107 - మాస నక్షత్ర వ్రత మాహాత్మ్యం - సాంభరాయణుని కథ

“యుగపురుషుడవైన ఓ వాసుదేవా! ఐశ్వర్యాదులు లేకపోవడంవల్ల కలిగే బాధకన్నా ఉన్న దానిని, అనుభవిస్తున్న దానిని పోగొట్టుకుంటే కలిగే బాధ కొన్ని వందలరెట్లు ఎక్కువ. కాబట్టి హే పరంధామా! ఐశ్వర్య భ్రంశమూ, ఇష్ట వస్తు వియోగమూ కలగకుండా చేసే వ్రతమేదైనా ఉంటే ఉపదేశించండి” అని అడిగాడు క్షత్రియోత్తముడు, చెప్పసాగాడు దేశికోత్తముడు.

“ధర్మరాజా! నీ బాధ నాకర్థమైంది. ఇలాంటి బాధ నుండి విముక్తిని గోరే శ్రేష్ఠ పురుషులు పన్నెండు మాసాలలో పన్నెండు నక్షత్రాలలో భగవానుడైన అచ్యుతుని వివిధ ఉపచారాలతో పూజించాలి. ఈ నక్షత్ర వ్రతాన్ని కార్తికమాసంలో కృత్తికా నక్షత్రంలో మొదలు పెట్టాలి. అలాగే మార్గశిరం - మృగశిర, పుష్యం - పుష్య, మాఘం - మఘ; ఈ నాలుగు నెలల్లో కిచ్‌డీని భోగమిచ్చి దానితోనే బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. ఫాల్గునాది నాలుగు నెలల్లో ఆయా నక్షత్రాల్లో సంయావ (కజ్జికాయల) నైవేద్యం పెట్టాలి. అలాగే ఆషాఢాది నాలుగు నెలల్లో ఆయా నక్షత్రాల్లో పాయసాన్ని నైవేద్యం పెట్టాలి. వ్రతి పంచగవ్యాలను ప్రాశ్న చేసి భక్తిపూర్వకంగా నారాయణుని నర్చించి ఈ విధంగా ప్రార్థించాలి:

నమో నమస్తేఽచ్యుత మే క్షయోఽస్తు

పాపస్య వృద్ధిం సముపైతు పుణ్యం

ఐశ్వర్య విత్తాది తథాఽ క్షయం మే

క్షయంచ మా సంతతి రభ్యుపైతు

యథాచ్యుతస్త్వం పరతః పరస్మాత్

సబ్రహ్మభూతః పరతః పరాత్మా

తథాచ్యుతంమే కురువాంఛితం త్వం

 హరస్వ పాపంచ తథాప్రమేయ

అచ్యుతానంత గోవింద ప్రసీదయదభీప్సితం

తదక్షయ మమేయాత్మన్ కురుష్వ పురుషోత్తమ (ఉత్తరపర్వం: 107/12-14)

 అచ్యుతా! మీకు అసంఖ్యాక నమస్కారములు. నా పాపాలన్నీ నశించాలి. పుణ్యాలు వృద్ధి పొందాలి. నా ఐశ్వర్య, విత్తాదులు అక్షయం కావాలి. నా సంతానానికే కష్టమూ కలుగరాదు. మీరు ఎలాగైతే పరబ్రహ్మ, అచ్యుత, పరమాత్మగా నిలచి వున్నారో అలాగే నా భక్తినీ అచ్యుతం చేయండి. నాపట్ల ప్రసన్నులు కండి- అని దీని భావం.

అనంతరం రాత్రి భగవంతుని ప్రసాదాన్ని స్వీకరించాలి. సంవత్సరం పూర్తియైన తరువాత అచ్యుత భగవానులను మేలుకొలిపి నేతితో నింపిన తామ్రపాత్రను దక్షిణతో సహా బ్రాహ్మణునకిచ్చి అచ్యుతః ప్రీయతాం అని పలకాలి. ఇలా ఏడు సంవత్సరాలు నక్షత్ర వ్రతాన్ని చేసి చివర్లో అచ్యుత దేవుని స్వర్ణ ప్రతిమను నిర్మింపజేసి స్థాపించి దానికెదురుగా పరమభక్తురాలూ, పతివ్రతా, బ్రాహ్మణీయగు సాంభరాయణీ దేవి యొక్క వెండి మూర్తిని తయారుచేయించి స్థాపించాలి. పిమ్మట వారిద్దరినీ గంధ పుష్పాదులతో పూజించి క్షమా ప్రార్ధన చేసి మొత్తం పూజా సామగ్రిని బ్రాహ్మణునికిచ్చి వేయాలి. ఈ ప్రకారంగా శ్రద్ధాపూర్వకంగా ఈ వ్రతాన్నాచరించి అచ్యుత భగవానుని పూజించిన వారికి ధన, సంతతి, ఐశ్వర్యాదులెప్పటికీ, క్షయం చెందవు, ఎన్నటికీ క్షీణించవు. వారి సమస్త అభిలాషలూ తీరుతాయి. కాబట్టి సర్వథా అక్షయ ప్రాప్తి కావాలంటే మనుష్యుడు ఈ మాస నక్షత్ర - వ్రత పాలనం చేయాలి.”

