దేవగురువైన బృహస్పతి ఇంకా ఇలా బోధింపసాగాడు. ‘దేవేంద్రా! ఒకప్పుడు విష్ణుశర్మయని వేదపారంగతుడైన బ్రాహ్మణుడొకాయన వుండేవాడు. ఆయన ప్రసన్న చిత్తంతో అచంచల భక్తితో సర్వదేవమయుడైన విష్ణువును పూజించేవాడు. ఆ పూజకు ముగ్ధులై దేవతలు కూడా అతనిని గౌరవించేవారు. అయినా అతడు భిక్షావృత్తి చేసు కుంటూనే జీవించేవాడు. అతనికి వివాహమైంది కానీ సంతానం లేదు. ఒకరోజాయన గృహానికొక అతిథి వచ్చాడు. దంపతులిద్దరూ ఉన్నంతలోనే ఆత్మీయంగా ఆప్యాయంగా అతనికి ఆతిథ్యమిచ్చారు. ఆ వ్యక్తి ప్రసన్నుడై విష్ణుశర్మ భార్యకి ఒక పారసమణి (ఇనుమును బంగారంగా మార్చేది) నిచ్చి తాను సరయూనదికి స్నానానికి పోయి మూడురోజుల తరువాత వస్తాననీ ఆ లోగా కావలసినంత బంగారాన్ని తయారు చేసుకొమ్మనీ చెప్పాడు. విష్ణుశర్మ అతిథి ప్రయాణానికేర్పాట్లు చేస్తూ ఈ సంగతిని గమనించలేదు. అతడు అతిథిని సాగనంపి వచ్చేసరికే ఇల్లంతా స్వర్ణకాంతులతో మిలమిలలాడ సాగింది. భార్య ద్వారా విషయాన్ని తెలుసుకున్న విష్ణుశర్మ మిక్కిలి కోపించి, ‘ఈ స్వర్ణంగాని ఇతర ధనరూపాలుగాని పాపహేతువులు నేను అకించనుడను. విష్ణుభక్తుడను. మోక్షగామిని నీకు ఈ సిరిసంపదలే కావాలనుకుంటే ఆయన వద్దకు పోయి సుఖపడు. నేనే కావాలనుకుంటే వీటిని విసర్జించు,’ అన్నాడు. ఆమె పతివ్రత కాబట్టి విష్ణుశర్మ పాదాలపైబడి క్షమింపుమని వేడుకొని ఆ స్వర్ణాన్నీ మణినీ అతని పాదాలపై వదిలేసింది. విష్ణుశర్మ ఆ మొత్తం స్వర్ణాన్నీ మణినీ అగాధంలోకి విసిరేశాడు.
మూడురోజుల తరువాత ఆ అతిథి మరలివచ్చి ఆసాధ్విని తన మణిని తనకిచ్చెయ్యమని అడిగాడు. ఆమె జరిగిందంతా చెప్పింది. అతడు విష్ణుశర్మ భిక్షాటన ముగించుకొని వచ్చేదాకా అక్కడే నిరీక్షించి ఆయన రాగానే చాలా కోపంగా ‘ఓయీ బ్రాహ్మణా! నువ్వు దైవమోహితుని వలెనున్నావు. దరిద్రుడిపై ఉండి కూడా ధనాన్ని తిరస్కరిస్తున్నావు. మీమీద జాలిపడి నేను ఉపకారం చేయబోతే నాకే ఎసరు పెట్టావు. సరే నీ కర్మకి నీవుపడి వుండు. నాపారసమణిని నాకివ్వు. ఆ మణిని నాకివ్వకపోతే నేనిక్కడే ప్రాణత్యాగం చేస్తాను, అన్నాడు.
