‘భగవాన్! కలికాలంలో ధర్మమెలా నిలద్రొక్కుకోగలదు?’ అని ప్రశ్నించారు చైతన్యులు.
‘మహాత్మా! ప్రాచీన కాలంలో కశ్యప మహర్షి యొక్క పుత్రుడైన కణ్వుడు ఆర్యావతి యను దేవకన్యను పత్నిగా పొందాడు. ఇంద్రుని ఆదేశంపై ఆ దంపతులు కురుక్షేత్ర వాహినియైన సరస్వతీనది యొడ్డుకు పోయి తపస్సుగావించారు. మహర్షియు మహావిద్వాంసుడునైన కణ్వుడు చతుర్వేదమయ సూక్తాలతో సరస్వతీదేవిని ఒక యేడాది పాటు స్తుతియించగా నామే ప్రసన్నయై ప్రత్యక్షమై ఆర్యసంతతిని సర్వసమృద్ధం చేసే వరాన్ని కణ్వునికిచ్చి అనుగ్రహించింది. ఈ వర ప్రభావంవల్ల కణ్వునికి అన్నివిధాలా ఆర్యులు, బుద్ధి జీవులునైన పదిమంది పుత్రులు జనించారు. (ఈ పురాణంలోనే ప్రతిసర్గ పర్వం, ప్రథమ ఖండం, ఆరవ అధ్యాయములో ఈ పదిమందీ కశ్యపుడను, బ్రాహ్మణుని పుత్రులని చెప్పబడింది. ఇది లేఖక భిన్నత్వ జనిత ప్రమాదం కావచ్చు) వారు ఉపాధ్యాయ, దీక్షిత, పాఠక, శుక్ల, మిశ్ర, అగ్నిహోత్రి, ద్వివేది, త్రివేది, పాండ్య, చతుర్వేది నామధారులై వర్ధిల్లారు. వీరి నామములు సర్వత్ర సార్థకాలైనవి. వీరంతా వినయసంపద ద్వారా సరస్వతీదేవిని ప్రసన్నం చేసుకొన్నారు. వారందరికీ ఆమె తన కన్యలనే వివాహార్థం ప్రదానం చేసింది. వారికి వరుసగా ఉపాధ్యాయీ, దీక్షితా, పాఠకీ, శుక్లికా, మిశ్రాణీ, అగ్నిహెూత్రిణి, ద్వివేదిని, త్రివేదిని, పాండ్యాయని, చతుర్వేదిని - అనే పేర్లను పెట్టి తానే పెంచి పెద్దచేసి కణ్వపుత్రుల పన్నెండవయేట వారికి కన్యాదానం చేసి పెండ్లిండ్లు చేసింది. వీరి పుత్రులే గోత్రర్షులయ్యారు. వారి పేర్లు: కశ్యప, భరద్వాజ, విశ్వామిత్ర, గోతమ (గౌతమ కాదు), జమదగ్ని, వశిష్ఠ, వత్స, గౌతమ, పరాశర, గర్గ, అత్రి, భృగు, అంగిరా, శృంగి, కాత్యాయన, యాజ్ఞవల్క్య.
సరస్వతీదేవి ఆజ్ఞ మేరకు కణ్వమహర్షి మిస్రదేశానికి వచ్చి అక్కడ పదివేలమంది మ్లేచ్ఛులకు సంస్కృత భాషను నేర్పి వారిని తన వశం చేసుకున్నాడు. కణ్వమహాముని తాను బ్రహ్మావర్తం వెళ్ళిపోతూ ఈ పదివేలమందినీ సరస్వతీదేవి అనుగ్రహం కోసం తపస్సు చెయ్యమని చెప్పాడు. వారు అలాగే అయిదేళ్ళపాటు తపించగా సరస్వతీదేవి సాక్షాత్కరించి వారికి వైదికమతంలోని శూద్రవర్ణాన్నీ శిల్పకార వృత్తినీ ప్రసాదించింది. గొప్ప గొప్ప శిల్పులంతా వీరి పుత్రులే. అంతేకాక శూద్రులకు ఇతర వర్ణాలలో ప్రావీణ్యం సంపాదించే అవకాశముండడంతో వీరిలో రెండువేలమంది ప్రతిభావంతులైన వైశ్యులుగా తయారయ్యారు. వారిలో నొకడు ‘పృథువు’ అను పేరుగలవాడు కశ్యపుని అహోరాత్రులూ సేవించి ధన్యుడైనాడు. ఆయన ఆదేశం మేరకు పన్నెండేళ్ళు ఘోరతపస్సు కూడా చేశాడు. కశ్యపుని కొడుకైన కణ్వమహర్షి ఈ పృథువు పట్ల పరమ సంతుష్టుడై ప్రసన్నుడై తాను స్వయంగా పృథువు కోసం దేవతలను ప్రార్ధించి అతనిని క్షత్రియునిగా రాజుగా చేయించాడు. రాజపుత్రపురమనే రాజ్యానికి పృథువు ఆ విధంగా రాజుగా ప్రతిష్ఠింపబడ్డాడు. అతని పత్నిపేరు రాజన్య. వారి పుత్రుడైన మాగధునికి కణ్వమహాముని తూర్పున గల మాగధీయ రాజ్యాన్ని ప్రదానం చేశాడు.
