“మహాత్మా! వ్రతోపవాస, దాన ధర్మాదులలో నియమాలు పూర్తిగా పాటించకుండా ఏదో ఒకటి తగ్గితే, తగ్గిస్తే ఏలాటి ఫలముంటుంది.
“ఫలంలో కూడా కోత పడుతుంది. రాజ్యం చేతికి వచ్చి ఖజానా ఖాళీ కావచ్చు, మంచి రూపం వుండీ ఒక కన్నులేక పోవచ్చు, కాలు ఒకటే వుండవచ్చు. ఇలా ఎన్నయినా, ఏవయినా ధర్మవైకల్యం వల్ల జరుగుతుంటాయి. కాబట్టి యజ్ఞాలలో, వ్రతాలలో, ఇతర ధర్మకృత్యాలలో ఎట్టి కార్య వైకల్యమూ కూడదు.”
“పరంధామా! పొరపాటు వల్లో గ్రహపాటుననో అటువంటి వైకల్యాలు కలిగితే ఫలంలో ఆ వైకల్య నివారణార్థం ఏం చేయాలి?”
కుంతీనందనుడడిగాడు, శ్రీకృష్ణుడు చెప్పసాగాడు.
“అఖండ ద్వాదశి వ్రతాన్ని చేస్తే ధర్మవైకల్యాలు దూరమవుతాయి. అదెలా చేయాలంటే మార్గశిర శుద్ధ ద్వాదశినాడు స్నానంచేసి జనార్దనుని భక్తిగా పూజించి ఉపవాసముండి ఆ రోజంతా మనసులోనూ బయటకూడా నారాయణ స్మరణ చేస్తూనే వుండాలి. యవలు, వరిధాన్యం నిండిన పాత్రను బ్రాహ్మణునికిచ్చి భగవంతుని ఈ విధంగా ప్రార్థించాలి.
సప్తజన్మని యత్కించిన్మయాఖండ వ్రతం కృతం
భగవన్ త్వత్ర్ప సాదేన తదఖండమిహాస్తు మే॥
యథాఖండం జగత్సర్వం త్వయైవ పురుషోత్తమ।
తథాఖిలాన్యఖండాని వ్రతాని మమ సంతువై॥ (ఉత్తరపర్వం 79/14, 15)
ఈ వ్రతంలో నాలుగు నెలలకోమారు పారణంచేయాలి. చైత్రాది నాలుగు మాసాల చివరి పారణం రెండవది అవుతుంది కదా, ఆనాడు బ్రాహ్మణునికి పేలపిండితో నిండిన పాత్రను సమర్పించాలి. శ్రావణాది నాలుగు మాసాల చివరి, చివరి వ్రతంలో చివరిదీ ఐన పారణంలో నారాయణుని పూజను చేస్తూ తన శక్తిననుసరించి బంగారం, వెండి, మట్టి లేదా పలాశ - పత్రాల పాత్రతో నేతిని దానం చేయాలి. సంవత్సరం పూర్తికాగానే జితేంద్రియులైన పన్నెండుగురు బ్రాహ్మణులకు పాయసంతో భోజనం పెట్టి వస్త్రా భూషణాదులను సమర్పించి వారిలో దేవునిచూస్తూ ఇదివఱకు తాను చేసిన వ్రతాల్లో దొర్లిన లోపాలకు క్షమాభిక్షను వేడాలి. ఆపై ఆచార్య దేవుని పూజించాలి. ఈ ప్రకారంగా అఖండ ద్వాదశీ వ్రతాన్ని చేసిన వారికి ఇప్పటి నుండి ఏడుజన్మలదాకా చేసే వ్రతాల్లో వైకల్యాలన్నీ పూరించబడతాయి.
స్త్రీ పురుషులు మనోరథ సిద్ధి కోసం ఆపేర ప్రసిద్ధి చెందిన వ్రతాన్ని ఫాల్గున శుద్ధ ఏకాదశినాడే ఉపవాసం చేసి ప్రారంభించాలి. ఆరోజంతా భగవానుని భజనలోనూ స్మరణలోనే గడపాలి. ద్వాదశినాటి పొద్దున్నే స్నానం, పూజ, నేతితో హవనాలను ముగించి బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి ఆ తరువాత భగవంతునికి తన మనోరథాన్ని చెప్పుకొని వాటి సంసిద్ధికై ప్రార్థించాలి. తరువాత హవిష్యాన్నంతో భోజనంచేయాలి.
