భవిష్య పురాణము

100 - వైశాఖ కార్తీక మాఘ పున్నమి వ్రతాలు

“పరంధామా! సంవత్సరం మొత్తం మీద ఏయే తిథులలో స్నాన దానాదికములు అధిక పుణ్య ప్రదాలౌతాయి.”

“ధర్మజా! వైశాఖ, కార్తిక, మాఘ పున్నములు స్నానదానాదులకు అతిశ్రేష్ఠములు. ఈ తిథుల్లో అందరూ ఈ కర్మలను అవశ్యం అనుష్ఠించాలి. వైశాఖంలో ఉజ్జయిని వద్ద శిప్రానదిలోనూ, కార్తికంలో పుష్కరక్షేత్రంలోనూ, మాఘ పున్నమినాడు వారాణసిదరి గంగలోనూ స్నానాలు చేయాలి. ఈరోజుల్లో పితరులకు తర్పణలు చేయువానికి అనంత ఫలాలు లభించడమే కాక పితరులు కూడా ఉద్ధరింపబడతారు. వైశాఖ పౌర్ణమినాడు అన్న, సువర్ణ వస్త్ర సహిత జలపూర్ణ కలశమును బ్రాహ్మణునికి దానమిచ్చిన వానికి జీవితంలో ఏ దశలోనూ శోకమన్నది వుండదు. ఈ వ్రతంలో సుందర, మధుర భోజనంతో నిండిన పాత్ర, గో, భూ, సువర్ణ, వస్త్రాది దానాలు చేయాలి. మాఘ పున్నమినాడు దేవతలకూ, పితరులకూ తర్పణలిచ్చి సువర్ణ సహిత తిలపాత్ర, శాలువ, ఉన్ని బట్ట, రత్నాదులను భూసురునికివ్వాలి. కార్తిక పున్నమినాడు వృషోత్సర్గం చేయాలి. విష్ణు భగవానునికి నీరాజనాలివ్వాలి. పది రకాల ధేనుదానం చేయాలి. అరటి నుండి కొబ్బరి దాకా వీలైనన్ని పండ్లను, ప్రశస్తమైన వాటిని, దానం చేయాలి. ఈ పుణ్య తిథులలో స్నాన దానాలను చేయనివారు వచ్చే జన్మల్లో రోగులు, దరిద్రులు కాగలరు. బ్రాహ్మణులకిచ్చే దానాలు నిస్సంశయంగా గొప్ప ఫలాలనిస్తాయి. అలాగే సోదరీమణులకు, తల్లిదండ్రుల మనుమలకు, మేనత్తలకు, బంధువులలోని దరిద్రులకు ఇచ్చే దానాలు కూడా గొప్ప పుణ్య ఫలాలనిస్తాయి. అతిథులకిచ్చే దానం అమోఘ ఫలదాయకం. స్వర్గప్రాప్తిని కూడా కలుగజేస్తుంది. మహారాజా! సీతాలక్ష్మణ సమేతుడై శ్రీరామచంద్రమూర్తి వనవాసాని కేగినప్పటికి భరతుడు మేనమామల ఇంట్లో వున్నాడు. తనకి తెలియకుండానే ఆయన శ్రీరామ వనగమనానికి ముఖ్య హేతువైనాడు. అయోధ్యకు వచ్చిన పిమ్మట కాని భరతునికి తన తల్లి తనకోసమనుకొని చేసిన తప్పు తెలియరాలేదు. తల్లి ఎంత చెప్పినా రాజ్యాభిషేకాని కంగీకరింపక పోగా ఆమెను చాలా తీవ్రంగా మందలించాడు. కోపించాడు, శపించాడు. చివరగా ఇలా అన్నాడు. ‘అమ్మా! దేవపూజితములు సకల పుణ్యదములునైన వైశాఖ, కార్తిక, మాఘ పున్నములు నా స్నానదానాలు లేకుండా వ్యతీతం కాలేదు. ఇక ముందూ కావు. అలాగే రామన్న గద్దెపై నేనుండడం కలలోనైనా జరగలేదు. జరగబోదు’ అని నిష్కర్షగా చెప్పాడు. అప్పుడు కైకహతాశురాలు కాగా కౌసల్యకు భరతునిపై నమ్మకం కుదిరింది. ఇవి అంత గొప్ప తిథులు నిజానికి వీటి సంపూర్ణ మాహాత్మ్యాన్ని వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ తిథులలో జల, అన్న, వస్త్ర, స్వర్ణ పాత్ర, ఛత్రాదులను దానం చేసేవాడు ఇంద్రలోకంలో ఎన్నో యేళ్ళపాటు నివసిస్తాడు.”