భవిష్య మహా పురాణము
5, 6 - వివిధ కర్మల పాప పుణ్య ఫలాలు
శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు ననుగ్రహించి ఇంకా ఇలా చెప్పసాగాడు. “మహారాజా! అధమ కర్మలు చేసేవాడు నరకంలో పడి అనేకానేక ఘోర యాతనలను అనుభవిస్తాడు. అధమ కర్మనే అధర్మమనీ పాపమనీ అంటారు. అధర్మంలో తేడాలు ఆ కర్మను చేయువాని చిత్తవృత్తిపై ఆధారపడి వుంటాయి. స్థూల, సూక్ష్మ, అతి సూక్ష్మాది కోట్ల ప్రకారాల పాపాలున్నాయి. పెద్ద పెద్ద పాపాలనే ప్రస్తుతం వర్ణిస్తాను. పరస్త్రీ చింతనం, ఇతరులకు కీడు చేయాలనే ఆలోచన, అకార్యాలు చేయాలనే ఆసక్తి - ఈ మూడు అభినివేశాలూ మానసిక పాపాలు. అడ్డూ ఆపూలేని పేలాపన, ఎదుటి మనిషిని బాధించే వాగుడు, అప్రియాలనూ అసత్యాలనూ పలకడం, పరనింద, కొండెములు చెప్పి జగడములు పెట్టుట - ఇవి వాచిక పాపాలు. అభ్యక్ష భక్షణం, హింస, సంయమనం లేని నియమం లేని జీవితం గడపడం, పరధనహరణం, ఇవి కాయక (శారీరక) పాపాలు. పైన చెప్పిన పన్నెండు రకాల పాపాలవల్లా నరకప్రాప్తి తప్పదు. వీటిలో అనేక భేదాలున్నాయి. స్థితి, లయకారకులైన విష్ణుదేవ, మహాదేవులను ద్వేషించేవారు ఘోర నరకంలో పడతారు. బ్రహ్మహత్య, సురాపానం, బంగారాన్ని దొంగిలించడం, గురుపత్నీ గమనం- ఇవి మహాపాతకాలు. ఈ మహాపాతకులతో కలిసి మెలిసి తిరగడం అయిదో మహాపాతకం. వీరంతా నరకానికి పోతారు.
(ఉపపాతకాలు ఇదివఱకే చెప్పబడ్డాయి.)
మహారాజా! యమధర్మరాజుగారి సభలో చిత్రగుప్తాదులు శుభాశుభ కర్మల వివేచన చేస్తారు. జీవి జాగ్రత్తగా జీవిస్తూ శుభకర్మలనే గావించాలి.
(ఆపై నారకీయ శిక్షలనూ నారకీయ మార్గాలనూ కూడా శ్రీకృష్ణుడు చెప్పాడు. అవి ఇదే పురాణంలో బ్రాహ్మపర్వం (అ-190, 191, 192 లలో) చెప్పబడ్డాయి.
ఇక యమలోకమెలా వుంటుందో అక్కడి సిబ్బందితో సహా చెప్పసాగాడు వాసుదేవుడు.
యమరాజుకి సమీపంలోనే కాలాగ్ని సమాన క్రూర కృష్ణవర్ణ మృత్యుదేవత వుంటాడు. ఈ నల్లని పెనుగొండ వంటి భయంకరాకారుని పరివేష్ఠించి కాలయముని భయంకర శక్తులూ, రోగాలూ అనేక రూపాలను ధరించి వుంటాయి. నల్లగా భయంకరంగా నున్న యమదూతలు తమ చేతుల్లో శక్తి, శూల, అంకుశ, పాశ, చక్ర, ఖడ్గ, వజ్ర, దండాది శస్త్రాలను ధరించి ఎల్లపుడూ శిక్షించడానికి సిద్ధంగా వుంటారు. పాపులు అక్కడికి వచ్చి వీరంతా వున్న వైనాన్ని చూడగానే వారి గుండెలు భయంతో బద్దలు కావడానికి ముందలి దశలో వుంటాయి. అప్పుడు చిత్రగుప్తుడిలా అంటాడు. ‘ఓయి పాపులూ! మీరింతటి చెడ్డపనులెలా చేయగలిగారు? ఇతరుల ధనాన్ని అపహరించారు; రూపాన్ని ఎరవేసి స్త్రీలతో వ్యభిచరించారు. మహాపాతకాలనూ, పాతకాలను, ఉపపాతకాలనూ ఏమాత్రమూ భయపడకుండా చేసి అక్కడ విర్రవీగారు కదూ! ఇప్పుడిక్కడ ఆ పాపాలకు శిక్షలనుభవించండి. ఇక్కడ మిమ్ము ఎవరూ రక్షించలేరు’ ఇలా చెప్పి చిత్రగుప్తుడు యమదూతలవైపు చూడగానే ఆ కింకరులు ఈ పాపకర్మలను గొనిపోయి ముందుగా నరకలోకంలో ప్రజ్వరిల్లుతున్న అగ్నిలోకి విసిరేస్తారు.
