భవిష్య పురాణము

121 - సూర్యనారాయణుని సౌమ్యరూపం యొక్క కథ శ్రీ సూర్యస్తుతి - పరివారం - దేవతల వర్ణన

“గురుదేవా! సూర్యదేవుని మాహాత్మ్యాన్నీ కథలనూ ఎంత విన్నా ఇంకా వినాలని పిస్తోంది. నాకావిషయమై మరింత జ్ఞానాన్ని ప్రసాదించండి” అని వేడుకొన్నాడు చక్రవర్తి.

“మహారాజా! ఈ జ్ఞానాన్నొకప్పుడు బ్రహ్మదేవుడే కొందరు మునులకు కథారూపములో ప్రసాదించాడు. దాన్నే నీకు వర్ణిస్తాను విను” అంటూ చెప్పసాగాడు సుమంతుడు.

“రాజా! ఒకప్పుడు ఆకాశంలో దేదీప్యమానంగా వెలిగిపోతున్న సూర్యుని వెలుగులోని వేడిని కూడా అనుభవించి అలసిపోయిన ఋషీశ్వరులు సంతప్తులై బ్రహ్మను ప్రార్థించి ఆయన సాక్షాత్కరించగానే చేతులు భక్తిపూర్వకంగా జోడించి ఇలా అడిగారు.

‘పరమపితా! ఆకాశంలో నిలబడి అగ్నివలె మమ్ము దహిస్తున్న ఈ తేజః పుంజమెవరు?’

‘మునీశ్వరులారా! ప్రళయకాలంలో స్థావరజంగమాత్మకమైన జగత్తు నశించినపుడు చిక్కటి చీకటి అన్ని దిశలా అలముకొంది. అపుడు అన్నిటికన్న ముందు బుద్ధి ఉత్పన్నమయింది. దానినుండి అహంకారము, దానినుండి ఆకాశాది పంచమహాభూతములు జనించాయి. వాటి ద్వారా ఒక అండమేర్పడింది. అందులోనే ఏడులోకాలతో ఏడు సముద్రాలతో ఒకప్పుడు వెలిగిన భూమి ఉండిపోయింది. అందులోనే సృష్టి స్థితి లయకారకులమైన నేను విష్ణు మహేశ్వరులూ ఉన్నారు. అంధకారంలో పడి కొట్టుమిట్టాడుతున్న ప్రకృతి ప్రార్థించగానే ఒక్కపెట్టున, భళ్ళున తెల్లారినట్టు ఒక తేజఃపుంజం ప్రకటితమైంది. మేమంతా ఆ దివ్య, దీవ్యత్ తేజాన్ని ఇలా స్తుతించాం.

ఆదిదేవోఽసిదేవా నామీశ్వరాణాం త్వమీశ్వరః

ఆది కర్తాసి భూతానాం దేవ దేవ సనాతన

జీవనం సర్వ సత్త్వానాం దేవ గంధర్వ రక్షసాం

మునికిన్నర సిద్ధానాం తథైవోరగ పక్షిణాం

త్వం బ్రహ్మాత్వం మహాదేవస్త్వం విష్ణుస్త్వం ప్రజాపతిః

వాయురింద్రశ్చ సోమశ్చ వివస్వాన్ వరుణ స్తథా

త్వం కాలః సృష్టికర్తాచ హర్తా త్రాతా ప్రభు స్తథా

సరితః సాగరాః శైలా విద్యుదింద్ర ధనుంషిచ

నమోనమః కారణ కారణాయ నమోనమః పాప వినాశనాయ

నమోనమోవందిత వందనాయ నమో నమో రోగ వినాశనాయ

నమో నమస్సర్వ వరప్రదాయ నమో నమస్సర్వ బలప్రదాయ

నమో నమోజ్ఞాననిధే సదైవ నమోనమః పంచ దశాత్మకాయ (బ్రాహ్మ123,11-24)

మా స్తుతికి ప్రసన్నులై ఆ తేజస్వీ, ఆ సకల కళ్యాణకారుడైన స్వామి ఇలా అడిగారు, ‘దేవతలారా మీకేమి కావాలి?’

‘ప్రభో! మీ యొక్క ప్రచండమైన ఈ రూపమును చూచుటకు మాలో ఏ ఒక్కరికినీ శక్తి లేకున్నది కాబట్టి దుర్నిరీక్ష్యమైన ఈ రూపాన్నుపసంహరించి సర్వనేత్ర గమ్యమై రమ్యమై వెలుగొందు సౌమ్యరూపాన్ని ధరించండి’ అని మేము వేడుకొన్నాం. ఆయన వెంటనే ‘ఏవమస్తు’ అంటూ అందరి కనులకూ హృదయాలకు సుఖాన్నిచ్చే ఉత్తమ రూపులైనారు. (‘ఏవమస్తు’ అంటే అట్లే అగును గాక అని భావము)

ఇంతవఱకూ బ్రహ్మ వాక్యాలను చెప్పి ఆపిన సుమంతుముని ఇలా వివరించాడు.

