168 - కామప్రద స్త్రీ వ్రతం

            మహారాజా! కార్తికమాసంలో శుక్ల కృష్ణ రెండు పక్షాలలోనూ షష్ఠినాడు ఏకభుక్తం. సప్తమినాడు ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని చేయాలి. క్షమ, అహింస, భోగవిసర్జన అనే నియమాలను పాటిస్తూ సంయతేంద్రియయై సూర్యదంపతులను పూజించాలి. కరవీర పుష్పాలతో, గుగ్గిల ధూపంతో, నేతితో సూర్యపూజ గావించాలి. ఆ తరువాత నెయ్యి, బెల్లాలతో వండిన వరి అన్నాన్ని సూర్యునికి నైవేద్యం పెట్టి తాను ఉపవాసానంతరం దానినే భుజించాలి. ఇలా చేసిన స్త్రీకి అన్ని కోరికలూ తీరుతాయి. దేహాంతమందు ఇంద్రనీల సమానమైన ప్రకాశంతో వెలిగే సార్వకాలిక విమానంలో అన్ని లోకాలలో తిరిగి సర్వభోగాలనూ అనుభవించి లక్ష సంవత్సరాలపాటు సూర్యలోకనివాసం, మరు జన్మలో కోరిన పతి లబ్ధి ఆమెకు సంప్రాప్తిస్తాయి.

            క్షమ, సత్యం, దయ, దానం, శౌచము, ఇంద్రియని గ్రహం, సూర్యపూజనం, అగ్నిహవనం, సంతోషం, అచైర్యవ్రతం ఈ పదీ అన్ని వ్రతాలకూ సామాన్యాంగాలు.