ఏడవ పాతాళంలో ఘోరాంధకారం మధ్య దారుణమైన నరకాలు ఇరవై ఎనిమిది కోట్లున్నాయి. జీవులు యాతనలననుభవించవలసినది ఎక్కువగా అక్కడే. పాపులను యమకింకరులు ఎత్తైన వృక్షాల కొమ్మలకు వ్రేలాడదీస్తారు. చాలా బరువున్న ఇనుపకడ్డీలను కాళ్ళకు కడతారు. వాటి బరువు శరీరాన్ని క్రిందికి లాగుతుంటుంది. ఎముకలు విరుగుతుంటాయి. ఒక్కొక్కమారు వచ్చే నొప్పికి వారు చేసిన ఒక్కొక్క పాపం గుర్తొస్తుంటుంది. బాగా కాల్చిన ముళ్ళుగల లోహ దండాలతో కొరడాలతో కొడతారు. విషసర్పాలతో కరిపిస్తారు. భరించలేని బాధతో పాపులు రోదిస్తారు. అరుస్తారు. ఎంత బాధ కలిగినా ఆ బాధ పెరుగుతుంటుందే కాని స్పృహ తప్పదు. ప్రాణం పోదు. రెండవసారి పోదుగా మరి. ఆ తరువాత రక్తాలొలుకుతున్న గాయాలపై ఉప్పు జల్లుతారు. అప్పుడప్పుడు వారిని బంధ విముక్తులను చేస్తారు. ఈ పాపులు అమ్మయ్య! శిక్ష అయిపోయినట్టుంది’ అనుకుంటూ హాయిగా ఊపిరి పీల్చుకుంటుండగానే వారిని ఉన్నపళంగా లేవనెత్తి యమకింకరులు పదిమంది పట్టేంత పెద్ద పెద్ద మూకుళ్ళలో మరుగుతున్న, సలసల కాగుతున్న నూనెలో పడవేస్తారు. అందులో నుండి తీసి అసహ్యకరమైన రక్తము, కొవ్వు వంటి పదార్ధాల ద్రావకాలున్న కూపాల్లో విసిరేస్తారు. వాటిలో రకరకాల కీటకాలుంటాయి. వాటి కాటుల్లో కూడా భరింపరాన్నంత వైవిధ్యముంటుంది. లోహపు ముక్కులున్న కాకులు, కుక్కలు పాపుల శరీరాలను పీక్కు తింటాయి. కొందరిని సూది మొనలున్న శూలలపై నిలబెట్టి, కూర్చుండబెట్టి శిక్షించడం కూడా జరుగుతుంది.
అభక్ష్య భక్షణం, మిథ్యాభాషణం చేసిన వారి నాలుకలకు అనూహ్యమైన, భరింపనశక్యమైన దండనలుంటాయి. మాతాపితరులను, గురువును కఠోర వచనాలచే హింసించిన వాని నోటిలో నిప్పు కణికలు పోసి అవి ఆరగానే ఆ గాయాలపై ఉప్పును రాస్తారు. అతిథులకు అన్నం పెట్టకుండా తాను మాత్రమే భోంచేసినవారికి ఇక్షుఖండ దండనముంటుంది. అంటే చెఱకును పిండి రసం తీసే యంత్రంలో వీరిని పడవేసి యమకింకరులు దానిని తిప్పుతారు. పరనారీ సంగమం చేసి వచ్చిన వారిని బాగా కాల్చిన ఇనుప స్తంభాలకు ఆలింగన భంగిమల్లో నిలబెట్టి ఇనుప త్రాళ్ళతో కట్టివేస్తారు. స్త్రీలకు కూడా ఇదే శిక్షను అమలుచేస్తూ, ‘ఓసీ దుష్టురాలా! ఎంత మోహంతో నీ పతిని మోసగించి పరపురుషుని కౌగలించుకున్నావో అంతే మనోవికారంతో ఈ తప్తలోహా లింగన సుఖాన్ననుభవించు’ అంటూ ఆమె పాపాన్ని తడవతడవకూ గుర్తుచేస్తూ శిక్షిస్తారు. దేవాలయాల్లో, మఠాది ఇతర పవిత్ర స్థలాల్లో మైథున క్రీడ వంటి పాప కర్మలను గావించిన వారికి లోహాలింగనంతోబాటు చిత్ర విచిత్ర మారణ యంత్రాలతో శిక్షలుంటాయి. మరణం మాత్రం లభించదు. కొందరు పరమ పాపాత్ములకూ అతిశయ దుష్టులకూ యుగాంతం వరకూ గాని చంద్రసూర్యులున్నంతవఱకూ గానీ పునర్జన్మే వుండదు. వారు అలా నరకంలో పడి వుండవలసినదే. గురునిందను ఆనందంగా విన్నవాని చెవులకు శిక్షపడుతుంది. అలాగే ఏ ఇంద్రియం ద్వారా పాపం చేస్తారో ఆ ఇంద్రియం ద్వారానే ఘోర హింసలననుభవిస్తారు. ఈ శిక్షలను మొత్తం నరకలోక హింసలను చెప్పడానికి నూరేళ్ళు చాలవు.
