147 - కాంచనపురీ వ్రత విధి

ధర్మనందనా! విశ్వమును ఉత్పత్తి చేసి, లాలించి పాలించి, సమయం వచ్చినపుడు సంహార కారకుడయ్యే అక్షర పురుషోత్తముడైన విష్ణుభగవానుడు శ్వేత ద్వీపంలో సుఖ పూర్వకంగా కూర్చొని యుండగా, నొకమారు లక్ష్మీదేవి ఆయన చరణాలకు పంచాంగ ప్రణామం చేసి ఇలా అడిగింది:

‘భగవన్! మీరు భక్తులపై మిక్కిలి దయను చూపించువేల్పునాపై కూడా అలాంటి దయతోనే ఒక సర్వోత్తమ వ్రతాన్నుపదేశించండి. ఆ వ్రతం చేస్తే రూప సౌభాగ్యాలతోబాటు సమస్త తీర్థ సంసేవనాది పుణ్యం కూడా కలగాలి. అలాంటి ఉత్తమ వ్రతాన్ని ఉపదేశించండి.’

విష్ణు భగవానుడిలా చెప్పాడు:

‘దేవీ! ఆశ్రమాలలో గృహస్థాశ్రమం వలె, వర్ణాలలో బ్రాహ్మణంలాగ, నదుల్లో గంగతీరున, జలాశయాల్లో సముద్రం భంగి, దేవతలలో నా (విష్ణు) పోలిక, స్త్రీ మూర్తులలోనీ (లక్ష్మి) కరణి వ్రతాలలో కాంచనపురీ వ్రతం అత్యుత్తమం. ఈ వ్రతాన్ని ప్రథమంగా భగవతి పార్వతి శంకర భగవానులతో కలసి అనుష్టించింది. సీతాదేవి శ్రీరామునితో కలిసి ఈ వ్రతాన్ని చేసి ఉత్తమ ఫలితాలు పొందినది. దమయంతీ వియోగ సమయంలో నలమహారాజు ఇదే వ్రతాన్ని చేసి ఆమెనూ, అఖండ సామ్రాజ్యాన్నీ సాధించుకున్నాడు. భద్రే! ఈ వ్రతం ఇంద్రాణి, అరుంధతి, సరస్వతి వంటి ఎందరో గొప్ప గొప్ప స్త్రీలచే అనుష్టింపబడి వారిని సౌభాగ్యవతులను చేసింది.

సామాన్య మానవులలో బ్రహ్మహత్యాది మహాపాతకాలు చేసినవారూ, నూనెను అమ్మినపుడు త్రాసులో తేడాను పెట్టి మోసం చేసేవారూ, కన్యనూ, ఆవునూ అమ్ముకొనేవారు, మాంస భక్షకులూ భూమిని ఆక్రమించేవారూ పశ్చాత్తప్తులై ఈ వ్రతాన్ని చేస్తే ఆ పాపాల నుండి నిస్సందేహంగా ముక్తులౌతారు.

రమా! ఈ కాంచనపురీ వ్రతాన్ని ఏ మాసంలోనైనా ఏ పక్షంలోనైనా తదియ, ఏకాదశి, పూర్ణిమ, సంక్రాంతి, అమావాస్య, అష్టమిలలో ఏదో ఒకరోజు ఉపవాస పూర్వకంగా చేయవచ్చు. వ్రతి ఈ రోజు కాంచనపురిని తయారుచేసి దానమివ్వాలి. ముందుగా పూర్వాహ్ణంలో నద్యాదులలోని శుద్ధ నిర్మల జలంలో స్నానం చేయాలి. ముందు మంత్ర పూర్వకంగా పవిత్రమైన మట్టిని శరీరంపై పూసుకొని స్నానం చేయాలి. ఇలా చేసి శుద్ధాత్మయై ఇంటికి వచ్చిన ప్రతి ఆ రోజు పాఖండులు, విధర్శులు, ధూర్తులు, శఠాదులతో మాట్లాడరాదు. చేతులు, కాళ్ళు కడుగుకొని ఆచమనం చేసి ఒక ఉత్తమ జలంతో నిండిన స్వర్ణయుక్త శంఖాన్ని తీసుకొని ఆ జలాన్ని ద్వాదశాక్షర మంత్రంతో అభిమంత్రితం చేసి ‘హరి’ మంత్రాన్ని జపిస్తూ త్రాగి వేయాలి. శమీ వక్షము నుండి చేసిన నాలుగుస్తంభాల మధ్య నాలుగుహస్తాల ప్రమాణంలో నొక వేదిని తయారుచేయాలి. దానిని పుష్పమాల, వితానం, దివ్య ధూపాదులతో అధివాసితమూ, అలంకృతమూ చేయాలి. వేది మధ్యలోనొక పద్మాన్ని రచించాలి. (వేది కావచ్చు.)  మండల మధ్యంలో నొక సుందరమైన భద్ర పీఠాన్ని నిర్మించాలి.

భద్రపీఠంపై నొక సుందర ఆసనంలో లక్ష్మీదేవినీ జనార్దనునీ స్థాపించాలి. అందులో క్షీరసాగరాన్ని భావించుకోవాలి. కలశపై నాలుగు లేదా రెండు లేదా ఒక పలపరిమాణంలో కాంచనపురి యొక్క స్వర్ణమయ ప్రతిమను చేయించి స్థాపించాలి. మండలాగ్రంలో నొక జలపూర్ణ కలశను స్థాపించి దానికెదురుగా అరటి స్తంభాన్నీ తోరణాలనూ పెట్టాలి. బ్రాహ్మణుల ద్వారా ప్రతిష్ఠించాలి.

