భవిష్య పురాణము

117 - భోజకులు - ఉత్పత్తి, లక్షణాలు

అరుణుడు మళ్ళా ఇలా అడిగాడు, ‘స్వామీ! ఈ భోజకుడెవరు? ఎవరి పుత్రుడు? బ్రాహ్మణాది వర్ణాలకంటె ఎక్కువగా తమరు భోజకుని ఇష్టపడడానికి ఆయన ఏయే ఉత్తమ కర్మలు గావించాడు?’

‘నాపూజ నిమిత్తమై నేనే నా తేజస్సు నుండి భోజకులను సృష్టించాను. వీరు బ్రాహ్మణ వర్ణమునకు చెందినవారే. నా పూజలను అనుష్టించడంలోనే మగ్నమై వుండే ఈ భోజకులంటే నాకు ప్రీతి.

ప్రాచీన కాలంలో శాకద్వీపపాలకుడైన ప్రియవ్రతుని పుత్రుడు విమానసమానమైన ఒక భవ్య సూర్యమందిరాన్ని నిర్మించి దానిలో ప్రతిష్ఠించడానికొక సర్వశుభలక్షణ లక్షితమైన సూర్య ప్రతిమను బంగారంతో తయారు చేయించాడు. దానిని ఎవరిచేత ప్రతిష్ఠింప చేయాలనే చింత రాజును ఆలోచనలో పడేసింది. అతని దృష్టికి ఎవరూ యోగ్యులుగా కనబడలేదు. అతడు చివరికి నన్నే ఆశ్రయించాడు. నేనతనికి ప్రత్యక్షమై ‘వత్సా! నేను నా తేజస్సుతో ‘మగ’ సంజ్ఞకులైన కొందరు బ్రాహ్మణులను ఉత్తమ పూజానిమిత్తమై సృష్టిస్తాను. అంటుండగానే చంద్ర సదృశమైన శ్వేతవర్ణంలో వెలిగిపోతున్న ఎనమండుగురు బలశాలులైన పురుషులు నా శరీరము నుండి ఉత్పన్నులైనారు. వారంతా కాషాయ వస్త్రధారులై పిటారీ మరియు కమల పుష్పాలను చేతులందుంచుకొని సాంగోపాంగంగా వేదాలను, ఉపనిషత్తులను అత్యుత్తమంగా చదువసాగారు. వీరిలో ఇద్దరు పురుషులు నా లలాటమునుండి, ఇద్దరు వక్షమునుండి, ఇద్దరు చరణాలనుండి, ఇద్దరు పాదాలనుండి పుట్టారు. ఆ మహాత్ములు నన్నే తండ్రిగా సంభావించి ‘హే పితృదేవా! మమ్మల్ని ఏదో పవిత్ర కర్తవ్యం నిర్వర్తించడానికే తమరు సృష్టించి వుంటారు. మాకు కర్తవ్యాన్ని ఉ పదేశించండి. మేము తమ ఆజ్ఞలను పాటిస్తాం.’ అన్నారు. నేను వారితో ‘పుత్రులారా! మీరందరూ ఈ రాజు వెంట వెళ్ళి ఆయన చెప్పిన పని చెయ్యండి’ అని చెప్పి రాజుతో ‘రాజా! వీరు నా తనయులు. బ్రాహ్మణులలో శ్రేష్టులు. సర్వదాపూజ్యులు. నన్ను మీ మందిరంలో ప్రతిష్ఠించడానికి మీరు సర్వవిధాల అర్హులు. యోగ్యులు. వీరిచేత ఆ పని చేయించు. ఆ మందిరాన్ని వీరికే సమర్పించు. నా పూజలనే వీరు ఎల్లప్పుడూ చేస్తుంటారు. ఒక మారు వీరికిచ్చిన దానిని తిరిగి గ్రహించకు. నా నిమిత్తమై సమర్పించబడిన ధన - ధాన్య, గృహ, క్షేత్ర, వన, గ్రామ, నగర, ఇత్యాదులలో ఎన్ని మందిరంలో సమర్పిస్తావో వాటన్నిటికీ వీరే అధికారులు. తండ్రి ద్రవ్యంపై అధికారం కొడుకులదే కదా! వీరిని భోజకులంటారు’ అని ఆజ్ఞాపూర్వకంగా చెప్పాను. అతడు నేను చెప్పినట్టే ఆ భోజకులను నెత్తిన బెట్టుకొని మందిరంలో నన్ను ప్రతిష్ఠింపించి మందిర సర్వస్వాన్నీ వారి హస్తగతం చేశాడు.

కాబట్టి అరుణా! ఈ ప్రకారం నాపూజల కోసం నేనే నా తేజస్సుతో నా శరీరం నుండి భోజకులను సృష్టించాను. వీరు నా ఆత్మస్వరూపులు. నా ప్రీతికై ఎవరేమి ఇవ్వదలుచుకొన్నా భోజకులకీయవచ్చు. కాని ఒక మారు వారికిచ్చిన దానిని తిరిగి తీసుకోకూడదు. వారు నా సంపూర్ణద్రవ్యానికి స్వాములు.

