165 - సువర్ణరచిత భూదానవిధి

(164వ అధ్యాయమైన భూదాన విధి ఈ పురాణంలో ఇదివఱకే వివరింపబడింది.)

“దానం చేయడానికి అందరి వద్దా, మహానగరాల్లోనూ భూమి వుండకపోవచ్చు కదా! కాబట్టి భూమిదాన యజ్ఞానికి సమాన ఫలదాయకమైన మరొక దానవిధిని ఉపదేశించండి పరంధామా!” అని ధర్మజుడు ప్రార్థించగా శ్రీకృష్ణుడు ధర్మజుని సకల జనుల సౌఖ్యనిష్ఠకు సంతసించి ఇలా ఉపదేశించాడు:

“మహారాజా! సువర్ణంతో భూమండలాన్ని నిర్మించి నదులనూ పర్వతాలనూ దానిపై రేఖలద్వారా గుర్తించి దానమివ్వడంవల్ల భూమండలాన్ని దానం చేసిన పుణ్యం దక్కుతుంది. పాపక్షయాన్నీ యశప్రాప్తినీ ఈ దాన ఫలాలుగా చెప్తారు.

సూర్యచంద్ర గ్రహణ దినాల్లో దాని జన్మ నక్షత్రంలో (దాని అనగా దానమిచ్చు వ్యక్తి), విషువయోగ దినాల్లో, యుగాది తిథుల్లో, అయన సంక్రాంతులలో ఈ దానాన్నివ్వ వచ్చును. ఒక వంద(పలం = 17 ½ గ్రాములు) పలంల నుండి కనీసం అయిదు పలంల బరువుతో శక్త్యనుసారం బంగారంతో జంబూ ద్వీపం ఆకారంలో ప్రతిమను తయారుచేయించాలి. దాని మధ్యలో మేరు పర్వతాన్నీ యథాస్థానాల్లో ఇతర పర్వతాలనీ గీతలతో గుర్తించాలి. దీనిని పృథ్విగా భావించుకొని దానికి ఎనిమిది దిక్కులలో లోకపాలకులనూ మధ్యలో త్రిమూర్తులనూ రేఖా చిత్రాలతో సూచించాలి. రత్నాలతో, ఇతర మణులతో అలంకరించాలి. ఇరువది యొక్క హస్తాల పొడవు వెడల్పులతో నొక మండపాన్ని నిర్మించి దానికి నాలుగు ద్వారాలనూ వాటికి తోరణాలనూ ఏర్పాటు చేసి మధ్యలో నాలుగు హస్తాల చోటులో నొక వేదిని నిర్మించాలి. ఈశాన్యం వైపు ఆ వేదిపై దేవతలను ప్రతిష్ఠించి ఆగ్నేయం వైపు కుండాన్ని పెట్టాలి. పతాకలతో మండపాన్ని అలంకరించాలి. లోకపాలకూ, గ్రహాలకూ షోడశోపచారాలతో పూజలను చేసి బ్రాహ్మణులచేత హవనాన్ని చేయించాలి. బ్రాహ్మణ వర్గాల వేదఘోష కొనసాగుతుండగా మంగళవాద్యాలు మార్మోగుతుండగా ఆ ప్రతిమను తెచ్చి తిలలు పరచిన వేదిపై స్థాపించాలి తరువాత దానిని నలువైపులా పదునెనిమిది ప్రకారాల అన్నాలనూ, లవణాది రసాలతో, జలంతో నించిన ఎనిమిది మాంగళిక కలశలనూ స్థాపించాలి. వాటిని పట్టువస్త్రాలతో, ఫలాలతో, చందనాదులతో అలంకరించాలి. ఈ విధంగా అధివాసన పూర్వకంగా పృథ్వి యొక్క అన్ని పనులనూ చేసి దాని స్వయంగా తెల్లబట్టలను వేసుకొని పూలమాలను ధరించి తెల్లని ఆభరణాలను ధరించి చేతులు జోడించి వాటిమధ్య పూలను పట్టుకొని మండపానికి ప్రదక్షిణం చేసి పుణ్యకాలం రాగానే ఈ క్రింది మంత్రాలను ఉచ్చరించాలి.

నమస్తే సర్వదేవానాం త్వమేవ భవనం యతః

ధాత్రీ త్వమస్తి భూతానామతః పాహివసుంధరే॥

వసుధారయసే యస్మాత్ సర్వసౌఖ్యప్రదాయకం

వసుంధరాతతోజాతా తస్మాత్ పాహి భయాదలం

చతుర్ముఖోఽపినో గచ్ఛేద్య స్మాదంతం తవాచలే!

అనంతాయై నమస్తుభ్యం పాహి సంసార కర్దమాత్

త్వమేవ లక్ష్మీర్గోవిందే శివే గౌరీతి సంస్థితా।

గాయత్రీ బ్రాహ్మణః పార్శ్వే జ్యోత్స్నా చంద్రేరవౌ ప్రభా॥

బుద్ధిర్బృహస్పతౌఖ్యాతా మేధామునిషు సంస్థితా।

విశ్వం వ్యాప్యస్థితా యస్మాత్‌తతో విశ్వంభరా మతా॥

ధృతిః క్షితిః క్షమాక్షోణీ పృథివీ వసుధా మహీ॥

ఏతాభిర్మూర్తిభిః పాహిదేవి సంసార సాగరాత్ ॥ (ఉత్తరపర్వం 165/21-26)

తరువాత ఆ పృథివీ మూర్తిని బ్రాహ్మణులకు దానమివ్వాలి. ముందుగా అందులో సగాన్ని గాని నాలుగోవంతును గాని గురుదేవునికి సమర్పించి మిగతా దాన్ని ఇతర బ్రాహ్మణులకు నివేదించాలి. ఈ ప్రకారం దానమిచ్చిన వానికి వైష్ణవ పదం లభిస్తుంది. చిరుగజ్జెలను మోగించుకుంటూ సూర్య సమాన తేజస్సుతో వెలుగులీనుతున్న విమానం వచ్చి, అతని దేహాంతంలో, అతనిని వైకుంఠానికి గొనిపోతుంది. అతనక్కడ మూడు కల్పాలబాటు నివసించి మరల భూలోకంలో పుట్టవలసిన వచ్చినపుడు ధార్మికుడైన చక్రవర్తిగా పుడతాడు.