భవిష్య పురాణము

90 - అనంగ త్రయోదశీ వ్రతం

“మానవజాతిని పాపముల నుండి సముద్ధరించడానికే అవతరించిన వాసుదేవా! నీ మాటలెంతసేపు విన్నా తనివి తీరడం లేదు. నాపై దయతో ఈ విషయం చెప్పు. రూప సౌభాగ్యాలను ప్రదానించే ఒక వ్రతాన్ని ఆనతియ్యి” అని వినయంగా అడిగాడు పాండవాగ్రజుడు.

“మహారాజా” అంటూ ఆతనిని మన్నించి చెప్పసాగాడు మాధవుడు, “శరీరానికి క్లేశాన్ని కలిగించని ఒక వ్రతాన్ని విను. దీని పేరు అనంగ త్రయోదశి ఇది అన్ని దోషాలనూ శమింపజేస్తూ సమస్త మంగళలానూ వృద్ధిపరుస్తూ రూప సౌభాగ్యాలను కూడా ప్రదానం చేస్తుంది.

ప్రాచీన కాలంలో పరమశివుడు, మన్మథుని దగ్ధం చేసిన తరువాత అతడు అంగములు లేనివాడైననూ, అనగా అనంగుడైననూ అందరి అంగాలనూ వారి వారి మనస్సుల ద్వారా ఆవేశించి నివసించేవాడు. కామదేవుడే ఈ వ్రతాన్ని ఆచరించాడు. అప్పటి నుండే దీనికి అనంగ త్రయోదశి అని పేరు వచ్చింది.

ఈ వ్రతాన్ని మార్గశిర శుక్ల త్రయోదశినాడు ప్రారంభించాలి. ఆరోజు ప్రొద్దున్నే నదిలోగాని తటాకంలోగాని స్నానం చేసి జితేంద్రియులై పుష్పధూపదీప నైవేద్యకాలోద్భూత ఫలాలతో పరమేశ్వరుని శశిశేఖర నామాన్ని అనేక పర్యాయాలు జపిస్తూ పూజించాలి. తరువాత తిలాసహిత అక్షతలతో హవనం చేయాలి. రాత్రి తేనెను మాత్రమే ‘ప్రాశ్న’ చేయాలి. అంటే నోట్లో వేసుకోవాలి. నేలపై శయనించాలి దీనివల్ల ప్రతులు సుందర రూపులౌతారు. పైగా పది అశ్వమేధాలు చేసిన పుణ్యం వస్తుంది.

(మిగతా మాసాల్లో శంకరనామ ప్రాశ్న ఫలాది వివరాలు ఈ క్రిందనీయబడినవి)

మాసం         శివనామం     ప్రాశ్న            ఫలం  

పుష్య               యోగేశ్వర      చందనం         రాజసూయ

మాఘ మహేశ్వర       ముత్యపుపొడి ఉత్తమ సౌభాగ్యం

ఫాల్గున           హరేశ్వర         కంకోల           అతుల సౌందర్యం

చైత్ర                 సురూపక        కర్పూరం         చంద్ర తుల్య

                                                                        మనోహరత, సౌభాగ్యం                                 వైశాఖ మహారూప     జాపత్తిరి          సహస్ర గోదాన,

                                                                        బ్రహ్మలోక ప్రాప్తి

జ్యేష్ఠ                ప్రద్యుమ్న        లవంగ            ఉత్తమ స్థానం,

                                                                        శ్రేష్ఠ సంపదలు, 108 వాజపేయాలు

ఆషాఢ            ఉమాభర్తా      తిలోదక          ఉత్తమ రూపం,

                                                                        నూరేళ్ళసుఖ జీవనం

శ్రావణ             ఉమాపతి        తిలలు             పౌండరీక యజ్ఞ

భాద్రపద         సద్యోజాత       అగరు గురుపదవి, పుత్ర పౌత్ర

                                                                        ధనవృద్ధి విష్ణులోక ప్రాప్తి

ఆశ్వయుజ     త్రిదశాధిపతి   స్వర్ణోదకం       కోట్ల నిష్కదాన

                                                                        ఉత్తమ రూపం, ప్రగల్భత

కార్తిక              విశ్వేశ్వర          దమన ఫలం               శివలోక ప్రాప్తి

                                                                                    బాహుబలి

ఈ విధంగా ఒక యేడాదిపాటు ఈ ఉత్తమ వ్రతపాలనం చేసి పారణ దినాన ఒక కలశను స్థాపించి దానిపై నొకరాగి పాత్రనూ దానిపై శివుని ప్రతిమను స్థాపించి ఒక శ్వేత వస్త్రాన్ని కప్పాలి. గంధ పుష్ప ధూపదీప నైవేద్యాదులతో దానిని పూజించి అనంతరం ఈ మొత్తం పూజా సామగ్రిని ఒక శివభక్తుడైన బ్రాహ్మణునికివ్వాలి. దీనితో బాటు పాలిచ్చే గోవునూ, దూడనూ, గొడుగునూ, శక్తిమేరకు దక్షిణనూ ఇవ్వాలి. ఈ ప్రకారంగా అనంగ త్రయోదశి వ్రతాన్ని సంపూర్ణంగా అనుష్ఠించి పారణ సమయంలో ఒక మహోత్సవాన్ని చేయించినవారికి నిష్కంటక రాజ్యము, ఆయుర్దాయము, బలం, యశం, సౌభాగ్యము ప్రాప్తిస్తాయి. దేహాంతంలో శివలోక నివాసమూ లభిస్తుంది.