ఇంతకన్నా ఇంకా దారుణమైన యాతనలున్నాయి. మృదువైన మనస్సుగలవారు వాటిని వింటేనే స్పృహ కోల్పోతారు. విచిత్రమేమిటంటే భార్యాపుత్రుల కోసమే పురుషులు ఎక్కువగా పాపాలు చేస్తుంటారు. కాని ఈ శిక్షలు మాత్రం పూర్తిగా ఒక్కరే అనుభవిస్తుండాలి. ఆ భార్యాపుత్రులిక్కడకు రారు. ఇక ఏ అక్కరకూ రారు. ఎవరు చేసిన పాపాన్ని వారే అనుభవించాలనేది ధ్రువీకరింపబడిన సిద్ధాంతం. కాబట్టి బుద్ధిమంతులైన మానవులు శరీరం నశ్వరమని తెలుసుకొని లేశమాత్ర పాపం కూడా చేయరు.
పరమ పాపాత్ముడు ఒక యుగమంతా నరకంలోనే వుండి మళ్ళీ భూమిపై పుట్టినా, వానికి వెంటనే మానవ జన్మ రాదు. ముందు వృక్షాది స్థావర యోనుల్లో, పిమ్మట కీట, పతంగ, పక్షి, పశు మున్నగు అనేక యోనుల్లో జనిస్తూ, గతిస్తూ ఎప్పటికో మరల అతి దుర్లభమైన మానవ జన్మను పొందవచ్చు. స్వర్గాన్నిగాని, మోక్షాన్నిగాని ఒక ఆత్మకు ఇవ్వగలిగినది మనుష్య జన్మయేనని తెలుసుకొని మానవుడు సర్వత్ర పాపానికి దూరంగా జీవించాలి. నరకంలో పడకుండా తనను తాను కాపాడుకోవాలి. ధర్మబద్ధంగా పశుజన్మలో నడుచుకోబట్టే మానవజన్మ లభించింది కాబట్టి మానవుడైనవాడు ఆ ధర్మాన్ని వృద్ధి చేయాలి. ధర్మావలంబనం వల్ల ధర్మాన్ని వృద్ధి చేయాలి. ధర్మావలంబనం వల్ల సుఖపడేది తనే అని తెలిసి ఆ ధర్మాన్ని ఆచరించని వానికంటె మూర్ఖుడెవడు?
ఈ దేశం అన్ని దేశాల్లోకీ ఉత్తమం. ఎంతో పుణ్యం చేసుకున్న ప్రాణే ఇక్కడ ఈ భరత వర్షంలో పుడుతుంది. శరీరంలో సత్తువ వున్నంత కాలం పుణ్యం చేస్తూనే వుండాలి. ఆ తరువాత చేయగలిగిందేమీ వుండదు.
ఆయుషః ఖండఖండాని నిపతంతి తవాగ్రతః ।
అహోరాత్రాపదేశేన కిమర్థం నావబుధ్యసే ॥ (ఉత్తరపర్వం-6/199)
జరుగుతున్న ప్రతి రాత్రికీ, పగటికీ ఆయువు తగ్గుతునే వుంటుంది. మృత్యువెప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి దానం చెయ్యడం తెలివైన పని. దానం చేసేవాడు సుఖంగా పోతాడు. దాన హీన మార్గంలో దుఃఖాలు చాలా ఎక్కువ. అన్నీ వుండి కూడా ఎవరికీ ఏమీ ఇవ్వనివాడు ఏదీ అరగక ఆకలితో పోతాడు. ఏ సత్పురుషుడైతే సర్వాత్మ భావంతో శ్రీ సదాశివుని శరణం కోరుకుంటాడో అతడే పద్మపత్ర స్థిత జలబిందువులాగా ద్వంద్వాల నుండి బయటపడి ఇహంలోనూ పరంలోనూ కూడా సుఖపడతాడు.