భవిష్య పురాణము

76 - సూర్యకుటుంబం

(సూర్య కుటుంబమే కాని సౌరకుటుంబం కాదు.)

‘ఆయనకిద్దరు పత్నులు. రాజ్ఞి, నిక్షుభా. రాజ్ఞి నిధ్మౌః అనగా స్వర్గము అనీ, నిక్షుభను పృథ్వి అని కూడా అంటారు. పుష్య శుక్లసప్తమి నాడు ద్యౌతోనూ, మాఘకృష్ణసప్తమిన పృథ్వితోనూ ఆయన వుంటాడు. ఆ సమయంలోనే లోకానికి సరిపడునంతగా జల, సస్య సంపత్తులుత్పన్నమవుతాయి. ఈ సస్యాన్ని చూడగానే అత్యంత ప్రసన్నతతో బ్రాహ్మణులు హవనం చేస్తారు. అప్పటి స్వాహాకారాలతో స్వధాకారాలతో దేవతలూ, పితరులూ తృప్తులవుతారు.

సాంబా! బ్రహ్మకు మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపునికి హిరణ్యకశిపుడు, అతనికి ప్రహ్లాదుడు, ఆయనకు విరోచనుడు పుత్రులుగానుదయించారు. విరోచనుని సోదరిని విశ్వకర్మకిచ్చి వివాహం చేశారు. వారికి పుట్టినది సంజ్ఞ. మరీచికి సురూపయను పేరు గల కూతురు పుట్టింది. ఆమెను అంగిరా మహర్షికిచ్చి మనువు చేయగా వారికి పుట్టినవాడు మహాశిల్పి విశ్వకర్మ. ఆయనకు త్వష్టయను పేరు కూడా వుంది. ఇతని కూతురుకే సంజ్ఞా, రాజ్ఞీ, ద్యౌ, త్వాష్ట్రీ, ప్రభా, సురేణు అనే పేర్లున్నాయి. ఈ సంజ్ఞ యొక్క ఛాయ పేరే నిక్షుభ.

స్వామి వేడిమిని భరింపలేక సంజ్ఞ వెడలిపోవడం నుండి ఛాయకు సూర్యశాపం దాకా కథ తెలుసుకదా.

అశ్వరూపధారులైన సూర్యదంపతులకు కవలలు, నాసత్య, దస్ర నామకులునైన అశ్వినీకుమారులు జనించారు. ఆ తరువాత మామూలు రూపంలో సూర్యదంపతులకు రేవంతుడు జన్మించాడు. ఈ ప్రకారంగా సావర్ణి మనువు, యముడు, యమున, శని, తపతి, అశ్వినీకుమారులు, వైవస్వతమనువు, రేవంతుడు - వీరంతా సూర్య సంతానము. సావర్ణి ఎనిమిదవ మనువయ్యాడు. ఆయన మేరుపర్వతంపై తపస్సు చేశాడు. అతని తమ్ముడు శని గ్రహమైనాడు. అశ్వినీ కుమారులిద్దరూ దేవవైద్యు లయ్యారు. వారి విద్యయే భూమిపై వైద్యశాస్త్రమై వర్థిల్లుతోంది. రేవంతుడు సూర్య భగవానుని వలెనే రూపసి, తేజోవంతుడు. సూర్యుడాతనిని అశ్వాలకు అధిపతిని చేశాడు. మార్గంలో ఇబ్బందులు రాకుండా వుండటానికై ప్రయాణికులు రేవంత స్వామిని పూజిస్తారు. సూర్యునిలో వేడిమిని తగ్గించడానికి విశ్వకర్మ ప్రయోగాలు చేసిన సమయంలో ఆ తేజస్సు నుండి భోజకులుద్భవించారు. భూలోకంలో సూర్యనారాయణ స్వామిని పూజించేవారంతా భోజకులను సత్కరిస్తారు. ఈ కథను విన్నవారు, చదివినవారు సర్వపాపాలూ నశించగా సూర్యలోకంలో పెద్దకాలం నివసించి, మరల భూమిపై చక్రవర్తులుగా జన్మిస్తారు.’