202, 203 - రత్నాచల, రౌప్యాచల దాన మాహాత్మ్యము

కౌంతేయా! రత్నాచల దానాన్ని చేసినవారు సప్తర్షి లోకాన్ని పొందుతారు. ఈ దానంలో వెయ్యి ముత్యాలను వినియోగించడం శ్రేష్ఠం. శక్తిలేని వారు అందులో సగం, మరీ స్తోమతు లేనివారు మూడు వందల ముత్యాలతో రత్నాచలాన్ని రచించుకోవచ్చును. ఇందులో నాలుగోవంతు ముత్యాలతో ఈ కొండకి నలువైపులా విష్కంభ పర్వతాలని రచించాలి. తూర్పువైపు ముత్యాలతో వజ్రాలనూ, గోమేధికాలనూ కలిపి మందరాచలాన్ని తయారు చేయాలి. అలాగే దక్షిణంలో పుష్య రాగాలూ, ఇంద్రనీలాలూ కలిపి గంధమాదనాన్నీ, పశ్చిమంలో వైఢూర్యాలనూ, పగడాలనూ వాడి విపులాచలాన్నీ, ఉత్తరంలో గారుమతాలనూ, మాణిక్యాలనూ కలిపి సుపార్శ్వ పర్వతాన్నీ నిర్మించాలి. ఇతర విధానమంతా ధాన్య పర్వత దాన పద్ధతినే అనుసరించి చేసి దాన సమయంలో ఈ మంత్రాలను ఉచ్ఛరించాలి:

యథా వేవగణాః సర్వే సర్వరత్నేష్వవ స్థితాః

త్వంచ రత్నమయో నిత్యమతః పాహి మహాచల

యస్మాద్రత్నప్రదానేన తుష్టిమేతి జనార్దనః

పూజారత్నప్రదానేన తస్మాన్నః పాహి సర్వదా (ఉత్తరపర్వం 202/8, 9)

ఈ విధంగా ఈ దానాన్ని చేసినవారు ఇంద్రునిచే సత్కరింపబడి విష్ణులోకాన్ని చేరుకుంటారు. అక్కడ నూరు కల్పాల కాలం నివాసముంటారు. మరల పుడమిపై పుట్టవలసొచ్చినపుడు సౌందర్యం, ఆరోగ్యం, సద్గుణాల ప్రోవుగా జన్మించి సప్తద్వీపాలకే అధినేత అవుతారు. సప్తర్షిలోక నివాసం వీరు కోరినపుడల్లా సిద్ధిస్తుంది.

నరోత్తమా ఇక రౌప్య లేదా రజత దాన మహిమను విను. పదివేల ఫలంల ఎత్తు వెండితో తయారుచేయబడిన వెండికొండ దానం ఉత్తమం. అంతలేనివారు అందులో సగాన్నీ అదీ లేని వారు అందులో సగం వెండిని వినియోగించవచ్చును. అయితే మరీ నిర్ధనుడైనవారు ఈ దానం చేసి తీరాలి అనుకుంటే ఇరవై పలంలతోనే కొండని కట్టవచ్చు. విష్కంభ పర్వతాలను ఎప్పటిలాగే నాల్గవవంతు వెండితో నిర్మించి ఒక వైపు మాత్రం బంగారు తాపడం చేయించాలి. వాటిపై లోకపాలుర, త్రిమూర్తుల, సూర్య భగవానుని స్వర్ణప్రతిమలను స్థాపించాలి. ఇతర దానాలలో వెండిని వాడిన చోట ఈ దానంలో బంగారాన్ని వాడాలి. మిగతా పద్ధతంతా ధాన్య శైల దానంలాగే వుంటుంది. రజతాచలాన్ని గురువుగారికీ విష్కంభ పర్వతాలను ఋత్విజులకూ దానం చేసి మనసును మత్సరరహితంగా వుంచుకొని కుశలను చేత బట్టుకొని ఈ మంత్రాన్ని చదవాలి:

                     పితౄణాం వల్లభం యస్మాద్ధరీంద్రాణాం శంకరస్యచ

రజత పాహిత స్మాన్నో ఘోరాత్ సంసార సాగరాత్ (ఉత్తరపర్వం 203/8)

ఈ దానాన్నిచ్చిన వారికి దశ సహస్ర గోదాన ఫలం దక్కుతుంది. అతడు విద్వాంసుడౌతాడు. చంద్రలోక నివాసం, గంధర్వ కిన్నరాప్సర సమూహాలచే పూజలూ ప్రళయందాకా ప్రాప్తిస్తాయి.