భవిష్య మహా పురాణము
1 - ప్రతిసర్గ పర్వం - సత్యయుగ రాజవంశ వర్ణన
మహాముని, ఆచార్యుడునైన శౌనకుడు సూతమునీంద్రుని ఇలా అడిగాడు. “మహర్షీ! బ్రహ్మదేవుని ఆయువులో ఉత్తరార్ధంలో భవిష్యమనే పేరుగల మహాకల్పం వస్తుందనీ దాని ప్రథమ వర్షంలో మూడవ రోజు వైవస్వత నామక మన్వంతరముంటుందనీ అందులో పదునెనిమిదవ సత్యయుగంలో శ్రేష్ఠులైన మహారాజులు జన్మిస్తుంటారనీ విన్నాను. మీరు మాపై దయవుంచి ఆ రాజులనూ వారి చరిత్రనూ వారి రాజ్యకాలాన్నీ ప్రవచన రూపంలో వర్ణించాలని ప్రార్థిస్తున్నాను.”
చెప్పసాగాడు సూత మహర్షి.
“మునీంద్రా! మూడవరోజున ఏడవ ముహూర్త ప్రారంభంలో వైవస్వత మను మహారాజు జన్మించాడు. ఆయన సరయూ నదీతీరంలో నూరు దివ్యసంవత్సరాలు తపస్సు చేయగా ఆయన నాసిక నుండి ఇక్ష్వాకు మహారాజు జన్మించాడు. తరువాత బ్రహ్మ ప్రత్యక్షమై మనువునకు దివ్యజ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆయన పుత్రుడు పరమ విష్ణు భక్తుడు. ఆ దేవదేవుని దయతోనే ఈయన అరవై మూడు వేల సంవత్సరాలపాటు రాజ్యపాలన చేయగలిగాడు. ఆయన పుత్రుడే వికుక్షి. ఇతడు తన తండ్రి కంటే ఒక వంద సంవత్సరాలు తక్కువ కాలం రాజ్యం చేసి స్వర్గానికి వెళ్ళాడు. ఆయన పుత్రుడు రిపుంజయుడు మరో వంద సంవత్సరాలు తక్కువ కాలం పాటు ప్రజలను పరిపాలించి స్వర్గానికి వెళ్ళాడు. ఆయన పుత్రుడు కకుత్థ్సమహారాజు మరో నూరేళ్ళు తక్కువగా పరిపాలించగా అతని తనయుడు అనేనుడు మరో నూరేళ్ళు తక్కువ చేసి పరిపాలించాడు. అనేనుని పుత్రుడు పృథు నామంతో విఖ్యాతుడయ్యాడు. అతని పుత్రుడు విష్వగశ్వుడు, అతని తనయుడు అద్రి, అతని కొడుకు భద్రాశ్వుడు, అతని నందనుడు యువనాశ్వుడు. తండ్రులకంటె ఒక్కొక్క నూరేసి సంవత్సరాలు తక్కువగా రాజ్యపాలనం చేశారు. యువనాశ్వుని పుత్రుడే శ్రావస్తుడు. అతడే శ్రావస్తీ నగరనిర్మాత. ఆకాలంలో సమగ్ర భరత వర్షంలో ధర్మం తన యొక్క నాలుగు పాదాల మీద నడిచేది. (తప, జ్ఞాన, యజ్ఞ దానములనేవి ధర్మదేవత పాదాలని మనుస్మృతి (1 - 86) లో చెప్పబడింది ఈ ఇక్ష్వాకు వంశరాజులందరూ ఉదయాచలం నుండి అస్తాచల పర్యంతమూ వుండిన సంపూర్ణ పృథ్వినీ నీతి, ధర్మ పూర్వకంగా పరిపాలించారు. శ్రావస్తమహారాజు ముప్పదియైదువేల సంవత్సరాలు రాజ్యపాలనము చేయగా ఆయన పుత్రుడు బృహదశ్వుడు ఒక వందేళ్ళు తక్కువగా పరిపాలన చేశాడు. అతని పుత్రుడు కువలయాశ్వుడు మరొక వందేళ్ళు తక్కువగా రాజ్యపాలన చేశాడు.
