9 - పూరకర్మ నిరూపణ

            విప్రవరులారా! మరొక యుగంలో బ్రహ్మ చెప్పిన అంతర్వేది, బహిర్వేది అనేవి ద్వాపర కలియుగాలకు అత్యంత ఉత్తమాలుగా పరిగణింపబడ్డాయి. జ్ఞానసాధ్యమైన కర్మలు అంతర్వేదులనబడతాయి. అనగా ఇవి జ్ఞానప్రదానం చేస్తాయి. పైకి కనిపించే పనులు బహిర్వేది కర్మలు. అనగా దేవతలను స్థాపించుట, పూజించుట వంటివి. ఇవి మరల రెండు ప్రకారాలు. నూతులను, చెరువులను, తటాకాలను తవ్వించి పోషించుట, బ్రాహ్మణులను, గురువులను సంతుష్టపఱచుట. ఈ బహిర్వేదినే పూర్తకర్మయని కూడా అంటారు.

            నిష్కామభావపూర్వకంగా చేసే కర్మలు, ఆపత్సమయంలో లేకున్నా అంత ఉద్వేగంగా భక్తితో చేసే హరిస్మరణాదిశ్రేష్ఠకర్మలూ అంతర్వేది కర్మలోకి వస్తాయి. ఇవి కానివి బహిర్వేది కర్మలు. ధర్మాన్ని నిలబెట్టవలసినవాడు రాజు. రాజు ధర్మకర్మ నిర్వహణాన్ని చెయ్యాలి. రాజాశ్రయం పొందిన వారందరూ ఈ బహిద్వేది లేదా పూర్తకర్మాచరణ చేయాలి. ఎనభైయేడు రకాల కర్మలు పూర్తకర్మలుగా చెప్పబడ్డాయి. వాటిలో ప్రధాన విభాగాలు మూడు - దేవతలను స్థాపించుట. ప్రాసాదాలను నిర్మించుట, తటాకాదుల నేర్పాటు చేయుట. ఇవి కాక గురుపూజలు, పితృపూజలు, దేవతాదులప్రతిష్ఠలు, దేవతల ప్రతిమలను నిర్మించుట, వృక్షసంరక్షణ వంటివి కూడా పూర్తకర్మలలోకే వస్తాయి.

            దేవప్రతిష్ఠ ఉత్తమ, మధ్యమ, కనిష్ఠాలని మూడువిధాలు. ప్రతిష్ఠలో పూజ, హవనము, దానము అనే మూడు కర్మలు ప్రధానము. మూడురోజుల పాటు జరుపబడే ప్రతిష్ఠా విధానంలో ఇరవై ఎనిమిది మంది దేవతలకు పూజలూ, జపాలూ పదహారుగురు బ్రాహ్మణులచేత చేయించాలి. ఇది ఉత్తమ ప్రతిష్ఠా విధి. దీనిని చేయించడం వల్ల అశ్వమేధయాగం చేసిన ఫలం దక్కుతుంది. ఇరవై ముగ్గురు దేవతలను ప్రతిష్ఠించి నలుగురు విద్వాంసుల చేత యజనాదులను చేయించుట మధ్యమ విధానము. ఇందులో నవగ్రహ, దిక్పాల, వరుణ, పృథ్వి, శివాదుల పూజాప్రతిష్ఠలు ఒకరోజులోనే సంపన్నం చేయబడతాయి. కేవలం గణపతి, దిక్పాలురు, గ్రహాలు, వరుణుడు, శివులను మాత్రమే పూజించి ప్రతిష్ఠించగలిగితే అది కనిష్ఠ ప్రతిష్ఠావిధిగా పరిగణింపబడుతుంది. క్షుద్రదేవతల ప్రతిమలు రకరకాల చెట్ల కొయ్యలనుండి చేయబడుతున్నాయి.

            నూతన తటాకము, బావలి యనబడు లోతైన చిన్న చెరువు, కుండము, జలాశయము మున్నగు వాటి నిర్మాణ సంస్కారంలో గణేశాది దేవతలకు పూజన, హవనాది కార్యాలు చేయాలి. ఆ తరువాత వాటిలో గంగాజలం, పుష్కరిణి మున్నగు వాటినుండి పవిత్రజలాన్ని తెచ్చి పోయాలి.

