భవిష్య పురాణము

27 - ఒక కట్టెల వాని కథ

సూతుడు పురాణగాథల ప్రవచనంలో భాగంగా సత్యనారాయణ వ్రతకల్పాన్ని ఇలా కొనసాగించాడు. “ఋషివరులారా! ఇది బిల్లుల కథ. ఒకప్పుడు కొందరు నిషాదులు అడవిలోని చెట్లను కొట్టి కట్టెలను మోపులుగా కట్టి నగరం లోకి వచ్చి అమ్ముతుండేవారు. ఆవిధంగా కొందరు కాశీపురికి వచ్చారు. వారిలో నొకడు బాగా దాహంగా వుండడంతో ఎదురుగా ఒక ఆశ్రమం కనబడితే త్రాగునీటికోసం అందులోకి వెళ్ళాడు. అది శతానందుని ఆశ్రమం. ఇపుడాయన విష్ణుదాస నామాన్ని స్వీకరించి ఆశ్రమంలో ఉంటున్నాడు. భిల్లుడక్కడి వారిచ్చిన నీటిని ద్రావి ఆశ్రమాన్నొకమారు పరికించాడు. అక్కడ ఎందరో బ్రాహ్మణులు భగవంతుని పూజిస్తున్నారు. అక్కడ దేనికీ లోటు లేకపోగా గొప్ప వైభవం, లక్ష్మీకళ కనిపిస్తున్నాయి. శతానందుని నుండి ఏదో వెలుగు బయటికివస్తున్నట్టు కనిపించింది. గొప్ప ధనికుడుని వలె కనిపిస్తున్న ఈ శతానందుడు ఒకప్పుడు భిక్షుక వృత్తిలో జీవించేవాడని భిల్లునికి తెలుసు. రెండు మూడు మార్లు అప్పట్లోచూశాడేమో కూడా. ఇక ఉండబట్టలేక తిన్నగా వెళ్ళి శతానందునే ఇలా అడిగేశాడు. ‘స్వామీ! మీకు ఇంత అదృష్టం ఎలా పట్టింది? మీకు దారిద్య్ర్యం నుండి విముక్తి ఎలా లభించింది? దయచేసి నాకా వివరాలు అనుగ్రహించండి. నేను వినాలనుకుంటున్నాను.’

‘సోదరా! ఇదంతా శ్రీ సత్యనారాయణ ఆరాధనాఫలం. ఆయనను ఆరాధించే వారు సాధించలేనిది వుండదు. సత్యనారాయణస్వామి దయలేకుంటే ఎవరికీ, ఏదీ సాధ్యం కాదు’ అని ఓపికగా చెప్పాడు శతానందుడు.

‘స్వామీ! సత్యనారాయణస్వామి వారి మహాత్మ్యమెట్టిది? ఈ వ్రతాన్నెలా చెయాలి? మీరు నాపై దయవుంచి ఆ పూజావిధానాన్ని అన్ని ఉపచారాలతో సహా నాకు ఉపదేశించండి.

సాధూనాం సమచిత్తానాం ఉపకారవతాం సతాం

నగోప్యం విద్యతే కించిత్ ఆర్తానాం ఆర్తినాశనం (ప్రతి. 2/27/8)

ఉపకార పరాయణులైన సంతులు, మహాత్ములు తమ హృదయంలో మానవులందరికీ సమానమైన విలువనే ఇస్తారని, కల్యాణకారకమైన విషయాన్ని ఎవరినుండీ దాచరనీ విన్నాను’ అన్నాడు నిషాదుడు.

(భిల్లులని కోయలని, బోయలని, అడవి వీరులను అసహ్యించుకొనేవారనీ, ముఖ్యంగా బ్రాహ్మణులు వారిని నగరాలలోకి రానిచ్చేవారు కారని పనిగట్టుకొని ప్రచారం చేయడం జరిగింది. అది నిజం కాదని, భిల్లునికి ఆశ్రమ ప్రవేశం కలిగించడమే గాక అతనిని సోదరా అని ఒక బ్రాహ్మణుడే సంబోధించడం ఆనాటి హైందవ సంస్కారమనీ ఈ పురాణం చెబుతున్నది.)

            ‘నువ్వు సరిగానే విన్నావు. ఒకప్పుడు కేదారక్షేత్రంలోని మణిపూరక నగరానికి రాజైన చంద్రచూడుడు ఈ ఆశ్రమానికి విచ్చేసి సత్యనారాయణ భగవానుల వ్రతకథా విధానాలను విని వెళ్ళారు. ఆయనకు చెప్పినదే నీకూ చెబుతున్నాను. విను.

