భవిష్య పురాణము

31 - పాణిని కథ

            “భగవన్ సూతమహర్షీ! సర్వతీర్థదానాది ధర్మ సాధనలలోకి ఉత్తమమైనదేది? దేనినాశ్రయిస్తే మనుజులు క్లేశసాగరాన్ని తరించి ముక్తిని పొందగలరు? దయచేసి ఈ విషయంలో మా అజ్ఞానాన్ని దూరం చేయండి” అడిగారు మహర్షులు. చెప్పసాగాడు సూతమహర్షి

“పితృశర్మ మనుమడు పాణిని ఒకనాడు కణాద శ్రేష్ఠుని శాస్త్రజ్ఞ శిష్యులతోడి వాదనలో. పరాజయం పొంది ఆవూరిలో వుండడానికి సిగ్గుపడిపోయి తీర్థాటన నెపంతో వెడలిపోయాడు. తన దారిలో తగిలిన అన్ని తీర్థాలలో స్నానంచేస్తూ దేవతలకూ, పితరులకూ తర్పణలిస్తూ పోతూ కేదారక్షేత్రం చేరాడు. అక్కడ తృప్తికరంగా జలాన్ని సేవించి శివధ్యాన తత్పరుడై వుండిపోయాడు. ఆకలి వేసినట్లనిపిస్తే కనిపించిన ఆకులు నోట్లో వేసుకొని నీరైనా ముట్టుకోకుండా ఒక వారంరోజులు శివధ్యానం చేశాడు. వారాంతంలో సంతృప్తికరంగా నీటిని త్రాగి మరల ధ్యానం లోకి వెళ్ళిపోయాడు. ఈమారు ఆకులను కూడా విసర్జించి నీరు మాత్రమే స్వీకరిస్తూ పదిరోజులు ధ్యానంలో గడిపాడు. ఆ తరువాత ఆ నీటిని కూడా త్యజించి మరో పదిరోజులపాటు శివధ్యానంలో ఉండి పోయాడు. చివరికి ఇరవై యెనిమిదవ రోజు శివుడు సాక్షాత్కరించి ‘భక్తా వరం కోరుకో’ అన్నాడు. పరమశివుని వాణిని వినగానే శరీరం గగుర్పొడిచి కనులు తెరిచాడు పాణిని. సర్వేశుడు, సర్వలింగేశుడు, గిరిజావల్లభుడునైన ఆయన అమృత స్వరూపాన్ని వీక్షించి అప్రయత్నంగా, కనులనుండి అశ్రువులు జారుతుండగా ఇలా శివుని స్తుతించాడు పాణిని.

నమో రుద్రాయ మహతే సర్వేశాయ హితైషిణే

 నందీసంస్థాయ దేవాయ విద్యాభయకరాయచ

పాపాంతకాయ భర్గాయ నమోఽనంతాయ వేధసే

నమో మాయా హరేశాయ నమస్తే లోకశంకర (ప్రతిసర్గపర్వం. 2/31/7,8)

‘దేవేశా! నాకు మూలవిద్యనూ, పరమశాస్త్రజ్ఞానాన్నీ ప్రదానంచేయండి.’ అని కోరుకున్నాడు పాణిని. అపుడు మహాదేవుడు పరమప్రసన్నుడై ‘అఇఉణ్’ ఆది మంగళకరములైన, సర్వవర్ణమయ సూత్రాలను అతనికిచ్చాడు. ‘జ్ఞానసరోవరంలో దిగి సత్యజలంలో శ్రద్ధగా స్నానం చేస్తే రాగద్వేషమలం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. కడుక్కుపోతుంది. ఆ మానసతీర్థాన్ని అవగాహన చేసుకున్ననాడే (అవగాహన అంటే స్నానమని కూడా అర్థముంది) అన్ని తీర్ధస్నానాల అన్ని విద్యాశాలల అవగాహనల ఫలం పూర్తిగా దక్కుతుంది. బ్రహ్మని సాక్షాత్కారం చేసుకోగలిగే శక్తి విద్యకుంటుంది. ఈమానస జ్ఞానమనే సర్వోత్తమ తీర్థాన్ని నీకు నేను ప్రసాదిస్తున్నాను. ఓ పాణినీ నీజన్మ సఫలమై చరిత్రలో నిలిచిపోతావు.’ అని ఆశీర్వదించి పరమశివుడంతార్ధానం చెందాడు. పాణిని సంతోషంగా ఇల్లు చేరాడు. సంస్కృతభాషకొక సమగ్రమైన శాశ్వతమైన వ్యాకరణాన్ని, సూత్రపాఠ, ధాతుపాఠ, గణపాఠ, లింగసూత్ర - రూపభాగాలలో నిర్మించి పరమపదాన్ని చేరుకొని ఈనాటికీ పూజలందుకుంటున్నాడు పాణిని (వ్యాకరణవేత్తలైన పాశ్చాత్యభాషా పండితుల చేత కూడా) ఓ భార్గవశ్రేష్ఠా! శౌనకా! నీవుకూడా మహాపండితుడవు. సద్గ్రంధకర్తవు. మనోయజ్ఞాన తీర్థమంటే నీకు తెలిసే వుంటుంది. కాబట్టి జనులకు ఆ ‘అవగాహన’ ను కల్పించు. సర్వోత్తమ తీర్థమైన గంగయే దానినుండి పుట్టింది. గంగకన్న గొప్పతీర్థం ఇప్పటికి లేదు. ఇకముందు వుండదు.