సరస్వతి కృపవల్ల ఆర్యుల సంఖ్య బాగా పెరిగింది. వారు దేవతలకు, పితరులకు హవ్యకవ్యాలను బాగుగా సమర్పించేవారు. అందరు ప్రజలూ దేవతోపాసనల ద్వారా దేవతలను తృప్తిపఱచారు. కలియుగంలో ఇరవైయేడు వందల ఇరవై సంవత్సరాలు గడిచాక బలివంశజుడైన ఒక మహారాక్షసుడు భూమి మీదికి వచ్చాడు. అతని పేరు మయుడు. అతడెన్నో మాయలు నేర్చి ముందు శాక్య సింహుడను పేరుతోనూ తరువాత గౌతమాచార్య నామంతోనూ పరమప్రసిద్ధుడై తానే ఒక గురుపీఠమై దైత్యపక్షాన్ని పెంచి పోషించసాగినాడు. అతడు మన అన్ని తీర్థాలలోనూ మాయామయ యంత్రాలను కొన్నిటిని స్థాపించాడు. వాటి క్రింది నుండి వెళ్ళిన ప్రతివాడూ బౌద్ధుడైపోయేవాడు. దానితో మన నేల నాలుగు చెఱగులా బౌద్ధం వ్యాప్తి చెందింది. కనీసం పదికోట్లమంది ఆర్యులు బౌద్ధమతావలంబులై పోయారు. ఈ మతాన్ని మెచ్చని వారొక అయిదు లక్షలమంది పర్వత శిఖరాలపైకి వలస పోయారు. ఈలోగా అగ్నివంశంలో ఉత్పన్నులైన రాజులు మన చతుర్వేదీయ సంస్కృతిచే ప్రభావితులై బౌద్ధ నాయకులను ఎదిరించి పోరాడసాగారు. మారు మనసు చేసుకున్న ఆర్యులను సంస్కరించి వైదికులనుగా మార్చారు. వింధ్య పర్వతమునకు దక్షిణంవైపు గల రాజ్యాలలో ఈ విధంగా వైదికమతం నిలదొక్కుకోగా వింధ్యోత్తర పుణ్యభూమి ఆర్యావర్తంలో కూడా కనీసం అయిదు లక్షలమంది వైదిక మతావలంబులైనారు.’
జగన్నాథస్వామి ఈవిధంగా చెప్పిన తరువాత చైతన్య మహాప్రభువు వైదికమతాన్ని మరింత పరిపుష్టం గావించారు. జగన్నాథుడంతర్ధానుడైన పిమ్మట శుక్లదత్తుని పుత్రుడైన నిత్యానంద మహాస్వామి అక్కడికి వచ్చి చైతన్యుల వారి శిష్యుడైనాడు. ఉషాపతియు శ్రీకృష్ణపౌత్రుడు నగు అనిరుద్ధుడు వారికి సాక్షాత్కరించి భూతలంపై, అద్భుతమైన అనితర సాధ్యమైన ‘మహత్త్వం’ యను పదవినిచ్చాడు. వారు చాలా సంతోషించి జగన్నాథుని సన్నిధికి వచ్చినవారు అనిరుద్ధుని కూడా దర్శించి పూజించిన వారికి స్వర్గప్రాప్తి కలగాలని కట్టడి చేశారు. అలాగే ఇక్కడి ప్రసాదాన్ని భక్తితో సేవించిన వారికి కోటి వేదజ్ఞ, ధనాఢ్య, ద్విజ జన్మలు కలుగుతాయని ఆశీర్వదించారు. ఇక్కడి మార్కడేయ వటం వద్ద శ్రీకృష్ణుని దర్శించి ఇంద్రద్యుమ్న సరోవరంలో స్నానం చేసినవారికి పునర్జన్మ వుండదనీ శాసించారు. శ్రద్ధాభక్తి సమన్వితులై ఈ కథను విన్నవారికి జగన్నాథ దర్శన ఫలం సిద్ధిస్తుందని కూడా ఈ మహాగురుద్వయం (చైతన్య నిత్యానందులు) వరమిచ్చారు.