కువలయాశ్వుని పుత్రుడు దృఢాశ్వుడు తన తండ్రి కన్న వేయి సంవత్సరాలు తక్కువగా అనగా ముప్పది మూడు వేల యెనిమిది వందల సంవత్సరములు రాజ్యపాలనం చేశాడు. అతని కొడుకు నికుంభకుడు అతని కన్న వెయ్యేళ్ళు తక్కువగా రాజ్యపాలనం చేశాడు. అతని పుత్రుడు సంకటాశ్వుడు తన తండ్రి కన్న వేయి సంవత్సరాలు తక్కువగా పరిచాలించాడు. అతని పుత్రుడు ప్రసేనజిత్తు తన తండ్రి కన్నను వేయి సంవత్సరాలు తక్కువ కాలం పరిపాలించాడు. అతని కొడుకు రవణాశ్వుడు కూడా తన తండ్రి కన్న వేయి సంవత్సరాలు తక్కువగా పరిపాలించాడు. అతని పుత్రుడు మాంధాత తన తండ్రి కన్న వంద సంవత్సరాలు తక్కువ కాలం పాటు పరిపాలన చేశాడు. తరువాత మాంధాత పుత్రుడు పురుకుత్సుడు ఒక వంద సంవత్సరాలు తక్కువగా పరిపాలించాడు. అతని తనయుని పేరు త్రింశదశ్వుడు. అతని రథానికి నిరంతరం ముప్పది శ్రేష్ఠమైన గుఱ్ఱాలు పూన్చబడివుండేవట. అందుకే అతనికాపేరు వచ్చిందట. అతని పుత్రుడు అనరణ్యుడు అతడు ఇరువది యెనిమిది వేల సంవత్సరములు రాజ్యం చేశాడు. (ఈ పురాణంలో లేదు గాని అనరణ్యుని రావణుడు సంహరించాడనీ, అనరణ్యుడు చనిపోతూ తన వంశం వాడే ఈ రావణుని చంపుతాడని శపించాడనీ రామాయణంలో చెప్పబడింది.) అతని పుత్రుడు పృషదశ్వుడు ఆరు వేల సంవత్సరాలు రాజ్యం చేసి పితృలోక ప్రాప్తిని పొందాడు. తరువాత రాజైన హర్యశ్వుడు ఐదువేల సంవత్సరాలు రాజ్యం చేశాడు. అతని పుత్రుడైన వసుమానుడు నాలుగువేల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. అతని కొడుకు త్రిధన్వుడు మూడు వేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. అక్కడితో భారతదేశంలో సత్యయుగ ద్వితీయ పాదం సమాప్తమయిపోయింది.
త్రిధన్వపుత్రుడు త్రయ్యారుణి రెండువేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. అతని పుత్రుడు త్రిశంకు ఒక వేయి సంవత్సరాలు రాజ్యం చేశాడు. ఆయన పుత్రుడైన హరిశ్చంద్రుడు ఇరవై వేల సంవత్సరాల పాటు రాజ్యమేలాడు. అతని పుత్రుడు రోహితుడూ అంతే. అతని పుత్రుడు విజయుడు అతని కుమారుడు రుకుడూ కూడా ఇరవై వేల యేళ్ళ చొప్పునే పరిపాలించారు. ఈ మహా రాజులంతా విష్ణుభక్తులే. మహాసేనాధి నాయకులే. వీరి పాలనలో స్వర్ణము, మణులు సమృద్ధిగా ప్రజా వినిమయ సులభములుగా వుండేవి.
సత్యయుగ తృతీయ చరణంలో అప్పటి చక్రవర్తి రురూకునికి సగరుడనే పుత్రుడుదయించాడు. ఈయన శివ భక్తుడు, సదాచార సంపన్నుడు. ఆతనికి ఒక్కరాణి ద్వారానే అరవై వేలమంది పుత్రులుదయించారు. సగరుడు ముప్పదివేల సంవత్సరాలు రాజ్యం చేశాడు. అతని పుత్రులు అరువది వేల మందీ కపిల మహర్షిని అవమానించి ఆ పాపాగ్నియే ఆయన నేత్రాగ్ని కాగా బూడిదైపోయారు. సగరునికి రెండవ రాణి ద్వారా అసమంజుసుడనే పుత్రుడు కలిగాడు. అతని పుత్రుడంశుమంతుడు. అతని పుత్రుడు దిలీపుడు. దిలీప తనయుడైన భగీరథుడే గంగను నింగినుండి నేలకు తెచ్చిన పురుషోత్తముడు, తపస్వి సత్తముడు ఆయన కొడుకు శ్రుత సేనుడు. సగర చక్రవర్తి నుండి శ్రుతసేన చక్రవర్తి దాకా పాలించిన రాజులందరూ శైవులే. శ్రుతసేనుని కొడుకు నాభాగుడూ ఆయన తనయుడు అంబరీషుడూ ప్రసిద్ధ విష్ణు భక్తులు, వారి రక్షణలోనే సుదర్శన చక్రం రేయింబవళ్ళు నిమగ్నమై వుండేదని ప్రతీతి. అంబరీషునితో సత్యయుగంలో మూడవపాదం గడచిపోయింది.
