భవిష్య పురాణము

161 - కపిల గోదాన మహిమ

యుధిష్ఠిర మహారాజు ప్రార్థనమేరకు జగద్గురువు సర్వజ్ఞుడునగు శ్రీకృష్ణుడీ మహర్దాన మాహాత్మ్యాన్ని వర్ణించసాగాడు ఇలా:

“ధర్మజా! ఒకప్పుడీ మహిమను వరాహస్వామి ధరణీదేవికి వినిపించాడు. కపిలదానం సర్వపాపనాశకరం. పూర్వకాలంలో బ్రహ్మదేవుడు యజ్ఞాల్లో అగ్నిహోత్రం అవసరాల కోసం సంపూర్ణతేజాల సారాన్నొకచోట చేర్చి దానినుండి కపిల గోవును సృష్టించాడు. పరమ పూజ్యమయియైన కపిల గోవు పవిత్రులను మరింత పవిత్రం చేస్తుంది. తపస్సు ఈ గోవు యొక్క మరో రూపమే. వ్రతాలలోనిది ఉత్తమ వ్రతం, దానాలలోనిది ఉత్తమ దానం, నిధులలో కపిల గోవు అక్షయనిధి. లోకంలో జరిగే నిత్యనైమిత్తిక, ఉదయ, సంధ్యా యజ్ఞాలన్నీ అగ్నిహోత్రంలో కపిల గోవు నేతినీ పాలనూ, పెరుగునూ వాడడం ద్వారానే సంపన్నమవుతున్నాయి. తెల్లవారగానే కపిలగోవు తలపైనుండి గాని మెడ క్రింది నుండి గాని జారే జలానికి శ్రద్ధాభక్తులతో శిరస్సు వంచి నమస్కారం చేసేవారు పవిత్రులౌతారు. తత్ క్షణమే వారి పాపాలన్నీ భస్మమైపోతాయి. తెల్లవారి లేవగానే కపిల గోవుకి ప్రదక్షిణ చేస్తే సంపూర్ణ పృథివికి ప్రదక్షిణ చేసిన పుణ్యం వస్తుంది. పదిజన్మల పాపాలు దగ్ధమై పోతాయి. పవిత్ర వ్రతాచరణంలో గోమూత్రం కలిపిన జలస్నానం విధాయకం. గోమూత్రం కూడా పాపనాశకరమే. ఒక వేయి గోవులను దానం చేస్తే వచ్చే ఫలం ఒక్క కపిల గోవును దానం చేస్తే వస్తుంది. గోవును ప్రాణ సమానంగా రక్షించుకోవాలి. దాని ఉత్పత్తులలో దేనినీ అలక్ష్యంగాని అపవిత్రంగాని చేయరాదు. గోసేవ ధర్మాలలో కెల్ల శ్రేష్ఠధర్మము. గోచర భూమిని దానం చేసిన వానికి దివ్యలోక ప్రాప్తి కలుగుతుంది.

కపిల గోవును దానం చేసిన శ్రోత్రియ బ్రాహ్మణుడు అప్సరలచే అలంకృతమైన దివ్య విమానాన్నెక్కి స్వర్గానికి వెళతాడు. కపిల గోవు దానాల్లో రకాలను స్వయంగా బ్రహ్మదేవుడే ప్రతిపాదించాడు. శ్రోత్రియుడు, ధనహీనుడు, సదాచారి, అగ్నిహోత్రియగు బ్రాహ్మణునికి ఒక్క గోవును (కపిలను) దానం చేసినవాడు సర్వపాప విముక్తుడవుతాడు.

ప్రసవిస్తున్న గోవును, దూడ ముఖంపైకి వచ్చి ఇంకా మిగతా శరీరమంతా లోపల వున్నప్పుడే దానం చేసినవాడు బ్రహ్మవాదులచే సుపూజితుడై, ఆ ధేనువుకీ దాని దూడకీ కలిపి ఎన్నిరోమాలున్నాయో, అన్ని కోట్ల సంవత్సరాలు బ్రహ్మలోకంలో నివాసముంటాడు. ఎందుకంటే ఆ సమయంలో ఆ గోవును ఉభయముఖి అంటారు. అది సంపూర్ణ భూగోళంతో సమానం. అంతటి గొప్ప దానాన్నిచ్చినవానికిక ఎదురేముంది? వాని పితరులతో సహా ప్రసన్నతా పూర్వకంగా బ్రహ్మలోక నివాసం చేసి తరువాత విష్ణు భగవానుని పరమ ధామాన్ని చేరుకుంటాడు.

బ్రాహ్మణ ధనాన్నపహరించే వాడు, గోఘాతి, గర్భపాతం చేసేవాడు, మోసగాడు, వేద నిందకుడు, నాస్తికుడు, బ్రాహ్మణ నిందకుడు, మంచిపనుల్లో కూడా తప్పులు వెదికే రంధ్రాన్వేషకుడూ పరమ పాపాత్ములుగా పరిగణింపబడతారు. అంత ఘోరపాపి కూడా స్వర్ణ సహితంగా ఉభయముఖియైన కపిల గోవును దానం చేస్తే వాని పాపాలన్నీ నశించి పుణ్యుడవుతాడు. ఈ గోదానం చేసినవారు ఆ రోజంతా పాయసాన్నీ పాలనూ మాత్రమే స్వీకరించాలి.

ఈ గోదాన విధాన అధ్యాయాన్ని తెల్లవారగానే ప్రశాంత చిత్తుడై మూడుమార్లు చదివినవానికి ఆ సంవత్సరంలో చేసిన పాపాలన్నీ ఆ క్షణంలోనే నశిస్తాయి. దీనిని ఇతరులకు చదివి వినిపించిన బుద్ధిమంతుడైన పురుషునికి హృదయసంస్కారం పెరిగి పితృదేవతలు వానిపట్ల ప్రసన్నులవుతారు.