ఈ వ్రతంలో ఫాల్గునమాసం నుండి జ్యేష్ఠ మాసందాకా మొదటి నాలుగు నెలల్లో ఎఱ్ఱపూలు, గుగ్గిల ధూపం, హవిష్యాన్నాలతో భగవానుని పూజించి, అర్చించి గోశృంగ జలాన్నీ హవిష్యాన్నాన్నీ స్వీకరించాలి. ఆషాఢం నుండి ఆశ్వయుజం దాకా గల నాలుగు నెలల్లో మల్లెపూలు, ధూపము, శాల్యన్నాదులను అర్చనకు నైవేద్యాలకూ వినియోగించి తరువాత కుశోదకమునూ నైవేద్యములనూ తినిశయనించాలి. కార్తీకము నుండి మాఘం దాకా, మూడవపారణంలో, జపాపుష్ప, ఉత్తమ ధూప, కసార నైవేద్యాలతో స్వామి నర్చించి గోమూత్రమును, నివేదితక సారాన్నీ నోట్లో వేసుకొని శయనించాలి. ప్రతినెలా ఈ వ్రతం చేసినవాడు బ్రాహ్మణులకు దక్షిణలివ్వాలి. సంవత్సరాంతంలో ఒక ఐదు గురిగింజల బరువుతో నారాయణుని బంగారు ప్రతిమను చేయించి పూజించి, రెండు వస్త్రాలతో, దక్షిణలతో కలిపి బ్రాహ్మణునికి సమర్పించాలి. ఇది కాక పన్నెండుగురు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి వారిలో ప్రతి ఒక్కరికీ దక్షిణతో బాటు అన్నానికీ జలానికీ, పాత్రలనూ, గొడుగులనూ, చెప్పులనూ, వస్త్రాలనూ దానం చెయ్యాలి. ఈ విధంగా ఈ ద్వాదశీ వ్రతాన్ని చేయడంవల్ల అన్ని మనోరథాలూ తీరుతాయి. అందుకే దానికా పేరు పెట్టబడింది.
ఇంద్రునికి త్రైలోక్య రాజ్యాధిపత్యము ఈ వ్రతం వల్లనే సమకూడింది. శుక్రాచార్యుడు ధనాన్నీ ధౌమ్య మహర్షి నిర్విఘ్నవిద్యనీ అలాగే పొందగలిగారు. ఆ తరువాత ఎందరో శ్రేష్ఠులైన స్త్రీ పురుషులు ఈ వ్రతాన్నాచరించి మనోరథ సిద్ధిని పొందారు. సామాన్యులు కూడా ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో చేస్తే మనోరథసిద్ధి తప్పక కలుగుతుంది.
తన ప్రజలపై మిక్కుటమైన ప్రేమగల ధర్మరాజు వారికోసం శ్రీకృష్ణుని ఇలా అడిగాడు.
“ప్రభో! అతి తక్కువ పరిశ్రమతోగాని స్వల్పదానాలతో గాని పాపములను పోగొట్టే వ్రతమేదైనా వుందా?”
“మహారాజా! పరమ పవిత్రమూ సర్వపాప ప్రణాశకమూ నైన తిలద్వాదశి వ్రతనామక వ్రతమొకటుంది. మాఘ కృష్ణ ద్వాదశి పూర్వాషాఢ లేదా మూల నక్షత్రంతో యోగించినపుడు ఆ పుణ్య తిథికొక రోజు ముందే అనగా ఏకాదశినాడే ఉపవాసముండి ఈ వ్రత దీక్షను పట్టాలి. ద్వాదశినాడు నన్ను (అంటే శ్రీకృష్ణుని) పూజించి నల్లనువ్వులను బ్రాహ్మణునికి దానమివ్వాలి. వ్రతి కూడా, స్నానానంతరం, నల్లతిలలతో భోంచెయ్యాలి. ఇలా ఒక యేడాదిపాటు ప్రతి బహుళ ద్వాదశినాడూ చేసి చివరి ద్వాదశినాడు వ్రతం చేసి పన్నెండుగురు బ్రాహ్మణులకు తిలలతో నింపిన నల్లకుండలను, గొడుగులను, చెప్పులను, వస్త్రాలను, దక్షిణలను ఇవ్వాలి. ఆ తిలలను భూమిలో పాతినపుడు ఎన్ని మొలకలు వస్తాయో అన్నేళ్ళు ఈ వ్రతికి స్వర్గంలో పూజలందుకుంటూ నివసించే అవకాశముంటుంది. ఈ వ్రతం చేసిన వారికి ఎంత పెద్ద పాపాలైనా సరే నశిస్తాయి; ఇకపై ఏ జన్మలోనూ ఎటువంటి అంగవైకల్యమూ, దీర్ఘరోగమూ వుండవు. నువ్వులు సద్గతికి సోపానాలు.”