విష్ణుశర్మ ఎంతో ప్రశాంతంగా మనసులో ఇలా అనుకున్నాడు. ‘ఒక్క పారసమణి కోసమే ప్రాణత్యాగం చేస్తానంటున్నాడు పాపం, పైకి మాత్రం మరింత ప్రశాంతంగా ‘నీ మణిని చూపిస్తాను నాతోరా’ అంటూ ఆ అగాధం వద్దకు తీసుకెళ్ళాడు. అక్కడ అనేక పారసమణులున్నాయి. చేతికి అందేలాగ పైకే వున్నాయి. ముందు ఆశ్చర్యమూ తరువాత అసలు జ్ఞానమూ కలుగగా అయ్యతిథి విష్ణుశర్మ పాదాలపై బడి, ‘మహానుభావా! నేను పన్నెండు సంవత్సరాలు శివుని కోసం కఠోరతపస్సు చేసి ఆయన కనబడి వరం కోరుకొమ్మంటే పరమలోభినై, మూఢుడనై ఈ సంపదను కోరుకున్నాను. ఆయన చిరునవ్వు నవ్వి ఈ మణినిస్తే మహా ప్రసాదమనుకొని పొంగిపోయాను చివరికి ఈనాటికి నీవు నా మనస్సులో జ్ఞాన సూర్యుడవై ప్రవేశించి ఏది కోరుకోవాలో తెలిపావు. నేనిపుడే పోయి అదే శివునికై మరల తపస్సు చేసి ఈమారు మోక్షాన్ని కోరుకుంటాను’ అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఇలా విష్ణుశర్మ ఎన్నో చీకటిగుండెల్లో జ్ఞాన సూర్యులను వెలిగిస్తూ తాను స్వయంగా భక్తిశ్రద్ధలతో సూర్యారాధన చేస్తూ వెయ్యేళ్ళు జీవించాడు. ఆ తరువాత విష్ణులోక ప్రాప్తినొందాడు. ఆయనే వైష్ణవ తేజాన్ని ధరించి సూర్యమండలంలో నెలకొని ఫాల్గుణమాసంలో ముల్లోకాల నుండీ పూజలందుకుంటూ వెలుగులు విరజిమ్ముతున్నాడు. మీరంతా ఫాల్గుణమాసంలో సూర్యవ్రత పూజనాల నొనరించండి. అందరికీ శుభం జరుగుతుంది.
దేవతలు ఏకాగ్రచిత్తంతో ఫాల్గుణమాస సూర్యవ్రతాన్ని చేశారు. సూర్యుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై అందరూ చూస్తుండగానే ఒక దీపకళికగా మారి ఇంద్రునిలో ప్రవేశించాడు. ఇంద్రుడు ఎవరూ అంతవరకు కనీవినీ యెరుగనంత తేజస్సుతో వెలిగిపోతూ ఒక బ్రాహ్మణ రూపాన్ని ధరించాడు. శచీదేవి బ్రాహ్మణి రూపంలో వచ్చి అతని పక్కన నిలబడింది. వారు అక్కడే ఆశ్రమాన్ని సృష్టించుకొని నివసించసాగారు. సరిగ్గా ఒక సంవత్సరానికి, శచీదేవి గర్భము నుండి, భాద్రపద శుక్ల ద్వాదశి గురువారం బ్రాహ్మీముహూర్తంలో ఒక దివ్యతేజం గల మగపిల్లడు ఉదయించాడు. వాస్తవానికి అతడు విష్ణుదేవుని కళారూపము. ఆ సంగతి తెలిసిన రుద్రులు, వసువులు, విశ్వేదేవులు, మరుద్గణాలు, సాధ్యసిద్ధ భాస్కరాదులు ఆ బాలుని కరవుతీర దర్శించి నోరారా కీర్తించారు. కలియుగంలో దైత్యుల ద్వారా పీడింపబడుతున్న దైవాంశ సంభూతుల నుద్ధరించాలనీ, అధర్మంచే క్షోభిస్తున్న పృథ్వికి సంతోషాన్ని ప్రసాదించాలనీ వారాయనను ప్రార్థించారు. ఆయన పెరిగి పెద్దవాడవుతూ అలాగే చేశాడు. రాధాకృష్ణ తత్త్వాన్ని నేల నాలుగు చెరగులా వ్యాపింపజేసిన ఆ మహానుభావుడు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువుగా ప్రసిద్ధిచెందాడు.
