలు సాపుగా, కన్నాలు లేకుండా, అందంగా చెక్కబడాలి.

యజ్ఞోపవీత సంస్కారంలో ఈ బ్రహ్మచారులు తమతమ ప్రత్యేక దండాలను ధరించి ముందు సూర్యనారాయణ మూర్తిని, తరువాత గురుదేవుని శాస్త్రోక్తంగా పూజించి భిక్షాటనకు బయలుదేరాలి.

ఆదిభిక్ష తల్లి వేయాలి. లేకుంటే అక్కగాని, మేనత్తగాని వెయ్యాలి. భిక్షని అడుగునపుడు బ్రాహ్మణవటువు “భవతి భిక్షాం మే దేహి” అనీ, క్షత్రియ వటువు “భిక్షాం భవతి మే దేహి” అనీ, వైశ్య వటువు “భిక్షాం దేహి మే భవతి” అనీ పలకాలి. భిక్షగా బంగారాన్ని, వెండినీ లేదా అన్నమునూ వేయవచ్చును. భిక్షాటనలో ఆ రోజు లభించిన ద్రవ్యాన్నంతటినీ బ్రహ్మచారి తన గురువుకి నివేదించి, ఆయనగారి ఆజ్ఞయైన పిమ్మట తూర్పువైపు తిరిగి ఆచమనంచేసి భోజనము చెయ్యాలి.

తూర్పువైపు తిరిగి భోజనంచేస్తే ఆయువు, దక్షిణంవైపైతే కీర్తి, పశ్చిమంవైపు చేస్తే ధనం, ఉత్తర ముఖంగా కూర్చోని భోజనం చేస్తే సత్యము(సత్యము అభివృద్ధి చెందడమనేది ఒకవరం. ఎల్లప్పుడూ సత్యాన్నే పలకాలనే ఋద్ధీ, పలికే ధైర్యమూ, దాని వలన శాపానుగ్రహ శక్తులు లభిస్తాయి.) అభివృద్ధి చెందుతాయి. ఏకాగ్రచిత్తంతో భోజనం(టీవీ చూస్తూనో, కబుర్లు చెబుతూనో తినకూడదు.)  చెయ్యాలి. ఉత్తమమైన అన్నాన్నే తినాలి. పిమ్మట ఆచమనం చేసి కళ్ళనీ, ముక్కునీ,’ చెవిని నీటితో ముట్టుకోవాలి. అన్నాన్ని ఎల్లపుడూ స్తుతిస్తూనే వుండాలి. అన్నాన్ని నిందించరాదు. అన్నమును దర్శించగానే సంతుష్టీ, ప్రసన్నతా చెందాలి. ఆనందంగా భోంచేయాలి. అన్నాన్ని పూజిస్తే బలమూ, తేజమూ అదనంగా వచ్చి చేరుతాయి. నిందిస్తే ఉన్నవి పోతాయి. ఎంగిలికూడు ఎవ్వరికీ దానము చెయ్యరాదు. స్వయంగా కూడా తినకూడదు. భోజనాన్ని పలువిడతలుగా చేయరాదు. కొంత తిని - ఒక గంట ఆగి - మళ్ళీ తిని అలా చేయరాదు. ఒకేసారి నిష్ఠగా కూర్చుని, సంతుష్టిగా భోజనం చేయాలి. కక్కుర్తి కొద్దీ ఒకే భోజనాన్ని దాచుకుంటూ పలుమార్లు తినేవాడు ధనవర్ధనుడనే వైశ్యునిలాగా, ఇహపరాలు రెంటికీ చెడతాడు”,

“మునీంద్రా! నేనా ధనవర్ధనుని కథను విస్తారంగా వినాలని కోరుతున్నాను.”

చెప్పాడు రాజేంద్రుడు చెప్పసాగాడు మునీంద్రుడు

“రాజా! ఎపుడో సత్యయుగంనాటి ఘటన ఇది. పుష్కరక్షేత్రంలో ధన, ధాన్యసంపన్నుడై ధనవర్ధనుడను పేరుగల వైశ్యుడొకడుండేవాడు. అతడొకరోజు గ్రీష్మ ఋతువులో మధ్యాహ్నం విధ్యుక్తంగా వైశ్వదేవ కర్మ నాచరించి పుత్ర, మిత్ర, బంధు, బాంధవులతో సహా భోజనం చేస్తుండగా ఆకస్మాత్తుగా బయటనుండి ఎవరో దీనంగా పిలుస్తున్నట్లయింది. అతడు వెంటనే దయ కలుగగా లేచిపోయి బయటకు పరుగిడి చూస్తే అక్కడెవరూ లేరు. పిలుపూ వినబడలేదు. లోనికి వచ్చి తాను వదిలిపెట్టి వెళ్ళిన అదే పాత్రలోని అదే అన్నాన్ని పద్ధతికి విరుద్ధంగా తినేశాడు. భోజనం కాగానే, అతడు మరణించాడు. మిగులు తిండి తిన్న అపరాధంవల్ల అతనికి సద్గతులేవీ ప్రాప్తించలేదు.