జగన్నాథ స్వామి మరల అక్కడ ప్రత్యక్షమై ‘యజ్ఞాంశ చైతన్య మహాప్రభువుల నిత్యానందుల వాక్కు సత్యమగుగాక!’ అని ప్రకటించి అంతర్ధానం చెందాడు.
ఈమధ్యలో కలిపురుషుడు బలిని ప్రార్థించాడు. ఆయన విషయమంతా విని దుఃఖితుడై మయాసురుని పిలిచి ‘దైత్యేంద్రా! సుకందరుడను మేచ్ఛ మహీపతి మనవారి ఉన్నతికి పాటుపడడంలో తత్పరుడై యున్నాడు. నీవు పోయి వానికి సహాయపడు’ అని ఆజ్ఞాపించాడు. బలి ఆదేశాలను వెంటనే పాటిస్తూ జ్యోతిర్విద్యా విశారదుడైన ఆ మయాసురుడు ఒక వందమంది దైత్యులతో ఈ కర్మభూమి పైకి అడుగుపెట్టి దుష్టమ్లేచ్ఛ జాతికి జ్యోతిర్గణిత సహితంగా ఇరవైయొక్క అధ్యాయాలుగల రేఖా గణితంలో అత్యుత్తమ శిక్షణ నిచ్చి వారందరినీ గణితశాస్త్రంలో ఉద్దండ పండితులను చేసి పడేశాడు. ఆ శాస్త్ర పారంగతులైన మ్లేచ్ఛులు మన యొక్క సప్త ప్రముఖ నగరాలలో మాయామయ యంత్రాలను నిర్మించారు. ఆ యంత్ర ప్రభావం వల్ల అక్కడి జనులు మేచ్ఛ భావ పరిపూరితులై మ్లేచ్ఛ సిద్ధాంతాలను బలపరుస్తూ ఇంచుమించు మ్లేచ్ఛులై పోయారు.
ఆర్యులలోనిది గొప్ప ఉపద్రవాన్ని కలిగించింది. సర్వత్ర మహాకోలాహలాలు, హాహాకారాలు చెలరేగినాయి. ఈ దారుణం తమ దృష్టిలోకి రాగానే కృష్ణచైతన్యుల సేవక, శిష్యబృందాలు మహామంత్రాయుధులై మేచ్ఛ ప్రభావాన్ని నిర్మూలించడానికి ఆయా నగరాలవైపు పయనించారు. స్వామి రామానందుడు శిష్యులతో సహా అయోధ్యను చేరుకొని అక్కడి మ్లేచ్ఛ యంత్రాన్ని తన మంత్రశక్తి సహాయంతో వైష్ణవ యంత్రంగా మార్చివేశాడు. అక్కడి వారందరూ వెంటనే నుదుటిపై మూడేసి నిలువు గీతలను శ్వేతరక్త వర్ణాలలో ధరించసాగారు. కంఠాలందు తులసీమాలలను ధరింపజొచ్చారు. జిహ్వలపై రామనామమే నర్తిస్తుండగా వారంతా వైష్ణవులుగా మారారు. (ఇక్కడ చరిత్ర చెప్తున్నదేమిటంటే సికందర్ లోడీ ద్వారా బలవంతంగా మతం మార్చుకోవలసి వచ్చిన భారతీయులను ఆచార్య రామానందుడు, చైతన్య మహాప్రభువు రుద్ధి పూర్వకంగా మరల సనాతన హిందువులుగా స్వీకరించారు. సనాతన గోస్వామి స్వీయచరిత్రలో కూడా ఈ విషయం చెప్పబడింది. అనంతర కాలంలో శ్రీ దయానంద స్వామి కూడా ఇలాగే మతోద్ధరణను గావించారు.) వారిని సంయోగీ వైష్ణవులని పిలిచారు. మిగిలిన ఆర్యులు అయోధ్యలోనే వైష్ణవులుగా ఉండి పోయారు.