సకామభావంతోనైనా నిష్కామభావంతోనైనా మనసులో దృఢంగా సంకల్పం చేసుకొని శ్రీ స్వామివారి పూజనుచేయాలి. పావుసేరు గోధుమనూకను తేనె, సుగంధంగల నెయ్యిలతో సంస్కరించి నైవేద్యరూపంలో స్వామి వారికి సమర్పించాలి. భగవాన్ సత్యనారాయణస్వామి వారి సాలగ్రామాన్ని పంచామృతాలతో స్నానం చేయించి, చందనాది ఉపచారాలతో సిద్ధంచేసి దానికి పూజచేయాలి. పాయసం, అప్పాలు, సంయావ, పెరుగు, పాలు, ఆయా ఋతువుల్లో దొరికే పండ్లు, పూలు, ధూపదీప నైవేద్యాదులతో ప్రేమ మీరగా భక్తి పొంగారగా స్వామిని పూజించాలి. వ్రతి తన వైభవానికి తగినట్టుగానే చేయాలి. తక్కువగా కాదు; ఎక్కువగా అవసరంలేదు. భగవంతునికి భక్తి మాత్రమే ముఖ్యం. విపుల ద్రవ్యాలతో అల్ప భక్తి శ్రద్ధలతో స్వామిని ప్రసన్నం చేసుకోలేము. ఆయన సంపూర్ణ విశ్వంలో ప్రతి అణువులోనూ వున్నాడు కాబట్టి ఈ పూజకు వస్తువులపై శ్రద్ధ వుండదు. అయినా ఏదో ఒక పద్ధతంటూ వుండాలి కాబట్టి ఈ నియమాలను పెట్టుకోవడం జరిగింది. సుగంధ భరితమైన నేతిని తేలేకపోతే దానికి బదులు ఒక నీటి చుక్కను వేసి ఆ మంత్రాన్ని చదువవచ్చును. స్వామికి భక్తి ఎంత ముఖ్యమో ఆయన సుయోధనుని ఆతిథ్యాన్నీ రాజ మహలులో నివాసాన్నీ, వసతినీ తిరస్కరించి విదురుని పర్ణకుటీరంలో బస చేసిన లీలలోనే అవగతమవుతుంది. సుదాముడు తెచ్చిన అటుకులే ఆయనకు ‘ఆత్మకింపయిన భోజనం’ గా రూపుదిద్దుకున్నాయి. ఆయన మననుండి ప్రీతి పూర్వకమైన భక్తినే ఆపేక్షిస్తాడు. గోపికలు, రాబందు, వ్యాధుడు, హనుమంతుడు మున్నగువారు, రాజభోగాలనూ, రక్తసంబంధాలనూ వదిలేసుకొని వచ్చిన విభీషణుడు. చివరికి వృత్రుని వంటి దైత్యులు కూడా ఆయన సాన్నిధ్యాన్ని భక్తి ద్వారానే పొందగలిగారు.

నిషాదపుత్రా! ఇక్కడ జరిగిన ఉపదేశాన్ని శిరసావహించి, స్వామిని మనాసా పూజించి చంద్రచూడుడు కృతార్థుడై ఆనందంగా జీవిస్తున్నాడు. నీవు కూడా నిర్మలమైన భక్తితో స్వామిని ఉపాసించు. ఈ లోకంలో సర్వసుఖాలూ, పైలోకంలో విష్ణు సాన్నిధ్యమూ నీకు లభిస్తాయి.’

ఈ యుపదేశాన్ని విని విప్రశ్రేష్ఠుడైన శతానందునికి ప్రణామం చేసి నిషాదుడు తన ఇంటికి పోయి తన వారందరికీ ఈ హరిసేవా మాహాత్మ్యాన్ని తెలియజేశాడు. వారందరూ కూడా ప్రసన్నచిత్తులై శ్రద్ధాపూర్వకంగా ఆరోజు కర్రల నమ్మిన సొత్తునంతటినీ బంధువులతో సహా విధివిధానంగా శ్రీ సత్యనారాయణస్వామి పూజకే వినియోగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆనాడు వారికి ఎప్పటికంటే నాలుగింతల ఆదాయంవచ్చింది. ఇంటికి మరలి వచ్చి విషయాన్నంతటినీ తమతమ స్త్రీలకు చెప్పి అందరూ కలిసి ఆదరపూర్వకంగా శ్రీ సత్యనారాయణుని పూజించి కథాశ్రవణం చేసి, అందరికీ ప్రసాదాన్ని పంచి తాము స్వీకరించారు. దీని ఫలితంగా ఆ నిషాదగణమంతా పుత్ర పౌత్రాభివృద్ధినీ, ధన, జ్ఞాన వృద్ధినీ ఈలోకంలో పొందారు. యథేష్ట భోగాలన్నీ అనుభవించి దేహాంతంలో యోగి జనులకు కూడా దుర్లభమైన వైష్ణవధామ ప్రాప్తిని పొందారు.