204 - శర్కరాచలదానవిధి

మహారాజా! ఇపుడు సర్వోత్తమమైన శర్కరాచలదానాన్ని వర్ణిస్తాను. దీనివల్ల విష్ణు, శివ, సూర్యభగవానులు తృప్తులౌతారు. ఎనిమిదిభారాలు చక్కెరతో చేసే అచల దానముత్తమం. అంత లేని వారు అందులో సగం ఆ మాత్రమూ లేనివారు ఇందులో సగం భారంల చక్కెరను వాడవచ్చు. పేదలు ఒక భారం మరీ నిరుపేదలు అర్ధభారం చక్కెరను వినియోగించవచ్చును. శ్రద్ధాభక్తులు, దీక్షాసక్తులే ముఖ్యం.

ధాన్య శైలదానంలో వలెనే అన్నీ చేస్తూ, మందార, పారిజాత, కల్పవృక్షాల స్వర్ణ మూర్తులను అన్ని పర్వతాల పైనా స్థాపించాలి. అన్ని అచలాల తూర్పు, పడమటి ప్రక్కలలోనూ హరిచందనాన్ని పూసి వుంచాలి.

కదంబ వృక్షం క్రింద మందరాచలంపై మన్మథుని మూర్తినీ, జంబూవృక్షం క్రింద గంధమాదన శిఖరంపై విష్ణుదేవుని మూర్తినీ, విపులాచలంపై స్వర్ణ హంస మూర్తినీ వుంచాలి. దీనిని పూర్వాభిముఖంగానూ, గోవు మూర్తిని దక్షిణాభిముఖంగానూ వుంచాలి. మిగతా అంతా ధాన్యాచలం వలెనే. దానమంత్రాలిలా వుంటాయి.

సౌభాగ్యామృత సారోఽయం పరమః శర్కరాయుతః

యస్మదానందకారీ త్వం భవ శైలేంద్ర సర్వదా

అమృతం పిబతాం యేతు నిష్పేతుర్భువి శీకరాః

దేవానాం తత్సముత్థోఽసి పాహినః శర్కరాచల

మనోభవ ధనుర్మధ్యాదుద్భూతా శర్కరాయతః

తన్మయోఽసి మహాశైల పాహి సంసార సాగరాత్ (ఉత్తరపర్వం 204/10-13)

ఈ విధంగా శర్కరాచల దానం చేసినవారు సర్వపాప విముక్తులై శివలోకప్రాప్తి నొందుతారు. అక్కడ విష్ణుభగవానుని ఆజ్ఞతో ఒక విమానం లభిస్తుంది. వంద కల్పాల తరువాత భూమిపై మూడు జన్మలెత్తుతారు. దీర్ఘాయువులై, మహావీరులై, సప్త ద్వీపాలకు ఏలికలై మనుగడసాగిస్తారు.

మహారాజా! పర్వతాచల దానాలన్నిటిలో దాత మనస్సు ప్రశాంతంగా మత్సర రహితంగా వుండాలి. శక్త్యానుసారము వీలైనంతమందికి భోజనాలు పెట్టించాలి. గురువుగారి అనుమతితో తాను లవణరహిత భోజనాన్ని చేయాలి. అన్ని దానాలలోనూ సామగ్రిని దానం చేశాక దానిని బ్రాహ్మణుల ఇంటికి తానే స్వయంగా పంపించాలి.

మహారాజా! ఈ దశవిధ మహా దానాలను చూసి, సాయపడిన నిర్ధనులందరికీ ఇట్లే గొప్ప ఫలాలు ప్రాప్తిస్తాయి. ఈ మహిమలను విన్న వారికి పీడకలల భయాలతో పాటు సర్వదోషాలూ తొలగిపోతాయి’ అని చెప్పాడు శ్రీకృష్ణుడు.