భవిష్య పురాణము

6 - మాతాపితల, గురువుల మహిమ

            ద్విజశ్రేష్ఠులారా! నాలుగు వర్ణాలవారికీ తండ్రియే అత్యుత్తమ సహాయకుడు. నాన్న వంటి బంధువులేడు. ఇది వేదోక్తమైనమాట. మాత, పిత, గురువు వీరే మనకి పథప్రదర్శకులు (సరైన దారిని చూపి నడిపించేవారు) ఈ మువ్వురిలో తల్లి స్థానం సమున్నతం. అన్నలలో ముందు పెద్దన్న, తరువాత చిన్నన్న ఆక్రమంలో అన్నలంతా ఆదరపాత్రులే. వీరందరినీ ద్వాదశి, అమావాస్య, సంక్రాంతి దినాలలో, యథారుచి, మణియుక్త వస్త్రాలతో, దక్షిణలతో గౌరవించుకోవాలి. దక్షిణాయన, ఉత్తరాయణ ప్రారంభాలలో, విషువ సంక్రాంతినాడు, చంద్ర, సూర్యగ్రహణాల్లో వీరికి సంతృప్తికరంగా భోజనాలు పెట్టి ఈ క్రింది మంత్రాలు చదువుతూ చరణాలపై బడి వందనాలు చెయ్యాలి.

పితరో జయంతీహ పితరః పాలయంతిచ

పితరో బ్రహ్మరూపాహితేభ్యో నిత్యం నమోనమః

యస్మాద్విజయతే లోకస్తస్మాద్ధర్మః ప్రవర్తతే

నమస్తుభ్యం పితః సాక్షాత్ బ్రహ్మరూప నమోఽస్తుతే

యాకుక్షి వికరేకృత్వా స్వయం రక్షతి సర్వతః

నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపేణీం

కృచ్ఛ్రేణమహతా దేవ్యా ధారితోఽహం యథోదరే

త్వత్‌ప్రసాదాత్ జగద్దృష్టం మాతార్నిత్యం నమోఽస్తుతే

పృథివ్యాం యాని తీర్థాని సాగరాదీని సర్వశః

వసంతి మత్రతాం నౌమి మాతరం భూతిహేతవే

గురుదేవప్రసాదేన అబ్ధా విద్యా యశస్కరీ

శివరూపనమస్తస్మై సంసారార్ణవ సేతవే

వేదవేదాంగ శాస్త్రాణాం తత్త్వం యత్ర ప్రతిష్ఠితం

ఆధారః సర్వభూతానామగ్ర జన్మన్ నమోఽస్తుతే

బ్రాహ్మణో జగతాం తీర్థం పావనం పరమంయతః

భూదేవ హరమేపాపం విష్ణురూపిన్ నమోఽస్తుతే (మధ్యమ 1/6/6 - 14)

            విధి పూర్వకంగా (శాస్త్రోక్తంగా) వీరికి వందనం చేస్తే సర్వతీర్థాలూ సేవించిన ఫలం దక్కుతుంది. ద్విజులారా! తండ్రిని వలెనే ఆయన అన్నదమ్ములను కూడా గౌరవించాలి. అందరికీ ఆచార్యుడైన బ్రహ్మదేవునీ, పితృతుల్యుడైన ప్రజాపతినీ, పుడమితల్లినీ పూజించాలి. తండ్రి మేరు స్వరూపుడు, వసిష్ఠస్వరూపుడు, ధర్మమూర్తి. ఈ సనాతన ధర్మమూర్తియే మనకు తొలిప్రత్యక్షదైవము. ఈయన ఆజ్ఞను పాలించుటయే పరమధర్మము. ఇలాగే పితామహి, పితామహులను కూడా గౌరవించుకోవాలి. వీరి పూజన - వందన, రక్షణ, పాలన, సేవన - అత్యంత మహిమాన్వితములు. వీరి సేవాపుణ్యానికి సాటిలేదు; ఎందుకంటే వారు మన తండ్రికే పూజ్యులైన తల్లిదండ్రులు.”