ఇంతవఱకు బృహస్పతి దేవతలకూ, తనకూ కూడా వినిపించిన విశ్వవిహిత కార్యాలను నైమిషారణ్యంలో శౌనకాది మహామునులకు ప్రసాదించిన సూతమహర్షి జనశ్రుతిలో నున్ననూ రామాయణంలో లేని వాల్మీకి కథనిలా చెప్పసాగాడు. ‘ప్రాచీన కాలంలో ఒక అధమ బ్రాహ్మణుడు బ్రాహ్మణ్యాన్ని విసర్జించి అడవిలో దారికాసి ప్రజలను దోచుకొనేవాడు. ధనుర్బాణాలు ధరించి ప్రజలను ముఖ్యంగా బ్రాహ్మణులను హింసించే వాడు. వారిని కొట్టి, వారి యజ్ఞోపవీతాలను తొలగించి జబ్బలు చరిచి, అరిచి చాలా బాధ పెట్టేవాడు. బ్రాహ్మణుల బాధలను చూసి దేవగణాలు భయపడి బ్రహ్మవద్దకు పోయి వారిని రక్షించాలని వేడుకోగా అన్నీ తెలిసిన, ఆ విధాత సర్వలోక సంచారులైన సప్తర్షులను రావించి ‘మహర్షులారా! మీరు నిర్వర్తించవలసిన ఒక మహాకార్యానికి సమయం ఆసన్నమైంది. ఆ బ్రాహ్మణుని వద్దకు వెళ్ళిరండి’ అని ఆదేశించాడు.
ధనుర్బాణధారి, మహాబలవంతుడునగు అయ్యధమ బ్రాహ్మణుడు ఆ మహర్షులను దారిలో అడ్డగించి ‘గెడ్డం బాపలారా! నేను మీ అందరినీ చంపుతా’ అని గర్జించాడు. మరీచి మహర్షి తాపీగా ‘అలాగే చంపుదువు గానీ, ఈ మాట చెప్పు నువ్వు దోపిడీలూ హత్యలూ చేసేది నీకోసమా నీ కుటుంబం కోసమా?’ అని అడిగాడు.
‘రెండిటి కోసమూనూ’ చెప్పాడతడు.
‘సరే! మేము ఇక్కడే వుంటామని మాట ఇస్తున్నాం. నీవు మీ ఇంటికి పోయి నీవు చేస్తున్న హింసలవల్ల హత్యల వచ్చే పాపాఫలాన్ని అనుభవించేది ఎవరో కనుక్కొనిరా’
ఆ ఘోరాత్ముడు వెంటనే ఇంటికి పోయి ఈ ప్రశ్ననే వేశాడు. ఎవరి పాపఫలం వారిదే అనే మాటయే సర్వత్ర వినిపించింది. వారు ఇలా అన్నారు. ‘మమ్మల్ని పోషించడం నీ ధర్మం. ఆ ధర్మాన్ని ఎలా నిర్వర్తిస్తున్నావనేది మాకు అనవసరం. నీవు ధర్మకార్యాల ద్వారా ధనాన్ని సంపాదించావనుకో, అపుడు వాటివల్ల వచ్చే పుణ్యం, మమ్మల్ని పోషించడం వల్ల వచ్చే పుణ్యం నీకేగాని మాకు రావు కదా!’