ఆ పురి మధ్యలో విష్ణు సహిత లక్ష్మీ స్వర్ణ ప్రతిమను స్థాపించాలి. పంచామృతాలతో వారికి స్నానాలు చేయించి మంత్రోచ్చారణ గావిస్తూ చందన, పుష్పాది ఉపచారాల ద్వారా పూజ చేయాలి. ఇంద్రాదిలోకపాలురను కూడా యథాక్రమంగా పూజించాలి. విఘ్న నివారణకై వినాయకునీ, నవగ్రహాలనూ పూజించి హవనాలివ్వాలి. తరువాత పాయసం, సోహాలం, పీచు మిఠాయి, లడ్లు మున్నగువానిని నైవేద్యాలుగా అర్పించి దేశ కాలానుసారంగా పండ్లను కూడా పెట్టాలి. పది దెసలలో పది నేయి దీపాలను వెలిగించాలి. పుష్పమాలలనూ, చందనాన్నీ వేయాలి. విష్ణుస్తవరాజాన్నీ పురుష సూక్తాదులనూ చదవాలి. పదహారుగురు బ్రాహ్మణులను వారి పత్నులతో సహా ఆహ్వానించి ప్రతి జంటలోనూ లక్ష్మీనారాయణులను ఊహించుకొని పూజించాలి. చివర పూజాద్రవ్యాలన్నిటినీ వారికి నివేదించి బ్రాహ్మణ దేవతలారా! విష్ణుభగవానుడు నాపట్ల ప్రసన్నుడగుగాక!’ అనాలి వారు ‘తథాస్తు’ అనాలి.

కాంచనపురి ప్రతిమను ఇప్పటిదాకా ప్రతి చూడకూడదు. ఇపుడు ఆచార్యుడు దానిని వస్త్రంతో మూసి ఒక దీపంతో సహా తెచ్చి ముందు ప్రతిని కళ్ళు మూసుకొమ్మని వస్త్రాన్ని తొలగించి ‘ఇప్పుడు చూడు. నీ సర్వకామనలనూ ఇచ్చునదీ, అన్ని దుఃఖ దౌర్భాగ్యాలనూ దూరం చేసేదీ అగు ఈ రమణీయ కాంచనపురిని దర్శించు’ అనాలి.

చూచిన తరువాత వెండిగానీ రాగిగానీ వాడి ఒక శంఖమును తయారుచేసి అందులో పంచరత్నాలు, గంగాజలం, ఆవాలు, అక్షతలు, రోచన, పెరుగు కలిపిన అర్ఘ్యమును తయారుచేసి విష్ణుమూర్తికి ప్రదానం చేస్తూ ప్రతి ఇలా అనాలి : ‘సకల మనోవాంఛలనూ సాకల్యంగా తీర్చునట్టి భగవంతుడైన లక్ష్మీనారాయణా! ఈ కాంచనపురీ వ్రతాన్ని చేసిన నా మనస్సుకి ఆనందాన్ని కలిగించు. నారాయణా! లక్ష్మీనాథా! జగన్నాథా! మీరు ఈ అర్ఘ్యాన్ని గ్రహించండి. మీకు నమస్కారము’ తరువాత లక్ష్మీదేవికి అర్ఘ్యమిచ్చి ఆమెనిలా వేడుకోవాలి.

‘దేవీ! బ్రహ్మవిష్ణు మహేశులచే పార్వతీదేవిచే కార్తికేయునిచే పూజలందుకొనే మీరు నా ఈ స్వల్ప పూజనూ అర్ఘ్యాన్నీ ఆదరించి స్వీకరించాలి. నాకు సౌభాగ్యాన్నీ, పుత్ర, ధన, పౌత్రవృద్ధినీ అనుగ్రహించండి.’

వ్రతాన్ని ఈ విధంగా పూర్తిచేసి ఒక పెద్ద ఉత్సవాన్ని నడిపించి రాత్రంతా జాగరం చేయాలి. ఈ జాగరానికి వందయజ్ఞాల ఫలం వుంటుంది. ప్రాతఃకాలంలో నిర్మలజలంతో స్నానంచేసి దేవతలనూ, పితరులనూ పూజించి బ్రాహ్మణులను వారి పత్నులతో సహా ఆహ్వానించి భోజనాలు పెట్టి యథాశక్తి దక్షిణలివ్వాలి దీన, అంధ, బధిర, పంగ్వాదులను అన్న వస్త్రదానాలతో ఆనందింపజేయాలి. తరువాత బంధుమిత్రులతో కలిసి మధురాహారాలతో కూడిన భోజనం చేయాలి. ఈ విధంగా వ్రతం చేసినవారు దేహాంతంలో బ్రహ్మలోకాన్ని చేరుకొని బ్రహ్మదేవుని సన్నిధిలో ఆనందమయ జీవనాన్ని గడుపుతారు. అలాగే రుద్రలోకంలో విష్ణులోకంలో గడుపుతారు. దేవీ! కాంచనపురీ నామకమైన ఈ వ్రతాన్ని ఎప్పుడో పూర్వకాలంలో చేశావు కాబట్టే త్రైలోక్య పూజితుడనైన నన్ను చేబట్టగలిగావు.’ ధర్మరాజా! ఇది కాంచనపురీ వ్రతవిధి.