ధర్మజుని అభ్యర్థన మేరకు సాంభరాయణీ వృత్తాంతాన్ని చెప్పసాగాడు చెన్నకేశవుడు ఇలా:

“పురాతన కాలం నుండీ స్వర్గంలోనే వున్న ఒక సిద్ధ స్త్రీ ఈమె. గొప్ప తపోధన, కఠిన వ్రతాచరణకు కాణాచి ఆ కాంత. దేవతల మొత్తం జగత్తులో ఎవరికే సందేహమొచ్చినా తీర్చగల పాండిత్య దిగ్దంతి ఆ బ్రాహ్మణి. ఒకనాడు దేవేంద్రుడు బృహస్పతిని తనకంటె ముందా పదవికి వచ్చిన అందరు ఇంద్రుల విశేషాలూ వినగోరి అడిగాడు. బృహస్పతి కొందరి గురించైతే చెప్పగలనన్నాడు. తాను బృహస్పతిగా రాకముందలి ఇంద్రుల చరితలు తాను చెప్పలేనన్నాడు. ఐతే అలా చెప్పగల వ్యక్తి ఒకే ఒకరున్నారనీ ఆమె సాంభరాయణి అనీ మార్గం తెలిపాడు.

బృహస్పతిని తోడు తీసుకొని సాంభరాయణి వద్దకు స్వయంగా వెళ్ళాడు దేవేంద్రుడు. ఆమె సంభ్రమంగా లేచి నిలబడి మిక్కిలి వినయ విధేయతలతో వారిద్దరినీ సత్కరించి అర్ఘ్యాదులతో పూజించి కుశల ప్రశ్నలడిగింది. ఆ తరువాత బృహస్పతి ఆమెకు దేవరాజు అభ్యర్ధనను వినిపించాడు.

ఆమె ఇలా చెప్పసాగింది. ‘అదృష్టవశాత్తూ నేను మనువులనూ, దేవసృష్టులనూ సప్తర్షులనూ చూచి యున్నాను. మనుపుత్రులూ, మన్వంతరాల చరిత్రలూ నాకు తెలుసు. మీరడిగిన దేదైనా సరే చెప్పగలగడం నా భాగ్యంగా భావిస్తాను.’

స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష మున్నగు మనువుల కథలనూ ఆయా మన్వంతరాలలో ఇంద్రులైన వారి వివరాలనూ అడిగాడు దేవరాజు.

ఆమె అన్ని వివరాలనూ వృత్తాంతలనూ సంపూర్ణంగా చెప్పింది. ధర్మజా! వాటన్నిటిలోకీ ఆశ్చర్యకరం శంకుకర్ణుని కథ. ఇతడొక గొప్ప ప్రతాపవంతుడైన దైత్యుడు. అతడు లోక పాలకులందరినీ గెలిచి నిర్భయంగా ఇంద్రుని భవనంలో ప్రవేశించాడు. ఇతనిని చూడగానే అప్పటి ఇంద్రుడు భయపడి కనుమరుగు కాగా శంకు కర్ణుడు తిన్నగా పోయి ఇంద్రుని సింహాసనంలో కూర్చున్నాడు. సరిగ్గా అదే సమయానికి దేవతలతో సహా శ్రీ మహావిష్ణు వక్కడికి విచ్చేశాడు. ఆయనను చూడగానే ‘ధన్యోస్మి’ అంటూ సింహాసనం నుండి లేచి నిలబడిన శంకుకర్ణుడు విష్ణువున కెదురేగి ఆయనను ఆలింగనం చేసుకున్నాడు. అతని ఇంగితాన్ని పసిగట్టిన భగవంతుడు తానే అతనిని మరింత గట్టిగా ఆలింగనం చేసుకొని కౌగిలిపట్టు బిగించి ఎముకలు నుజ్జు నుజ్జు గావించడంతో శంకు కర్ణుడు భయంకర శబ్దాలు చేస్తూ మరణించాడు. వెంటనే ఎక్కడో దాక్కున్న ఇంద్రుడు వచ్చి విష్ణువును పలు విధాల స్తుతించాడు ‘దేవేంద్రా ఈ సంఘటనను నేను స్వయంగా చూశాను” అందామె.

‘ఇన్ని యుగాలపాటు నీవు స్వర్గంలో ఎలా వున్నావు? నీకీ అక్షయ స్వర్గ నివాస ప్రాప్తి ఎలా కలిగింది?’ అడిగాడింద్రుడు.

‘దేవరాజా! నేను ప్రతి మాసమూ మాస నక్షత్ర వ్రతాన్ని సంపూర్ణంగా ఏడేళ్ళపాటు ఆచరించాను. ఇదంతా దాని పుణ్యఫలమే. పురుషుడు కానీ స్త్రీ కానీ స్వర్గవాసం, ఇంద్ర పదవి, ఐశ్వర్యం, సంతతి మున్నగునవి అక్షయంగా కావాలనుకుంటే అవశ్యం ఈ వ్రతం ద్వారా మహావిష్ణువు నారాధించాలి. నాలుగు పురుషార్థాలనూ ఈయగలవాడు నారాయణుడే’

ధర్మజా! దేవరాజూ, దేవగురువూ కూడా సాంభరాయణీ దేవికి కృతజ్ఞతలు చెప్పుకొని తమ తమ నెలవులకు పోయి వీలైనంత వేగంగా మాస నక్షత్ర వ్రతాన్ని చేయడం మొదలెట్టారు.”