కాబట్టి ఒకసారి తిని వదిలిన అన్నాన్ని మళ్ళా తినకూడదు. అధిక భోజనమూ మంచిది కాదు. దాని వల్ల శరీరంలో అత్యధిక రసోత్పత్తి జరిగి ప్రతిశ్యామాది(ప్రతిశ్యామాదులనగా జలుబు, రొంప, జ్వరం, మందాగ్ని వంటివి.) అనేక రోగాలు పుట్టుకొస్తాయి. అజీర్ణరోగం బారిన పడ్డవాడు స్నానం, దానం, తపం, హోమం, తర్పణం, పూజ వంటి సత్కర్మలను మనసుపెట్టి చేయలేడు. అందువల్ల వాటి ఫలితం కూడ సక్రమంగా దక్కదు. అతిభోజనం వల్ల ఆయువు తగ్గిపోతుంది. తిండిపోతుకి సంఘంలో గౌరవం నశిస్తుంది. అంతమందు సద్గతులూ కలుగవు. భోజనంచేసి సరిగా మూతీ చేతులూ కడుక్కోకుండా బయటికి రావడం అశుచి. అది పాపము. భోజనాన్ని ఒక పవిత్ర కార్యంగా భావించి భక్తిగా శుద్ధిగా చేసేవారు ఇహంలో సుఖాన్నీ పరంలో సద్గతినీ పొందగలరు.”

“మునీశ్వరా! బ్రాహ్మణుడేయే కర్మలద్వారా పవిత్రుడు కాగలడు?” అని అడిగాడు శతానీకుడు.

“విధిపూర్వకంగా ఆచమనంచేసే బ్రాహ్మణుడు పవిత్రుడవుతాడు. అంతేకాక సత్కర్మలకు అధికారాన్నీ పొందగలుగుతాడు. ఆచమన విధి ఇలా: చేతులూ కాళ్ళూ శుభ్రంగా కడుక్కొని ఒక పవిత్ర స్థానంలో ఆసనం మీద తూర్పు లేదా ఉత్తరంవైపు ముఖాన్ని పెట్టి కూర్చోవాలి. కుడిచేతిని మోకాళ్ళకు మధ్యస్థంగా పెట్టి పిలక ముడివేసి వేడిగాని, నురగ గాని లేని చల్లని నిర్మలమైన నీటితో ఆచమనం చేయాలి. చాలా శ్రద్ధాభక్తులతో చెయ్యాలి. అంటే నిలబడిపోయిగాని, ఎవరితోనో మాట్లాడుతూగాని, అటూఇటూ చూస్తూగాని, త్వరత్వరగాగాని, మనసులో క్రోధం పెట్టుకొనిగాని ఆచమనం చెయ్యకూడదు.

ఓరాజా! బ్రాహ్మణుని కుడిచేతిలో 5 తీర్థాలుంటాయి. 1. దేవతీర్థం 2. పితృతీర్థం 3. బ్రాహ్మతీర్థం. 4. ప్రాజాపత్యతీర్థం 5. సౌమ్యతీర్థం. వీటిలో అంగుష్ఠమూలంలో బ్రాహ్మం, చిటికెన వేలి మూలంలో ప్రాజాపత్యం, వ్రేళ్ళచివరల్లో దేవం, చూపుడు - బొటన వ్రేళ్ళమధ్య పితృతీర్థం, అరచేతి మధ్యభాగంలో సౌమ్యతీర్థం వుంటాయి. ఏ తీర్థంలో ఏ పనిచేస్తే మంచిదో కూడా చెప్పబడింది.

దేవార్చన, దక్షిణలు దేవతీర్థంతో, తర్పణలు, పిండదానాది కర్మలు పితృ తీర్థంద్వారా, ఆచమనము బ్రహ్మతీర్థం నుండి, వివాహసమయంలో లాజహోమం, సోమపానం ప్రాజాపత్య సహాయాన, కమండల గ్రహణం, దధిప్రాశన సౌమ్యతీర్థంపై నుండి, ఉప స్పర్శన మరలబ్రాహ్మంతో చెయ్యడం సర్వశ్రేష్ఠము.