సత్యయుగ నాలుగవ పాదంలో అంబరీషుని (అంబరిష శబ్దమే సరైనదని కొందరందురు) పుత్రుడు సింధు ద్వీపుడు, అతని పుత్రుడు అయుతాశ్వుడు, అతని తనయుడు ఋతుపర్ణుడు, అతని కొడుకు సర్వకాముడు, ఆయన నందనుడు కల్మాషపాదుడు క్రమంగా రాజ్యపాలనం చేశారు.
కల్మాష పాదనందనుడైన సుదాసునికి వారి కులగురువు వసిష్ఠ మహర్షి ఆశీర్వాదం వల్ల మదయంతి యను స్త్రీ ద్వారా అశ్మకుడను పుత్రుడు కలిగాడు. ఇతనినే సౌదాసుడన్నారు. ఇతని దాకా పరిపాలన చేసిన ఏడుగురు చక్రవర్తులూ వైష్ణవులే. సౌదాసపుత్రుడైన హరివర్మ సాధువులను పూజించేవాడు. అతని కొడుకు (మొదటి) దశరథుడు. అతని పుత్రుడు (మొదటి) దిలీపుడు. అతని పుత్రుడు విశ్వాసహుడు పదివేల సంవత్సరాలు రాజ్యం చేశాడు గానీ అతని అధర్మాచరణ వల్ల నూరు వర్షాల పాటు భయంకరమైన అనావృష్టి యేర్పడి రాజ్యం నాశనమై పోయే పరిస్థితులు కనిపించాయి. అపుడు మహారాణి పూజలకూ, పట్టుదలకూ ప్రసన్నుడైన వసిష్ఠ మహర్షి గొప్ప యజ్ఞాన్ని గావించగా దాని ద్వారా ఖట్వాంగుడను వారసుడు జన్మించాడు. ఇతడు ధర్మమును మరల ప్రతిష్ఠించడమే గాక శస్త్రధరుడై ఇంద్రుని సహాయంతో ముప్పదివేల సంవత్సరాల పాటు రాజ్యం చేసి దేవతలిచ్చిన వరాల మేరకు స్వర్గప్రాప్తిని పొందాడు. అతని పుత్రుడు దీర్ఘ బాహువు ఇరవైవేల సంవత్సరాలు రాజ్యపాలనం చేశాడు. అతని పుత్రుడు మహామనీషి సుదర్శనుడు. ఈయన కాశీరాజపుత్రికను వివాహమాడి దేవీ ప్రసాదము వల్ల అందరు రాజులనూ జయించి సంపూర్ణ భరతఖండాన్ని ధర్మపూర్వకంగా అయిదువేల యేళ్ళపాటు పరిపాలించాడు.
ఒకనాడు మహాకాళి ఆయన కలలో కనిపించి ఇలా ఆదేశించింది. ‘వత్సా! నీవు నీ రాణితో వసిష్ఠునితో మరికొందరు పుణ్యాత్ముల కుటుంబాలతో కలసి హిమాలయాలకు పోయి అక్కడ నివాసముండు. అచిర కాలంలోనే ప్రళయం వచ్చి ప్రపంచంలో చాలాభాగం నశించిపోతుంది. పూర్వ, పశ్చిమాది దిశల్లో నున్న అనేక ఉపద్వీపాలు సముద్రంలో కలిసిపోతాయి. భరతవర్షం లో కూడా నేటికేడవ దినం దారుణమైన పెను తుఫాను రాబోతోంది. (‘తుఫాను’ అనే మాట పురాణకాలం నాటికి లేదు. ‘ఝంఝావాత’ శబ్దమే వాడబడేది)
భగవతి ద్వారా స్వప్నంలో ప్రళయ నిర్దేశాన్ని పొందిన సుదర్శనుడు ప్రధాన క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య, శూద్ర బృందాలను తమ తమ పరికరాలతో బాటు హిమాలయంపైకి గొనిపోయాడు. భారతదేశంలోని భూభాగంలో సింహభాగం సముద్రంలో కలిసిపోయింది. సంపూర్ణంగా ప్రాణికోటి తుడిచిపెట్టుకుపోయింది. నేలంతా జలమగ్నమై పోయిన కొన్నాళ్ళకి సముద్రం వెనక్కి వెళ్ళిపోగా భూభాగం మాత్రం స్థల రూపంలో గోచరించింది.