118 - భద్ర బ్రాహ్మణుని కథ - దీపాదానం

విష్ణుదేవా! కార్తికమాసంలో సూర్యమందిరంలో దీపాన్ని వెలిగించేవానికి సంపూర్ణ యజ్ఞాల ఫలం లభించి సూర్యసమాన తేజస్సు కూడా ప్రాప్తిస్తుంది. ఈ సందర్భంలోనే భద్రుడను బ్రాహ్మణుని కథను విన్నవిస్తాను.

ప్రాచీనకాలంలో మాహిష్మతీనగరంలో నాగశర్మయను బ్రాహ్మణుడు నివసిస్తుండేవాడు. సూర్యభగవానులు ప్రసన్నులైవానికి వందమంది పుత్రులను ప్రసాదించారు. అందరిలోకి చిన్నవాని పేరు భద్రుడు. అందరిలోకి అత్యంత విచక్షణ గల విద్వాంసుడాయన. అందుకేనేమో సూర్యమందిరంలో నిత్యం దీపాలు వెలిగిస్తుండేవాడు. ఒకరోజు తన అన్నలాయనతో ఆదరంగా ఇలా అన్నారు.

‘భద్రా! నువ్వు సూర్యమందిరంలో గాని ఇంట్లో గాని పుష్ప ధూప నైవేద్యాలతో పూజలు చేయడం కాని బ్రాహ్మణులకు భోజనాలు పెట్టడం గాని మేమెన్నడూ చూడలేదు. కేవలం రాత్రింబవళ్ళు సూర్యదేవాలయంలో దీపాలు వెలిగిస్తూనే వుంటావు. దీనికి కారణమేమిటో మాకు చెప్పవా?’

‘అన్నలారా! ఈ విషయమై ఒక కథ వుంది విన్నవిస్తాను. ప్రాచీనకాలంలో ఇక్ష్వాకు మహారాజు పురోహితుడైన వసిష్ఠుడాయన చేత సరయూనదీ తీరంలో నొక సూర్యదేవాలయాన్ని నిర్మింపజేశాడు. రాజూ, రాజగురువూ కూడా అక్కడ గంధపుష్పాది నిత్యోపచారాలతో సూర్యపూజలను చేస్తూ, చేయిస్తూ వుండేవారు. ముఖ్యంగా దీపారాధన చేసేవారు. కార్తికమాసంలో ఏకంగా దీపోత్సవాలే చేస్తుండేవారు. అప్పట్లో నేను కుష్ఠాదిరోగపీడితుడనై అక్కడే పడివుండేవాడిని. ఏది దొరికితే దానితోనే కడుపు నింపుకుంటుండేవాడిని. అక్కడి వాస్తవ్యులు రోగినీ, దీనునీ, హీనునీ అయిన నాపై జాలిపడి భోజనం పెట్టేవారు. ఒకనాడు నాకు రాత్రి అంధకారాన్ని అవకాశంగా చేసుకొని ఆ సూర్యమందిరంలో అమూల్య సువర్ణాభరణాలను దొంగిలించాలనే దుర్బుద్ధి పుట్టింది. మంచి ఆలోచన వచ్చినా మరింత కాలం ఆగుతాం కాని చెడ్డ ఆలోచన వస్తే వెంటనే అమలు చేసే జాతికి చెందిన నేను కృతనిశ్చయుడనై మందిరంలోని భోజకులు నిద్రపోవడం కోసం నిరీక్షించసాగాను. వారు నిద్రించాక నిశ్శబ్దంగా లోనికి వెళ్ళాను. దీపం ఆరిపోయింది. ఏమీ కనబడుటలేదు. అపుడు నేనే ఒక చక్కని దీపాన్ని వెలిగించి, దానిలో మరింత నెయ్యి పోసి దాని వెలుగులో సూర్యదేవుని ఆభరణాలను ఒకటొకటిగా ఒలిచివేయసాగాను. అప్పుడే మేల్కొన్న దేవపుత్ర భోజకుడొకడు నన్ను పట్టుకున్నాడు. నా దీనస్థితిని చూసి జాలిపడి వదిలేశాడు. కాని అదే సమయానికి పహరా కాస్తున్న రాజపురుషులు నన్ను పట్టుకొని గుంజకి కట్టేసి విచారించసాగారు. అసలే రోగపీడితుడనై వున్న నేను వారు పెట్టబోయే హింసలకు విపరీతంగా భయపడి మరణించాను. అది కూడా సూర్యమందిరంలోనే జరిగింది. వెంటనే సూర్యదేవుని దూతలు వచ్చి నన్ను విమానంలో వారి లోకానికి తీసుకుపోయారు. అక్కడొక కల్పము కాలమున్నాను. ఆ పుణ్యశేషం వల్ల ఈజన్మలో ఉత్తమవర్ణంలో మీలాంటి ఉత్తమాగ్రజులకు తమ్మునిగా పుట్టాను. అన్నలారా! ఇది కార్తికమాసంలో సూర్యమందిరంలో దీపం వెలిగిస్తే వచ్చిన పుణ్యఫలం. దుష్టబుద్ధితో ఏ స్వామినైతే దోచేద్దామనుకున్నానో ఆ స్వామియే ఆసంగతిని విస్మరించి దీపాన్ని వెలిగించిన విషయాన్నే గుర్తుంచుకొని నన్నింతవాణ్ణి చేశాడు. బ్రాహ్మణవర్ణంలో జన్మనిచ్చాడు. వేదశాస్త్రాలు అధ్యయనం చెయ్యగల చేవనిచ్చాడు. అన్నింటినీ మించి పూర్వజన్మస్మృతినిచ్చాడు. అందుకే నేను నిత్యం సూర్యదేవాలయంలో దీపాలు వెలిగిస్తుంటాను’

ఇలా చెప్పిన బ్రహ్మ ‘విష్ణుదేవా! భద్రుని పుణ్యఫలం విన్నారు కదా! అందుచేత తనకు సర్వమంగళాలూ కళ్యాణాలూ కలగాలనే ఇచ్ఛ గలవాడు సూర్యమందిరంలో దీపాదానం చేస్తాడు’.