వ్రేళ్ళను కలిపివుంచి, ఏకాగ్రచిత్తంతో, సవ్వడి రాకుండా, పవిత్రజలంతో మూడుమార్లు ఆచమనం చేస్తే ఎంతటి మహాఫలముంటుందంటే దేవతలు ప్రసన్నలౌతారు. మొదటి ఆచమనానికి ఋగ్వేదదేవతలు, రెండవదానికి యజుర్వేదంపు వేల్పులు, మూడవ

ఆచమనానికి సామవేద(నిలింపులన్నా దేవతలే! వేదము మొదలగునవి సామాన్య గ్రంథాలు కావు. అవి ఎల్లప్పుడూ దేవతలచే పరివేష్టించబడి వుంటాయి. ఇక్కడ ఆ దేవతలానందిస్తారని అర్ధం.) నిలింపులు ప్రీతిచెందుతారు. ఆచమనజలం పెదవిని తాకగానే ఇతిహాస, పురాణాల అధిదేవతలు సంతృప్తినొందుతారు. ఆచమనజలాన్ని తలకి అంటించుకోగానే(అభిషేక ప్రియుడు శివుడు.) రుద్రుడానందిస్తాడు. పిలకను స్పృశిస్తే ఋషిగణాలు, కన్నుల కద్దుకోగానే సూర్యదేవుడు, ముక్కుకి తగిలిస్తే వాయుదేవుడు, భుజాలకు రాసుకొంటే అష్టదిక్పాలకులలో మిగిలినవారు ఆనందిస్తారు. ఆచమనజలాన్ని నాభికి, ప్రాణగ్రంథులకు అద్దితే సర్వదేవతలను ఆరాధించినట్లవుతుంది. ఆచమనం తరువాత కాళ్ళుకడుక్కుంటే విష్ణువుని పూజించిన ఫలితము, నేలపై జలాన్ని భక్తిగా జల్లితే వాసుకిని తలచిన పుణ్య ఫలితము అబ్బుతాయి.

ఈ సమయంలో బొటన, అనామిక వ్రేళ్ళతో ముక్కును, అంగుష్ఠ, చూపుడు వ్రేళ్ళతో కనులను, బొటన, చిటికెనవ్రేళ్ళతో చెవులను, అన్ని వ్రేళ్ళతో భుజాలను, తలను, మరల అంగుష్ఠంతో నాభిని స్పృశించాలి. అంగుష్ఠం అగ్నిరూపం. చూపుడు వాయురూపం. మధ్యమం ప్రజాపతిరూపం. అనామిక సూర్యరూపం. చిటికెన వ్రేలు ఇంద్ర రూపం.

ఈ రకంగా విధిగా శ్రద్ధాభక్తులతో ఆచమన నిర్వహణ చేసే బ్రాహ్మణుడు దేవతల ఆశీస్సుల వల్ల లోకపూజితుడు, తానే స్వయంగా సర్వదేవమయుడు కాగలడు.

మన హస్తగతాలైన బ్రాహ్మ, ప్రాజాపత్య, దేవతీర్థాలతోనే ఆచమనం చెయ్యాలి. పితృతీర్థాన్ని ఆచమన సేవలో వినియోగించరాదు. ఆచమన జలాన్ని హృదయానికి తాకించడం ద్వారా బ్రాహ్మణునీ, కంఠానికి తగిలించి క్షత్రియునీ, తాగించి వైశ్యునీ, శరీరంపై చిలకరించి శూద్రునీ శుద్ధిచేయవచ్చు.

యజ్ఞోపవీతాన్ని కుడిచేతి క్రిందినుండి ఎడమభజంవైపు ధరించడమే సవ్యం. ఈ ధారణని ఉపవీతీ అంటారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కుడిభజంపై ధరించడాన్ని అపసవ్యమనీ ప్రాచీనవీతీ అనీ అంటారు. రెండు భుజాలపైనా హారంలా ధరించడాన్ని నివీతీ అంటారు.

మేఖల, మృగచర్మం, యజ్ఞోపవీతం, దండం, కమండలువు - వీటిలో ఏది ముక్కలైనా దానిని నీటిలోకి విడచి వేసి మంత్రోచ్చారపూర్వకంగా కొత్త దానిని ధరించాలి. సవ్యరీతిలో జంధ్యాన్ని ధరించి సవ్యంగా ఆసీనుడై ఆచమనం చేసే బ్రాహ్మణుడు పవిత్రుడవుతాడు. అతని చేతిలోని రేఖలను గంగతో సమానమైన పవిత్రత గలవిగా చూడాలి. అతని వ్రేళ్ళలోని నరుకులు హిమాలయమంత పునీతాలు. అతని కుడిచేయి సర్వదేవమయము.

సవ్యంగా చేసే ఆచమనం స్వర్లోకప్రాప్తికరం.