భవిష్య పురాణము

180 - గజరథ - అశ్వరథ దానవిధి

“భగవన్! తెలిసో తెలియకో అధర్మంచేసి దానికి భయపడుతున్నవారున్నారు. గ్రహపీడచే సంతప్తులూ, పీడకలలచే మనసు చెడినవారూ ఉన్నారు. ఇలాటి వారికి సుఖాన్నీ, ఐహిక పారలౌకిక మనోరథాల్నీ ఇవ్వగలిగే వ్రతాన్ని గాని విశిష్ట దానాన్ని గాని వినగోరుతున్నాను” అన్నాడు ధర్మరాజు.

“శుక్రాచార్యుడొకప్పుడు బలి చక్రవర్తికి గజరథాశ్వరథదానాన్ని ఉపదేశించాడు. దానినే నీవడిగిన దానికి బదులుగా వర్ణిస్తాను. సామాన్యులు గోదానాన్ని చేసినట్లే రాజులు, మంత్రులు, (శ్రీ కృష్ణుని కాలంనాటికి ధనికులైన వైశ్యులుండేవారు. పారిశ్రామిక సామ్రాజ్యాలూ వాటికి అంతర్జాతీయ శాఖలూ, వాటికి సామంత రాజులూ, సమ్రాట్టులూ వేరే పేర్లతో, పదవులతో, హోదాలతో ఇప్పుడేర్పడ్డారు. వీరు పాతకాలపు రాజులకంటే ధనం, అధికారం గలవారు. ఏ వ్రతాన్నయినా, దానాన్నయినా వీరు చేయగలరు.) పరిశ్రమ అధినేతలు ఈ దానాన్ని చేయాలి. అన్ని పాపాలూ, గ్రహపీడలూ, భయంకర ఆధి వ్యాధులూ ఈ దానం వల్ల పూర్తిగా నశించిపోతాయి.

కార్తిక పూర్ణిమ, అయన సంక్రాంతి, చంద్ర సూర్యగ్రహణాలు, విషువయోగం, సూర్య సంక్రాంతులు - ఈ దానానికి ప్రశస్తాలు. కఱ్ఱతో నొక రథాన్ని తయారు చేయించి దానిని బంగారంతో అలంకరించాలి. రథాంగాలన్నీ సుందరంగా నిర్దిష్ట ప్రమాణాలలో వుండాలి. స్వర్ణ ధ్వజాన్ని కట్టి నలుపు తెలుపు జండాలనెగుర వేయాలి. పుష్పమాలలతో అలంకరించాలి. దీనిని ఒక శుభదినాన నదీతటంలోగాని గోశాలలో గాని దాత గృహాంగణంలో గాని ఒక శ్రేష్ఠమైన వేదిపై వేదవిద్య, పురాణజ్ఞాతయైన విద్వాంసుడైన బ్రాహ్మణునిచే స్థాపింపజేయాలి. రథమధ్యంలో బ్రహ్మను స్థాపించి ఓంకారంతో ఆయనను పూజించాలి. ఉత్తరంలో విష్ణువును స్థాపించి పురుష సూక్తంతోనూ, దక్షిణంలో మహాశివుని స్థాపించి రుద్రసూక్తంతోనూ పూజించాలి. నవగ్రహాలను యధావిధిగా పూజించి శంఖ, భేరీ మృదంగ, బ్రహ్మఘోషలతో ఉత్సవంచేయించాలి.