“మహారాజా! సాంఖ్యయోగాన్ని ఆశ్రయించిన యోగులు, మోక్షాభిలాషగల తపస్వులు సూర్యధ్యానాన్ని చేస్తుంటారు. సూర్యనారాయణుని ధ్యానించడం వల్ల ఎంత పెద్ద పాపాలైనా నశిస్తాయి. అగ్నిహోత్రాలు, వేదపాఠాలు, ప్రచుర దక్షిణలతో కూడివున్న యజ్ఞాలు కూడా సూర్యధ్యాన పుణ్యంలో పదహారవ వంతు పుణ్యాన్నయినా సంపాదించి పెట్టలేవు. సూర్యతేజంలో పడి ప్రపంచమంతా మాడిపోతుందని చివరకు బ్రహ్మదేవుని కమలం కూడా వాడిపోతోందని గమనించిన మహర్షులు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి (చాలామంది తరుణోపాయమని రాస్తుంటారు. దానికి అర్థం కుదరదు. తరణము అంటే దాటుటయని అర్ధము ఇబ్బంది అనే నదిని దాటడానికి దారి చూపేది తరణ ఉపాయి. అనగా తరణోపాయం.) తరణో పాయమును సూచింపుమని అడిగారు. బ్రహ్మ సూచనపై మొత్తం మహర్షులంతా దేవతలను, త్రిమూర్తులను ముందిడుకొని సూర్యదేవుని సమ్ముఖానికి పోయి స్తుతించారు. ఆయన సుప్రసన్నుడై వరం కోరుకొమ్మనగానే ఇలా అడిగారు.

‘చండ ప్రచండమైన మీ తేజస్సును చూడలేక, తట్టుకోలేక సౌమ్య దర్శనాన్ని ప్రార్థించాం. మీరు దయచేశారు కూడ. కాని, మాకు ఇంకా ప్రసన్నమైన రూపం కావాలి. ఈ తేజస్సును ఎలా, ఎంతవరకు తగ్గిస్తే సామాన్య మానవులు కూడా మిమ్మల్ని తట్టుకోగలరో విశ్వకర్మకు తెలుసు. కాబట్టి మీరు దయతో ఆయనకు ఆ మేరకు ఆజ్ఞనివ్వవలసిందని కోరుతున్నాము?’.

సూర్యదేవుడు ఈ ప్రార్థనను స్వీకరించగా విశ్వకర్మ కొంతమేరకు ఆ తేజస్సును తగ్గించగా ఆ తగ్గిన తేజస్సు నుండి విష్ణుదేవుని చక్రమూ ఇతర దేవతల శూల, శక్తి, గద, బాణ, ధనురాది ఆయుధములు దుర్గాది దేవతల పవిత్ర మహిమోపేత ఆభరణములు సూర్యదేవుని అనుగ్రహం వల్ల విశ్వకర్మచే తయారు చేయబడ్డాయి.

సూర్యదేవుని బాగా దగ్గరగా చూసుకొనే భాగ్యంతో బాటు ఆయన తేజస్సుతో తయారైన ఆయుధాలు కూడా లభించడంతో దేవతలంతా ఆనందాంతరంగులై ఆయనను మరల స్తుతించారు.

రాక్షసులు సూర్యుని రథం వైపు రాకుండా వుంచడం కోసం స్కందుడను దేవుడు రెండు భాగాలుగా విడిపోయి సూర్యుని కుడి ఎడమలలో నిలచి దండనాయకునిగా నిరంతర కర్తవ్యపరాయణుడైనాడు. సూర్యుడాతని పట్ల ప్రసన్నుడై అతనికి జీవుల శుభా శుభ కర్మలను లిఖించి ఫలాలను కూడా నిర్దేశించే బాధ్యత నొప్పజెప్పాడు. ముఖ్యంగా పాపాలకు దండ నిర్ణయాన్ని ఏకంగా దండనీతి శాస్త్రాన్నే తయారు చేసిన స్కందుడు మరో అర్థంలో కూడా అచ్చంగా దండనాయకుడయ్యాడు. అగ్నిదేవుడు కూడా పింగళవర్ణం ధరించి సూర్యుని కుడివైపు తన అంశను నిలబెట్టాడు. సూర్యుని ఆలయానికి ఒక్కొక్క ద్వారానికి ఇద్దరేసి పాలకులుంటారు కదా! వారూ దేవతలే. కార్తికేయుని అవతారమైన రాజ్ఞుడును, హరుని అవతారమైన శ్రేషుడు ధర్మ, అర్థరూపాల్లో సూర్యుని ప్రథమ ద్వారపాలకులై వుంటారు. యమాంశుడైన కల్మాషుడు, గరుడాంశమైన పక్షుడు దక్షిణ దిశవైపున్న రెండవ ద్వారానికి పాలకులు. కుబేరుడు, వినాయకుడు ఉత్తరంలోనూ దిండీ, రేవంతుడూ తూర్పు దెసలో నుంటారు. దిండి రుద్రాంశ, రేవంతుడు సూర్యాంశ. ఈ దేవపురుషులందరూ రాక్షస సంహారానికై కామ రూపాది విద్యలతో విలసిల్లన వారే. వేదాలు కూడా సూర్యభగవానుని నలువైపులా కొలుస్తాయి.