అరుణా! ఇక భోజకులకుండవలసిన లక్షణాలను వివరిస్తాను, విను. భోజకుడు ముందు క్షుణ్ణంగా వేదాధ్యయనం చేసి అప్పుడు గృహస్థజీవనంలో ప్రవేశించాలి. నిత్యం త్రికాల స్నానాలు చేసి రాత్రి, పగలూ (ఇజ్యా, అభిగమన, ఉపాదన, స్వాధ్యాయం, యోగ అనేవి పంచ ఉపాసనాభేదాలు. ప్రతిమా - పూజనం, సంధ్యా - తర్పణం, హవన - పూజనం, ధ్యానం - జపం సూర్యచరిత్ర పఠనం పై ఉపాసనలతో సమ్మిళితమైతే పంచకృత్యాలవుతాయి.) పంచకృత్యాలద్వారా నన్ను పూజిస్తుండాలి. వేదాలను, బ్రాహ్మణులను, దేవతలను ఎట్టి పరిస్థితులలోనూ నిందించరాదు. నా సమ్ముఖంలో నిత్యం శంఖధ్వనిని చేస్తుండాలి. అంటే శంఖం పూరిస్తుండాలి. పురాణ శ్రవణమంటే నాకెంత ప్రసన్నతో నీకు తెలుసుకదా! ఆరునెలలు ఎవరైనా పురాణ శ్రవణం చేసినా చేయించినా ఎంత సంతోషిస్తానో! నా పూజలో ఒక్కసారి శంఖం పూరిస్తే అంత సంతోషపడతాను. భోజకులు తినకూడనిదేదీ తినరు. అందుకే వారిని భోజకులంటారు. వారు నాకు నిత్యమూ భోజనం పెడతారు. అందువల్ల కూడా వారిని భోజకులంటారు. వారు సదా ‘మగ’ ధ్యానం (మగ అనగా సూర్యపుత్రులు) లో వుంటారు. అందుకని వారిని మగధులంటారు. వారు పరమశుద్ధులై ‘నిత్యఅవ్యంగధారులై’ వుంటారు. అవ్యంగధారణ లేకుండా నా పూజ చేసే వానికి సంతానం కలుగదు. నా కరుణ వానిపై ప్రసరింపదు. భోజకునికి శిఖ వుండాలి. జుత్తు వుండకూడదు. వారు రవి వారమునాడు. షష్ఠినాడు నక్తవ్రతం చేయాలి. సప్తమినాట ఉపవాసం చెయ్యాలి. సంక్రాంతినాడు వ్రతం చెయ్యాలి. నా సమ్ముఖంలో మూడు కాలాలలోనూ గాయత్రి జపించాలి. భక్తి శ్రద్ధలతో మౌనంగా నా పూజ గావించాలి. క్రోధాన్ని వర్ణించాలి. నా నైవేద్యాన్నే సదా భక్షించాలి. పవిత్రత విషయంలో నా నైవేద్యమేదైనా వారికి హవిష్యాన్ని సమానము. అది వారిని శుద్ధి చేస్తుంది. నాకు నివేదించి వారికి సమర్పించిన గంధ, వస్త్ర, భూషణాదులను అమ్ముకోరాదు. నాకు స్నానం చేయించిన జలాలను, నాపూజకై వేయబడిన పూలను, అగ్నిని, ఇతర ద్రవ్యాలను (అంటే నిర్మాల్యాలను) అనాదరణ చేయరాదు. రోజులో ఒకమారే భోంచేయాలి. క్రోధాన్ని విసర్జించాలి. అమంగళవచనాలను పలుకరాదు. అశుభకర్మలు తలపెట్టరాదు.

అరుణా! “ఈ లక్షణాలున్న భోజకులంటే నాకిష్టం. నువ్వంటే ఎంత యిష్టమో అంత ఇష్టం” అని సూర్యుడన్నాడని చెప్పిన పరావసువు సత్రాజిద్దంపతులకు ఇలా చెప్పాడని బ్రహ్మ నారాయణునకు విన్నవించాడు.

“ప్రభో! పరావసువు ఉపదేశాన్ని విన్న రాజదంపతులు పరమానందభరితులై తమ రాజ్యంలో అన్ని సూర్యమందిరాలనూ తుడిపించి కడిగించే ఏర్పాట్లు చేశారు. ప్రతి దేవాలయంలోనూ పురాణ శ్రవణాన్ని చేయించి పౌరాణికులను దక్షిణలతో సంతృప్తి పఱచారు. స్వయంగా నిత్యసూర్యోపాసన చేసి దేహాంతంలో ఉత్తమ గతులను, ఈప్సి తార్థాలను పొందారు.