ఆగ్నేయంలోనొక హస్తప్రమాణంలో కుండాన్నేర్పాటు చేసి విభిన్న వైదిక శాఖల అధ్యేతలైన బ్రాహ్మణులను పూజించాలి. నలుగురు లేదా ఎనమండుగురు బ్రాహ్మణులనూ ఒక ఆచార్యునీ వరించి తెచ్చుకోవాలి. నువ్వులతో, నేతితో హపనం చేయాలి. బ్రాహ్మణులతో కలిసి యజమాని యజ్ఞకార్యాన్ని సంపన్నం చేసి రెండుశ్రేష్ఠమైన ఏనుగులను, శుభ లక్షణాలున్న వాటిని బంగారం, ముత్యాలమాలలతో అలంకరించి అన్ని వస్తువులూ పెట్టి రథానికి అమర్చాలి. రథంపై ధనుర్బాణములు, కవచాది సర్వాయుధాలనూ పెట్టి ఒక బ్రాహ్మణుని సర్వాలంకార భూషితుని చేసి రథంపై కూర్చోబెట్టాలి. తరువాత శ్వేత వస్త్రధారియై యజమానుడు వచ్చి రథానికి ప్రదక్షిణ చేసి పుష్పాంజలిబద్ధుడై రథాన్ని యజ్ఞపురుషుడైన విష్ణువుగా అందులోని బ్రాహ్మణుని పరమశివునిగా భావించుకొని ప్రదక్షిణ చేసి ఇలా మంత్ర ప్రార్థన చేయాలి:

కుముదై రావణౌ పద్మః పుష్పదంతోఽథ వామనః ।

సుప్రతీకోంఽజనః సార్వభౌమోఽష్టౌ దేవయోనయః!!

తేషాం వంశ ప్రసూతౌ తు బలరూప సమన్వితౌ ॥

తద్యుక్త రథ దానేన మమ స్యాతాం వరప్రదౌ ॥

రథోఽయం యజ్ఞ పురుషో బ్రాహ్మణోఽత్ర శివఃస్వయం

మమే భరథ దానేన ప్రీయేతాం శివకేశవౌ ॥ (ఉత్తరపర్వం 180/29-31)

ఇలా చెప్పి ఆ రథంలోని బ్రాహ్మణునికి మరల ప్రదక్షిణ చేసి ఆ రథాన్ని మొత్తంగా ఆయనకు దానమిచ్చి వేసి రథాన్ని ఆ భూదేవుని ద్వారం దాకా తీసుకుపోయి వెనక్కి వచ్చెయ్యాలి. వికలాంగులకు బ్రహ్మండమైన భోజనాలు పెట్టి తృప్తిపఱచి గోదానం చెయ్యాలి.

మహారాజా! ఇదే విధంగా ఏనుగులకు బదులు రెండు సర్వశుభ లక్షణయుక్తాలైన గుఱ్ఱాలను రథానికి అమర్చి చేసే దానం అశ్వరథదానం అవుతుంది. ఇందులో ఈ క్రింది మంత్రంతో ప్రార్థన చేసి దానమివ్వాలి.

నమోఽస్తుతే వేదతురంగమాయ

త్రయీమయాయ త్రిగుణాత్మకాయ

సుదుర్గమార్గే సుఖయాన పాత్రే

నమోఽస్తుతే వాజి ధరాయ నిత్యం ॥

రథోఽయం సవితా సాక్షాద్ వేదేశ్చామీ తురంగమాః

అరుణోబ్రాహ్మణశ్చాయం ప్రయచ్ఛంతు సుఖంమమ ॥ (ఉత్తరపర్వం 180/40, 41)

రథాన్ని సాక్షాత్తూ సూర్యభగవానునిగా భావించుకొని పై ప్రార్థనను చేయాలి. తరువాత దాన్ని బ్రాహ్మణునింట విడిచిరావాలి. ఈ దానాలను చేసినవారు పాపవిముక్తులై రోగాలు రాకుండా జీవించి సూర్యసమాన తేజస్సు గల రథంపై స్వర్గలోకాన్ని చేరి వంద మన్వంతరాల కాలంపాటు అన్ని భోగాలనూ అనుభవించి మరల భూలోకంలో జన్మించ వలసి వచ్చినపుడు పుత్రపౌత్ర సమన్వితులై, చిరంజీవులై, అతిథి సేవకులూ పరమ ధార్మికులునైన రాజులుగా పుడతారు”.