మహాబుద్ధిమతియగు నింబాదిత్యుడు తన శిష్యులతో సహా కాంచికాపురికి వెళ్ళాడు. అక్కడి రాజమార్గంలో వున్న మ్లేచ్ఛయంత్రాన్ని గమనించాడు. ఆయన తనకు గురువు గారిచ్చిన మంత్రాన్ని విలోమంగా అనగా తిరగేసి చదువుతూ అక్కడే వుండిపోయారు. కొన్నాళ్ళకి ఆ మ్లేచ్ఛ యంత్రం ప్రభావ శూన్యమై పనిచేయడం మానేసింది. నుదుటిపై నిలువు గీతనూ, కంఠంలో మాలనూ, పెదవులపై నిరంతరం గోపీవల్లభ మంత్రాన్నీ కలిగియుండి నిత్యసుశోభితులై అక్కడే నివసిస్తున్న నింబాదిత్యుల ప్రభావంవల్ల మ్లేచ్ఛులంతా ఆ ప్రాంతంలో సంయోగీ వైష్ణవులై పోయారు. అక్కడున్న యంత్రం నింబాదిత్యుల పునః ప్రయోగంవల్ల తిరగబడి తన ప్రాంతంలోకి వచ్చిన వారిని వైష్ణవులనుగా మార్చసాగింది. విష్ణుస్వామి హరిద్వారం పోయి అక్కడనున్న మ్లేచ్ఛయంత్రాన్ని విలోమం చేసి విష్ణు మహాయంత్రంగా మార్చివేయడంతో హరిద్వారం అనతి కాలంలోనే వైష్ణవమయమై పోయినది. నుదుటిపై రెండు నిలువురేఖలు, వాటిమధ్యమందు ఎఱ్ఱటిబొట్టు, కంఠంలో తులసిమాల, పెదవులపై నిత్యం కదలాడే మహామాధవ మంత్రములతో విష్ణుస్వామి కదలివస్తుంటే ఆ సంయోగీ వైష్ణవులకు శ్రీకృష్ణుడు కదలి వస్తున్నట్లే కనిపించేది.
మధ్వాచార్యులు మథురకు పోయి అక్కడి రాజమార్గంలో నున్న మ్లేచ్ఛ యంత్రాన్ని విలోమం చేశారు. నుదుట సగం మేరకు కరవీర పత్రాకారంలో శుభతిలకం. మెడలో తులసిమాల, అధరంపై నిత్యం రాధాకృష్ణ నామం మాధ్వులకు విధాయకాలు. ఆయన శిష్యుడు, శంకరాచార్యుడను పేరుగల మహానుభావుడొకాయన ఆయన ఆనతిపై కాశీపోయి అక్కడి యంత్రాన్ని విలోమం చేయడంతో ఆ యంత్ర పరిధిలోకి వచ్చిన వారంతా శైవులై పోయారు. నుదుటిపై అడ్డంగా త్రిపుండ్ర రేఖలు, కంఠానికి రుద్రాక్షమాల, పెదవులపై గోవింద మంత్రము ఈ శైవులకు విధాయకాలు. (న్యాయంగా ఇక్కడ పంచాక్షరీ మంత్ర ముండాలనేది ఇప్పటివారి ఆలోచన) అయితే, ఇదే సమయంలో గుణవంతుడైన వరాహమిహిరుడు ఉజ్జయని పోయి అక్కడి మ్లేచ్ఛ యంత్రాన్ని నిష్ఫలం చేసి శైవ మతాన్ని స్వయం ప్రచారం ద్వారా ప్రాచుర్యంలోకి తెచ్చినపుడు త్రిపుండ్ర, రుద్రాక్షమాలతో బాటు ‘శివ’ నామోచ్చాటనను విధించాడు. రామానుజులు తోతాద్రిలోనూ, వాణీభూషణుడు కన్యాకుబ్జంలోనూ, ధన్వంతరి ప్రయాగలోనూ, భట్టోజిశ్రేష్ఠుడు ఉత్పలారణ్యంలోనూ, రోపణుడు ఇష్టికాపురిలోనూ, జయదేవుడు ద్వారకలోనూ, మ్లేచ్ఛయంత్రాలకే ‘మారు మనసు’ను గావించి క్రమముగా విష్ణు, దేవీ, విశ్వనాథ, బ్రహ్మ, గోవింద నామోచ్చాటనలను చేయించి వైదిక మతాన్ని పునఃప్రతిష్టించారు. శాక్తంలో నిర్గుణోపాన, వైష్ణవంలో సగుణోపాసన శైవంలో రెండు ఉపాసనలూ వర్ధిల్లాయి. నిత్యానందులు శాంతిపురంలోనూ, హరి నదియాలోనూ, కబీరు మగధలోనూ, రైదాసు కలింజరలోనూ, సదనుడు నైమిషారణ్యంలోనూ సమాధి చెందారు. ఇప్పటికీ వీరి పవిత్రాత్మలకు అక్కడ పూజలందుతున్నాయి. నిష్ఫలులై, నిస్పృహులై పరాజితులై మయాదిదైత్యులు బలివద్దకు పోయారు.”