భవిష్య మహా పురాణము
49 - శర్కరా సప్తమీ వ్రత విధి
ధర్మరాజా! నీకిప్పుడొక సర్వపాప ప్రణాశినీ, ఆయురారోగ్యానంతైశ్వర్య వర్ధినీయగు వ్రతానుప్రదేశిస్తాను ఆలకించు. దీని పేరు శర్కరా సప్తమి వ్రతం. దీనిని వైశాఖ శుద్ధ సప్తమినాడు ప్రారంభించాలి. ఆరోజు ముందుగా నువ్వులు కలిపిన నీటితో స్నానంచేసి తెల్లని వస్త్రాలను ధరించి ఒక వేది నేర్పఱచి దానిపై కుంకుమతో నొక కర్ణికా సహితమైన అష్టదళ కమలాన్ని రచించాలి. సవిత్రేనమః అనే నామమంత్రాన్ని జపిస్తూ దానిపై గంధ, పుష్పాదులతో సూర్యపూజనం చేయాలి. తరువాత కమల మధ్యంలో నీటికుండనీ దానిపై చక్కెర నింపిన పాత్రనీ స్థాపించాలి. వాటిని రక్తవస్త్ర, శ్వేత మాలాదులతో అలంకరించి వాటి పక్కనే సువర్ణ శ్వేతాశ్వ ప్రతిమను పెట్టాలి. తరువాత సూర్యభగవానుని ఆవాహనం చేసి ఈ క్రింది మంత్రం ద్వారా ఆయనను పూజించాలి.
విశ్వేదేవమయోయస్మాద్ వేదవాదీతి పఠ్యతే ।
త్వమేవామృత సర్వస్వమతః పాహి సనాతన। (ఉత్తరపర్వం 49/5,6)
తరువాత సౌర సూక్తాన్ని జపించాలి. లేదా సౌర పురాణాన్నయినా వినాలి(సౌరపురాణమనగా భవిష్య లేదా సాంబపురాణమనియే. కొన్ని సౌర పురాణ నామంతో వస్తున్న గ్రంథాలు కావు. అవి శైవ పురాణాలు. ఇక సౌర సూక్తమనగా ఋగ్వేద ప్రథమ మండలంలోని 50వ సూక్తమే.). అష్టమి నాడు తెల్లవారగానే లేచి పనులు చూసుకొని స్నానం చేసి సూర్యదేవుని పూజించాలి. తరువాత పూజ సామగ్రినంతటినీ వేదవేత్తయైన ఒక బ్రాహ్మణున కొసగి పంచదార, నెయ్యి, పాయసాలతో యథాశక్తి భోజనం పెట్టాలి. ప్రతి స్వయంగా నూనె, ఉప్పులేని భోజనాన్ని మౌనంగా తినాలి. ఇలా ప్రతి నెలా వ్రతమాచరించి సంవత్సరం పూర్తికాగానే ప్రతి శక్తి మేరకు, ఉత్తమశయ్య, పాలిచ్చే ఆవు, పంచదార కుండ, సర్వగృహెూపకరణాలతో నిండిన ఇల్లు, ఒక వెయ్యిగాని వందగాని లేదా అయిదు బంగారు కాసులతో చేయబడిన అశ్వ ప్రతిమలను బ్రాహ్మణునకు దానం చేయాలి. సూర్యభగవానుడమృత పానం చేస్తు న్నప్పుడాయన నోటినుండి జారిపడిన అమృత బిందువు నుండి, మానవ కల్యాణార్థం శాలి ధాన్యము, పెసలు, చెఱకు పుట్టినవి. చెఱకు నుండి వచ్చిన పంచదార కూడా ఈ కారణంగానే ఉత్తమ పూజా ద్రవ్యమైనది. ఈ వ్రతం చేయడంవల్ల సంతాన వృద్ధి, ఉపద్రవ నాశనం జరుగుతాయి. దేహాంతంలో ఒక కల్పం దాకా స్వర్గలోక నివాసమూ, తదనంతరం మోక్ష ప్రాప్తీ కలుగుతాయి.