పరుగు పరుగున మరలి వచ్చి సప్తర్షుల పాదాల మీద పడిపోయాడా అధమ బ్రాహ్మణుడు. ‘మహాత్ములారా! ఇన్నాళ్ళూ కుటుంబ పోషణ కోసం చేయరాని పనులు చేసి పాపం మూటగట్టుకున్నాను. నా పాపాలన్నీ దగ్ధమైపోయే ఉపాయం చెప్పండి’ అని రోదిస్తూ అడిగాడు. నిజానికి ఆ ఋషులక్కడికి వచ్చినదే అందుకు కదా! వారిలా అన్నారు. ‘ఒక ఉత్తమ మంత్రమున్నది నాయనా! అది రామనామం. ఇది అన్ని పాపాలనూ దూరం చేస్తుంది. ఇప్పుడు మేము వెళ్తున్నాము. మేము మళ్ళా వచ్చి లేపే దాకా నువ్వు ఇక్కడే కూర్చుని కదలకుండా రామనామ జపం చేస్తూ వుండు’ అని చెప్పి కదిలిపోయారు. ఆ దోపిడీ దొంగ అన్నీ మఱచిపోయి ‘మరా మరా’ అంటూ వెయ్యి సంవత్సరాలపాటు అలాగే వుండిపోయాడు. అతని జపప్రభావం వల్ల అడవిలోని ఆ భాగంలో ముళ్ళచెట్లు మాయమై నేల తడిసి కమలాలు తామరతంపరగా ఆతని చుట్టూ విరబూసినవి. (ఇప్పటికీ ఆ వనానికి ఉత్పలారణ్యమనే పేరు నిలచివుంది)
రామనామ హితజ్ఞేయం సర్వాఘౌషు వినాశనం ॥ (ప్రతిసర్గ - 4/10/52) మరామరామరేత్యేవం
సహస్రాబ్దం జజాపహ
జపప్రభావాత్ భవత్
వనముత్పలసంకులం ॥
తత్‌స్థానముత్పలారణ్యం
ప్రసిద్ధమభవద్భువి (ప్రతిసర్గపర్వం 4/10/54)
అతని చుట్టూ వల్మీకం అనగా పుట్ట పెరిగిపోయింది. సప్తర్షులు మరలి వచ్చి తమ తపశ్శక్తిచే ఆ పుట్టనీ మట్టినీ తొలగించి చూచుసరికి అక్కడ బందిపోటు లేడు. ఒక విశుద్ధ జ్యోతి స్వరూపుడైన బ్రాహ్మణుడున్నాడు.
వల్మీకాన్నిః సృతోయస్మాత్
తస్మాద్వాల్మీ కిరుత్తమం ।
తవనామ భవేద్విప్ర
త్రికాలజ్ఞ మహామతే ॥ (ప్రతిసర్గం 4/10/56)
సప్తర్షులు వానిని తట్టిలేపి, ‘నాయనా! నీ పాపాలన్నీ దగ్ధమైపోవడమే కాక నీవొక మహర్షీ, త్రికాలజ్ఞుడూనగు మహాపండితుడవైనావు. వల్మీకంలో ఈ లోకానికి దొరికిన మాణిక్యానివి కాబట్టి నీవిక ‘వాల్మీకి’ అనే పేరుతో జగత్ ప్రసిద్ధుడవౌతావు’ అని గౌరవించి ఆశీర్వదించి నిష్క్రమించారు. ఆ వాల్మీకియే రామాయణాన్ని రచించాడు.
తరువాత ఆయన శివునిలో కలసిపోయి కైలాసంలో నివసించసాగాడు. మహామునులారా! బృహస్పతి ఇంద్రునికి తెలిపిన, హరప్రియుడైన ‘మృగవ్యాధ శివుని’ చరిత్రను వినండి.
వైవస్వత మన్వంతరంలో తొలి సత్యయుగంలో బ్రహ్మ ఉత్పలారణ్యానికి వచ్చి ఒక యజ్ఞాన్ని చేశాడు. అప్పుడక్కడికి సరస్వతీదేవి ఒక నదీరూపంలో వచ్చింది. తరువాత బ్రహ్మతన ముఖము నుండి కల్యాణకారులైన బ్రాహ్మణులను, భుజాల నుండి వీరవరులైన క్షత్రియులను ఊరువులనుండి ఉత్తమ వైశ్యులను, పాదాల నుండి శుభాచార సంపన్నులైన శూద్రులనూ ఉత్పన్నం చేశాడు. ద్విజరాజైన సోముని (చంద్రుని), సూర్యుని, తేజవీర్యాలకు రక్షకుడైన