            అరవై యొక్క జానల ప్రాసాదం ఉత్తమంగానూ. అందులో సగం మధ్యమంగానూ అందులో సగం కనిష్ఠంగానూ వ్యవహరింపబడుతున్నాయి. ఐశ్వర్యాన్ని కోరుకొనేవారు ప్రతిమ పరిమాణాన్ని బట్టి ప్రాసాదాన్ని నిర్మింపజేస్తారు. తన సంపూర్ణ కుటుంబాన్నుద్ధరించి వారికి స్వర్లోకప్రాప్తిని కలుగజేయ గోరువారు నూతన తటాకాన్ని నిర్మించాలి లేదా పాడైన దానిని బాగుచేయించాలి. వాపీ, కూప, తటాకాలను, చెరువులను ఉద్యానవనాలనూ ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ నిర్మలజలం నిరంతరాయంగా లభించేలా చేసే వానికి ముక్తి, ఉత్తమగతులు కలుగుతాయి. విప్రుల, దేవతల నివాసాలకు మధ్యనున్న స్థలాల్లో జలాశయాలను నిర్మించడం బహుపుణ్యప్రదం. నదీతీరాల్లోనూ శ్మశానాల్లోనూ నీటి చెలమలను నిర్మించరాదు. దేవాలయాల వద్దనే కాక, జనసంకుల గ్రామాలకు దగ్గర్లో జలాశయాలను శాస్త్రసమ్మతంగా నిర్మించడం కూడ బహుపుణ్యప్రదం. కాబట్టి ప్రతిఒక్క సంపన్నుడైన మానవుడూ న్యాయార్జితమైన ధనంతో, ప్రయత్నపూర్వకంగా, శుభ ముహూర్తంలో, పరమశ్రద్ధాళువై, యథాశక్తి, శాస్త్రోక్తంగా ప్రతిమనో, మందిరాన్నో, జలాశయాన్నో నిర్మించి ప్రజలకు అంకితం చేయాలి. భగవంతునికి పెద్దదో, చిన్నదో ఏ మందిరాన్ని విధిపూర్వకంగా కట్టినా విష్ణులోకనివాసం ప్రాప్తిస్తుంది. క్రమంగా ముక్తి కూడా లభిస్తుంది.

            జీర్ణశిథిల మందిర సముద్ధరణ చేయువానికి అన్నిరకాల పుణ్యాల ఫలాలూ లభిస్తాయి. విష్ణు, శివ, సూర్య, బ్రహ్మ, దుర్గ, లక్ష్మీనారాయణాది దేవతల మందిరాలను నిర్మించిన వాని తరతరాల కుటుంబసభ్యులు ఉద్ధరింపబడడమే కాక ఆ వ్యక్తి కోటి కల్పాలపాటు సూర్యలోకంలో నివాసప్రాప్తిని పొందుతాడు. మృత్యులోకంలోకి (అక్కడినుండి మృత్యులోకమంటే ఇక్కడ భూలోకమనే అర్థం చేసుకోవచ్చు. మృత్యువున్నలోకము అని  భావం.) వచ్చి మహారాజుగానో గొప్పకీర్తి గల ధనికునిగానో కలకాలం జీవిస్తాడు. భగవతి త్రిపుర సుందరి మందిరంలో అనేక దేవతలను స్థాపించినవాడు సంపూర్ణ విశ్వంలో స్మరణీయుడయ్యేటంత గొప్ప కార్యాలను సాధించి స్వర్గంలో కూడా పూజలందుకోగలడు. జలసమర్పణ పరమపుణ్య ఫలదాయకము. పరోపకారము, దేవకార్యంలో ఒక రోజుకి సరిపడా జలాలనేర్పాటు చేయుట గావించిన వాని మాతృ, పితృ, భార్య, ఆచార్య వంశాలలో అనేక తరాలు, వానితో సహా ఉద్ధరింపబడతాయి. ఇదే ఫలం అవిముక్తదశార్ణవ తీర్థంలో దేవార్చనకూ చెప్పబడింది. నీటిపైనగాని దేవాలయంపై గాని ఇల్లు కట్టరాదు. శివలింగాన్ని శిధిలమైనా కూడా పెకలించరాదు. అన్యదేవతల విగ్రహాలను, పూజలందు కొనుచున్న వృక్షాలను కదపరాదు.

            దైవమందిరానికి అనుబంధంగా పుష్కరిణి నేర్పాటు చేసినవాడు బ్రహ్మలోక ప్రాప్తినంది,

ఇక దిగిరాడు.