భవిష్య పురాణము

20 - అశూన్య శయన వ్రతం

“తాపసోత్తమా! పుష్ప ద్వితీయ వ్రతాన్ని మీ ద్వారా తెలుసుకుని ధన్యుడనైనాను. ఫల ద్వితీయ వ్రతాన్ని గూర్చి కూడా వినగోరుతున్నాను.”

 సంతోషంగా చెప్పసాగాడు సుమంతుడు.

“ఈ ఫల ద్వితీయనే అశూన్యశయన ద్వితీయ వ్రతమని కూడా అంటారు. దీనిని విధిపూర్వకంగా నియమ నిష్ఠలతో చేసిన స్త్రీకి వైధవ్యముండదు. ఆమె భర్తకు కూడా ఎక్కువ కాలం ఎడబాటుండదు.

క్షీరసాగరంలో లక్ష్మితో బాటు విష్ణువు శయ్యపై శయనించిన సమయంలోనే ఈ వ్రతకాలం కూడా వస్తుంది. శ్రావణమాసం, కృష్ణపక్షం, విదియనాడు లక్ష్మీసమేత శ్రీవత్సధారి మహావిష్ణువును పూజించి చేతులు జోడించి ఈ క్రింది ప్రార్ధన చేయాలి.

శ్రీవత్సధారిః శ్రీకాంత శ్రీవత్స శ్రీపతే ఽవ్యయ

              గార్హస్థ్యం మా ప్రణాశం మేయాతు ధర్మార్థ కామదం

          గావశ్చ మా ప్రణశ్యంతు మా ప్రణశ్యంతు మే జనాః

              జామయో మా ప్రణశ్యంతు మత్తో దాంపత్య భేదతః

              లక్ష్మ్యా వియుజ్యేఽహం దేవన కదా చిద్యథా భవాన్

          తథా కళత్ర సంబంధో దేవమామే వియుజ్యతాం

           లక్ష్మ్యా నశూన్యం వరద యథా తే శయనం సదా

                   శయ్యా మమాప్య శూన్యాస్తు తథాతుమధుసూదన (బ్రాహ్మ 20/7-11)

శ్లోకార్థాన్ని బట్టి పతియే దీనిని చదవాలేమో ననిపించవచ్చుగాని పతి పత్నులలో ఎవరు చదివినా, వ్రతం చేసినా ఫలం సంపూర్ణంగా వస్తుంది.

ఈ రకంగా విష్ణువును ప్రార్థించి వ్రతము చెయ్యాలి. విష్ణుభగవానుని కిష్టమైన ఫలాలను ఆ ఋతువులో ఎక్కువగా లభించే వాటిని భగవానుని శయ్యపైనుంచి వ్రతం చేసేవారు రాత్రికి అవే పండ్లను భుజించి మరునాడు బ్రాహ్మణులకు దక్షిణనివ్వాలి.

పండ్ల విషయంలో జాగ్రత్త వహించాలి. ఎప్పుడూ కూడా పచ్చివి, కుళ్లినవి, ముక్కలైనవి దేవునికి నివేదించరాదు. విష్ణుభగవానునికి ఖర్జూర, నారికేళ,(మాదీఫలం) మాతులుంగ వంటి మధుర ఫలాలను నివేదించవచ్చు. భగవంతుడు మధురఫలాలను సమర్పిస్తే ప్రసన్ను డౌతాడు. రెండవరోజు బ్రాహ్మణునికి కూడా అవే పండ్లను సమర్పిస్తూ వస్త్రాలు, అన్నము నుండి సువర్ణం దాకా యథాశక్తి ఇచ్చుకోవాలి.

ఇలా నాలుగు మాసాల పాటు చేసిన మగవానికి మూడు జన్మల దాకా సంపన్న గార్హస్థ్యజీవనము, ఐశ్వర్యప్రాప్తి కలుగుతాయి. ఈ వ్రతాన్ని చేసే నారీమణికి మూడుజన్మల దాకా వైధవ్యం రాదు. పతితో యెడబాటుండదు. ఐశ్వర్యానికి అంతమూ వుండదు.

అన్నట్టు మహారాజా! ఈ వ్రతం చేస్తున్నంతకాలం అశ్వనీ దేవతలను కూడా పూజించాలి.