కశ్యపుని, మరీచిని, సముద్రుని, ప్రజాపత్యాదులను కూడ సృష్టించాడు. దక్షునికి చాలామంది కన్యలు జనించారు. వారు విష్ణుమాయా ప్రభావం చేత కళలుగా పృథ్విపై ప్రసిద్ధి పొందారు. బ్రహ్మవారిలో అశ్వని మున్నగు ఇరవైయేడుగురు చుక్కల్లాటి కన్యలను నక్షత్రలోకాభి వృద్ధికై సోమునికిచ్చి వివాహంచేశాడు. అదితి మున్నగు పదముగ్గురు కన్యలను కశ్యపునికీ, కీర్తి మొదలగు కన్యలను ధర్మునికీ ప్రదానం చేశాడు. వారే వైవస్వత మన్వంతరంలో సృష్టికి మూలాలయి నారు. బ్రహ్మదేవుని ఆజ్ఞమేరకు పృథ్విలో వారందరికీ దక్షుడే ప్రజాపతియైనాడు. యజ్ఞతత్పరుడైన దక్షప్రజాపతి నిరంతరం యజ్ఞశాలలోనే ఉ౦డేవాడు. దేవగణాల వారందరూ ఆయనకు నమస్కారం చేస్తుండేవారు. భూతనాథుడైన మహాదేవుడు మాత్రం దక్షునికి నమస్కారం చేసేవాడు కాడు అహంకరించి కోపించిన దక్షుడు శివునికి యజ్ఞభాగాన్నివ్వడం మానేశాడు. శివుడు కుపితుడై తనలో నున్న మృగవ్యాధుని వీరభద్ర రూపంలో పంపించాడు. అతనితోబాటు త్రిశరులు త్రినేత్రులు, త్రిపాదులు శివగణాలు కూడా బయలుదేరి వచ్చి దక్షాధ్వర ధ్వంసాన్ని మొదలెట్టారు. ఈ శివరూపుల దాడిలో దేవతలు, మునులు, పితృగణాలు కూడా పీడింపబడినారు. అప్పుడు యజ్ఞపురుషుడే భయభీతుడై లేడిరూపంధరించి పారిపోయాడు. అపుడు శివుడు పులిరూపంలో మృగవ్యాధుని పంపగానతడు ఆ యజ్ఞపురుషుని లేడి రూపాన్ని చీలికలు పేలికలు గావించాడు. అంతట భగవంతుడైన బ్రహ్మదేవుడు మధురమైన స్తుతుల ద్వారా, ప్రార్థనల ద్వారా పులిరూపంలో, వ్యాధరూపంలో నున్న శివుని శాంతింపజేసి ప్రసన్నుని చేసుకోగా శివుడు మృగవ్యాధ రూపంలో వుండి దక్షయజ్ఞాన్ని సంపూర్ణంగావించాడు. (శివుడు మృగవ్యాధుని వీరభద్రరూపంలో పంపించాడనగా శివుడే స్వయంగా ఆ రూపంలో వచ్చాడని అర్థం చేసుకోవలసి వున్నది. అనగా శరీరమే వ్యాధునిదని, ఆత్మ శివుడేనని పురాణకారుని ఉద్దేశ్యము) బ్రహ్మ తృప్తిపడి మృగవ్యాధుని చంద్రమండలంలో చంద్ర సమాన సౌందర్యంతో నిలచి వుండేలాగ వరమిచ్చి తన లోకానికి వెళ్ళిపోయాడు. సోముని సర్వజ్ఞ బ్రాహ్మణాంశ, వీరభద్రుని ఆవేశము, మృగవ్యాధుని కావ్యరచనా శక్తి కలిసి శివదేశముచే భూలోకంలో దక్షిణదేశంలో భైరవదత్తుడను బ్రాహ్మణుని పుత్రునిగా అవతరించగా ఆ పుత్రుడే శంకరాచార్య నామంతో ప్రసిద్ధుడైనాడు. గుణవంతుడు, సకలశాస్త్రవేత్త, ఆజన్మ బ్రహ్మచారియగు శంకరాచార్యుడు శంకరభాష్యమును, అనేకానేక భగవత్ స్తోత్రాలను రచించి, శైవమతాన్ని ప్రతిష్ఠించి, త్రిపుండ్ర, రుద్రాక్షమాల, పంచాక్షర మంత్రాలను విశ్వానికి ప్రసాదించి తన పని పూర్తికాగానే పిన్నవయసులోనే కైలాసానికి ప్రస్థానించాడు.